రసాయనాలు, పెట్రోకెమికల్స్ విభాగం
ఈ–వ్యర్థాల తొలగింపు, పరిశుభ్రత, కార్యాలయ సామర్థ్యంపై దృష్టితో ప్రత్యేక ప్రచారం 6.0కు సన్నద్ధమైన రసాయనాలు, పెట్రోకెమికల్స్ విభాగం
ప్రత్యేక ప్రచారం 5.0లో స్క్రాప్ తొలగింపు, స్థల నిర్వహణ, రికార్డుల నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కారంలో గణనీయ పురోగతి
నాడు పోస్టు చేయడమైనది:
26 SEP 2026 11:13AM by PIB Hyderabad
రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని రసాయనాలు, పెట్రోకెమికల్స్ విభాగం (డీసీపీసీ) 2026 అక్టోబర్ 2 నుంచి 31 వరకు నిర్వహించనున్న ప్రత్యేక ప్రచారం 6.0కు సన్నద్ధమవుతోంది. పరిశుభ్రత, ఈ–వ్యర్థాల తొలగింపు, స్థల నిర్వహణ, కార్యాలయ సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై ఈసారి మరింత ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు నిర్వహించిన సన్నద్ధత దశలో కూడా పలు పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టారు.
ఆరో సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ ప్రచారంలో ఈ–వ్యర్థాల (నిర్వహణ) నిబంధనలు 2022, ఇతర వర్తించే మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ–వ్యర్థాలను గుర్తించి, వాటిని తొలగించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కార్యాలయ స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం, స్క్రాప్, అవసరం లేని వస్తువులను తొలగించడం, రికార్డుల నిర్వహణ, మొత్తంగా కార్యాలయ వాతావరణాన్ని మెరుగుపరచడంపైనా దృష్టి పెట్టనున్నారు. ఈ ఏడాది ప్రచారం ఇతివృత్తం “ఈ–వ్యర్థాల సమర్థవంతమైన సేకరణ, విభజన, తొలగింపు”.
ప్రత్యేక ప్రచారం 5.0లో సాధించిన ముఖ్యమైన విజయాలు
రసాయనాలు, పెట్రోకెమికల్స్ విభాగం 2025 అక్టోబర్ 2 నుంచి 31 వరకు ప్రత్యేక ప్రచారం 5.0ను విజయవంతంగా నిర్వహించింది. పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కారం, స్క్రాప్ తొలగింపు, కార్యాలయ స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం వంటి అంశాలపై ఈ ప్రచారంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ప్రత్యేక ప్రచారం 5.0లో స్క్రాప్ తొలగింపు ద్వారా రూ.9.18 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. స్థల ఆడిట్, ఇతర చర్యల ద్వారా 7,156 చదరపు అడుగుల స్థలాన్ని ఖాళీ చేయడంతో, అందుబాటులో ఉన్న కార్యాలయ స్థలాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడింది.
రికార్డుల నిర్వహణలో భాగంగా 4,792 భౌతిక ఫైళ్లను పరిశీలించి, వాటిలొ 237 ఫైళ్లను తొలగించారు. ఎలక్ట్రానిక్ రికార్డులు, ఈ–ఫైళ్లకు సంబంధించి 1,275 ఈ–ఫైళ్లను సమీక్షించి, వాటిలొ 170 ఈ–ఫైళ్లను మూసివేశారు.
ఈ ప్రచారం సందర్భంగా విభాగానికి ప్రజల నుంచి ఆరు ఫిర్యాదులు అందగా, వాటన్నింటినీ పరిష్కరించారు. ఇది ప్రజలకు సకాలంలో, స్పందనాత్మకంగా సేవలు అందించడంపై విభాగం చూపుతున్న దృష్టిని ప్రతిబింబిస్తుంది. వీటితోపాటు ప్రచారంలో భాగంగా తొమ్మిది పార్లమెంటరీ హామీల అమలును కూడా పర్యవేక్షించారు.
పాత ఫర్నిచర్, పాత రికార్డులు, ఇతర అవసరం లేని వస్తువులను తొలగించడంతో పాటు పరిశుభ్రత, స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేలా పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ చర్యలు మరింత పరిశుభ్రమైన, క్రమబద్ధమైన, సమర్థవంతమైన కార్యాలయ వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి దోహదపడ్డాయి.
పీఎస్‌యూలు, స్వయంప్రతిపత్తి సంస్థల చురుకైన భాగస్వామ్యం
కేంద్ర పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్, టెక్నాలజీ సంస్థ (సీఐపీఈటీ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెస్టిసైడ్ ఫార్ములేషన్ టెక్నాలజీ (ఐపీఎఫ్‌టీ), హిందుస్తాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ (హెచ్‌ఓసీఎల్), హెచ్‌ఐఎల్ సహా విభాగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి సంస్థలు ఈ ప్రచారంలో చురుకుగా పాల్గొన్నాయి.
విభాగం ఆధ్వర్యంలో మొత్తంగా 93 పరిశుభ్రతా కార్యక్రమాలను చేపట్టారు. కార్యాలయ పరిశుభ్రత, అవసరం లేని వస్తువుల తొలగింపు, స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం, కార్యాలయ సామర్థ్యాన్ని మెరుగుపరిచే ఇతర చర్యలను ఈ కార్యక్రమాల్లో చేపట్టారు.
ప్రత్యేక ప్రచారం 6.0లో ప్రధానంగా దృష్టి సారించే అంశాలు
ప్రత్యేక ప్రచారం 5.0 ద్వారా పొందిన అనుభవం, సాధించిన విజయాలను ఆధారంగా చేసుకుని, విస్తృత స్థాయిలో కింది అంశాలపై దృష్టి సారిస్తూ ప్రత్యేక ప్రచారం 6.0కు విభాగం సన్నద్ధత చేపట్టింది.
· నిరంతరం పరిశుభ్రత, స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించడం.
· కార్యాలయ స్థల నిర్వహణ, కార్యాలయ సుందరీకరణ, అందుబాటులో ఉన్న కార్యాలయ స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం.
· నిర్దేశిత నిబంధనలు, విధానాలకు అనుగుణంగా ఈ–వ్యర్థాలను గుర్తించి, తొలగించడం.
· వర్తించే సాధారణ ఆర్థిక నిబంధనల (జీఎఫ్‌ఆర్ ప్రకారం స్క్రాప్, అవసరం లేని వస్తువులను గుర్తించి, తొలగించడం.
· పార్లమెంట్ సభ్యులు, ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ), రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిన పెండింగ్ లేఖలు, అంతర్ మంత్రిత్వ శాఖల కేబినెట్ నోట్‌లను సమీక్షించడం.
· మూడు నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్న పార్లమెంటరీ హామీల అమలును పర్యవేక్షించడం.
· సీపీజీఆర్‌ఏఎంఎస్, ఇతర మార్గాల ద్వారా అందిన పెండింగ్ ప్రజా ఫిర్యాదులు, అప్పీళ్లను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించడం.
· పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు నిబంధనలు, ప్రక్రియలను సమీక్షించి, సరళీకరించడం.
· పాత భౌతిక ఫైళ్లను సమీక్షించి, నమోదు చేసి, అవసరం లేని వాటిని తొలగించడం, ఈ–ఫైళ్లను మూసివేయడం ద్వారా రికార్డుల నిర్వహణను బలోపేతం చేయడం.
పరిశుభ్రమైన, సమర్థవంతమైన, పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పాలన అనే ప్రభుత్వ విస్తృత లక్ష్యాలకు అనుగుణంగా తన పరిపాలనా విధానాలను రసాయనాలు, పెట్రోకెమికల్స్ విభాగం కొనసాగిస్తోంది. ప్రత్యేక ప్రచారం కింద నిరంతరంగా చేపడుతున్న చర్యల ద్వారా వనరులను అత్యుత్తమంగా వినియోగించుకోవడం, కార్యాలయ పరిస్థితులను మెరుగుపరచడం, పౌర కేంద్రీకృత ప్రజా సేవలను మరింత బలోపేతం చేయడమే ఈ విభాగం లక్ష్యంగా పెట్టుకుంది.
***
(రిలీజ్ ఐడి: 2315387)
సందర్శకుల సూచీ సంఖ్య : : 36