సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
8వ పీఎం మెమెంటోస్ ఈ- వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హర్యానా క్రీడా విజయాలు
వేలంలో హర్యానాకు చెందిన ఏడు జ్ఞాపికల్లో ముగ్గురు పారాలింపిక్ స్వర్ణ పతక విజేతలు సమర్పించిన వస్తువులతో పాటు, రాష్ట్ర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే వస్తువులు
వేలం ద్వారా వచ్చిన ఆదాయం నమామి గంగే ప్రాజెక్ట్‌కు కేటాయింపు
నాడు పోస్టు చేయడమైనది:
03 OCT 2026 5:22PM by PIB Hyderabad
8వ పీఎం మెమెంటోస్ ఈ- వేలంలో హర్యానాకు చెందిన ఏడు జ్ఞాపికలు ఉన్నాయి. వీటిలో క్రీడా విజయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అయిదు జ్ఞాపికలు క్రీడలకు సంబంధించినవి కాగా, మిగిలినవి రాష్ట్ర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి.
ప్రజల బహిరంగ వేలం కోసం అందుబాటులో ఉన్న ఈ జ్ఞాపికలు.. విజయాలు, పట్టుదలకు సంబంధించిన స్ఫూర్తిదాయక కథలను కలిగి ఉన్నాయి. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు అందించనున్నారు.
హర్యానా పారాలింపిక్ ఛాంపియన్‌లకు గౌరవం
ఈ సేకరణలో ప్రముఖంగా ఉన్న జ్ఞాపికల్లో హర్విందర్ సింగ్ అందించిన ఒక బాణం ఉంది. విలువిద్యలో పారాలింపిక్స్ స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందారు. అలాగే పారిస్ 2024 పారాలింపిక్స్‌లో పురుషుల ఎఫ్41 జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించిన నవదీప్ సింగ్‌కు సంబంధించిన రెండు జ్ఞాపికలు కూడా ఉన్నాయి. ఆయన టోపీ, సంతకం చేసిన చొక్కా ఈ క్రీడా విజయానికి సంబంధించిన జ్ఞాపికలను సొంతం చేసుకునే అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తున్నాయి.
పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ స్వర్ణ పతక విజేత నితేశ్ కుమార్ అందించిన అసలైన యోనెక్స్ బ్యాడ్మింటన్ రాకెట్, భారత జట్టు చొక్కా కూడా ఈ సేకరణలో ఉన్నాయి. ఈ వస్తువులన్నీ కలిపి భారత క్రీడా విజయాల్లో హర్యానా అందించిన విశిష్ట సహకారాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
హర్యానా ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం
క్రీడలకు సంబంధించిన జ్ఞాపికలతో పాటు, ఈ సేకరణలో శీతల దేవి లోహ విగ్రహం కూడా ఉంది. అధిక నాణ్యత కలిగిన లోహంతో రూపొందించిన ఈ విగ్రహంలో సున్నితమైన, కళాత్మకమైన అలంకరణలు ఉన్నాయి. మెరిసే ముగింపు విగ్రహానికి మరింత దైవిక శోభను అందిస్తోంది.
భగవద్గీతతో హర్యానాకు ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా ధర్మక్షేత్రం కురుక్షేత్రలోని గీతా ఉపదేశ స్థలాన్ని స్మరించుకునే జ్ఞాపిక కూడా ఈ సేకరణలో ఉంది.
పీఎం మెమెంటోస్ 8వ విడతలోని ఈ ఏడు జ్ఞాపికలు హర్యానాలోని విభిన్న ప్రత్యేకతలను ఒకచోట చేర్చాయి. ఈ జ్ఞాపికల వేలం ద్వారా వాటికి మరింత విస్తృతమైన ప్రజా ప్రయోజనం చేకూరనుంది. వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు అందించనున్నారు.
వేలం తేదీలు, పాల్గొనే వివరాలు, పూర్తి జాబితా కోసం అధికారిక పీఎం మెమెంటోస్ ఈ–వేలం వేదికను pmmementos.gov.in సందర్శించండి.
(రిలీజ్ ఐడి: 2318718)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8