సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పెన్షనర్ల జీవన సౌలభ్యం పట్ల ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించిన డాక్టర్ జితేంద్ర సింగ్

డిజిటల్ పెన్షన్ సేవలను మరింత విస్తృతంగా స్వీకరించాలని పిలుపు

· 17వ అఖిల భారత 'పెన్షన్ అదాలత్'కు అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

· 2017లో 'పంచాయతీ అదాలత్' విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనను కొనియాడిన కేంద్ర మంత్రి

· పెన్షన్ సంస్కరణలు జీవన సౌలభ్యం, లబ్ధిదారులకు నేరుగా సేవలు చేరవేయడంపైనే దృష్టి సారించాలని సూచన

· టెక్నాలజీ ఆధారిత పెన్షన్ సేవలు, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు, కుటుంబ పెన్షన్ సంస్కరణలను ప్రముఖంగా ప్రస్తావించిన డాక్టర్ జితేంద్ర సింగ్

· పెన్షన్ సేవలను మరింత అందుబాటులో, సాంకేతికత ఆధారితంగా ఉంచడానికి, పౌర-కేంద్రితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం

· 17వ పెన్షన్ అదాలత్... ఫిర్యాదుల సత్వర పరిష్కారం, పెన్షనర్ల సంక్షేమానికి ప్రాధాన్యం

· 897 ఫిర్యాదుల్లో 756 పరిష్కారం... 84.2 శాతం పరిష్కార రేటు నమోదు

నాడు పోస్టు చేయడమైనది: 05 OCT 2026 5:05PM by PIB Hyderabad

పెన్షనర్ల సంక్షేమం, జీవన సౌలభ్యాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో), సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు పునరుద్ఘాటించారు. సాంకేతికత, డిజిటల్ భాగస్వామ్యం అంతిమంగా పెన్షనర్లు, వారి కుటుంబాల కోసం సరళమైన, మరింత అందుబాటులో ఉండే సేవలుగా మారాలని ఆయన స్పష్టం చేశారు.

 

న్యూఢిల్లీలోని ఐఐపీఏ, టి. ఎన్. చతుర్వేది మెమోరియల్ హాల్‌ వేదికగా పెన్షన్లు, పెన్షనర్ల సంక్షేమ శాఖ (డీవోపీపీడబ్ల్యూ) నిర్వహించిన 17వ పెన్షన్ అదాలత్‌లో కేంద్ర మంత్రి పాల్గొని, ప్రసంగించారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న అనుభవాలు, ఇబ్బందుల నుంచి పెన్షన్ నిర్వహణ విభాగం నిరంతరం నేర్చుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. ప్రస్తుత వ్యవస్థలోని లోపాలను తొలగించడానికి కృషి చేయాలనీ పేర్కొన్నారు. నేటి అదాలత్‌లో 897 ఫిర్యాదుల్లో 756 పరిష్కరించగా, 84.2 శాతం పరిష్కార రేటు నమోదైంది. 2017లో 'పంచాయత్ అదాలత్' భావనను ప్రవేశపెట్టినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనను కేంద్ర మంత్రి ప్రశంసించారు.

 

పెన్షన్ పంపిణీలోని లోపాలను గుర్తించి, నిరంతర మెరుగుదల ద్వారా వాటిని సరిదిద్దాల్సిన ప్రాముఖ్యతనూ కేంద్ర మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. పెన్షన్ సంస్కరణల లక్ష్యం కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాదనీ... సంస్కరణల ప్రయోజనాలు చివరి వరకు చేరి, పెన్షనర్ల కోసం స్పష్టమైన మార్పును తీసుకురావడమేనని ఆయన అన్నారు.

 

కుటుంబ పెన్షనర్లు, అత్యంత వృద్ధులైన పెన్షనర్లకు సంబంధించిన 897 ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు 17వ పెన్షన్ అదాలత్ వాటిని విచారించింది. ఈ రోజు వాటిలో 756 కేసులు పరిష్కరించగా, పరిష్కార రేటు 84.2 శాతంగా నమోదైంది. మిగిలిన కేసులనూ రాబోయే రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇది సకాలంలో ఫిర్యాదుల పరిష్కారం, పెన్షనర్ల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిరంతర శ్రద్ధను తెలియజేస్తుంది.

పెన్షన్ సంబంధిత సేవల్లో డిజిటల్ సాంకేతికత వినియోగం పెరుగుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. డిజిటల్ గుర్తింపు, ముఖ గుర్తింపు ఆధారిత విధానాల ద్వారా ప్రక్రియలను సరళతరం చేసేందుకు కృషి జరుగుతోందని ఆయన తెలిపారు. అందుబాటులో ఉన్న డిజిటల్ సేవలను పెన్షనర్లు పూర్తిగా వినియోగించుకునేలా, అటువంటి సౌకర్యాల గురించి వారికి నిరంతరం సమాచారం అందించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

 

డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ... పెన్షనర్లు సౌకర్యవంతంగా డిజిటల్ సర్టిఫికెట్లను పొందేలా చూడటంలో ప్రచారాలు, అవగాహన కార్యక్రమాల ప్రాముఖ్యతను మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా గణనీయ స్థాయిలో పురోగతి సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. మరింత అవగాహన, విస్తృత ప్రచారం వాటి ప్రభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు.

