పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేషన్ స్కీమ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థకు, ఒడిశాకు చెందిన వెదురు రైతుకు భారత తొలి ప్రమాణ్ ధ్రువీకరణ పత్రాలను అందించిన కేంద్ర పర్యావరణశాఖ మంత్రి

అటవీ నిర్మూలన లేకుండా కలప సేకరణ, ఉపాధి కల్పనకు సంబంధించి మారుతున్న ప్రపంచ అవసరాలను తీర్చటంలో కీలక సాధనం ప్రమాణ్: శ్రీ భూపేందర్ యాదవ్

నాడు పోస్టు చేయడమైనది: 29 SEP 2026 11:16AM by PIB Hyderabad

ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేషన్ స్కీమ్ (ఐఎఫ్‌డబ్ల్యూసీఎస్) ద్వారా న్యూఢిల్లీలో మొదటి ప్రమాణ్ ధ్రువీకరణ పత్రాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి అందజేశారు. ఈ పథకానికి నిర్వహణ సంస్థగా వ్యవహరిస్తున్న భోపాల్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ (ఐఐఎఫ్ఎం) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎంఓఈఎఫ్‌సీసీ సీనియర్ అధికారులు, పలు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు, ధ్రువీకరణ సంస్థ, పారిశ్రామిక వర్గాల ప్రతినిధులు హాజరయ్యారు.

 

ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలోని 33,000 హెక్టార్ల విస్తీర్ణంలోని అటవీ ప్రాంతం, ఒడిశా వెదురు డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఓబీడీఏ)కి చెందిన శ్రీ గోవింద్ మహాపాత్ర అనే రైతుకు 'ప్రమాణ్' ధ్రువీకరణ పత్రాలను అందించారు. ధ్రువీకరణకు ముందుగా ఈ తోటలను క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్వహణకు సంబంధించి ఆడిట్ చేశారు. డిసెంబర్ 2023లో ఐఎఫ్‌డబ్ల్యూసీఎస్‌ను మంత్రిత్వశాఖ ప్రారంభించిన నాటి నుంచి రూపొందించిన ప్రక్రియలకు ఇవి నిదర్శనం. అటవీ పెంపకం, వ్యవసాయ సాగు రెండింటిలోనూ ఈ విధానం కేవలం ఒక పాలసీ రూపం నుంచి క్షేత్రస్థాయి అమల్లోకి విజయవంతంగా మారినట్లు సూచిస్తుంది.

 

సభనుద్దేశించి శ్రీ భూపేందర్ యాదవ్ ప్రసంగించారు. అంతర్జాతీయ మార్కెట్లలోని కొత్త నిబంధనలు, ముఖ్యంగా ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లు అనుసరిస్తున్న సమగ్ర పరిశీలనా విధానాలు, బాధ్యతాయుతమైన అటవీ నిర్మూలన రహిత కలప సేకరణ ప్రమాణాలను భారత తయారీదారులు, ఎగుమతిదారులు, అటవీ ఆధారిత పరిశ్రమలకు ప్రమాణ్ కీలక సాధనమని అన్నారు. మార్కెట్ ప్రవేశాన్ని ధ్రువీకరించదగిన సుస్థిరత ఆధారాలతో ప్రపంచ వాణిజ్యాన్ని ఎక్కువగా ముడిపెడుతున్న తరుణంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘వోకల్ ఫర్ లోకల్ అండ్ యాక్ట్ గ్లోబల్’ నినాద స్ఫూర్తితో.. కేవలం నిబంధనలను పాటించటమే కాక సుస్థిర అటవీ నిర్వహణ, అడవుల వెలుపల చెట్ల నిర్వహణ వ్యవస్థల్లో భారత్ అగ్రగామిగా నిలవటమే కాక, నాయకత్వం వహించేలా ప్రమాణ్ దోహదపడుతుందని అన్నారు. అటవీ నిర్వహణ, అడవుల వెలుపల చెట్ల నిర్వహణ, సరఫరా వ్యవస్థ ధ్రువీకరణకు పలు రాష్ట్రాల అటవీ శాఖలు, అటవీ అభివృద్ధి సంస్థలు, రైతులు, పరిశ్రమలు దరఖాస్తు చేసుకున్నాయని, ప్రస్తుతం ఆ దరఖాస్తులు వివిధ దశల్లో పరిశీలనలో ఉన్నాయని చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ ధ్రువీకరణ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన 'ప్రమాణ్' అక్రెడిటేషన్ వ్యవస్థ వల్ల, ఈ పథకం ద్వారా జారీచేసే ధ్రువీకరణ పత్రాలకు దేశీయ, అంతర్జాతీయ కొనుగోలుదారులు, నియంత్రణ సంస్థల నుంచి గుర్తింపు లభిస్తుందని మంత్రి వెల్లడించారు. స్వచ్ఛందంగా ప్రకటించుకోవటం కాకుండా నేషనల్ వర్కింగ్ ప్లాన్ కోడ్ (ఎన్‌డబ్ల్యూపీసీ)-2023 సూత్రాలకు అనుగుణంగా మూడో పక్షం ద్వారా నిర్వహించే అటవీ నిర్వహణ ఆడిట్ ఆధారంగా ఈ ధ్రువీకరణ రూపొందించినట్లు చెప్పారు.

 

ప్రమాణ్ కేవలం వాణిజ్య సాధనం కాదని... ఉపాధి కల్పన మిషన్ అని మంత్రి కొనియాడారు. గ్రామీణ, గిరిజన సముదాయాలు, చిన్న, సన్నకారు రైతులు, అడవులపై ఆధారపడే వర్గాలను క్రమబద్ధమైన, ధ్రువీకరించిన సర్టిఫికేషన్ వ్యవస్థలోకి తీసుకురావటం ద్వారా ఉత్పత్తిదారులపై అదనపు భారం పడకుండా, నాణ్యమైన, ప్రముఖ మార్కెట్లలోకి ప్రవేశించేందుకు ఈ పథకం నూతన ఆదాయ మార్గాలను తెరుస్తుందని ఆయన తెలిపారు. ఎన్‌టీఎఫ్‌పీ సేకరణ, ప్రాసెసింగ్, వ్యవసాయం, ఆగ్రోఫారెస్ట్రీ, సాగు ఆధారిత వ్యవసాయ విధానంలో నిమగ్నమైన మహిళా స్వయం సహాయక సంఘాలు, ఉపాధి లేని, తక్కువ భూమి గల రైతులు దీనిద్వారా లబ్ధి పొందుతారని పేర్కొన్నారు.

 

విస్తృతమైన జాతీయ దృక్పథంతో ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళుతూ... వికసిత్ భారత్-2047 దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణాన్ని 'ప్రమాణ్' ప్రతిబింబిస్తుందని శ్రీ భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఇది ఆర్థిక వృద్ధిని పర్యావరణ పరిరక్షణతో మిళితం చేసే అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సూచిస్తుంది. ఇది కేవలం సుస్థిర ఉత్పత్తుల తయారీదారుగానే కాక, సుస్థిర పాలనలో ప్రపంచ నాయకుడిగా భారతదేశానికి గుర్తింపు తెస్తుందని తెలిపారు. ఐఐఎఫ్ఎంను, మంత్రిత్వ శాఖను మంత్రి అభినందించారు. భారతదేశ అడవులను, వాటిపై ఆధారపడిన వారిని ప్రపంచ సుస్థిర వాణిజ్యానికి కేంద్ర బిందువుగా నిలిపేందుకు 'ప్రమాణ్'లో సర్టిఫికేషన్ సంస్థలు, రాష్ట్ర అటవీ శాఖలు, చెట్ల పెంపకందారులు, రైతు ఉత్పత్తిదారు సంఘాలు, రైతు ఉత్పత్తిదారు కంపెనీలు, పరిశ్రమలు, సంస్థలు తమ భాగస్వామ్యాన్ని మరింత బలపరచాలని మంత్రి పిలుపునిచ్చారు.

ప్రమాణ్ గురించి

 

అడవులు, కలప, కలపయేతర అటవీ ఉత్పత్తుల ధ్రువీకరణకు జాతీయ స్థాయిలో ఆమోదించిన, విశ్వసనీయమైన, పారదర్శకమైన విధానమే ప్రమాణ్ (వ్యవసాయ అటవీ, సహజ అటవీ వనరుల కోసం సుస్థిర నిర్వహణ పద్ధతుల గుర్తింపు, అక్రిడేషన్ కార్యక్రమం). ధ్రువీకరణ పొందిన అడవులు, అగ్రోఫారెస్ట్రీ ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానాన్ని ప్రోత్సహించటమే దీని ప్రధాన లక్ష్యం. భారతదేశ అడవులు, అగ్రోఫారెస్ట్రీ వ్యవస్థలు, కలప ఆధారిత పరిశ్రమల సామాజిక, పర్యావరణ విలువలను ఐఎఫ్‌డబ్ల్యూసీఎస్-ప్రమాణ్ ధ్రువీకరణ పత్రం పెంపొందిస్తుంది.

 

జాతీయ వర్కింగ్ ప్లాన్ కోడ్-2023లో భాగంగా ఉన్న ఇండియన్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ స్టాండర్డ్ ఆధారంగా ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ సర్టిఫికేషన్ అంచనా వేస్తారు. ఈ సర్టిఫికేట్ ముఖ్య సూత్రం కేవలం స్వయం-ప్రకటనపై కాకుండా, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) ఆధ్వర్యంలోని నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ సర్టిఫికేషన్ బాడీస్ (ఎన్ఏబీసీబీ) ద్వారా గుర్తింపు పొందిన సంస్థల స్వతంత్ర ఆడిట్‌పై ఆధారపడి ఉంటుంది. దేశీయ, అంతర్జాతీయ కొనుగోలుదారులు, నియంత్రణ సంస్థల నుంచి గుర్తింపు పొందేలా ప్రమాణ్ అక్రిడిటేషన్ విధానం అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా రూపొందించారు.

****


(రిలీజ్ ఐడి: 2316724) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Tamil