బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇండియా మైనింగ్ వీక్ 2026లో 19 దేశాల దౌత్య కార్యాలయాల ప్రతినిధులతో ‘ఇండియా మైనింగ్: గ్లోబల్ కనెక్ట్’ కార్యక్రమం


మైనింగ్, కీలక ఖనిజాలు, సాంకేతిక రంగాల్లో దేశాల భాగస్వామ్యం, పెట్టుబడి అవకాశాలు, సహకారంపై ఈ అంతర్జాతీయ సమావేశంలో చర్చలు

నాడు పోస్టు చేయడమైనది: 30 SEP 2026 2:16PM by PIB Hyderabad

భారత్‌లో మైనింగ్, ఖనిజాల రంగానికి సంబంధించిన అతిపెద్ద సదస్సు, ప్రదర్శన అయిన ఇండియా మైనింగ్ వీక్ 2026లో భాగంగా ‘ఇండియా మైనింగ్: గ్లోబల్ కనెక్ట్’ పేరుతో అంతర్జాతీయ స్థాయి సమావేశం జరిగింది. ఈ  కార్యక్రమంలో 19 దేశాలకు చెందిన దౌత్య కార్యాలయాల ప్రతినిధులు పాల్గొని.. భారత మైనింగ్, ఖనిజాల రంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యం, సహకారాన్ని మరింత పెంచేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు.

న్యూఢిల్లీలోని యశోభూమిలో 2026 నవంబర్ 15 నుంచి 17 వరకు ఇండియా మైనింగ్ వీక్ 2026 జరగనుంది. దీనికి సన్నాహకంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, గనుల మంత్రిత్వ శాఖలు, మైనింగ్ పరిశ్రమతో కలిసి నిర్వహించాయి.

ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు, గనులశాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే, బొగ్గు మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి రూపిందర్ బ్రార్ ఆతిథ్యం ఇచ్చారు. దౌత్య కార్యాలయాల సీనియర్ ప్రతినిధులతో పాటు మైనింగ్, ఖనిజ రంగానికి చెందిన భాగస్వాములు కూడా చర్చల్లో పాల్గొన్నారు. ఇండియా మైనింగ్ వీక్ 2026లో ఆయా దేశాలు తమ స్థాయిలో ఎలా భాగస్వామ్యం కావచ్చనే అంశంపై వీరంతా చర్చించారు.

ఇండియా మైనింగ్ వీక్ 2026లో ప్రపంచ మైనింగ్ రంగం నుంచి చురుకైన సహకారం, భాగస్వామ్యం అవసరమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే పిలుపునిచ్చారు. ప్రముఖ మైనింగ్ కంపెనీలు, ప్రధాన పెట్టుబడిదారులు, ముఖ్య ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా భాగస్వామ్య దేశాలు సహకరించాలని ఆయన కోరారు. ఇలాంటి భాగస్వామ్యం ఇరుపక్షాలకు ప్రయోజనకరంగా ఉండటంతో పాటు మైనింగ్, ఖనిజాల రంగంలో భవిష్యత్తు సహకార అవకాశాలను మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

భాగస్వామ్య దేశాలకు చెందిన మైనింగ్ శాఖల మంత్రులతో పాటు ప్రముఖ పెట్టుబడిదారులు, పరిశ్రమ ప్రతినిధులు కూడా పాల్గొనేలా విస్తృత అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని నిర్ధారించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు శ్రీ సతీష్ చంద్ర దూబే తెలిపారు. నవంబర్ 15న న్యూఢిల్లీలోని యశోభూమిలో జరిగే ఇండియా మైనింగ్ వీక్ 2026 ప్రారంభ కార్యక్రమానికి ప్రముఖులు, సంబంధిత రంగాల ప్రతినిధులందరినీ ఆయన సాదరంగా ఆహ్వానించారు.

‘ఇండియా మైనింగ్: గ్లోబల్ కనెక్ట్’ కార్యక్రమంలో బొగ్గు మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి రూపిందర్ బ్రార్ మాట్లాడుతూ.. భారతీయ ప్రాచీన విలువైన “వసుధైక కుటుంబం’’ భావనను ప్రస్తావించారు. ప్రపంచ మైనింగ్ రంగ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం, పరస్పర సహకారం కీలకమని ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ముందుకు సాగుతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వృద్ధి, ప్రపంచ స్థాయి లక్ష్యాలకు మద్దతు ఇవ్వడంలో మైనింగ్, ఖనిజాల రంగం కీలక పాత్ర పోషించాల్సి ఉందని ఆమె అన్నారు. నవంబర్‌లో ఇండియా మైనింగ్ వీక్ 2026 జరగనున్న నేపథ్యంలో ప్రపంచ మైనింగ్ రంగానికి చెందిన వారంతా ఒకచోట చేరి, ఆలోచనలు పంచుకోవాలని, తమ నైపుణ్యాన్ని, అనుభవాన్ని పరస్పరం పంచుకోవడంతో పాటు సహకార అవకాశాలను అన్వేషించాలని ఆమె ఆహ్వానించారు. మరింత ఆవిష్కరణాత్మక, సుస్థిర, ప్రపంచంతో అనుసంధానమైన మైనింగ్ రంగాన్ని తీర్చిదిద్దడంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వాముల ఆలోచనలు, అనుభవం, సహకారం కోసం భారత్ ఎదురుచూస్తోందని రూపిందర్ బ్రార్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మలావి, శ్రీలంక, మొజాంబిక్, అల్జీరియా, అమెరికా, చిలీ, భూటాన్, ఇండోనేషియా, ఇథియోపియా, రష్యా, ఇరాక్, మొరాకో, వెనిజులా, స్పెయిన్, పోలాండ్, మంగోలియా, జాంబియా, ఫ్రాన్స్, ఘనా, యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

దేశాల ప్రతినిధి బృందాలు, ప్రభుత్వ, సంస్థాగత ప్రతినిధులు, వ్యాపార ప్రతినిధి బృందాలు, వక్తలు, సాంకేతిక నిపుణులు, మైనింగ్-ఖనిజ కంపెనీలు, సాంకేతికత అందించే సంస్థలు, పరికరాల తయారీదారులు, పెట్టుబడిదారులు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమ సంఘాల ద్వారా ఇండియా మైనింగ్ వీక్‌లో భాగస్వామ్యం అయ్యే అవకాశాలపై చర్చలు జరిగాయి.

ఈ సమావేశం ద్వారా ఇండియా మైనింగ్ వీక్ 2026 పరిధి, కార్యక్రమాల వివరాలను పంచుకోవడంతో పాటు కీలక ఖనిజాలు, ఖనిజాల అన్వేషణ, మైనింగ్ టెక్నాలజీ, భారీ మైనింగ్ పరికరాలు, ఆవిష్కరణలు, పెట్టుబడులు, వాణిజ్యం, వనరుల అభివృద్ధి వంటి పరస్పర ఆసక్తి కలిగిన అంశాలపై చర్చించే అవకాశం లభించింది. ఆయా దేశాల నుంచి సంబంధిత కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు, సంస్థాగత ప్రతినిధులు, పరిశ్రమ సంఘాలు ఇండియా మైనింగ్ వీక్‌లో పాల్గొనేలా సహకరించాలని ఆయా దేశాల దౌత్య ప్రతినిధి బృందాలను కోరారు.

కీలక ఖనిజాలు, వనరుల భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధి, దేశీయ తయారీపై భారత్ దృష్టి విస్తరిస్తున్న నేపథ్యంలో మైనింగ్ రంగంలోని అన్ని దశల్లో అంతర్జాతీయ సహకారం మరింత కీలకంగా మారుతోంది. ఇండియా మైనింగ్ వీక్ 2026 ద్వారా వివిధ దేశాలు, కంపెనీలు తమ సామర్థ్యాలను ప్రదర్శించడంతో పాటు వ్యాపార అవకాశాలను అన్వేషించేందుకు, భారత విధాన రూపకర్తలు, మైనింగ్ కంపెనీలు, పెట్టుబడిదారులు, సాంకేతికత అందించే సంస్థలతో చర్చలు జరిపేందుకు ఒక వేదికను అందిస్తుంది.

మూడు రోజుల పాటు జరిగే ఇండియా మైనింగ్ వీక్ 2026లో 25,000 మందికి పైగా పరిశ్రమ నిపుణులు, నిర్ణయాధికారులు, 500 మందికి పైగా ప్రదర్శనకారులు, సాంకేతిక ప్రదాతలు, 200 మందికి పైగా వక్తలు, పరిశ్రమ నిపుణులు, 100కు పైగా సమావేశాలు, సాంకేతిక ప్రదర్శనలు, 1,000 మందికి పైగా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) ప్రతినిధులు, 300కు పైగా మైనింగ్, ఖనిజ కంపెనీలు పాల్గొననున్నాయి. ఇందులో 50కి పైగా దేశాల నుంచి భాగస్వామ్యం ఉంటుందని అంచనా.

ఈ కార్యక్రమంలో ఉన్నతస్థాయి సమావేశం, అంతర్జాతీయ ప్రదర్శన, సాంకేతిక సెషన్లు, పరిశ్రమ నాయకులతో చర్చలు, బీ2బీ సమావేశాలు, సాంకేతిక ప్రదర్శనలు, ఉత్పత్తుల ఆవిష్కరణలు ఉంటాయి. వీటిలో బొగ్గు, లోహాలు, కీలక ఖనిజాలు, ఖనిజాల అన్వేషణ, మైనింగ్ టెక్నాలజీ, ఆటోమేషన్, గనుల భద్రత, సుస్థిరత, ఖనిజాల ప్రాసెసింగ్, వనరుల సమర్థ వినియోగం వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి.

‘ఇండియా మైనింగ్: గ్లోబల్ కనెక్ట్’ కార్యక్రమం ఇండియా మైనింగ్ వీక్ 2026కు ముందు నిర్వహిస్తున్న అంతర్జాతీయ విస్తరణ కార్యక్రమంలో భాగం. నవంబర్‌లో జరిగే ఈ సదస్సుకు ముందు అంతర్జాతీయ ప్రభుత్వాలు, మైనింగ్ కంపెనీలు, సాంకేతికత అందించే సంస్థలు, పెట్టుబడిదారులు, పరిశ్రమ సంస్థలతో మరిన్ని చర్చలు, భాగస్వామ్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఇండియా మైనింగ్ వీక్ 2026కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

https://www.indiaminingweek.org/

 

 

***


(రిలీజ్ ఐడి: 2317133) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , English , Urdu , हिन्दी