సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
చెత్త ఏరుకోవడం నుంచి పారిశ్రామికవేత్త దాకా... గౌరవం, స్వయం-సమృద్ధి దిశగా సాగిన ఓ ప్రయాణం
నాడు పోస్టు చేయడమైనది:
05 OCT 2026 3:28PM by PIB Hyderabad
ఆర్థిక సహాయం, స్థిరమైన జీవనోపాధి అవకాశాలను పొందడం... వెనకబడిన వర్గాలకు చెందిన వ్యక్తులను శక్తిమంతం చేయడానికి, వారి సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ముఖ్యంగా దోహదపడతాయ. స్వయం ఉపాధి, యాంత్రీకరణకు మద్దతునివ్వడం... అణగారిన వర్గాలకు చెందిన కార్మికులు మరింత స్థిరమైన ఆదాయ వనరుల వైపు వెళ్లడానికి, కుటుంబ ఆర్థిక భద్రతను బలోపేతం చేయడానికి, పని పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి సహాయపడుతాయి.
30 ఏళ్ల మేకల నాంచారమ్మ షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) వర్గానికి చెందినవారు. ఆమె దాదాపు 12 ఏళ్లుగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో చెత్త ఏరుకునే కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఆర్థికంగా వెనకబడిన కుటుంబం నుంచి వచ్చిన ఆమె... చిన్న వయసులోనే చెత్త ఏరుకునే పనిని చేపట్టవలసి వచ్చింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె పాఠశాలకు వెళ్లలేకపోయారు. నిరక్షరాస్యులుగానే మిగిలిపోయారు. ఆమె జీవనోపాధి చాలా వరకు చెత్త ఏరుకోవడంపైనే ఆధారపడి ఉండేది. దీనివల్ల వచ్చే ఆదాయం పరిమితంగా, క్రమరహితంగా ఉండటంతో... ఇంటి ఖర్చులు తీర్చడం, తన పిల్లలకు మంచి భవిష్యత్తును కల్పించడం ఆమెకు కష్టంగా మారింది.
కనీస వసతులు, నిత్యావసర సేవలు పరిమితంగా ఉన్న మురికివాడ వాతావరణంలో నివసించడం ఆమె కుటుంబ సామాజిక-ఆర్థిక అవకాశాలను మరింతగా దెబ్బతీసింది. తన బలహీనమైన సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమె సామాజిక బహిష్కరణను, వివక్షనూ ఎదుర్కొన్నారు. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ... శ్రీమతి నాంచారమ్మ తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి, తన పిల్లలకు మంచి విద్యావకాశాలు కల్పించడానికి, మరింత సురక్షితమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి దృఢ సంకల్పంతో ఉన్నారు.
నవజీవన్ సంస్థ ద్వారా 'స్వచ్ఛతా ఉద్యమీ యోజన' (ఎస్‌యూవై) కింద శ్రీమతి నాంచారమ్మకు అందిన సహాయం ఆమె జీవితంలో ఒక కీలక మలుపుగా నిలిచింది. ఇద్దరు సభ్యులతో కూడిన ఒక సమూహ ప్రాజెక్టు కింద... 'ఓపెన్ నాలా క్లీనర్' (ట్రాక్టర్ అమర్చిన పరికరం) కొనుగోలుకు ఆర్థిక సహాయం లభించింది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 16,99,952 కాగా... ఇందులో రూ. 10,24,964 రుణం, రూ. 6,74,988 మూలధన రాయితీ ఉన్నాయి.
ఈ ఆర్థిక సహాయంతో శ్రీమతి నాంచారమ్మ సాంప్రదాయిక పద్ధతిలో వ్యర్థాలను ఏరుకునే పని నుంచి బయటపడి... వ్యవస్థీకృతమైన, సుస్థిరమైన జీవనోపాధిని పొందగలిగారు. యాంత్రిక పరికరాల సహాయంతో ఆమె నెలకు అదనంగా రూ.10,000 సంపాదించడం ప్రారంభించారు. ఈ సహాయం అందకముందు సుమారు రూ.8,000గా ఉన్న ఆమె నెలవారీ ఆదాయం, ఇప్పుడు సుమారు రూ.18,000కు పెరిగింది.
ఆదాయం పెరగడం వల్ల ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో గణనీయమైన మెరుగుదల వచ్చింది. ఇప్పుడు ఆమె ఇంటి ఖర్చులను భరించడం, పిల్లల చదువులకు అండగా నిలవడం, కుటుంబ జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవడం వంటి విషయాల్లో మెరుగైన స్థితిలో ఉంది. ఈ జీవనోపాధి అవకాశం ఆమె ఆర్థిక భద్రతను, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవ భావననూ బలోపేతం చేసింది.
తనకు లభించిన మద్దతు గురించి శ్రీమతి నాంచారమ్మ ఇలా అన్నారు. " 'స్వచ్ఛతా ఉద్యమీ యోజన' కింద అందిన మద్దతు... సంప్రదాయ పద్ధతిలో వ్యర్థాలను ఏరుకునే పనికి పరిమితం కాకుండా, మరింత స్థిరమైన ఆదాయాన్ని పొందడంలో నాకు సహాయపడింది. ఇది నా కుటుంబ ఆర్థిక భద్రతను బలోపేతం చేయడంతో పాటు, నాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని, గౌరవాన్నీ కల్పించింది."
ఈ ఆర్థిక సహాయం, యంత్ర పరికరాల లభ్యత, సుస్థిర జీవనోపాధి అవకాశాలు బలహీన వర్గాలను ఆర్థిక స్వాతంత్య్రం, స్వయం సమృద్ధి దిశగా ఎలా ముందుకు నడిపించగలవో శ్రీమతి నాంచరమ్మ ప్రస్థానం నిరూపిస్తుంది. క్రమరహిత ఆదాయం పొందే చెత్త ఏరుకునే పనిపై ఆధారపడటం నుంచి మరింత వ్యవస్థీకృత జీవనోపాధిలో పాలుపంచుకునే స్థాయికి ఆమె పరివర్తన... గౌరవప్రదమైన, సురక్షితమైన భవిష్యత్తుకు అవకాశాలను కల్పించడంలో సాధికారత ఆధారిత కార్యక్రమాల సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
నేటి ఆర్థిక సహాయం... రేపటి స్వయం-సమృద్ధి.
(రిలీజ్ ఐడి: 2319281)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6