రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారత్ ఏ దేశ భూభాగాన్ని ఆక్రమించుకోవాలని కోరుకోదు... తనకు ముప్పు ఉన్నప్పుడు భద్రతను, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కచ్చితంగా కాపాడుకుంటుంది: శ్రీ రాజ్‌నాథ్ సింగ్

గొప్ప నాగరికతా శక్తిగా భారత్ అభ్యున్నతి యావత్ ప్రపంచానికి శ్రేయస్కరం

రక్షణ రంగ దిగుమతిదారు నుంచి విశ్వసనీయ అంతర్జాతీయ సరఫరాదారుగా పురోగమిస్తున్న భారత్

జాతీయ భద్రతకు జాతీయ ఐక్యతే కీలకం: శ్రీ రాజ్‌నాథ్ సింగ్

నాడు పోస్టు చేయడమైనది: 27 SEP 2026 1:40PM by PIB Hyderabad

రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన రక్షణ సదస్సులో ప్రసంగిస్తూ... "భారత్ శాంతిని విశ్వసిస్తుంది. ఏ దేశ భూభాగాన్ని ఆక్రమించాలని కోరుకోదు. శాంతిని బలహీనతగా భావించకూడదు. మేం ప్రపంచ స్థిరత్వాన్ని కోరుకుంటాం. అయితే మా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని పణంగా పెట్టి కాదు. ముప్పు వాటిల్లినప్పుడు మా భద్రతను, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకోవడానికి మేం దృఢంగా కట్టుబడి ఉన్నాం" అని వ్యాఖ్యానించారు.

భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశంతోనూ చర్చలకు తావులేదని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. “ఉగ్రవాదాన్ని తమ ప్రభుత్వ విధానంగా మార్చుకుని, ఉగ్రవాదులకు ఆశ్రయం, మద్దతునిస్తున్న దేశాలకు... ఉగ్రవాదం ఏ దేశానికీ వ్యూహాత్మక ఆస్తి కాలేదని గట్టిగా గుర్తుచేయాల్సిన అవసరం ఉంది. పొరుగు దేశం ఉగ్రవాదానికి మద్దతునిచ్చే విధానాన్ని కొనసాగించినంత కాలం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకునే పూర్తి హక్కు భారత్‌కు ఉంటుంది” అని పేర్కొన్న రక్షణ మంత్రి, ఇటీవల జరిగిన ఎస్‌సీవో సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రస్తావించారు.

జాతీయ భద్రతకు జాతీయ ఐక్యతే కీలకమని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. దేశ భద్రత కేవలం సాయుధ దళాల బాధ్యత మాత్రమే కాదనీ, ప్రతి పౌరుడి ఉమ్మడి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. మతం, కులం, జాతి, భాష, ప్రాంతం, ఇతర విభేదాలకు అతీతంగా పౌరులంతా ఉన్నత స్థాయికి ఎదగాలి. వ్యక్తిగత, సంకుచిత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యమివ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

భారత్‌ను గొప్ప నాగరికతా శక్తిగా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. ఒక దేశం ఎదుగుదల ఇతర దేశాలతో ఘర్షణలు, ఆ దేశాలను విచ్ఛిన్నం చేయడంపై కాకుండా.. అందరినీ కలుపుకొనిపోయే సమష్టి అభివృద్ధిపైనే ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్ అనుసరించే విధానానికి మూడు పునాదులు ఉన్నాయని తెలిపారు. మన సుదీర్ఘ ప్రజాస్వామ్యం, సాంస్కృతిక సంప్రదాయాలు... 'వసుధైవ కుటుంబకం' అనే మన సిద్ధాంతం... 'సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్' అనే మన సంకల్పం ఆ మూడు పునాదులని కేంద్ర మంత్రి వివరించారు. వీటితో పాటు గౌరవం, చర్చలు, సంపద, భద్రత, సంస్కృతి అనే ఐదు వ్యూహాత్మక స్తంభాలు భారత్ కోసం మార్గదర్శకాలని ఆయన గుర్తుచేశారు.

