సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ఉత్తరప్రదేశ్ సంపన్న వారసత్వాన్ని, ఆధునిక పురోగతిని ఆవిష్కరించిన ప్రధానమంత్రి జ్ఞాపికల ఇ - వేలం 2026
ఉత్తరప్రదేశ్ వైవిధ్యభరిత గుర్తింపును చాటిచెప్పిన ఆధ్యాత్మిక ప్రాధాన్య ప్రాంతాలు, సంప్రదాయ కళలు, క్రీడా విజయాలు, ఆధునిక మౌలిక సదుపాయాల సమాహారం
నాడు పోస్టు చేయడమైనది:
29 SEP 2026 5:40PM by PIB Hyderabad
వివిధ సందర్భాల్లో ప్రధానమంత్రికి లభించిన జ్ఞాపికల్లో 99 జ్ఞాపికలు వైవిధ్యభరితమైన ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని, చారిత్రక నేపథ్యాన్ని, సమకాలీన విజయాలను ప్రతిబింబిస్తున్నాయి. ఇందులో అధ్యాత్మిక కళాఖండాలు, సాంప్రదాయ కళలు, క్రీడా జ్ఞాపికలు ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నమూనాలు ఉన్నాయి. అక్టోబర్ 2 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి జ్ఞాపికల 8వ విడత ఇ-వేలం 2026 లో ఇవి అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం, ఇ - వేలంలో పాల్గొనడం కోసం https://pmmementos.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ప్రముఖంగా ఆకట్టుకునే జ్ఞాపికల్లో అయోధ్యలోని రామ మందిర సమగ్ర నమూనా ఒకటి. ఎంఐఎఫ్ ఫైబర్‌బోర్డుతో రూపొందించిన ఈ నమూనాలో ఆలయ నిర్మాణ శైలిని ప్రతిబింబించే సున్నితమైన, సంక్లిష్టమైన వివరాలను పొందుపరిచారు. మరో జ్ఞాపిక వారణాసిలోని శ్రీ గురు రవిదాస్ జన్మస్థాన్ మందిరాన్ని కళ్ళకు కడుతుంది. గురు రవిదాస్‌తో ముడిపడిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
ఝాన్సీ లక్ష్మీబాయి తన కుమారుడు దామోదర్ రావుతో కలిసి గుర్రంపై స్వారీ చేస్తున్న దృశ్యాన్ని చిత్రించిన మరో ఫ్రేమ్ కూడా ఆకట్టుకుంటుంది. మథురకు చెందిన సమకాలీన సంజీ పేపర్ కట్ కళాఖండంలో గోమాతలతో జీవ వృక్షాన్ని ఆవిష్కరించారు. సంప్రదాయ సంజీ కళారూపానికి ప్రత్యేకమైన సున్నితమైన చేతి కత్తిరింపు నైపుణ్యాన్ని కూడా ఈ కళాఖండం చాటిచెబుతుంది. .
ఉత్తరప్రదేశ్ క్రీడా విజయాలకు ప్రతీకగా, పారా అథ్లెట్ ప్రీతి పాల్‌కు చెందిన సంతకం చేసిన క్రీడా దుస్తులను కూడా ఈ సేకరణలో పొందుపరిచారు. 2024 పారిస్ పారాలింపిక్స్‌లో మహిళల 100 మీటర్లు, 200 మీటర్ల టీ35 విభాగాల్లో ఆమె రెండు కాంస్య పతకాలు సాధించారు.
మీరట్ మెట్రో సూక్ష్మ నమూనా కూడా జాబితాలో ఉంది. 2026 ఫిబ్రవరిలో 26 కిలోమీటర్ల కారిడార్ ప్రారంభమైన సందర్భంగా దీనిని రూపొందించారు.
ఇతర ప్రముఖ జ్ఞాపికల్లో వారణాసిలోని నమో ఘాట్ ‘హ్యాండ్ నమస్తే’, నమో ఘాట్‌లో ప్రత్యేకంగా కనిపించే జోడించిన చేతుల శిల్పాకృతి, గంగా దేవితో పాటు మౌలిక సదుపాయాల ప్రాజెక్టు సూక్ష్మ నమూనాను కలిగి ఉన్న గంగా ఎక్స్‌ప్రెస్‌వే నమూనా ఉన్నాయి.
ఈ స్మారక చిహ్నాలన్నీ ఉత్తరప్రదేశ్ విభిన్న కోణాలను ప్రతిబింబిస్తున్నాయి. ఆ రాష్ట్ర సంప్రదాయాలు, చరిత్రతో పాటు సాధించిన విజయాలు, ప్రత్యేక గుర్తింపులుగా నిలిచిన ప్రాంతాలు, ప్రాజెక్టులను కూడా ఇవి కళ్లకు కడుతున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2316731)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14