గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్‌కు 3 లక్షల శాశ్వత గృహాలను అందించాలన్న మోదీ ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకం
బుర్రిపాలెం నుంచి భారీ అభివృద్ధికి పిలుపునిచ్చిన శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, శ్రీ చంద్రబాబు నాయుడు
మోదీ-నాయుడు ద్వయం ఒక శక్తిమంతమైన కూటమి
"ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పేదవాడికి శాశ్వత గృహం లభిస్తుంది" అని గుంటూరులో ప్రకటించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
గుంటూరు నుంచి దేశ గృహ నిర్మాణ విప్లవానికి నూతన ఆరంభం
దేశంలోనే తొలి 3డి-ప్రింటెడ్ గృహ నిర్మాణ ప్రాజెక్టును ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు
"నేను మధ్యప్రదేశ్‌కు 'మేనమామ'ను అయితే, ఏపీ రాష్ట్రానికీ 'మేనమామ'నే": శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
ప్రజలకు సేవ చేయడం దేవుడిని పూజించడంతో సమానమని పేర్కొంటూ... గుంటూరులో వేలాది మంది ప్రజల హృదయాలను గెలిచిన కేంద్ర మంత్రి
మోదీ దార్శనికత, నాయుడు నాయకత్వంలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా అవతరించనున్న ఆంధ్రప్రదేశ్
అమరావతి నుంచి పోలవరం వరకు అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోన్న ఆంధ్రప్రదేశ్
'అన్నదాత సుఖీభవ' నుంచి 'లఖ్‌పతి దీదీ' దాకా... రైతులకు, మహిళలకు ఆర్థిక సాధికారత కల్పిస్తోన్న మోదీ-నాయుడు ప్రభుత్వం
"తెలుగు భాష తేనె కన్నా మధురమైనది": బుర్రిపాలెంలో శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన హృద్యమైన తెలుగు ప్రసంగానికి ప్రజల నుంచి వెల్లువెత్తిన కరతాళధ్వనులు
ఢిల్లీ వెలుపల తొలిసారిగా ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ 'సరస్ మేళా'
'నక్షత్ర దీదీలను' (సాధికార మహిళా పారిశ్రామికవేత్తలను) సత్కరించే ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించనున్న గౌరవ రాష్ట్రపతి
కేంద్ర మంత్రికి స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
“రాష్ట్రానికి 75,000కు బదులుగా 3 లక్షల ఇళ్లను మంజూరు చేసిన 'మామ మహారాజ్' ... ఆంధ్రకు ఇది ఒక గొప్ప బహుమతి”: శ్రీ చంద్రబాబు నాయుడు
నాడు పోస్టు చేయడమైనది:
04 OCT 2026 6:04PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్ సమగ్ర, గ్రామీణాభివృద్ధికి నూతనోత్తేజం ఇస్తూ... కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన గుంటూరు జిల్లా, బుర్రిపాలెం గ్రామంలో ఆదివారం ఒక ముఖ్యమైన కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో రూ. 3,600 కోట్లతో 3 లక్షల శాశ్వత గృహాలను నిర్మించే కార్యక్రమాన్ని ఈ వేదికగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో... దేశంలోనే తొలి 3డి నిర్మాణ సాంకేతికతతో నిర్మించిన 177 ఇళ్లతో కూడిన పైలట్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ సభనుద్దేశించి శ్రీ చౌహాన్ మాట్లాడుతూ... ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అమరావతిలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు మధ్య 'డైనమిక్ భాగస్వామ్యం' రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు '360 డిగ్రీల (అన్ని రంగాల్లో) అభివృద్ధి'ని కొనసాగిస్తోందని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, తెనాలి మండలం, చరిత్రాత్మక బుర్రిపాలెం గ్రామం ఈ రోజు గ్రామీణాభివృద్ధిలో ఒక కొత్త విజయాన్ని సాధించింది. కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్ 2.0) కింద 3 లక్షల శాశ్వత గృహాల నిర్మాణ ప్రాజెక్టును ప్రారంభించారు. రూ.14 కోట్ల వ్యయంతో నిర్మించనున్న, దేశంలోనే తొలి 3డి-నిర్మిత గృహాలతో కూడిన పైలట్ ప్రాజెక్టునూ వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్, శ్రీ కొలుసు పార్థసారథి, శ్రీ కందుల దుర్గేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పీ.ఎన్. మాధవ్, రాజ్యసభ సభ్యులు శ్రీ లింగమనేని రమేష్, ఎమ్మెల్సీ శ్రీ ప్రసాద్, పాఠశాల కార్యదర్శి శ్రీ బాతు తాత్యా బాబు సహా కేంద్ర-రా ష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, వేలాది మంది గ్రామస్తులు, రైతులు, మహిళలు హాజరయ్యారు.
