సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘సాధన శృంఖల’: ‘మిషన్ కర్మయోగి’పై విజయవాడలో తొలి ప్రాంతీయ వర్క్‌ షాప్‌ విజయవంతం

· ఉన్నతి.. సామర్థ్య వికాస కమిషన్ శిక్షణ సంస్థల పరిణామాత్మక చట్రం ద్వారా శిక్షణ నుంచి సామర్థ్య వికాసం వైపు దిశానిర్దేశం

· శిక్షణ సంస్థలను సామర్థ్య వికాస కేంద్రాలుగా మార్చే ఉత్తమ పద్ధతులు.. కార్యాచరణ ప్రణాళికలను సమర్పించిన 7 రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలు

· దేశంలో సివిల్ సర్వీసు శిక్షణ సంస్థల వ్యవస్థ మెరుగు దిశగా సీబీసీ చేపట్టిన పరిణామాత్మక కార్యక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రశంస

నాడు పోస్టు చేయడమైనది: 01 OCT 2026 8:07PM by PIB Hyderabad

   ‘మిషన్ కర్మయోగి’లో భాగంగా ‘సాధన శృంఖల’ కార్యక్రమం కింద సామర్థ్య వికాస కమిషన్ (సీబీసీ) ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో నిర్వహించిన తొలి ప్రాంతీయ వర్క్‌షాప్‌ విజయవంతంగా ముగిసింది. ‘శిక్షణ సంస్థల నుంచి సామర్థ్య వికాస సంస్థల దిశగా ప్రస్థానం’ ఇతివృత్తంగా సెప్టెంబరు 29-30 తేదీల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిషా రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం నుంచి 300 మందికి పైగా ప్రతినిధులు, అక్కడి విషయ పరిజ్ఞాన నిపుణులు ఇందులో పాల్గొన్నారు. వీరిలో శిక్షణ, పరిపాలన శిక్షణ సంస్థలు సహా సాధారణ పరిపాలన విభాగాలు, అకాడమీల అధిపతులు, అధ్యాపకులు ఉన్నారు.

నేపథ్యం

 

సాధన (జాతీయ ప్రగతి దిశగా సానుకూల అభివృద్ధి-మానవీయ సామర్థ్య వికాసం) శృంఖల అంటే- జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రాంతీయ సంప్రదింపు కార్యక్రమాల పరంపర. ఇంతకుముందు ‘సీబీసీ’ నిర్వహించిన భాగస్వామ్య సంప్రదింపుల కార్యక్రమానికి కొనసాగింపుగా దీన్ని రూపొందించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 2-8 తేదీల మధ్య ‘సాధన సప్తాహ్’ పేరిట ఒక జాతీయ శిక్షణ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సాంకేతికతలు, సంప్రదాయం, విస్పష్ట ఫలితాలపై ప్రధానంగా దృష్టి సారించారు. దీంతోపాటు ‘సామర్థ్య వికాస సంస్థాగతీకరణ: శిక్షణ నుంచి పనితీరు ఆధారిత పాలన దాకా” ఇతివృత్తంగా జాతీయ స్థాయి విభాగాల సదస్సును కూడా నిర్వహించారు.

 

ఈ క్రమంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ వర్క్‌ షాప్‌ వంటివి సంబంధిత భాగస్వాములు ఒకే వేదికపైకి తెస్తాయి. తద్వారా వారి విభిన్న అవసరాలు, సందర్భాలను ప్రతిబింబించే శిక్షణ సంస్థల పరిణామాత్మక చట్రాన్ని సంయుక్తంగా రూపొందిస్తాయి. ఆ చట్రం ధ్రువీకరణతోపాటు మార్పు సంబంధిత సంయుక్త భవిష్యత్‌ ప్రణాళికలోని అంశాలను ఆచరణాత్మక ప్రాథమ్యాలుగా మార్చే పునాదిని సమకూరుస్తాయి. ఈ చట్రంలోని ప్రధాన డిజిటల్ ఉపకరణం ‘ఉన్నతి’ వేదిక ఇందుకు సౌలభ్యం కల్పిస్తుంది. వనరుల భాగస్వామ్యం, సహకారం, నిరంతర, డేటా ఆధారిత సంస్థాగత పురోగమనానికి మద్దతివ్వడంలో భాగంగా ఇది 900కు పైగా శిక్షణ సంస్థలను అనుసంధానిస్తుంది.