గ్లోబల్ సౌత్ కూటమిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ... ఒక విశ్వసనీయ భాగస్వామిగా, 'విశ్వ బంధు'గా భారత్ ప్రస్తుతం అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషిస్తున్నదని రక్షణ మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. 'వాక్సిన్ మైత్రి' కార్యక్రమం కింద 100కు పైగా దేశాలకు 30 కోట్లకు పైగా కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులను భారత్ సరఫరా చేసిందని తెలిపారు. మందులు, డిజిటల్ చెల్లింపుల సాంకేతికత, నైపుణ్యం, వనరుల ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ అండగా నిలిచిందనీ ఆయన గుర్తుచేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి 'వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమిట్స్' వంటి కార్యక్రమాలనూ ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. బాధ్యతాయుతంగా అధికారాన్ని వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేస్తూ... పోటీ ఉన్నప్పటికీ దేశాల మధ్య పరస్పర సహకారం ఉండాలనీ, ప్రపంచ అభివృద్ధిలో అందరినీ కలుపుకొనిపోయే భాగస్వామ్యం అవసరమని ఆయన పిలుపునిచ్చారు.

రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధన దిశగా భారత్ సాధించిన అద్భుతమైన ప్రగతిని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రముఖంగా ప్రస్తావించారు. విమానాలు, డ్రోన్ ఇంజిన్ల నుంచి అయిదో, ఆరో తరం ఫైటర్ జెట్ల వరకు మన దేశం సొంతంగానే సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. భారత్ రక్షణ ఎగుమతులు 2013-14లో కేవలం రూ. 686 కోట్లు మాత్రమే ఉండగా... 2025-26 నాటికి రికార్డు స్థాయిలో రూ. 38,424 కోట్లకు చేరి, 100కు పైగా దేశాలకు విస్తరించాయన్నారు. గతేడాది రూ. 30,000 కోట్ల ఎగుమతుల లక్ష్యాన్ని విజయవంతంగా అధిగమించిన భారత్, 2029 నాటికి రూ. 50,000 కోట్ల ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకుందని ఆయన వెల్లడించారు.

భారత క్షిపణులు, రాడార్లు, మందుగుండు సామగ్రి, రక్షణ ప్లాట్‌ఫారమ్‌లకు అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్.. భారత సాంకేతికత, నాణ్యత, సరఫరా సామర్థ్యాలపై ప్రపంచానికి ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఫలితంగా, “మేడ్ ఇన్ ఇండియా” నినాదం కేవలం ఒక తయారీ లేబుల్‌గా మాత్రమే కాదు... భారత రక్షణ రంగ సామర్థ్యాలపై ప్రపంచానికి గల గొప్ప నమ్మకానికి చిహ్నంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.

రక్షణ రంగానికి కేటాయించే బడ్జెట్ గణనీయంగా పెరుగుతోందని రక్షణ మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. 2013-14లో రక్షణ రంగ బడ్జెట్ దాదాపు రూ. 2.53 లక్షల కోట్లుగా ఉందనీ... 2026-27 నాటికి అది రూ. 7.85 లక్షల కోట్లకు చేరిందనీ ఆయన పేర్కొన్నారు. పెట్టుబడి సేకరణ బడ్జెట్‌లో సుమారు 75 శాతం అంటే రూ. 1.39 లక్షల కోట్లను కేవలం స్వదేశీ రక్షణ పరిశ్రమల నుంచి కొనుగోలు చేయడానికి కేటాయించామనీ, దీనివల్ల స్థానిక తయారీ రంగంతో పాటు దానికి అనుబంధంగా ఉన్న ఎంఎస్ఎంఈలు, సరుకు రవాణా వ్యవస్థలూ మరింత బలోపేతం అవుతాయని కేంద్ర మంత్రి వివరించారు.

యుద్ధాల స్వభావం వేగంగా మారుతోందనీ, ఆధునిక ఘర్షణలు సాంప్రదాయిక సరిహద్దులకే పరిమితం కాకుండా సైబర్, అంతరిక్షం, ఎలక్ట్రానిక్-ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్ వంటి రంగాలకూ విస్తరిస్తున్నాయని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. వీటితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్లు, స్వయం-ప్రతిపత్తి గల సిస్టమ్స్, క్వాంటం టెక్నాలజీ, హైపర్సోనిక్ సిస్టమ్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలూ దీనికి తోడవుతున్నాయని ఆయన వివరించారు. ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా, అన్ని రంగాల్లో భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా సరికొత్త సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

సాంకేతికత, ఇంధనం, డేటా, సరుకు రవాణా వ్యవస్థల వంటి రంగాల్లోని వ్యూహాత్మక బలహీనతలను అధిగమించడానికి దేశం చేస్తున్న కృషిని రక్షణ మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. సెమీకండక్టర్లు, కీలకమైన ఖనిజాల విభాగాల్లో స్వదేశీ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, పలు రకాల ఇంధన వనరులను అందుబాటులో ఉంచడం ద్వారా ఇంధన భద్రతను మరింత పటిష్ఠం చేయడానికి సంబంధించి విస్తృత చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

రక్షణ రంగంలో స్వయంసమృద్ధి ప్రాముఖ్యతను రక్షణ మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. మన సాయుధ దళాలు విడుదల చేసిన అయిదు సానుకూల స్వదేశీకరణ జాబితాల్లో... 509 రక్షణ పరికరాలు, ఆయుధ వ్యవస్థలు, ప్లాట్‌ఫారమ్‌లను చేర్చినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు (డీపీఎస్‌యూలు) మరో ఆరు స్వదేశీకరణ జాబితాలను విడుదల చేశాయన్నారు. వీటిలో వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఎల్ఆర్‌యూలు, సబ్-సిస్టమ్స్, స్పేర్స్, విడిభాగాలు కలిపి మొత్తం 5,417 వస్తువులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వీటిలో ఇప్పటికే సుమారు 3,300 వస్తువులను విజయవంతంగా స్వదేశీ సాంకేతికతతోనే తయారు చేసినట్లు రక్షణ మంత్రి వెల్లడించారు.

రక్షణ రంగ తయారీలో ప్రైవేట్ రంగం, అంకురసంస్థలు, ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోందని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం భారత రక్షణ వ్యవస్థలో ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలతో పాటు, ప్రైవేటు పరిశ్రమలు, 16,000కు పైగా ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో రక్షణ రంగానికి సంబంధించిన తయారీ సామర్థ్యాలు వేగంగా విస్తరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రక్షణ పారిశ్రామిక కారిడార్లలో దాదాపు రూ. 70,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయనీ, అందులో ఇప్పటికే సుమారు రూ. 10,000 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు రక్షణ మంత్రి వెల్లడించారు.

స్వదేశీ రక్షణ వస్తువుల సరఫరా వ్యవస్థల బలోపేతంలో 'సృజన్', 'సృజన్ దీప్' పోర్టల్‌ల పాత్రనూ రక్షణ మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. సృజన్ పోర్టల్ ద్వారా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే దాదాపు 33,000 వస్తువులను గుర్తించి, వాటి స్థానంలో స్వదేశీ వస్తువులను వాడాలని నిర్ణయించామన్నారు. వాటిలో ఇప్పటికే సుమారు 15,700 వస్తువులను సొంతంగానే తయారు చేసుకుంటున్నామనీ ఆయన తెలిపారు. 'సృజన్ దీప్' పోర్టల్ ద్వారా 40,000 కంటే ఎక్కువ మంది రక్షణ రంగ తయారీదారులు, విక్రేతలు, లక్షలాది ఉత్పత్తుల వివరాలతో ఒక జాతీయ డిజిటల్ డేటాబేస్‌ను రూపొందించినట్లు శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వివరించారు

ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు, ఆయుధ కర్మాగారాల వ్యవస్థలో వచ్చిన విప్లవాత్మక మార్పులను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా గుర్తుచేశారు. ఆయుధ కర్మాగారాలను కార్పొరేట్ సంస్థలుగా మార్చడం వల్ల వాటిలో సరికొత్త సాంకేతికత వాడకం, ఉత్పాదకత, జవాబుదారీతనం గణనీయంగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని మొత్తం 16 ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు ఎలాంటి నష్టాలు లేకుండా విజయవంతంగా నడుస్తున్నాయనీ, ఇవన్నీ ఇప్పుడు పరిశోధనాభివృద్ధి, ఎగుమతులపై మరింతగా దృష్టి సారిస్తున్నాయని రక్షణ మంత్రి స్పష్టం చేశారు.

రక్షణ రంగంలో యువత, ఆవిష్కరణల పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ... ఐడెక్స్, ఐడెక్స్-ప్రైమ్ కార్యక్రమాలు జాతీయ భద్రతలో అంకురసంస్థలు, నూతన ఆవిష్కర్తలు భాగస్వాములయ్యేందుకు గొప్ప అవకాశాలను కల్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. 'అదితి' వంటి పథకాలు అత్యాధునిక రక్షణ సాంకేతికతలను ప్రోత్సహిస్తున్నాయని రక్షణ మంత్రి తెలిపారు. 2026 మార్చి నాటికి, ఐడెక్స్ ద్వారా 676 అంకురసంస్థలు, ఆవిష్కర్తలు రక్షణ రంగంతో అనుసంధానమయ్యారనీ, వీటి ద్వారా 551 ఒప్పందాలు జరిగాయని ఆయన వెల్లడించారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు అంకురసంస్థలు/ఎంఎస్ఎంఈల నుంచి రూ. 2,400 కోట్లకు పైగా విలువైన కొనుగోళ్లకు ఆమోదం తెలిపిందనీ, రూ. 1,500 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులనూ మంజూరు చేసిందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వివరించారు.

ఈ సదస్సులో రక్షణ మంత్రి ఒక కీలక ప్రకటన చేశారు. సాంప్రదాయిక క్షిపణి వ్యవస్థల కోసం డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన సాంకేతికతలను, అర్హత కలిగిన భారతీయ పరిశ్రమలకు బదిలీ చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. దీనివల్ల ఎంపికైన ప్రైవేట్ కంపెనీలూ నిబంధనలకు లోబడి క్షిపణుల ఉత్పత్తిని చేపట్టేందుకు వీలుంటుంది. ఈ చర్య మన సాయుధ దళాల సన్నద్ధతను మరింత బలోపేతం చేయడమే కాకుండా, క్షిపణులను సకాలంలో సరఫరా చేయడానికీ దోహదపడుతుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. డీఆర్‌డీవో ఇకపై పరిశోధనాభివృద్ధిపైనే పూర్తి దృష్టి పెట్టేలా, రక్షణ రంగ పరిశ్రమలు ఉత్పత్తిలో మరింత కీలక పాత్రను పోషించేలా వ్యూహాత్మకంగా మార్పులు చేస్తున్నట్లు ఆయన జోడించారు.

రక్షణ రంగానికి సంబంధించిన ప్రతి చిన్న విడిభాగం నుంచి పూర్తి స్థాయి ఆయుధ వ్యవస్థల వరకు... అన్ని విభాగాల్లోనూ స్వదేశీ సామర్థ్యాలను పెంపొందించుకోవడం భారత్  ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ రక్షణ మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ఇతర దేశాల నుంచి దిగుమతులపై ఆధారపడకుండా, రక్షణ సాంకేతికతలను మన దేశంలోనే సొంతంగా అభివృద్ధి చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ విధానం దేశ వ్యూహాత్మక సార్వభౌమత్వాన్ని, రక్షణ రంగ సన్నద్ధతను, ఎలాంటి సవాళ్లనైనా తట్టుకోగల బలమైన స్వదేశీ రక్షణ-పారిశ్రామిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని రక్షణ మంత్రి వివరించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2315821) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Tamil