ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అధికారిక పత్రాలను కృత్రిమ మేధస్సు ఉపయోగించి బహుభాషల్లోకి అనువదించటానికి శ్రీకారం చుడుతూ ‘కాగ్-భాషిణి అనువాద్’ను సంయుక్తంగా ప్రారంభించిన డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్, కాగ్

సంస్థాగత అనువాద ప్రక్రియల్లో ‘లాంగ్వేజ్ఏఐ’ని ఉపయోగించనున్న భాగస్వామ్యం.. సాంకేతికత ఆధారిత భాషా సహకారాన్ని ప్రదర్శిస్తున్న హిందీ పక్షోత్సవ కార్యక్రమాలు

నాడు పోస్టు చేయడమైనది: 30 SEP 2026 4:19PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (మైటీ) ఆధ్వర్యంలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీ) కింద పనిచేస్తున్న డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ (డీఐబీడీ).. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) కార్యాలయంతో కలిసి ఈ రోజు ‘కాగ్-భాషిణి అనువాద్’ను ప్రారంభించింది. అధికారిక కాగ్ పత్రాలు, ఆడిట్-సంబంధిత నివేదికల అనువాదానికి మద్దతుగా భాషిణి అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత అనువాద పరిష్కారం ఇది. దిల్లీలోని కాగ్ కార్యాలయంలో జరిగిన 74వ హిందీ దినోత్సవం, హిందీ పక్షోత్సవాలు 2026 ముగింపు వేడుక సందర్భంగా ఈ పరిష్కారాన్ని విడుదల చేశారు. 

 

ఈ కార్యక్రమానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ శ్రీ కె. సంజయ్ మూర్తి, డిప్యూటీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ శ్రీ ఎ. ఎం. బజాజ్, అడిషనల్ డిప్యూటీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ డాక్టర్ నిలోత్పల్ గోస్వామి, డైరెక్టర్ జనరల్ శ్రీ అథర్వ సిన్హా, తదితర సీనియర్ కాగ్ అధికారులు, ఇతర అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు.

 

భాషిణికి ఉన్న బహుభాషా సాంకేతిక సామర్థ్యాలను కాగ్‌కు ఉన్న ప్రత్యేక భాషా అవసరాలతో మిళితం చేస్తూ సంస్థాగత ప్రక్రియలో లాంగ్వేజ్ఏఐని తీసుకురావడంలో ఈ ప్రారంభోత్సవం ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలుస్తుంది. తగిన మానవ పర్యవేక్షణను కొనసాగిస్తూ ఇప్పటికే ఉన్న సంస్థాగత ప్రక్రియలకు అనుబంధంగా ఉంటూ అధికారిక- ఆడిట్ సంబంధిత పత్రాల అనువాదానికి మద్దతుగా ఇది రూపుదిద్దుకుంది.

 

స్థిరమైన పదజాలాన్ని, సందర్భోచిత అనువాదాన్ని, అవుట్‌పుట్ నాణ్యతను సమర్థవంతంగా అందించడంపై దృష్టి సారిస్తూ కాగ్ కోసం ప్రత్యేకించిన లాంగ్వేజ్ఏఐ పరిష్కారంగా 'కాగ్-భాషిణి అనువాద్'ను అభివృద్ధి చేశారు. భద్రత, నియంత్రిత యాక్సెస్, డేటా సౌర్వభౌమత్వం వంటి సంస్థాగత అవసరాలను పరిష్కరిస్తూనే అధికారిక పత్రాల అనువాదం కోసం ఈ పరిష్కారం ఏఐ ఆధారిత వాతావరణాన్ని అందిస్తుంది.

భాషలవారీగా అధికారిక సమాచారాన్ని మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వ సంస్థలకు లాంగ్వేజ్ఏఐ అందిస్తోన్న విస్తృత అవకాశాన్ని ఈ సహకారం తెలియజేస్తోంది. సుస్థిరమైన సంస్థాగత ప్రక్రియల్లో బహుభాషా ఏఐ సామర్థ్యాలను అనుసంధానించడం ద్వారా భారతీయ భాషల్లో అధికారిక సమాచారాన్ని మరింత విస్తృతంగా, సమర్థవంతంగా పొందేలా ఇది దోహదపడుతుంది.