 

తొలి రోజు: ప్రారంభ కార్యక్రమం

 

విజయవాడలో సెప్టెంబరు 29న జ్యోతి వెలిగించి, కర్మయోగి గీతం ఆలపించడంతో ఈ వర్క్‌ షాప్‌ ప్రారంభమైంది. అనంతరం సీబీసీ సభ్యురాలు (పరిపాలన) డాక్టర్‌ అల్కా మిట్టల్ స్వాగతోపన్యాసం చేయగా, ముఖ్య కార్యదర్శి (ప్రణాళిక) శ్రీ పీయూష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ జి.సాయి ప్రసాద్ సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ‘ఉన్నతి’పై వీడియో ప్రదర్శన తర్వాత రాష్ట్రస్థాయి లాంఛనాలను ముగించారు.

 

అనంతరం సీబీసీ చైర్‌పర్సన్ శ్రీమతి ఎస్.రాధా చౌహాన్ మాట్లాడుతూ- నానాటికీ రూపాంతరం చెందే సాంకేతికతలు... ముఖ్యంగా ఏఐ వంటి పరిజ్ఞానాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ అధికారుల సామర్థ్యం నిరంతరం మెరుగుపడాలన్నారు. “పౌర దేవోభవ” సూత్రం పరిపాలనకు ప్రధాన ప్రాతిపదికగా ఆవిర్భవించిందని ఆమె చెప్పారు. తదనుగుణంగా అధికారులు తమ వ్యవహార శైలి, నైపుణ్యం, పనితీరును పౌర అవసరాల మేరకు మార్చుకోవడం అవశ్యమని స్పష్టం చేశారు. ఈ దిశగా క్రమబద్ధ అభ్యసనంలో ‘ఐగాట్ కర్మయోగి’ పాత్రను ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. దీనికింద శిక్షణ సంస్థలు వ్యూహాత్మక, సామర్థ్య చోదిత, సామర్థ్య వికాస సంస్థలుగా రూపొందాలన్నారు. తద్వారా ప్రభుత్వ సంస్థలు తమ పాత్రకు తగిన సామర్థ్యాలను పెంచుకోగలవని చెప్పారు. ఈ దిశగా ‘ఐగాట్ కర్మయోగి’ ద్వారా లభించే ఆన్‌లైన్ అభ్యసనం కూడా తోడ్పడుతుందని తెలిపారు.

వర్క్‌ షాప్‌ను ప్రారంభించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ- డేటా, సాంకేతికతల ఫలితంగా పరిపాలన విధానాలు రూపాంతరం చెందాయని చెప్పారు. తక్షణ సమాచారం, వివిధ శాఖల మధ్య దాని అనుసంధానం, ఏఐ ఆధారిత పర్యవేక్షణ వంటివి నేడు సకాలంలో చర్యలకు తోడ్పడతాయని తెలిపారు. ఈ క్రమంలో ఉత్తమ విధానాలకు సమర్థ అమలు, నాయకత్వం తోడుకావాలని స్పష్టం చేశారు. ఆ మేరకు సమగ్ర సామర్థ్య వికాస వ్యవస్థ సృష్టి లక్ష్యంగా ‘మిషన్ కర్మయోగి’ ఏర్పాటు, దీని సద్వినియోగం కోసం ‘ఐగాట్’, ‘ఉన్నతి’ వంటి మాధ్యమాల రూపకల్పనను ఆయన అభినందించారు. ఈ ఆన్‌లైన్ అభ్యసనానికి వివిధ సంస్థలలో భౌతిక శిక్షణ తోడు కావాలని చెప్పారు. ప్రతి అధికారి ఎప్పటికప్పుడు పరిజ్ఞాన విస్తరణ ద్వారా పాత పద్ధతులకు స్వస్తి చెబుతూ ముందడుగు వేయడం అత్యంత కీలకమని ఆయన పునరుద్ఘాటించారు.

 

ఐగాట్ కర్మయోగి పోర్టల్‌ ద్వారా ఇప్పటికే 2 కోట్ల కోర్సులు పూర్తి కావడంపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. స్వర్ణాంధ్ర-2047 స్వప్న సాకారం దిశగా వృద్ధిని వేగిరపరచడంలో సమర్థ పరిపాలన, ప్రభావశీల విధానాల అమలు ప్రధానమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రగతి ఫలాలు చిట్టచివరి వ్యక్తికీ చేర్చాలనే లక్ష్య సాధనలో ‘పీ4’ (ప్రభుత్వ-ప్రైవేటు-ప్రజా భాగస్వామ్యం) విధానం ఆవశ్యకతను కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ‘ఉన్నతి’ మాధ్యమం ద్వారా జాతీయ, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయి శిక్షణ సంస్థలను ఒకే వేదికపైకి తేవడం హర్షణీయమన్నారు. విభిన్న పని పరిస్థితులపై అధికారులకు ప్రత్యక్ష అవగాహన దిశగా ఈ నెట్‌వర్క్‌ను విశ్వవిద్యాలయాలు సహా ప్రైవేట్ రంగానికీ విస్తరించాలని సూచించారు.

 

ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్య వికాసం పరంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. కర్ణాటక, ఒడిషా రాష్ట్రాలు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించాయి. ఈ ఘనత సాధించిన అధికార యంత్రాంగాలకు ముఖ్యమంత్రి పురస్కార ప్రదానం చేశారు. సీబీసీ కార్యదర్శి శ్రీ జగదీప్ గుప్తా వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.

తొలి రోజు: సాంకేతిక గోష్ఠులు

 

· శిక్షణ సంస్థల స్థాయి నుంచి సామర్థ్య వికాస సంస్థల దిశగా రూపాంతరీకరణ: దేశంలోని శిక్షణ సంస్థలు వ్యక్తిగత కార్యక్రమాలకు బదులు పూర్తి సామర్థ్య వికాస వలయాన్ని నిర్వహించే స్థాయికి చేరడం ఎలాగో ‘ఉన్నతి’ ఆధ్వర్యాన తొలి గోష్ఠి విశదీకరించింది. సామర్థ్య వికాస ప్రణాళికల (సీబీపీ) ద్వారా డిమాండ్‌ను అర్థం చేసుకోవడం, దాన్ని తగిన అభ్యసన కార్యక్రమాలుగా మార్చి సమర్థంగా అమలు చేయడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐగాట్‌ కర్మయోగి పరిధిలో ఏఐ సీబీపీ క్రియేషన్ టూల్ ప్రదర్శన, శిక్షణ సంస్థ కోసం సీబీపీ ద్వారా గ్రహించిన అవసరాలను కార్యక్రమాలుగా మార్చే ఉన్నతి పోర్టల్ ఫీచర్లను ప్రదర్శించారు. అలాగే అభ్యాసకులకు శిక్షణ సంస్థ వాటిని సమర్థంగా అందించే వెసులుబాటుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ‘మిషన్ కర్మయోగి’ సంబంధిత అంశాలలో తమ పురోగతిని ఇందులో పాల్గొన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం వివరించాయి.

 

· శిక్షణ సంస్థల కోసం కర్మయోగి నాణ్యత చట్రం (కేక్యూఎఫ్‌): సామర్థ్య అవసరాల గుర్తింపు నుంచి అభ్యసన కార్యక్రమాల రూపకల్పన, తయారీ, సరఫరా, మూల్యాంకనం, మెరుగుదల దాకా అభ్యసన వలయం మొత్తంలో శిక్షణ సంస్థల నాణ్యతను పొందుపరచడం ఎలాగో ఈ గోష్ఠి వివరించింది. తదనుగుణంగా ఇందులో- సామర్థ్య చోదిత పాఠ్యప్రణాళిక రూపకల్పన కోసం జాతీయ పాఠ్యప్రణాళిక రూపకల్పన చట్రం, (ఎన్‌సీడీఎఫ్‌), అవసరమైన సందర్భాలలో మానవ సమీక్ష మద్దతు ద్వారా కోర్సుల సమీక్ష దిశగా ఏఐ చోదిత నాణ్యత మూల్యాంకనం పేరిట రెండు పరిపూరక విభాగాలను పరిచయం చేసింది.

· కర్మయోగి కర్తవ్య కార్యక్రమం (కేకేకే): జాతీయ స్థాయిలో ప్రవర్తనా శైలి శిక్షణ కార్యక్రమంతోపాటు ప్రభుత్వోద్యోగులలో- ప్రత్యేకించి క్షేత్రస్థాయిలో సేవా భావం పెంపొందించే విధానాన్ని ఈ గోష్ఠి విశదీకరించింది. వారిలో పౌర కేంద్రక వైఖరి, ప్రవర్తనా శైలిని అనుభవపూర్వక అభ్యసనం, ఆత్మపరిశీలన, సహచరులతో సంభాషణ ఎలా బలోపేతం చేయగలవో వివరించింది. ఈ కార్యక్రమాన్ని చివరి అంచె దాకా చేర్చడంలో శిక్షణ సంస్థలు, అధ్యాపకుల పాత్రను కూడా ప్రముఖంగా ప్రస్తావించింది.