 

దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు పెన్షన్ సంస్కరణలను చేరవేయడంలో మీడియా, ప్రజా సమాచార ప్రసార విభాగాల పాత్రను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రముఖంగా ప్రస్తావించారు. గతంలో నిర్వహించిన అవగాహన ప్రచారాల ద్వారా సాధించిన సానుకూల ఫలితాలను ప్రస్తావిస్తూ... పెన్షనర్లు, వారి కుటుంబాలు అందుబాటులో ఉన్న సేవలు, సంస్కరణల గురించి ఎప్పటికప్పుడు సమాచారం పొందేలా చూసేందుకు ఆధునిక సమాచార ప్రసార సాధనాలను ఉపయోగించే ప్రయత్నాలను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.

 

సాధారణ సర్వీస్ డెలివరీకే కాకుండా సమస్యలను గుర్తించి మొత్తం పెన్షన్ నిర్వహణ వ్యవస్థను మెరుగుపరచడానికీ సాంకేతికతను ఉపయోగించాలని కేంద్ర మంత్రి అన్నారు. ఎక్కడైనా అంతరాలు లేదా నివారించదగిన ఇబ్బందులు గమనించినట్లయితే, వాటిని నివేదించి పరిష్కరించాలని కేంద్ర మంత్రి సూచించారు. తద్వారా వ్యవస్థ నిరంతరం మెరుగుపడుతుందని ఆయన అన్నారు.

 

పెన్షనర్ల సంక్షేమం ప్రభుత్వ విధానంలో కీలకమని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. సాంకేతికపరమైన చర్యలు చేపట్టినప్పుడు... పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్ల అవసరాల పట్ల సున్నితమైన దృక్పథమూ ఉండాలని ఆయన పేర్కొన్నారు.

పెన్షన్ సంబంధిత విధానాలను సరళీకృతం చేయడానికి, పెన్షనర్ల కుటుంబాలకు మద్దతును మెరుగుపరచడానికి కొనసాగుతున్న ప్రయత్నాలనూ కేంద్ర మంత్రి ప్రస్తావించారు. సంస్కరణలు లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఆచరణాత్మక ఇబ్బందులపైనే దృష్టి సారించాలనీ, మరింత జీవన సౌలభ్యానికి అవి దోహదపడాలని ఆయన స్పష్టం చేశారు.

 

పెన్షన్ ఫిర్యాదులను సమర్పించి, పరిశీలించడం కోసం పెన్షనర్లను, సంబంధిత మంత్రిత్వ శాఖలను, విభాగాలను 17వ పెన్షన్ అదాలత్ ఒకచోట చేర్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో... సంయుక్త కార్యదర్శి (పెన్షన్) కేసుల ప్రజెంటేషన్ సమర్పించారు. ఈ కార్యకలాపాలు ఫిర్యాదులను నేరుగా పరిశీలించడానికి వీలు కల్పించాయి. వాటిని త్వరితగతిన పరిష్కరించడం కోసం సమన్వయ ప్రయత్నాలకూ తోడ్పడ్డాయి.

 

అదాలత్ సందర్భంగా... 16వ పెన్షన్ అదాలత్ విజయ గాథలపై కరపత్రాలు, “కుటుంబ పెన్షనర్ల జీవితంలో సౌలభ్యం” అనే ఇ-పుస్తకాన్నీ విడుదల చేశారు. సమర్థమైన ఫిర్యాదుల పరిష్కారం, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్ల అనుభవాన్ని మెరుగుపరచడం కోసం ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నాలను ఈ ప్రచురణలు ప్రముఖంగా తెలియజేస్తున్నాయి.

 

పెన్షనర్ల సమస్యలను అర్థవంతంగా, సులభంగా, వేగంగా పరిష్కరించడం కోసం 'పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ' రూపొందించిన వ్యవస్థాగత యంత్రాంగంలో 17వ పెన్షన్ అదాలత్ ఒక భాగం.

 

1973లో తన భర్త ప్రాణత్యాగం చేసిన శ్రీమతి చందర్ కాంతా జల్లీ గారిది ఒక ఆదర్శప్రాయమైన ఉదంతం. ఆమెకు సరళీకృత కుటుంబ పెన్షన్ మంజూరైంది. అయితే, కొన్ని కారణాల వల్ల ఆమెకు అర్హత ఉన్న మొత్తం కంటే తక్కువ కుటుంబ పెన్షన్ చెల్లించారు. ఈ విషయంగా ఆమె పలు వేదికలను ఆశ్రయించారు. పెన్షన్ అదాలత్ సందర్భంగా... ఆమె కుమారుడు శ్రీ జస్విందర్ జల్లీ చండీగఢ్ నుంచి వీడియో అనుసంధానం ద్వారా హాజరై, గౌరవ సహాయ మంత్రి (పీపీ) గారి ముందు తన తల్లి తరపున ఫిర్యాదును సమర్పించారు. ఈ కేసుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం రూ. 2.02 కోట్ల కుటుంబ పెన్షను బకాయిలను విడుదల చేశారు.

 

శ్రీమతి దమయంతి సిన్హాకు సంబంధించిన మరో కేసులోనూ 'పెన్షన్ అదాలత్' సహాయంతో 72 లక్షల రూపాయలకు పైగా పెన్షన్ ప్రయోజనాలు విడుదలయ్యాయి.

 

ఈ రెండు సందర్భాలూ అత్యంత వృద్ధులైన కుటుంబ పెన్షనర్లకు సంబంధించినవే.

***


(రిలీజ్ ఐడి: 2319375) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil , Telugu