భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పీఏం ఈ-డ్రైవ్ ఆధ్వర్యంలో ఆటోమోటివ్ టెస్టింగును ముందుకు తీసుకెళుతున్న జీఏఆర్‌సీ
నాడు పోస్టు చేయడమైనది:
28 SEP 2026 1:06PM by PIB Hyderabad
కేంద్ర మోటారు వాహనాల నిబంధనల్లోని 126వ నియమం ప్రకారం అధీకృత పరీక్షా సంస్థగా చెన్నైలోని ఒరగాడంలో ఉన్న గ్లోబల్ ఆటోమోటివ్ రీసెర్చి సెంటర్ (జీఏఆర్‌సీ) పనిచేస్తుంది. భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన జాతీయ ఆటోమోటివ్ బోర్డు ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. పవర్ ట్రెయిన్ ఉద్గారాలు, ఈఎంసీ, ఫెటీగ్, విద్యుత్ వాహనాలు, భద్రతా పరీక్షల సౌకర్యాల ద్వారా వాహనాలు, విడి భాగాల పరీక్షలు, ఆర్ అండ్ డీ, హోమోలోగేషన్, ధ్రువీకరణ సేవలను జీఏఆర్‌సీ అందిస్తుంది.
భారత ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (పీఎం ఈ-డ్రైవ్) పథకం ద్వారా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్, అధునాతన వాహన సాంకేతిక పరిజ్ఞానాలకు అనుగుణంగా తన టెస్టింగ్ సౌకర్యాలను జీఏఆర్‌సీ ఆధునీకరిస్తోంది. పీఎం ఈ-డ్రైవ్ పథకానికి రూ.10,900 కోట్లను కేటాయించారు. దీనిలో టెస్టింగ్ ఏజెన్సీలను మెరుగుపరిచేందుకు రూ.780 కోట్లను కేటాయించారు. ఇది 2028 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది.
జీఏఆర్‌సీ ప్రగతి
జీఏఆర్‌సీకి రూ. 221.13 కోట్లను కేటాయించారు. దాదాపు అన్ని ప్రతిపాదిత పరికరాలకు కొనుగోలు ఉత్తర్వులను జారీ చేసింది. ఏర్పాటవుతున్న లేదా ఆధునికీకరిస్తోన్న ప్రధాన సౌకర్యాలు:
· ఏఐఎస్-156 ప్రకారం విద్యుత్ వాహన, ఈవీ బ్యాటరీ పరీక్ష
· ఏఐఎస్-004 మూడో భాగం రివిజన్ 1 ప్రకారం ఈవీ ఈఎంఐ/ఈఎంసీ పరీక్ష
· భారీ వాణిజ్య వాహన పరీక్షా కేంద్రం
· పవర్‌ట్రెయిన్ ప్రయోగశాల ఆధునికీకరణ
· డమ్మీలు, డమ్మీ క్యాలిబ్రేషన్ పరికరంతో సహా అధునాతన పాసివ్ సేఫ్టీ టెస్టింగ్
· పరికరాలు, డమ్మీ లక్ష్యాలతో సహా అధునాతన డ్రైవర్ సహాయక వ్యవస్థల (ఏడీఏఎస్) పరీక్షలు
· ఆటోమోటివ్ కాంపోనెంట్ టెస్టింగ్
కొనుగోలు చేసిన పరికరాల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో ప్రధానంగా హై-స్పీడ్, హై-రిజల్యూషన్ ఇమేజింగ్ వ్యవస్థను జోడిస్తున్నారు. దీనిలో 750 ఎఫ్‌పీఎస్ వరకు పనిచేసే యుహెచ్‌డీ-4కే కెమెరాలున్నాయి. వీటికి 3,000 ఎఫ్‌పీఎస్ వరకు రికార్డ్ చేసే ఫుల్ హెచ్‌డీ సామర్థ్యం ఉంది. ఈ వ్యవస్థ ద్వారా వాహనం ముందు, పక్క, వెనుక భాగాల క్రాష్ టెస్టులను సమగ్రంగా పరిశీలించవచ్చు. ఇది ప్రమాద సమయంలో వాహనం దెబ్బతినే తీరు, లోపల ఉన్నవారి కదలికలు, ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకునే విధానం లాంటి ముఖ్యమైన అంశాలను చిత్రీకరిస్తుంది. దీనివల్ల పూర్తి భద్రతా విశ్లేషణ, హోమోలోగేషన్ ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది.

జీఏఆర్‌సీ వద్ద పాసివ్ సేఫ్టీ క్రాష్ టెస్టింగ్ కేంద్రం

క్రాష్ టెస్టింగ్ కోసం హై స్పీడ్ కెమెరా వ్యవస్థ
భారతదేశ ఆధునికతరం ఆటోమోటివ్ వ్యవస్థకు తోడ్పాటు
విద్యుత్ వాహనాలు, బ్యాటరీలు, అధునాతన భద్రతా వ్యవస్థలు, ఏడీఏఎస్, భారీ వాణిజ్య వాహనాలు, అధునాతన వాహన సాంకేతిక పరిజ్ఞానాల కోసం స్వదేశీ పరీక్షా, ధ్రువీకరణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా భారత్ వేసిన ముందడుగును పీఏం ఈ-డ్రైవ్ మద్దతుతో జీఏఆర్‌సీ వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలు సూచిస్తున్నాయి.
ఈ పెట్టుబడులతో, జాతీయ వాహన టెస్టింగ్, పరిశోధనా కేంద్రంగా తన పాత్రను జీఏఆర్‌సీ మరింత బలోపేతం చేసుకుంటోంది. అలాగే సురక్షితమైన, సాంకేతికంగా ముందంజలో ఉన్న, అంతర్జాతీయంగా పోటీనిచ్చే భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడుతోంది.
(రిలీజ్ ఐడి: 2316061)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3