76,000కి బదులుగా 3 లక్షల ఇళ్లు అందించాం... 9 లక్షలు అడిగినా ఇస్తాం: కేంద్ర మంత్రి
"ఆంధ్రప్రదేశ్‌కు కేవలం 76,000 ఇళ్ల కోటా మాత్రమే ఉందని నా మంత్రిత్వ శాఖ అధికారులు నాతో చెప్పారు. అయితే, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ‘తన రాష్ట్రంలోని ప్రతి పేదవాడి కలను నెరవేర్చాలని కోరుకుంటున్నాననీ, ఇంకా ఎక్కువ ఇళ్లు అవసరమని’ అడిగారు. ప్రధానమంత్రి మోదీ ఆశీస్సులతో... మేం కేవలం 76,000 ఇళ్లు కాకుండా, ఏకంగా 3 లక్షల శాశ్వత గృహాలను మొదటి విడతగా ఆంధ్రకు అందజేశాం." అని కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. "శ్రీ చంద్రబాబు చిరునవ్వుతో... 'మనసు ఇంకా ఎక్కువ కోరుకుంటోంది'... మాకు మరో 6 లక్షల ఇళ్లు కావాలి అన్నారు. నేను ఆయనతో, 'చంద్రబాబు గారూ, భారత ప్రభుత్వం మొత్తం మీదే, నేనూ మీవాడినే. ఈ 3 లక్షల ఇళ్లను పూర్తి చేయండి... ఆ వెంటనే మరో 3 లక్షలు, ఆ తర్వాత ఇంకో 3 లక్షల ఇళ్లు మంజూరు చేస్తాం. ఆంధ్రలోని ప్రతి ఒక్క పేద కుటుంబానికి శాశ్వతంగా ఇల్లు లభిస్తుంది.”' అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
3డి కాంక్రీట్ టెక్నాలజీ: 6 నెలల్లో పటిష్ఠమైన గృహాలు సిద్ధం
బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెంలో ప్రారంభమవుతున్న 3డి కాంక్రీట్ ప్రింటింగ్ ప్రాజెక్టును దేశంలో గృహ నిర్మాణ విప్లవంగా కేంద్ర మంత్రి అభివర్ణించారు. ఈ పైలట్ ప్రాజెక్టు వల్ల సమయం, ఖర్చు, శ్రమ గణనీయంగా ఆదా అవుతాయని ఆయన పేర్కొన్నారు. యంత్రాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి... సాంప్రదాయ గృహాల కంటే ఎంతో ఉన్నతమైన మన్నికతో, సుదీర్ఘ కాలం ధృడంగా నిలిచి ఉండే ఈ ఇళ్లను కేవలం ఆరు నెలల్లోనే పూర్తి చేయనున్నారు.
అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించిన ప్రధానమంత్రి శ్రీ మోదీ
పార్లమెంటులో చట్టాన్ని ఆమోదించడం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధాని హోదాను అమరావతికి సాధించిపెట్టారని కేంద్ర మంత్రి తెలిపారు. రూ.15,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్నీ విడుదల చేశారని శ్రీ చౌహాన్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 100 శాతం గ్రాంటుతో పోలవరం జీవనాధార ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి వేగంతో పూర్తవుతోంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్ర కనెక్టివిటీని కొత్త శిఖరాలకు తీసుకువెళుతుంది అని ఆయన వివరించారు.
'అన్నదాత సుఖీభవ'... 60 లక్షల 'లఖ్‌పతి దీదీల' మిషన్
రైతులు, మహిళల సాధికారతను ప్రముఖంగా ప్రస్తావించిన కేంద్ర మంత్రి శ్రీ చౌహాన్... కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ. 6,000 పీఎం-కిసాన్ సమ్మాన్ నిధికి ముఖ్యమంత్రి నాయుడు గారు 'అన్నదాత సుఖీభవ' పథకం ద్వారా రూ. 14,000 అదనంగా చేర్చారని తెలిపారు. రాష్ట్రంలో రైతులకు చరిత్రాత్మక వార్షిక ఆర్థిక సహాయంగా రూ. 20,000 అందిస్తున్నారని పేర్కొన్నారు. పండ్లు, పూలు, కూరగాయలు, ఔషధ పంటల కోసం ఆంధ్రను దేశంలోనే అతిపెద్ద ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. స్వయం సహాయక బృందాల గురించి చర్చిస్తూ... రాష్ట్రంలో ఇప్పటికే 23 లక్షల మంది మహిళలు 'లఖ్‌పతి దీదీలు'గా మారారనీ, ఈ సంఖ్యను 60 లక్షలకు పెంచడమే ఎన్‌డీఏ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఢిల్లీ వెలుపల జాతీయ 'సరస్ మేళా'ను ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తున్నామనీ, దీనిని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారని కేంద్ర మంత్రి ప్రకటించారు.
'నేను ఎంపీ రాష్ట్రానికి మామను అయితే, ఏపీ రాష్ట్రానికీ మామనే': తెలుగులో మాట్లాడిన కేంద్ర మంత్రి
వేదికపైకి రాగానే కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్... "భారత్ మాతా కీ జై", "శ్రీ వెంకటేశ్వర భగవాన్ కీ జై" అనే నినాదాల నడుమ అనర్గళమైన తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆంధ్రభూమి... జ్ఞానం, విజ్ఞానం, ప్రతిభ, గొప్ప సంప్రదాయాల సంగమమని ఆయన అభివర్ణించారు. తెనాలి రాముని జన్మస్థలమైన ఈ పవిత్ర భూమికి నమస్కరిస్తూ ఆయన ఇలా అన్నారు... "తెలుగు భాష తేనె కన్నా మధురమైనది. ఈ రోజు అది దేశమంతటా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంటోంది. నేను మధ్యప్రదేశ్‌కు 'మామ'ను అయితే... ఆంధ్రప్రదేశ్‌కూ 'మామ'నే. ప్రజలకు సేవ చేయడం నాకు దేవుడిని పూజించడంతో సమానం. ఇక్కడి ప్రజల స్ఫూర్తిని, నిజాయితీని, అభిరుచిని చూస్తుంటే మనసులో ఒకే ఆలోచన మెదులుతుంది. 'నిజంగా, మీ అందరినీ కలవాలని ఎంతగానో కోరుకుంటున్నాను!'" అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.
డాక్టర్ పెమ్మసాని నిరాడంబరత, ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతకు ప్రశంసలు
తన సహచరులు, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని పూర్వీకుల గ్రామమైన బుర్రిపాలెంను సందర్శించడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ పేర్కొన్నారు. "చంద్రశేఖర్ గారు 'అమెరికా నుంచి తిరిగి వచ్చినవారు.' ఆయనకు గ్రామ జీవితం, గ్రామీణాభివృద్ధి అర్థమవుతాయా అని మొదట్లో నేను సందేహించాను. అయితే, ప్రజలతో ఆయనకున్న గాఢమైన అనుబంధం, సేవాభావం, ఆయన పనిలో స్పష్టతను చూసి ఆశ్చర్యపోయాను. 'చంద్రబాబు' నిజమైన ప్రతిభను గుర్తించి, దాన్ని మరింత మెరుగుపరిచి, ప్రజా సేవ కోసం రాజకీయ రంగంలోకి తీసుకువస్తారు" అని కేంద్ర మంత్రి తెలిపారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చైతన్యవంతమైన, అంకితభావం గల, నిర్ణయాత్మక నాయకత్వానికి ప్రతిరూపంగా అభివర్ణించారు. ఆంధ్రను ప్రపంచ ఐటీ కేంద్రంగా మార్చింది శ్రీ నాయుడేననీ... అదే దార్శనిక విధానం నేడు అమరావతిని ఏఐ, క్వాంటం టెక్నాలజీ, డేటా సెంటర్లు, అధునాతన తయారీ రంగాల్లో ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతోందని కేంద్ర మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ప్రసంగం
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు... శివరాజ్ జీ కేవలం మధ్యప్రదేశ్‌కే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికీ ప్రియమైన 'మామ' అని పేర్కొన్నారు. "శివరాజ్ జీ తన సుపరిపాలన, సేవ పట్ల అంకితభావంతో మధ్యప్రదేశ్‌లో ఒక అద్వితీయ రికార్డును నెలకొల్పిన ప్రజా నాయకులు. ఈ రోజు, రాష్ట్రంలోని పేదలకు శాశ్వత గృహాలు అందించే విషయాన్ని మేం అడిగిన వెంటనే, ఆయన 75,000 ఇళ్ల ప్రాథమిక ప్రతిపాదనకు మించి, తక్షణం 3 లక్షల ఇళ్లను ఆమోదించి ఆంధ్ర ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ప్రతి ఒక్కరికీ శాశ్వత గృహవసతి కల్పిస్తామన్న ఎన్‌డీఏ వాగ్దానాన్ని నేను ప్రస్తావించి, మాకు మొత్తం 9 లక్షల ఇళ్లు అవసరమని తెలియజేసినప్పుడూ... మొదటి దశ పనులు పూర్తయిన వెంటనే మిగిలిన 6 లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణం మంజూరు చేస్తుందని ఆయన బహిరంగ సభలో హామీ ఇచ్చారు" అని శ్రీ చంద్రబాబు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శనం, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిరంతర సహకారంతో... మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఆధునిక సాంకేతికత, గ్రామీణాభివృద్ధి సహా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఆవిర్భవిస్తుందని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు.
****
(రిలీజ్ ఐడి: 2318949)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6