 

· శిక్షణ సంస్థల రూపాంతరీకరణ చట్రంపై సంప్రదింపులు: ఇందులో భాగంగా సంస్థాగత పాలన బలోపేతం, డిజిటల్ రూపాంతరీకరణలో ప్రగతి, ఏఐ కేంద్రకంగా శిక్షణ సంస్థలలో మార్పు తదితరాలపై అభిప్రాయాలను ఆహ్వానించారు. ఆయా రాష్ట్రాలు, సంస్థాగత నేపథ్యాలు ప్రాతిపదికగా సీబీసీ నిర్దేశిత శిక్షణ సంస్థల రూపాంతరీకరణ చట్రం అమలుకుగల అవకాశాలు-సమస్యలపై చర్చించారు. అమలు ప్రాథమ్యాలు, దశలను గుర్తించే ముసాయిదా రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికల రూపకల్పనకు ఈ చర్చలు దోహదం చేశాయి.

 

రెండో రోజు: సమీక్ష.. నిపుణుల భేటీ.. రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికల సమర్పణ

 

‘కృత్రిమ మేధ (ఏఐ) శకంలో అభ్యసనంపై పునరాలోచన’ అంశంపై నిపుణుల సమావేశంతో రెండో రోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ‘సింప్లిలెర్న్’ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీ కృష్ణకుమార్ ప్రసంగిస్తూ- అభ్యసనం ఇకపై జీవితంలోని ఒక దశ కాదని, అదొక నిరంతర ప్రక్రియని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు నేడు నిర్దిష్ట నైపుణ్యం సహా ఏఐ ప్రావీణ్యమూ అవశ్యమని ఆయన పేర్కొన్నారు. అయితే, కంటెంట్‌ విస్తృతి వల్ల మార్గనిర్దేశకుల కొరత ఏర్పడిందని చెప్పారు. అందువల్ల మార్గదర్శకుడిగా శిక్షకుడి పాత్ర మునుపటికన్నా ఇప్పుడు మరింత కీలకమన్నారు. ఈ నేపథ్యంలో శిక్షణ సంస్థలు ఏఐ కేంద్రక పాఠ్యప్రణాళికను అనుసరిస్తూ ఆచరణాత్మక అభ్యసనానికి ప్రాధాన్యమివ్వాలని స్పష్టీకరించారు. అభ్యసన విస్తృతి దిశగా ఏఐ వినియోగం మరింత పెరగాలని ఆయన సూచించారు.

 

ఇక తొలి రోజు కార్యక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి శ్రీ పీయూష్ కుమార్ తన సమీక్ష సారాంశాన్ని అందరితో పంచుకున్నారు. ఈ మేరకు ప్రతి గోష్ఠిలో వెల్లడైన ప్రధాన ఆలోచనలు, అభిప్రాయాలను కింది విధంగా విశదీకరించారు:

· నియమాధారిత, కోర్సు-కేంద్రక శిక్షణ నుంచి పాత్ర-సామర్థ్య-ఫలితాధారిత సామర్థ్య వికాసం వైపు మళ్లడం.. ‘సీబీపీ’లు నిరంతర డిమాండ్‌కు వనరులుగా ఉండటం ఇందులో ప్రధానాంశాలు.

 

· కేక్యూఎఫ్‌ ద్వారా రూపకల్పన దశలోనే అభ్యసన నాణ్యతకు రూపమివ్వడం.

 

· కేకేకే కింద అనుభవం, సమీక్ష, సహచరులతో సంభాషణల ద్వారా సేవాభావం ప్రోదిచేయడం.

 

· భవిష్యత్‌ సంసిద్ధ శిక్షణ సంస్థల కోసం సమష్టిగా ముందడుగు వేయడంలో మూడు ప్రాథమ్యాలు: ఒక అనుసంధాన వ్యవస్థ.. ప్రభావశీల సంస్థలు.. బాధ్యతాయుత ఏఐ అనుసరణ.

