కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన ట్రాయ్

నాడు పోస్టు చేయడమైనది: 25 SEP 2026 4:00PM by PIB Hyderabad

డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్ (డీసీఆర్) ప్లాట్‌ఫామ్‌ను భారతీయ టెలికాం నియంత్రణ మండలి (ట్రాయ్) ఈ రోజు ప్రారంభించింది. ప్రాపర్టీల డిజిటల్ రేటింగ్ సమాచారాన్ని వినియోగదారులకు అందించేందుకు, భవనాల డిజిటల్ కనెక్టివిటీకి రేటింగ్ ఇచ్చే సమగ్ర ప్రక్రియను సులభతరం చేసేందుకు దీన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా డిజిటల్ కనెక్టివిటీని పరీక్షించే యాప్‌ను కూడా విడుదల చేశారు.

 

2024 మే 13న ట్రాయ్ నోటిఫై చేసిన ‘టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (రేటింగ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఫర్ డిజిటల్ కనెక్టివిటీ) రెగ్యులేషన్స్- 2024’, 2026 మే 13న జారీ చేసిన దాని సవరణ నిబంధన- 2026, 2026 జూన్ 9న ట్రాయ్ విడుదల చేసిన 'రేటింగ్ మాన్యువల్ 2026'లో పేర్కొన్న మార్గదర్శకాల అమలును ఈ డీసీఆర్ ప్లాట్‌ఫామ్ సులభతరం చేస్తుంది.

 

ఈ ప్లాట్‌ఫామ్ డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్ పొందిన ప్రాపర్టీలను వినియోగదారులు చూసేందుకు ఒక పబ్లిక్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. ఇది ప్రాపర్టీ మేనేజర్లు (పీఎం), రిజిస్టర్డ్ డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్ ఏజెన్సీ (డీసీఆర్ఏ), వినియోగదారులను ఒకే ఉమ్మడి డిజిటల్ వేదికపైకి తీసుకువస్తుంది. ప్రాపర్టీ మేనేజర్లు తమ ప్రాపర్టీలను ప్రజా, ప్రభుత్వ, వాణిజ్య, ప్రైవేట్ మొదలైన విభాగాలలో రిజిస్టర్ చేసుకోవటం, రేటింగ్ దరఖాస్తులను సమర్పించటం, నిర్దేశిత సమాచారాన్ని- పత్రాలను అప్‌లోడ్ చేయటం, డీసీఆర్‌ఏను ఎంచుకోవటం చేయచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా తమ దరఖాస్తు పురోగతిని కూడా ట్రాక్ చేసుకోవచ్చు. నిర్మాణం పూర్తైన వాటితో పాటు నిర్మాణంలో ఉన్న వాటికి కూడా నిర్దేశిత మదింపు ప్రక్రియను ఇది అందిస్తోంది. నమోదిత డీసీఆర్‌ఏలు కేటాయించిన దరఖాస్తులను పరిశీలించటం, మదింపులను నిర్వహించటం, పరిశీలనలు- పరీక్ష ఫలితాలను రికార్డ్ చేయటం, సంబంధిత(సపోర్టింగ్) దస్త్రాలను నిర్వహించటం, నిర్దేశిత ఫ్రేమ్‌వర్క్ ప్రకారం రేటింగ్ ప్రక్రియను పూర్తి చేయటం చేయొచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ మదింపు, నివేదిక తయారీ, ధ్రువీకరణ, రేటింగ్‌ల ప్రచురణకు సంబంధించిన డిజిటల్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. వినియోగదారులు, ఇతర సంబంధిత వర్గాలు రేటింగ్ పొందిన ప్రాపర్టీలను వెతికేందుకు, ప్రచురించిన రేటింగ్‌లను వీక్షించడానికి, సంబంధిత పత్రాలను ధ్రువీకరించడానికి, ఆసక్తి ఉన్న భవనాలను సరిపోల్చుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది.

క్షేత్రస్థాయి మదింపుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన డీసీఆర్‌ఏ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. నిర్దేశిత పరీక్షా విధానానికి అనుగుణంగా అధీకృత డీసీఆర్‌ఏలు భవనాల లోపల డిజిటల్ కనెక్టివిటీని అంచనా వేసేందుకు ఈ యాప్ వీలు కల్పిస్తుంది. వెబ్ పోర్టల్ ద్వారా అందిన భవనాల సమాచారం, మొబైల్ అప్లికేషన్ ద్వారా సేకరించిన మదింపు డేటా ఈ ప్లాట్‌ఫామ్‌లో అనుసంధానమవుతుంది. దస్త్రాలు, ధ్రువీకరణ పత్రాలపై డిజిటల్ సంతకం చేయడానికి, వాటిని ధ్రువీకరించడానికి ఈ ప్లాట్‌ఫామ్ 'ఈ-సైన్' సౌకర్యాన్ని కలిగి ఉంది. వర్తించే రేటింగ్ ఫీజులను ఆన్‌లైన్‌లో చెల్లించటం, ఈమెయిల్- ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లు, ప్రాపర్టీ రికార్డులు, పరీక్ష ఫలితాలు, ధ్రువీకరణ పత్రాలు, ఆడిట్ లాగ్‌ల సురక్షిత భద్రతకు ఇది పూర్తి మద్దతునిస్తుంది.

 

వినియోగదారుల కోసం ఈ ప్లాట్‌ఫామ్ ఒక పబ్లిక్ రేటింగ్ సెర్చ్ పేజీని అందిస్తుంది. వినియోగదారులు ప్రాపర్టీ పేరు, సర్టిఫికెట్ ఐడీ లేదా లొకేషన్ ఆధారంగా రేటింగ్ పొందిన ప్రాపర్టీని వెతుక్కోవచ్చు. వారు భవనానికి సంబంధించిన డిజిటల్ సంతకం చేసిన రేటింగ్ ధ్రువీకరణ పత్రాన్ని చూడొచ్చు. ఆ ధ్రువీకరణ పత్రంపై ఉండే క్యూఆర్ కోడ్ ద్వారా దాని ప్రామాణికతను తెలుసుకోవచ్చు. దీనివల్ల రేటింగ్ పొందిన ప్రాపర్టీలో డిజిటల్ కనెక్టివిటీ అనేది స్పష్టంగా కనిపించే, ధ్రువీకరించదగిన అంశంగా మారుతుంది. తద్వారా వినియోగదారులకు కనెక్టివిటీ సమాచారం అందుబాటులోకి వస్తుంది. ఈ సమాచారం ఆధారంగా వినియోగదారులు తుది కొనుగోలు లేదా లీజు నిర్ణయం తీసుకునే ముందు తమకు కావాల్సిన ప్రాపర్టీని ఎంపిక చేసుకునేటప్పుడు సరైన నిర్ణయం తీసుకోవచ్చు.

 

ఈ సందర్భంగా ట్రాయ్ ఛైర్మన్ శ్రీ అనిల్ కుమార్ లహోటి మాట్లాడుతూ "డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్ ప్లాట్‌ఫామ్ ప్రాపర్టీల డిజిటల్ కనెక్టివిటీ సన్నద్ధతను అంచనా వేయడానికి ఒక పారదర్శకమైన, ప్రామాణికమైన ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పరుస్తుంది. రేటింగ్ వివరాలను ప్రజలకు అందుబాటులోకి తేవడం, సర్టిఫికెట్లను సులభంగా పరిశీలించే వెసులుబాటు కల్పించడం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్ వినియోగదారులకు నమ్మకమైన, పోల్చుకునేందుకు వీలైన సమాచారాన్ని అందిస్తుంది. బలమైన, నమ్మదగిన కనెక్టివిటీ ఉన్న ఇళ్లు, కార్యాలయాల గురించి మరింత సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది వారికి సహాయపడుతుంది. అంతరాయం లేని కాల్స్, డౌన్‌లోడ్‌లు, ఆన్‌లైన్ సేవల వినియోగానికి ఇది తోడ్పడుతుంది. ప్రాపర్టీలో నిర్మించిన డిజిటల్ కనెక్టివిటీ మౌలిక సదుపాయాల విలువను వినియోగదారులు గుర్తించేలా ఇది వీలు కల్పిస్తుంది. అదే సమయంలో ప్రాపర్టీ అభివృద్ధికి తగిన దశలోనే అటువంటి మౌలిక సదుపాయాలను ప్లాన్ చేసుకోవడానికి ప్రాపర్టీ మేనేజర్‌లను ఇది ప్రోత్సహిస్తుంది" అని వ్యాఖ్యానించారు.

 

డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్ (డీసీఆర్) ఫ్రేమ్‌వర్క్:

 

డీసీఆర్ ఫ్రేమ్‌వర్క్ ప్రాపర్టీలలో డిజిటల్ కనెక్టివిటీని అంచనా వేయడానికి ఒక ప్రామాణిక పద్ధతిని అందిస్తుంది. వివిధ రకాల ప్రాపర్టీల కోసం వర్తించే బెంచ్‌మార్క్‌లతో కూడిన ఫైబర్ సంసిద్ధత, మొబైల్ నెట్‌వర్క్ లభ్యత, బిల్డింగ్-ఇన్ సొల్యూషన్స్, వై-ఫై మౌలిక సదుపాయాలకు సంబంధించిన నిర్దేశిత ప్రమాణాలను ఈ మదింపు పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రాపర్టీ అభివృద్ధికి తగిన దశల్లో డిజిటల్ కనెక్టివిటీ మౌలిక సదుపాయాలను పరిగణనలోకి తీసుకునేలా ప్రోత్సహించడం, ఇప్పటికే ఉన్న ప్రాపర్టీలలో మౌలిక సదుపాయాలు- కనెక్టివిటీ పనితీరును అంచనా వేయడాన్ని సులభతరం చేయడం ఈ ఫ్రేమ్‌వర్క్ ప్రధాన ఉద్దేశం. డిజిటల్ కనెక్టివిటీ రేటింగ్ (డీసీఆర్) ప్లాట్‌ఫామ్‌ ఈ లింక్‌లో https://dcrp.trai.gov.in అందుబాటులో ఉంది. 

 

మిగతా సందేహాల కోసం దయచేసి సంప్రదించండి: శ్రీమతి అర్చన అహ్లావత్, సలహాదారు (ఐటీ) - ఈమెయిల్: advisorit@trai.gov.in

***


(రిలీజ్ ఐడి: 2315121) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी