పర్యటక మంత్రిత్వ శాఖ
పర్యటన రంగ అభివృద్ధి ఒక్క ప్రసిద్ధ ప్రాంతాలకే కాక ఇతర చోట్లకు కూడా విస్తరించి, స్థానికులకు అవకాశాలు కల్పించాలి:
కేంద్ర పర్యటన, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ శెఖావత్
‘ప్రపంచ పర్యటన దినోత్సవం-2026’ సందర్భంగా జాతీయ డిజిటల్ టూరిజమ్ స్టాక్‌తో పాటు,
జాతీయ ప్రత్యామ్నాయ గమ్యస్థానాల మిషన్.. ‘దేఖో అప్నా దేశ్ 2.0’ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించిన కేంద్ర పర్యటన శాఖ మంత్రి
పర్యటనకు ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు బాధ్యతాయుత యాత్ర బలోపేతానికి
పరిశ్రమ భాగస్వాములతో ఎంఓయూలు మార్పిడి చేసుకున్న పర్యటన మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
27 SEP 2026 8:12PM by PIB Hyderabad
‘ప్రపంచ పర్యటన దినోత్సవం-2026’ను పర్యటన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు నిర్వహించారు. కేంద్ర పర్యటన, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ శెఖావత్, పర్యటన శాఖ కార్యదర్శి శ్రీ భువనేశ్ కుమార్, శాఖకు చెందిన సీనియర్ అధికారులతో పాటు పర్యటన పరిశ్రమ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జాతీయ డిజిటల్ టూరిజమ్ స్టాక్, జాతీయ ప్రత్యామ్నాయ గమ్యస్థానాల మిషన్.. ‘దేఖో అప్నా దేశ్ 2.0’ ప్రచార ఉద్యమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. పర్యటన రంగాన్ని, మార్కెటింగును కలసి ప్రోత్సహించే ఉద్దేశంతో, పరిశ్రమ ప్రతినిధులకు మంత్రిత్వశాఖ కు మధ్య అయిదు అవగాహన ఒప్పందాల (ఎంఓయూస్) మార్పిడి కూడా ఈ సందర్భంగా చోటుచేసుకుంది.
శ్రీ గజేంద్ర సింగ్ శెఖావత్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ‘‘పర్యటన రంగం అంటే కేవలం స్థలాలను సందర్శించడానికి పరిమితం కాదు. ప్రస్తుతం ప్రయాణికులు ప్రామాణిక అనుభూతులను కోరుకుంటున్నారు. వాటిలో స్థానిక వంట విధానాలు, స్థానిక కళలు, స్థానిక సంప్రదాయాలతో పాటు వట్టి ఫోటోలే కాకుండా చక్కని జ్ఞాపకాలను అందించే అనుబంధం.. వీటి పాత్ర పెరుగుతోంది’’ అన్నారు. ‘‘అభివృద్ధి అంటే ప్రసిద్ధ దర్శనీయ స్థలాలకు మించింది.. స్థానికులకు, ఔత్సాహిక వాణిజ్య వేత్తలకు, మహిళలకు, యువతకు అవకాశాలను అందించే అభివృద్ధికి బాటను వేయడం అని చెప్పుకోవాలి. ఇదే భారత్ పర్యటన రంగ ప్రస్థానంలో తదుపరి దశ. ఇది జరిగినప్పుడే మరింత సమతౌల్యంతో కూడిన, అన్ని వర్గాల వారిని కలుపుకొని ముందుకు పోయే, స్థిర ప్రాతిపదిక గలిగిన రంగంగా పర్యటన రంగం నిలదొక్కుకోగలుగుతుంది’’ అని మంత్రి వివరించారు.
పర్యటన శాఖ కార్యదర్శి శ్రీ భువనేశ్ కుమార్ స్వాగతోపన్యాసాన్నిచ్చారు. ‘‘కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్ వేదికలు, సమాచారాన్ని
ఆధారంగా చేసుకొని పర్యటక స్థలాలను నిర్వహణను చేపట్టడం.. ఇవి పర్యటనను మరింత సులభతరంగా, బాధ్యతాయుతంగా, వ్యక్తిగతంగా తీర్చిదిద్దుతాయి. డిజిటల్ రంగంలో ప్రజోపయోగ సేవలకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన (డీపీఐ) రంగంలో భారతదేశం చెప్పుకోదగిన అనుభవాన్ని సంపాదించింది. మరి ఈ సామర్థ్యాలను ఇక పర్యటన రంగంలో ఎలా ఉపయోగించుకోవాలో మేం పరిశీలిస్తున్నాం’’ అని శ్రీ కుమార్ అన్నారు.
‘‘పర్యటన రంగానికి సరికొత్త నిర్వచనాన్ని ఇవ్వడానికి డిజిటల్ అజెండాను, కృత్రిమ మేధను ఉపయోగించుకోవడం’’అనే విషయం ఈ సంవత్సర ప్రపంచ పర్యటన దినోత్సవ ఇతివృత్తంగా ఉంది. దీనిపై సర్వమ్ ఏఐ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ వివేక్ రాఘవన్ కీలకోపన్యాసాన్నిచ్చారు. పర్యటన రంగ ప్రస్థానంలో పర్యటక స్థలాల గుర్తింపు, యాత్రకు ప్రణాళిక వేసుకోవడం మొదలు బుకింగ్, యాత్రానుభూతి, ఆ అనుభూతులను ఇతరులతో పంచుకోవడం వరకు.. ప్రతి దశకూ నూతన రూపురేఖలను ఇవ్వగల శక్తిసామర్థ్యాలు ఏఐకి ఉన్నాయి. ప్రయాణాన్ని ఎలాంటి ఇబ్బందులకు తావు లేని విధంగా, వ్యక్తిగతమైందిగా, సుగమమైందిగా తీర్చిదిద్దడానికి సాంకేతికతను వినియోగించుకొనే అవకాశం మన ముందుంది. అలాగే యాత్రికులలో ప్రతి ఒక్కరి సొంత అభిరుచిని దృష్టిలో పెట్టుకొని దానికి అనుకూలమైన పథక రచన చేయడం కూడా సాధ్యమే’’ అని ఆయన అన్నారు.
శ్రీ భువనేశ్ కుమార్‌తో పాటు పర్యటన శాఖ అదనపు కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ శ్రీ సుమన్ బిల్లా జాతీయ డిజిటల్ టూరిజమ్ స్టాక్, జాతీయ ప్రత్యామ్నాయ గమ్యస్థానాల మిషన్ (ఇది పర్యటన డిమాండు పునస్సమీక్ష అంతగా వెలుగులోకి రాని ప్రాంతాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ప్రచార ఉద్యమం).. ‘దేఖో అప్నా దేశ్ 2.0’ పై నివేదికలను సమర్పించారు. తరువాత, పరిశ్రమ ప్రతినిధులతో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు.
జాతీయ డిజిటల్ టూరిజమ్ స్టాక్‌కు ఓఎన్‌డీసీ, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ డీపీఐ ఇన్నొవేషన్ అండ్ అడ్వాన్స్‌మెంట్ (ఐసీడీఐఏ) ల సహాయంతో మెరుగులు దిద్దుతున్నారు. భారతదేశంలో పర్యటన రంగంలో ఉన్న అవకాశాలు మరింత ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించేటట్లు, మరింత మంది చేరుకోవడానికి అనువుగా తీర్చిదిద్దేటట్లు, విశ్వసనీయంగా ఉండేటట్లు మలచడం దీని లక్ష్యం. పర్యటన రంగంలో సేవలను అందించే వర్గాలు వాటి సేవలను వివిధ వేదికల్లో అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ఈ ఉమ్మడి డిజిటల్ మౌలిక సదుపాయాల స్వరూపం తోడ్పడుతుంది. ఆ యా సేవలలో.. ప్రామాణిక గుర్తింపు వ్యవస్థలు, సరఫరాదారు సంస్థలకు చెందిన ప్రమాణపత్రాలు, అన్వేషణ, సమాచారాన్ని తెలుసుకునే సదుపాయం, చెల్లింపులు, రేటింగులు, ఫిర్యాదుల పరిష్కారం వంటి సౌకర్యాలు కలిసి ఉంటాయి. మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పరిశ్రమ భాగస్వామ్యం పంచుకునే ఈ సహకార ప్రధాన కార్యక్రమాన్ని దశ వారీ పద్ధతిలో అమల్లోకి తీసుకొస్తారు. తొలి కార్యక్రమాన్ని 2027 జనవరిలో చేపట్టాలని సంకల్పించారు.
మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి: click here.
జాతీయ ప్రత్యామ్నాయ గమ్యస్థానాల మిషన్ (ఇది పర్యటన డిమాండు పునస్సమీక్ష, అంతగా వెలుగులోకి రాని ప్రాంతాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ప్రచార ఉద్యమం).. ‘దేఖో అప్నా దేశ్ 2.0’ల ఉద్దేశం పర్యటనల గిరాకీని పెద్ద ఎత్తున విస్తరించడం. దీనిలో భాగంగా, పర్యటనకు సిద్ధంగా ఉన్న/ భారీ సంఖ్యలో యాత్రికులు పోటెత్తుతున్న ప్రసిద్ధ పర్యటన స్థలాలకు ప్రత్యామ్నాయంగా, లేదా వాటిని భర్తీ చేసే విధంగా.. అంతగా వెలుగులోకి రాని ఇతర ప్రాంతాలను ప్రోత్సహిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో, ఆ యా పర్యటన స్థలాలను గుర్తిస్తారు. దీని కోసం ప్రత్యేక ఆకర్షణ, తగినంత మౌలిక వసతులు, నివాస సదుపాయాలు ఉన్నాయా, అవి ఎక్కువ మంది పర్యటకులకు ఆతిథ్యాన్ని ఇవ్వగలుగుతాయా అనే అంశాలను పరిశీలిస్తారు. పర్వతాలు, కొండలు ఉన్న ప్రాంతాలు, కోస్తా ప్రాంతాలు లేదా జలమార్గాలను కలిగివున్న ప్రాంతాలు, వారసత్వ పట్టణాలు/సాంస్కృతిక పట్టణాలతో పాటు ప్రాంతీయ ధార్మిక స్థలాలపై ప్రత్యేక దృష్టి పెడతారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు పర్యటన రంగ పరిశ్రమ భాగస్వాములతో కలిసి యాత్రా ప్రధాన కార్యక్రమాలను, ప్యాకేజీలను రూపొందిస్తారు. వాటిలో వసతి, రవాణా, భోజనం, స్థానిక అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో చేతివృత్తిదారులకు, స్వయంసహాయ సంఘాలకు, గైడ్లకు, ఇతర స్థానిక ఆసక్తిదారు వర్గాలకు అవకాశాలు కలుగుతాయి. సంయుక్త ప్రచారంలో సామాజిక మాధ్యమాలకు పెద్దపీట వేస్తారు. డిజిటల్ ప్రచార ఉద్యమాలు, పరిశ్రమ సహకారంతో సంయుక్త ప్రచారాన్ని పటిష్టపరుస్తారు. పర్యటన స్థలాల నిర్వహణలో సందర్శకుల సమాచారాన్ని, ప్రతిస్పందనలను ఉపయోగించుకుంటారు. ఇది నిర్ధారిత సామర్థ్యానికి అనుగుణంగా పర్యటకుల రాకను పర్యవేక్షించడంలో తోడ్పడుతుంది.
మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి: click here.
ఈ సందర్భంగా పర్యటక ప్రదేశాల ప్రచారం, స్థానికుల భాగస్వామ్యం, బాధ్యతతో కూడిన పర్యటనలను బలోపేతం చేయడానికి ఎయిర్‌బీఎన్‌బీ ఇండియా, ఫ్లిక్స్‌బస్ ఇండియా, ఇన్‌మొబీ గ్రూపునకు చెందిన గ్లాన్స్ డిజిటల్ ఎక్స్‌పీరియన్స్, ఐషర్ గ్రూప్ ఫౌండేషన్, మేక్‌మైట్రిప్ (ఇండియా)లతో అయిదు అవగాహన ఒప్పందాల (ఎంఓయూస్)ను పర్యటన మంత్రిత్వశాఖ మార్పిడి చేసుకుంది.
హోంస్టే సంబంధిత వసతిని అభివృద్ధిచేయడం, అతిథులకు నైపుణ్యాలను నేర్పించడంపై ఎయిర్‌బీఎన్‌బీతోనూ, నగర పరిధిలో రాక పోకల మాధ్యమం ద్వారా పర్యటన స్థలాలకు ప్రచారాన్ని కల్పించి వాటిని ప్రోత్సహించడం, బాధ్యతాయుత యాత్ర వంటి అంశాలపై ఫ్లిక్స్‌బస్‌తోనూ, డిజిటల్ టూరిజం కంటెంట్, బాధ్యతాయుత పర్యటక సమాచారాన్ని అందజేసే అంశంపై గ్లాన్స్‌తోనూ, హిమాలయ ప్రాంతంలో స్థానికుల సారథ్యంలో, వారసత్వ ఆధారిత సుస్థిర పర్యటన అంశాలపై ఐషర్ గ్రూప్ ఫౌండేషన్‌తోనూ, ఇంతవరకు వెలుగులోకి రాని పల్లెలు, ప్రామాణిక స్థానిక కొనుగోళ్లు, మంత్రిత్వ శాఖ గుర్తించిన యాత్రా కార్యక్రమాలను తెర మీదకు తీసుకురావడంపై మేక్‌మైట్రిప్‌తో నూ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ అయిదు ఎంఓయూల పరిధిలోకి వచ్చే సహకారం వాణిజ్య తరహాది కాదు. దీనికి ఆర్థిక సహాయాన్నేమీ అందించరు. ఈ సహకారం తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సింది కూడా కాదు. ప్రత్యేక షరతులంటూ వర్తించవు.
మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి: click here.
స్వచ్ఛత అంశానికి సంబంధించిన ‘టెలివిజన్ ఆధారిత సామాజిక జాగృతి ప్రచార ఉద్యమం- 2026’ను కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. దీనిలో గౌరవ ప్రధానమంత్రి తీర్థస్థలాలు, మందిరాలు, వారసత్వ స్థలాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు స్వచ్ఛత పరిరక్షణ కార్యక్రమాల్లో ఉమ్మడి భాగస్వామ్యాన్ని పెంచాలంటూ దేశ పౌరులకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో భాగంగా ‘ఇండియా టూరిజం స్టాటిస్టిక్స్- 2026’ను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమాల శుభారంభంతో పాటు, టెలివిజన్ క్యాంపెయిన్ (టీవీసీ)ని, ఉద్యమానికి సంబంధించిన ఒక వీడియోని ప్రదర్శించారు.
***
(రిలీజ్ ఐడి: 2316056)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7