 

ఈ వర్క్‌ షాపులో పాల్గొన్న 6 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం తమ పరిధిలో ఉత్తమ పద్ధతులను, కార్యాచరణ ప్రణాళికల ముసాయిదాను అందజేశాయి. సంస్థాగత బలోపేతం దిశగా ప్రాధాన్య రంగాల గుర్తింపు, ‘ఉన్నతి’ అనుసరణ దిశగా తమ అవసరాలను వివరించాయి. ఇందులో పాల్గొన్న విషయ నిపుణులు కూడా తమ పరిశీలనలో వెల్లడైన ముఖ్యాంశాలను పంచుకున్నారు.

 

వందన సమర్పణ

 

సామర్థ్య వికాస కమిషన్‌ (సీబీసీ) కార్యదర్శి శ్రీ జగదీప్ గుప్తా వందన సమర్పణ చేస్తూ- చర్చాగోష్ఠులపై తన సమీక్ష గురించి వివరిస్తూ- శిక్షణ సంస్థల రూపాంతరీకరణ చట్రానికి అనువైన మూడు ప్రధానాంశాలను ప్రకటించారు. అవేమిటంటే:

 

· స్వరూపం - పరిపాలన: సాధికార సంస్థాగత నాయకత్వం, క్రమబద్ధ స్వయంప్రతిపత్తి, పనితీరు ఆధారిత జవాబుదారీతనం.

 

· కార్యాచరణ నైపుణ్యం - వ్యవస్థాగత సహకారం: ‘ఉన్నతి’ వేదిక ద్వారా సంస్థల మధ్య అధ్యాపకులు, అనుభవ జ్ఞానం, మౌలిక సదుపాయాల క్రమబద్ధ ఆదానప్రదానం.

 

· డిజిటల్ - ఏఐ పరిజ్ఞానాల అనుసరణ: బలమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు, అత్యాధునిక ఏఐ ఉపకరణాల సురక్షిత వినియోగం, మానవాధీనంలోనే అంతిమ నిర్ణయాలు.

ఈ వర్క్‌షాప్‌లో పరస్పరం పంచుకున్న అభిప్రాయాలను క్రోడీకరించి తమతమ కార్యాచరణ ప్రణాళికలను ఖరారు చేయాలని ఆయన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు. అలాగే, ఉన్నతిలో ఇంకా చేరని సంస్థలు అందులో భాగం కావాలని ఆహ్వానం పలికారు.

 

‘ఉన్నతి’ నేపథ్యం

 

‘ఉన్నతి’ (యూనిఫైడ్ న్యూ-ఏజ్ నేషనల్ ట్రైనింగ్ ఇనిషియేటివ్) అంటే- సీబీసీ ఆధ్వర్యాన ప్రారంభమైన ఒక డిజిటల్ వేదిక. ఇది మునుపటి ‘ఎన్‌ఎస్‌సీఎస్‌టీఐ’ అక్రెడిటేషన్‌ విధానాన్ని నిరంతర పురోగమన వ్యవస్థగా మార్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 700కు పైగా శిక్షణ సంస్థలను ఇది అనుసంధానించింది. అలాగే, సంస్థాగత గుర్తింపు, సహకారంతోపాటు అధ్యాపకులు, అనుభవ జ్ఞానం, మౌలిక సదుపాయాల క్రమబద్ధ ఆదానప్రదానాన్ని ‘ఉన్నతి’ సులభం చేస్తుంది. శిక్షణ దిశగా నిరంతర డిమాండును సూచించడానికి ఇది ‘సీబీపీ’లను ఒక ఉపకరణంగా వాడుకుంటుంది. అలాగే, ఆన్‌-ఆఫ్‌లైన్ అభ్యాసనాల పర్యవేక్షణ కోసం ‘ఐగాట్‌ కర్మయోగి’ వేదికతో, రాష్ట్ర మానవ వనరుల వ్యవస్థలతో ఇది అనుసంధానితమవుతుంది. సంస్థాగత పనితీరును, తక్షణ ప్రమాణాలను ‘ఉన్నతి’ సామర్థ్య సూచీ ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంది. ఇందుకు ఏఐ సహాయపడినప్పటికీ, అంతిమ నిర్ణయాలు మాత్రం సంస్థల పరిధిలో, మానవాధీనంలోనే ఉంటాయి.

 

****


(రిలీజ్ ఐడి: 2318352) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी