రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
అసాధారణంగా తక్కువ బిడ్‌లు నమోదైన ప్రాజెక్టుల్లో ప్రత్యేక నాణ్యతా తనిఖీలు నిర్వహించనున్న ఎన్‌హెచ్‌ఏఐ
నాణ్యత బలోపేతం, సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం, సకాలంలో దిద్దుబాటు చర్యలు సులభతరం చేయడం లక్ష్యంగా ప్రాజెక్టుల తనిఖీలు
నాడు పోస్టు చేయడమైనది:
30 SEP 2026 4:55PM by PIB Hyderabad
జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో నాణ్యత నియంత్రణను, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించడాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా నిర్మాణంలో ఉన్న 17 జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) ప్రత్యేక నాణ్యతా తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టుల బిడ్ విలువ, అంచనా ప్రాజెక్ట్ వ్యయం కంటే 15 శాతానికి పైగా తక్కువగా ఉంది. ఎన్‌హెచ్ఏఐ సాధారణ నాణ్యతా తనిఖీలకు అదనంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. నాణ్యతకు సంబంధించిన ఏవైనా సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, సకాలంలో దిద్దుబాటు చర్యలు తీసుకోవడమే వీటి ముఖ్య ఉద్దేశం. మొదటి విడత తనిఖీలు డిసెంబర్ 2026 నాటికి పూర్తి కావాల్సి ఉంది. నాణ్యత, నిర్మాణ ప్రమాణాలను పాటించడాన్ని నిర్ధారించుకోవడానికి, గుర్తించిన ప్రాజెక్టులను 6 నెలల తర్వాత మరో నిపుణుల బృందంతో ఎన్‌హెచ్ఏఐ తిరిగి తనిఖీ చేస్తుంది.
నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా 17 ప్రాజెక్టులు ఎంపిక
రూ.500 కోట్లకు పైబడిన నిర్మాణ వ్యయం, 15 శాతానికి పైగా టెండర్ విలువ తగ్గింపు, 35 శాతం నుంచి 80 శాతం మధ్య భౌతిక పురోగతి అనే మూడు ప్రమాణాల ఆధారంగా తనిఖీల కోసం 17 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. నిర్మాణంలో కీలక దశలో ఉన్న ప్రాజెక్టుల నాణ్యతా తనిఖీలపై దృష్టి సారిస్తూ... నిష్పాక్షికమైన, డేటా ఆధారిత విధానాన్ని అవలంబించడానికి ఈ ప్రమాణాలు సహాయపడతాయి.
కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రీన్‌ఫీల్డ్, యాక్సెస్-నియంత్రిత కారిడార్లు, బైపాస్‌లు సహా నాలుగు, ఆరు వరుసల విస్తరణ పనులూ ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఉన్నాయి.
అనుభవజ్ఞులైన ఇంజనీర్లతో తనిఖీలు
నాణ్యతా యంత్రాంగ బలోపేతం, నిబంధనల పాటింపును నిర్ధారించడం లక్ష్యంగా ఎన్‌హెచ్ఏఐ నిపుణుల బృందాలను ఏర్పాటు చేసింది. రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రజా పనుల శాఖలు సహా వివిధ ప్రభుత్వ సంస్థలకు చెందిన 39 మంది అనుభవజ్ఞులైన, విశ్రాంత ఇంజనీర్ల నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలను నిర్వహిస్తాయి. తనిఖీల సమయంలో సాంకేతిక నిపుణులూ ఈ బృందాలకు సహకారం అందిస్తారు.
నిర్మాణం, సామాగ్రి నాణ్యత, భద్రత తనిఖీ
ఆమోదించిన డ్రాయింగ్‌లు, సాంకేతిక నిర్దేశాలు, ఒప్పంద షరతులు, ప్రాజెక్ట్-నిర్దిష్ట నాణ్యతా ప్రణాళికలకు అనుగుణంగా నిర్మాణ పనులను నిపుణుల బృందాలు తనిఖీ చేస్తాయి. వారు నిర్మాణ సామగ్రి నాణ్యత, పనితనం, నిర్మాణ పద్ధతులతో పాటు సేకరించిన నమూనాలు, పరీక్షల రికార్డులనూ పరిశీలిస్తారు.
వర్తించే చోట... రహదారి భద్రతా చర్యలు, ట్రాఫిక్ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ చర్యలూ ఈ తనిఖీల్లో భాగంగా ఉంటాయి. అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా లేని ఏ పనినైనా గుర్తించి, వర్తించే ఒప్పంద నిబంధనల ప్రకారం సవరణ చర్యల కోసం తదుపరి చర్యలు చేపడతారు.
సాధారణ నాణ్యతా సమస్యలను, నిర్మాణ పద్ధతులను... కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లు, ఇతర ప్రాజెక్ట్ భాగస్వాముల నుంచి అధిక జవాబుదారీతనం అవసరమయ్యే రంగాలను గుర్తించడంలో ఈ ప్రత్యేక తనిఖీలు ఎన్‌హెచ్ఏఐకి సహాయపడతాయి.
దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి జాతీయ రహదారి నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో... కొనసాగుతున్న జాతీయ రహదారి ప్రాజెక్టుల నాణ్యత పర్యవేక్షణను బలోపేతం చేయడానికి, సకాలంలో దిద్దుబాటు చర్యలు తీసుకునేలా చూడటానికి ఎన్‌హెచ్ఏఐ కొనసాగిస్తున్న నిరంతర ప్రయత్నాల్లో ఈ కార్యక్రమం ఒక భాగం.
***
(రిలీజ్ ఐడి: 2317397)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5