పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రూట్స్‌ ఏషియా సదస్సు సన్నాహక కార్యక్రమాన్ని ప్రారంభించిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు

2027 మార్చి 16 నుంచి 18 వరకు న్యూఢిల్లీలో జరగనున్న 24వ రూట్స్‌ ఏషియా సదస్సు

నాడు పోస్టు చేయడమైనది: 29 SEP 2026 7:06PM by PIB Hyderabad

ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ విమానయాన కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ చేస్తున్న సన్నాహాలలో ముఖ్యమైన ఘట్టంగా రూట్స్ ఆసియా 2027 సన్నాహక కార్యక్రమాన్ని (కర్టెన్ రైజర్) కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. 

 

రూట్స్‌ ఏషియా 2027కు సంబంధించి నిర్వహించిన కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమంలో 28 దేశాల రాయబార కార్యాలయాల ప్రతినిధులతో పాటు, విమానయాన రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులు పాల్గొన్నారు. దీంతో రూట్స్‌ ఏషియా 2027 పై పెరుగుతున్న అంతర్జాతీయ భాగస్వామ్యం, సహకార అవకాశాలకు మార్గం సుగమం అయింది.

 

రూట్స్‌ ఏషియా 24వ సదస్సు 2027 మార్చి 16 - 18 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో జరుగుతుంది. ఆసియా, ఇతర ప్రాంతాల నుంచి 115 పైగా ప్రముఖ విమానయాన సంస్థలు, 55 పైగా దేశాల ప్రతినిధులు, విమానాశ్రయాలు, పర్యాటక సంస్థలు, విమానయాన రంగ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు.

 

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కర్టెన్‌ రైజర్‌ ఫలకాన్ని ఆవిష్కరిస్తూ, “భారత విమానయాన రంగం పురోగతి: సమ్మిళిత వృద్ధి - ఆసియా, ప్రపంచానికి అనుసంధానం” అనే ఇతివృత్తంతో జరిగే రూట్స్‌ ఏషియా 2027పై భారత దార్శనికతను వివరించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా ఎదిగే దిశగా భారత్‌ ముందుకు సాగుతున్న తరుణంలో ఈ కార్యక్రమం సరైన సమయంలో జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. “రూట్స్‌ ఏషియా 2027 సరైన ప్రదేశానికి, సరైన సమయంలో, సరైన అవకాశంతో వస్తోంది! మరింత విమానయాన సామర్థ్యానికి, మరిన్ని విమానయాన సంస్థలకు, మరిన్ని విమాన మార్గాలకు అవకాశం ఉంది” అని ఆయన అన్నారు.

166 పైగా విమానాశ్రయాలతో పాటు, వచ్చే పదేళ్లలో మరో 100 విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలన్న ప్రణాళికలతో భారత్‌ విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోంది. మరిన్ని నగరాలను, ప్రజలను అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో అనుసంధానించగల హబ్‌ - అండ్‌ - స్పోక్‌ విధానానికి విధానం ప్రాధాన్యం పెరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. ఇది విమానయాన సంస్థలు, పర్యాటకం, ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు. ద్వైపాక్షిక విమానయాన సంబంధాల బలోపేతానికి భారత్‌ చురుకుగా చేస్తున్న కృషిని, ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాలతో కొనసాగిస్తున్న సహకారాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అంతర్జాతీయ విమాన ప్రయాణం నిరంతరం వృద్ధి చెందుతోందని, ప్రయాణికుల రద్దీ విషయంలో వార్షిక వృద్ధి రేటు 4.6 శాతంగా నమోదవుతోందని ఆయన తెలిపారు.

 

రూట్స్‌ ఏషియా 2027లో పాల్గొని, భారత్‌లోని విభిన్న పర్యాటక ప్రాంతాలను సందర్శించడంతో పాటు విస్తరిస్తున్న విమానయాన అవకాశాలను అన్వేషించాలని ప్రపంచ విమానయాన రంగానికి చెందిన వారిని మంత్రి ఆహ్వానించారు. ద్వితీయ శ్రేణి నగరాలను అనుసంధానించడం, అంతర్జాతీయ విమానయాన కేంద్రాలను బలోపేతం చేయడం, భారత విమానయాన రంగ ప్రస్థానంలో తదుపరి అధ్యాయానికి రూపకల్పన చేసే కొత్త విమాన మార్గాలను అభివృద్ధి చేయడం కోసం భాగస్వాములంతా సమష్టిగా కృషి చేయాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు.

 

2026 ఏప్రిల్‌లో చైనాలోని షియాన్‌లో జరిగిన రూట్స్‌ ఏషియా 2026 ముగింపు కార్యక్రమంలో రూట్స్‌ ఏషియా 2027 నిర్వహణ బాధ్యతలను చైనా వెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ గ్రూప్‌ నుంచి భారత్‌ అధికారికంగా స్వీకరించింది. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఈ నిర్వహణ బాధ్యతలకు సంబంధించిన బ్యాటన్‌ను అందుకుంది. రాబోయే రూట్స్‌ ఏషియా సదస్సుకు ప్రముఖ విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు, పర్యాటక సంస్థలకు చెందిన నిర్ణయాధికారులతో పాటు 2,000 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

 

పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ సమీర్‌ కుమార్‌ సిన్హా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలను అనుసంధానించడం, వాణిజ్యాన్ని సులభతరం చేయడం, ఆర్థిక అవకాశాలను సృష్టించడంలో విమానయాన రంగం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. పర్యాటకం, వ్యాపార అవసరాల కోసం అంతర్జాతీయ ప్రయాణాలు మరింత అందుబాటులోకి రావడంతో పాటు, అవి సులభతరంగా, అవాంతరాలు లేకుండా సాగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. భారత విమానయాన వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగస్వామ్యాలకు, కొత్త విమాన మార్గాల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఉందని ఆయన అన్నారు.

 

పటిష్టమైన భాగస్వామ్యాలకు, కొత్త విమాన మార్గాల అభివృద్ధికి, విమానయాన, అనుసంధాన రంగాల్లో భారత్‌ను ప్రాధాన్య గమ్యస్థానంగా నిలపడం కోసం రూట్స్‌ ఏషియా 2027 వ్యూహాత్మక వేదికగా ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమం సమ్మిళిత వృద్ధి, అంతర్జాతీయ సహకారం, వికసిత భారత్‌ 2047 దార్శనికత పట్ల భారత్‌ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది.

***


(రిలీజ్ ఐడి: 2316744) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी