వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో జాతీయ వ్యాపారుల సంక్షేమ బోర్డు 11వ సమావేశం
వ్యాపారుల సంక్షేమం, సులభతర వ్యాపారం, డిజిటల్ సాధికారత, ఎగుమతుల ప్రోత్సాహకానికి తీసుకున్న చర్యలను సమీక్షించిన బోర్డు
నాడు పోస్టు చేయడమైనది:
25 SEP 2026 2:32PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్‌లో జాతీయ వ్యాపారుల సంక్షేమ బోర్డు (ఎన్‌టీడబ్ల్యూబీ) 11వ సమావేశం హైబ్రిడ్ విధానంలో జరిగింది. వ్యాపారుల సంక్షేమం, వ్యాపార సౌలభ్యం, డిజిటల్ సాధికారత, రుణాల లభ్యత, కేంద్ర-రాష్ట్ర సమన్వయం, ఎగుమతుల ప్రోత్సాహం తదితర అంశాలను బోర్డు సమీక్షించింది. జీఎస్‌టీ, ఎంఎస్ఎంఈలు, వ్యాపారుల ఫిర్యాదు పరిష్కారం, డిజిటల్ వేదికలకు సంబంధించిన అంశాలను చర్చించారు. అలాగే వ్యాపారులు, చిన్న వ్యాపారులు, తయారీదారులు, ఎగుమతిదారులు, సర్వీసు ప్రొవైడర్లకు సంస్థాగత మద్దతును బలోపేతం చేయడం లాంటి అంశాలపై సైతం చర్చించారు.
హేతుబద్దీకరణ, రీఫండులో జాప్యాలు, సుదీర్ఘ ఆడిట్‌లు, కారుణ్య పథకాలు, ఐటీసీ అవకతవకలు, పెండింగులో ఉన్న అప్పీళ్ల పరిష్కారంతో సహా జీఎస్టీ సంబంధిత అంశాలపై సభ్యులు చర్చించారు. ఎంఎస్ఎంఈ సదుపాయాల కమిటీల్లో వ్యాపారులను చేర్చడం, 30 రోజుల కాలపరిమితితో కూడిన కేంద్రీకృత రుణ పోర్టల్ ప్రతిపాదన, సిబిల్ స్కోర్ వ్యవస్థలో సంస్కరణలు, వ్యాపారుల ఫిర్యాదుల హెల్ప్‌లైన్‌ల ఏర్పాటు అంశాలపై ఎంఎస్ఎంఈ, ఆర్థిక సంబంధ చర్చల్లో చర్చించారు.
ప్రభుత్వ కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లింపులు, సాంకేతిక కారణాలతో విధించే జరిమానాల నుంచి రక్షణ, వ్యాపారాలు మందగించిన సమయాల్లో రుణాల చెల్లింపులో వెసులుబాటు, కేంద్ర-రాష్ట్రాల మధ్య మరింత మెరుగైన సమన్వయం లాంటి వ్యాపార సంక్షేమ అంశాలపైనా సభ్యులు చర్చించారు. డిజిటల్ సాధికారతకు సంబంధించి ఓఎన్‌డీసీ, డిజిదుకాణ్ సేవలను జిల్లా స్థాయికి విస్తరించడం, నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో మహిళా పారిశ్రామికవేత్తల సదుపాయ డెస్క్‌ల ఏర్పాటు, ఫిర్యాదుల పరిష్కారానికి పోష్ సెల్స్‌తో పాటు సైబర్ మోసాల పరిష్కార యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడంపై బోర్డు విస్తృతంగా చర్చించింది.
ఎగుమతుల్లో వ్యాపారులు, ఎంఎస్‌ఎంఈల భాగస్వామ్యాన్ని పెంచడం, ఎగుమతి అవకాశాలపై అవగాహనను పెంపొందించడం, సంస్థాగత సహాయక వ్యవస్థలను బలోపేతం చేయడం, అంతర్జాతీయంగా పోటీనిచ్చే వాణిజ్య దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వివిధ రంగాల వారీగా సమస్యలను లోతుగా పరిశీలించి, విధానపరమైన నిర్ణయాల కోసం నిర్మాణాత్మక సిఫారసులను అందించేందుకు వీలుగా నిర్దిష్ట అంశాలవారీ కమిటీలు, ప్రత్యేక వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతపై కూడా బోర్డు చర్చించింది.
ఈ సమావేశానికి ఎన్‌టీడబ్ల్యూబీ ఛైర్మన్ శ్రీ సునీల్ జె సింఘీ అధ్యక్షత వహించారు. నిర్దేశిత బోర్డు లక్ష్యాలను చేరుకోవడానికి చేపట్టిన ప్రధాన కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. 40,000 నిబంధనలను హేతుబద్ధీకరించిన జన్ విశ్వాస్ చట్టం, సులభతర వాణిజ్య చర్యలు, మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడులో రాష్ట్ర వ్యాపారుల సంక్షేమ బోర్డుల ఏర్పాటు వంటి సంస్కరణల ద్వారా వ్యాపార సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ సింఘీ తెలిపారు. ఇదే అంశంపై గోవా, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన లిఖితపూర్వక ఆమోదాలను, జిల్లా సదుపాయ కేంద్రాల ఏర్పాటులో సాధించిన పురోగతిని కూడా బోర్డు పరిగణనలోకి తీసుకుంది.
కేంద్ర-రాష్ట్రాల మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తూ వరుసగా 100 వర్చువల్ సమావేశాలను విజయవంతంగా నిర్వహించిన అంశాన్ని శ్రీ సింఘీ ప్రస్తావించారు. స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో జూన్ 29న భామాషా జయంతిని రాష్ట్రీయ వ్యాపారి దివస్‌గా నిర్వహించడం, డెహ్రాడూన్, ఇండోర్ నగరాల్లో జరిగిన వ్యాపారి సంవాద్, చండీగఢ్, ఇండోర్‌లో చేపట్టిన తిరంగా యాత్ర తదితర కార్యక్రమాలు, ప్రచారాల గురించి కూడా ఆయన వివరించారు.
తర్వాతి తరం జీఎస్టీ 2.0 సంస్కరణలు, ఓఎన్‌డీసీ అనుసంధానం, డిజిదుకాన్ విస్తరణకు సంబంధించి సాధించిన పురోగతులను కూడా ఛైర్మన్ సభ్యులకు వివరించారు. ఓఎన్‌డీసీ చేపట్టిన బీ2బీ కొనుగోళ్లు, కిరాణా డిజిటలైజేషన్ కార్యక్రమం డిజిదుకాణ్. దీని ద్వారా కిరాణా దుకాణాలు ఒకే ఆర్డరింగ్ ఇంటర్‌ఫేస్ సాయంతో సరకుల కొనుగోలు ప్రక్రియను డిజిటలైజ్ చేసుకునే వీలు కలుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్, జైపూర్ నగరాల్లో 19,000 మందికి పైగా రీటైలర్లు ఈ వేదికను వినియోగిస్తున్నారు.
సమావేశం ప్రారంభంలో డీపీఐఐటీ డైరెక్టర్ శ్రీ యువరాజ్ రవీంద్ర పాటిల్ బోర్డు సభ్యులతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన ఎక్స్-అఫీషియో సభ్యులకు స్వాగతం పలికారు. అనంతరం జాతీయ వ్యాపారుల సంక్షేమ బోర్డు లక్ష్యాలు, విధులను వివరించారు. బోర్డు చేపడుతున్న కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు, డీపీఐఐటీ నిర్వహించే ఇంటరాక్టివ్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశాల వివరాలు అందరికీ చేరేలా చూడాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో 2027 జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చేందుకు ప్రతిపాదించిన వినియోగదారుల రక్షణ (సవరణ) బిల్లు-2026తో సహా త్వరలో రానున్న పలు సంస్కరణలను సభ్యులకు వివరించారు. ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రాధాన్యమిస్తూ, భారత్-యూకే సీఈటీఏ చర్చలపైనా బోర్డు విస్తృత చర్చలు చేపట్టింది.
ఈ సమావేశానికి వాణిజ్య సంఘాలు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాన్-అఫీషియల్ సభ్యులతో పాటు భారత ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల ఎక్స్-అఫీషియో సభ్యులు హాజరయ్యారు.
విధానపరమైన మద్దతు, డిజిటల్ సాధికారత, సులభతర వాణిజ్య సంస్కరణలు, సామాజిక భద్రతా కార్యక్రమాలు, కేంద్ర-రాష్ట్రాల మధ్య మరింత దృఢమైన సమన్వయం ద్వారా వ్యాపారులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు బోర్డు కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ సమావేశం ముగిసింది. వ్యాపారులు, వారి ఉద్యోగుల సంక్షేమం, సాధికారత కోసం కృషి చేయడంతో పాటు వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో చురుగ్గా పాల్గొనాలనే సంకల్పాన్ని బోర్డు మరోసారి స్పష్టం చేసింది.
***
(రిలీజ్ ఐడి: 2314961)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16