 

ప్రభుత్వం, ప్రజా సేవల్లో దీని అనువర్తనాలను ప్రధానంగా తెలియజేస్తూ డిజిటల్ ఇండియా భాషిణి లాంగ్వేజ్ఏఐ సామర్థ్యాలపై ఈ కార్యక్రమంలో ఒక ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. కాగ్ కార్యాలయంలో 'కాగ్-భాషిణి అనువాద్' పరిష్కారాన్ని అధికారికంగా ప్రారంభించడం కూడా ఈ కార్యక్రమంలో మరో ముఖ్యాంశంగా నిలిచింది. 

 

ఈ కార్యక్రమంలో డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ సీఈఓ శ్రీ అమితాబ్ నాగ్ మాట్లాడుతూ.. భాషా డేటా, ఏఐ నమూనాలు- అప్లికేషన్లు- వినియోగ సందర్భాల్లో భాషిణి అభివృద్ధిని, భారత భాషా వైవిధ్యానికి సరిపోయే సార్వభౌమ లాంగ్వేజ్ఏఐ ప్లాట్‌ఫామ్ రూపకల్పనను వివరించారు.

 

భాషిణి ప్రస్తుతం 36 భారతీయ టెక్స్ట్ భాషలు, 23 భారతీయ వాయిస్ భాషలు, 35 అంతర్జాతీయ భాషలకు మద్దతు ఇస్తోందని.. ప్రజా సేవా రంగాల్లో పెరుగుతున్న విభిన్న అవసరాలకు ఇది ఉపయోగపడుతోందని ఆయన పేర్కొన్నారు. బహుభాషా వ్యవసాయ సలహాలు, వాయిస్-ఎనేబుల్డ్ ఫిర్యాదుల నమోదు, ప్రాసెసింగ్.. వాయిస్, టెలిఫోన్ ఆధారిత ఇంటర్‌ఫేస్‌‌ల ద్వారా సేవలను అందించే సంభాషణ సేవలు వీటిలో ముఖ్యమైనవి.

 

భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ శ్రీ కే. సంజయ్ మూర్తి మాట్లాడుతూ.. ఆడిట్ ఫలితాలు, నివేదికలను ప్రజలు అర్థం చేసుకునే భాషల్లో అందేలా చూసే ప్రాముఖ్యతను ప్రముఖంగా చెప్పారు. అధికారిక కార్యకలాపాల్లో హిందీ, ఇతర భారతీయ భాషల వినియోగాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలకు దోహదపడుతూనే స్థానిక, ప్రాంతీయ భాషల్లో ఆడిట్ సమాచారాన్ని సులభంగా పొందేలా చేయడంలో సాంకేతికతకు ఉన్న సామర్థ్యాన్ని ఆయన ప్రస్తావించారు. 

 

భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయం అదనపు డిప్యూటీ కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ (రాజ్‌భాషా) శ్రీ నిలోత్పల్ గోస్వామి మాట్లాడుతూ.. "కృత్రిమ మేధస్సు, కమ్యూనికేషన్ల కలయిక వివిధ ప్రాంతాల మధ్య భాషా అడ్డంకులను అధిగమించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. మన సంస్థాగత ప్రక్రియల్లో భాషా సాంకేతికతను అనుసంధానించడం ద్వారా పరిపాలన, అధికారిక కార్యకలాపాలలో భారతీయ భాషల వినియోగాన్ని బలోపేతం చేస్తూ కమ్యూనికేషన్‌ను మరింత సులభంగా, సకాలంలో, ప్రభావవంతంగా మార్చొచ్చు. భాష, సాంకేతికత విషయంలో దీనిని ఆచరణలోకి తీసుకురావడంలో 'కాగ్-భాషిణి' ఒక ముఖ్యమైన ఘట్టం" అని పేర్కొన్నారు.

సాంకేతికత ఆధారిత హిందీ పక్షోత్సవ కార్యక్రమాల కోసం భాషిణి, కాగ్ సహకారం

 

2026 సెప్టెంబర్ 14 నుంచి 29 వరకు నిర్వహించిన హిందీ పక్షోత్సవాల 2026 కార్యక్రమంలో కూడా కాగ్, భాషిణిల మధ్య ఈ సహకారం విస్తరించింది. సంప్రదాయ హిందీ భాషా కార్యకలాపాలతో పాటు భాషిణి సహకారంతో అభివృద్ధి చేసిన సాంకేతికత ఆధారిత భాషా కార్యకలాపాలు, ఆటలను ఈ వేదికపై పరిచయం చేశారు. దీనివల్ల అధికారులు, ఉద్యోగులు ఇంటరాక్టివ్ ఫార్మట్‌లో భాషా సాంకేతికతతో మమేకం కావడానికి అవకాశం లభించింది.

 

హిందీ పక్షోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలు, కార్యకలాపాలలో భారీ సంఖ్యలో అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారిక భాషా వినియోగం, హిందీ నోటింగ్, డ్రాఫ్టింగ్, అనువాదం, టైపింగ్, ఇతర భాషా-ఆధారిత నైపుణ్యాలతో పాటు భాషిణి-ఎనేబుల్డ్ కార్యకలాపాలను చేపట్టారు. ముగింపు వేడుక సందర్భంగా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేసి ఘనంగా సత్కరించారు. హిందీ పక్షోత్సవాలలో వారి భాగస్వామ్యాన్ని, ప్రతిభను ఈ వేడుక ద్వారా అభినందించారు.

 

ఈ కార్యక్రమంలో డిజిటల్ భాషా సాంకేతికతను ఉపయోగించడంపై ఒక ప్రత్యేక ప్రదర్శనతో పాటు హిందీ, భారతీయ భాషల వినియోగంలో పెరుగుతున్న సాంకేతికత పాత్రపై అధికారులకు అవగాహన కల్పించే లక్ష్యంతో వివిధ ప్రదర్శనలు, కార్యకలాపాలు నిర్వహించారు. కేవలం అనువాదాలు, అధికారిక పనులకే పరిమితం కాకుండా ప్రభుత్వ రంగంలో ప్రజలతో మాట్లాడటానికి, వారి భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి కూడా లాంగ్వేజ్‌ఏఐ ఎంతగానో తోడ్పడుతుందని ఈ భాగస్వామ్యం నిరూపించింది.

 

సంస్థాగత వ్యవస్థలో లాంగ్వేజ్ఏఐ ఆచరణాత్మక అనువర్తనాలను అన్వేషించడానికి కాగ్, భాషిణిల మధ్య జరిగిన విస్తృత సహకారానికి 'కాగ్-భాషిణి అనువాద్' ఆవిష్కరణ, సాంకేతికత ఆధారిత హిందీ పక్షోత్సవ కార్యక్రమాలు ప్రతీకగా నిలుస్తున్నాయి. అధికారిక సమాచారాన్ని మరింత విస్తృతమైన బహుభాషా రూపంలో అందించడానికి భాషా సాంకేతికత, మానవ నైపుణ్యం, సంస్థాగత అవసరాలను ఇది ఒకచోట చేర్చుతుంది.

డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ (డీఐబీడీ) గురించి:

 

ఏఐ-ఆధారిత బహుభాషా డిజిటల్ చేరిక కోసం ఏర్పాటైన జాతీయ వేదిక అయిన డిజిటల్ ఇండియా భాషిణి డివిజన్ (డీఐబీడీ)... కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (మైటీ) ఆధ్వర్యంలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీ) కింద పనిచేస్తోంది. భాషిణి ప్లాట్‌ఫామ్ 800కి పైగా ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో పనిచేస్తోంది. ఇది ఇప్పటివరకు 9 బిలియన్లకు పైగా సంచిత ఏఐ అనుమితులను (ఇన్ఫరెన్సెస్) సాధించింది. రోజువారీగా 24 మిలియన్లకు పైగా ఏఐ అనుమితులను ప్రాసెస్ చేస్తోంది. 36 భారతీయ టెక్స్ట్ భాషలు, 23 భారతీయ వాయిస్ భాషలు, 35 అంతర్జాతీయ భాషలకు మద్దతు ఇస్తూ లాంగ్వేజ్ఏఐ ద్వారా డిజిటల్ ప్రజా మౌలికసదుపాయాలను మరింత అందుబాటులోకి తీసుకువస్తోంది

***.

 


(రిలీజ్ ఐడి: 2317395) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati