కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ లేబర్, అవార్డ్స్-2026ను ఉద్దేశించి ప్రసంగించిన డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ
కార్మిక చట్టాలపై అవగాహన కల్పించేందుకు మంత్రిత్వశాఖ ప్రారంభించిన "శ్రమ సంవాద్" కార్యక్రమం 90 రోజుల్లో దేశవ్యాప్తంగా 316 జిల్లాల్లోని పారిశ్రామిక క్లస్టర్లలో నిర్వహణ: డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ
సుస్థిరమైన ఆర్థికాభివృద్ధికి పరిశ్రమలు, శ్రామిక శక్తి భాగస్వాములుగా ముందుకు సాగాలి: డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ
ఏఐ ద్వారా అపారమైన అవకాశాలు… దాన్ని వినియోగించుకునేందుకు యువతకు తగిన నైపుణ్యాలను అందించాలన్న కేంద్రమంత్రి
"సంవాద్ సే సమాధాన్": పారిశ్రామిక సంబంధాలను బలోపేతం చేయటంలో భాగస్వాముల మధ్య నిరంతర చర్చలే కీలకం: డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ
ఏఐ యుగంలో పారిశ్రామిక సంబంధాలు, కార్యాలయ భాగస్వామ్య పునర్నిర్మాణంపై సమావేశంలో చర్చ
నాడు పోస్టు చేయడమైనది:
28 SEP 2026 4:24PM by PIB Hyderabad
ఇవాళ న్యూఢిల్లీలో నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇండస్ట్రీయల్ రిలేషన్స్ అండ్ లేబర్, అవార్డ్స్-2026ను కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ప్రారంభించారు. "ఏఐ యుగంలో పారిశ్రామిక సంబంధాలు, కార్యాలయ భాగస్వామ్య పునర్నిర్మాణం" ఇతివృత్తంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఎంప్లాయర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఈఎఫ్ఐ) సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి.
సభను ఉద్దేశించి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ మాట్లాడుతూ... మారుతున్న కాలం, వాస్తవ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా భారతదేశ శ్రామిక, సామాజిక భద్రతా వ్యవస్థలను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని తెలియజేశారు. కృత్రిమ మేధ ద్వారా నేటి ప్రపంచంలో ఎన్నో అవకాశాల ద్వారాలు తెరుచుకుంటాయని చెబుతూ... ఏఐ, ఆటోమేషన్, రోబోటిక్స్, ఇతర అత్యాధునిక సాంకేతికతల్లో భారతదేశ యువతకు సరికొత్త నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సిన ప్రాముఖ్యత గురించి ప్రస్తావించారు. 2026లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాబోయే ఏడాదిలో కోటి మంది యువతకు ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) గుర్తింపు ప్రకారం... గత దశాబ్ద కాలంలో భారతదేశంలో సామాజిక భద్రతా పరిధి గణనీయంగా విస్తరించిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. 2015లో కేవలం 19 శాతం మందికి మాత్రమే ఉన్న భద్రత... నేడు దేశ జనాభాలో 68 శాతానికి, అంటే 101 కోట్ల మందికి వర్తిస్తోందని ఆయన వెల్లడించారు. కార్మిక అనుకూల విధానాలు, పారిశ్రామిక అనుకూల విధానాలు ఒకదానికొకటి వ్యతిరేకమనే సంప్రదాయ భావనను మార్చుకోవాలని కేంద్రమంత్రి పిలుపునిచ్చారు. పరిశ్రమలు, కార్మికులు దేశ నిర్మాణంలో భాగస్వాములుగా కలిసి ముందుకు సాగాలని కోరారు.
కార్మిక చట్టాలపై "శ్రమ్ సంవాద్" పేరుతో కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ భారీ అవగాహనా కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ప్రకటించారు. రాబోయే 90 రోజుల్లో దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 316 జిల్లాల్లోని పారిశ్రామిక క్లస్టర్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. పారిశ్రామిక సంబంధాలను బలోపేతం చేయటంలో అన్ని వర్గాల భాగస్వాముల మధ్య నిరంతర చర్చలు, సంప్రదింపుల ప్రాముఖ్యతను డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ స్పష్టం చేశారు. "ఎక్కడైతే చర్చలు జరుగుతాయో... అక్కడ పరిష్కారం ఉంటుంది" అని ఆయన అన్నారు. పరిశ్రమలు, కార్మికుల ప్రయోజనాలు కలిసి ముందుకు సాగేలా స్వేహపూర్వక పారిశ్రామిక సంబంధాలను పెంపొందించేందుకు ఉత్తమ పద్ధతులను అందరూ పంచుకోవాలని, ఆచరించాలని స్పష్టం చేశారు.
ఇండియా సాధించిన 7.8 శాతం అధిక జీడీపీ వృద్ధిని తెలియజేస్తూ... దేశం బలమైన వృద్ధి పథాన్ని కొనసాగించేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఆర్థిక విధానాల గురించి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ వివరించారు. భారతదేశ బలమైన ఆర్థిక వృద్ధికి తగినట్లుగానే ఇటీవల ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయన్నారు. 2017-23 మధ్య కాలంలో ఆర్థిక వ్యవస్థలో ప్రతి ఒక శాతం వృద్ధికి 1.11 శాతం చొప్పున ఉపాధి వృద్ధి జరిగిందని... ఇది గతంలో కేవలం 0.008 శాతంగా మాత్రమే ఉండేదని చెప్పారు. సుస్థిర ఆర్థికాభివృద్ధి, విస్తృత ఉపాధి అవకాశాలు, గౌరవప్రదమైన శ్రామిక శక్తి ప్రధాన ప్రాతిపదికగా... వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనకు భాగస్వాములందరూ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు.
ప్రారంభ సమావేశంలో "ఎంప్లాయర్స్ గైడ్ అండర్ న్యూ లేబర్ కోడ్స్ ఫ్రేమ్‌వర్క్: ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ ఇండియా" నివేదికను కేంద్రమంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ఆవిష్కరించారు.
ఈ సదస్సుకు సీఐఐ నార్తర్న్ రీజియన్ చైర్మన్ శ్రీ పునీత్ కౌరా, సీఐఐ ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్‌పై జాతీయ కమిటీ సహ-అధ్యక్షుడు శ్రీ హర్షవర్ధన్ చితాలే, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) ప్రాంతీయ భాగస్వామ్య అభివృద్ధి, వనరుల సమీకరణ డిప్యూటీ డైరెక్టర్, సీనియర్ సలహాదారు శ్రీ ఒక్తావియాంటో పసరిబు, పరిశ్రమ రంగ ప్రతినిధులు, కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ అధికారులు హాజరయ్యారు.
భవిష్యత్తులో ఉద్యోగాలు, పారిశ్రామిక సంబంధాలపై వివిధ అభిప్రాయాలను పంచుకునేందుకు పరిశ్రమ, కార్మిక వర్గాలకు ఈ సదస్సు వేదికను అందిస్తుంది. సాంకేతిక పరివర్తన, మారుతున్న ఉపాధి వ్యవస్థ వల్ల ఏర్పడే అవకాశాలు, సవాళ్లను మెరుగ్గా అర్థం చేసుకునేందుకు ఈ అంశాలపై జరిగే చర్చలు దోహదపడతాయని భావిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2316273)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4