సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఆర్థిక ఇబ్బందుల నుంచి చదువులో విజయాల దాకా ఎన్ఎఫ్ఎస్‌సీ ద్వారా తెలంగాణ మహిళ శ్రీమతి యాట్ల స్రవంతి ప్రయాణం
నాడు పోస్టు చేయడమైనది:
28 SEP 2026 5:23PM by PIB Hyderabad
సకాలంలో లభించే సంస్థాగత సహాయం... విద్యార్థులు ఆర్థికపరమైన అడ్డంకులను అధిగమించి, వారి విద్యా ప్రస్థానాన్ని కొనసాగించి, ఉన్నత విద్య, పరిశోధనల్లో రాణించడానికి తోడ్పడుతుంది. ఆర్థిక పరిమితులు, విద్యా వనరులు పరిమితంగా మాత్రమే అందుబాటులో ఉన్నప్పుడు... అర్హులైన విద్యార్థులు ఉన్నత విద్యను, ఉన్నత పరిశోధనలను అభ్యసించకుండా అవి నిరోధించగలవు.
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన 37 ఏళ్ల శ్రీమతి యాట్ల శ్రావంతి, 'షెడ్యూల్డ్ కులాల కోసం జాతీయ ఫెలోషిప్' (ఎన్ఎఫ్ఎస్‌సీ) పథకం కింద ఆర్థిక సహాయంతో వృక్షశాస్త్రంలో తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు. ఆమెకు 2017లో ఫెలోషిప్ సహాయం ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఆమె ఫెలోషిప్, ఇంటి అద్దె భత్యం, ఇతర అనుబంధ ఖర్చుల కోసం మొత్తం రూ. 21 లక్షల మేర ఆర్థిక సహాయాన్ని పొందారు.
ఆర్థిక సహాయం అందకముందు... శ్రీమతి స్రవంతి తన ఉన్నత విద్యను, డాక్టొరల్ పరిశోధనను కొనసాగించడంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా పుస్తకాలు, పరిశోధనా సామగ్రి, పరికరాలు, హాస్టల్ వసతికి సంబంధించిన ఖర్చులను భరించడం ఆమెకు కష్టంగా మారింది. ఈ పరిమితులు ఆమె చదువు, పరిశోధనపై పూర్తిగా దృష్టి సారించనీయకుండా చేశాయి.
ఆమెకు నాణ్యమైన విద్యా వనరులు, ఇంటర్నెట్ సౌకర్యాలు, విద్యపరంగా సరైన మార్గదర్శనం పరిమితంగానే లభించాయి. మారుమూల ప్రాంతం నుంచి రావడం, సామాజిక-ఆర్థిక ప్రతికూలతలను ఎదుర్కోవడం వల్ల, డాక్టరేట్ స్థాయి విద్యను అభ్యసించడం ఆమెకు సవాలుగా మారింది. ఆర్థిక సహాయం అందుబాటులో లేకపోవడంతో, ఆమె రుణాలు తీసుకోవలసి వచ్చేది. ఉద్యోగం వెతుక్కోవడానికి తన చదువును మధ్యలోనే ఆపవలసి వచ్చేది.
ఎన్ఎఫ్ఎస్‌సీ పథకం శ్రీమతి స్రవంతికి ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించింది. ఆమె తన డాక్టరేట్ పరిశోధనపై ఎక్కువ సమయం, శ్రద్ధ పెట్టడానికి వీలు కల్పించింది. నెలవారీ ఫెలోషిప్ ఆమె విద్య, జీవన వ్యయాలకు సంబంధించిన ఆర్థిక భారాన్ని తగ్గించడంలో సహాయపడగా... పరిశోధన అనుబంధ నిధి ఆమె విద్యా సంబంధిత పనులకు అవసరమైన ముఖ్యమైన పుస్తకాలు, పరిశోధన సామాగ్రి, సాఫ్ట్‌వేర్‌లను సమకూర్చుకోవడానికి వీలు కల్పించింది.
ఈ ఫెలోషిప్ ఆమెకు జాతీయ సెమినార్లు, వర్క్‌షాప్‌లలో పాల్గొనే అవకాశాన్నీ కల్పించింది. ఈ అవకాశాలు ఆమెకు తన పరిశోధన ఫలితాలను ప్రదర్శించడానికి, నిపుణులతో సంభాషించడానికి, విద్యాపరమైన అభిప్రాయాన్ని స్వీకరించడానికి, వృత్తిపరమైన నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేసుకోవడానికి వీలు కల్పించాయి. ఇటువంటి అనుభవం ఆమె విద్యా అనుభవాన్ని బలపరిచి, పరిశోధనా రంగంలోకి ఆమె ప్రవేశాన్ని విస్తృతం చేసింది.
ఎన్ఎఫ్ఎస్‌సీ పథకం మద్దతుతో శ్రీమతి స్రవంతి మరింత ఆత్మవిశ్వాసంతో తన పరిశోధనను కొనసాగించి, తన విద్యా సంబంధిత ప్రక్రియలను పూర్తి చేయగలిగారు. ఈ ఫెలోషిప్ ఆమె పరిశోధనా ప్రొఫైల్‌ను బలోపేతం చేయడంతో పాటు... వృత్తిపరంగా పరస్పర సంప్రదింపులు, నెట్‌వర్కింగ్ కోసం అవకాశాలనూ కల్పించింది. వ్యక్తిగత స్థాయిలో, ఆమె కుటుంబంపై ఆర్థిక భారం తగ్గడం వల్ల ఆమెకు మరింత ఆత్మవిశ్వాసం, స్వాతంత్య్రం లభించాయి.
నేడు శ్రీమతి స్రవంతి ఉన్నత విద్యారంగంలో గానీ, విధాన పరిశోధన రంగంలో గానీ ఉత్తమమైన కెరీర్‌ను నిర్మించుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. సమాజంలో అవకాశాలకు దూరంగా ఉన్న అణగారిన వర్గాల విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచేందుకు తన విద్యా అనుభవాన్ని వినియోగించాలని దృఢసంకల్పంతో ఉన్నారు. సరైన సమయంలో లభించే ఆర్థిక చేయూత... విద్యార్థులను, పరిశోధకులను ఆర్థిక-సామాజిక అవరోధాలను అధిగమించేలా ఎలా తీర్చిదిద్దుతుందో, వారు ఉన్నత పరిశోధనలు కొనసాగించి తమలోని విద్యా సామర్థ్యాన్ని ఎలా పరిపూర్ణంగా ఆవిష్కరించుకోగలరో ఆమె ప్రయాణం నిరూపిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2316280)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11