శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పూర్తి పునర్వినియోగ ‘అగ్నిబాన్’ ప్రయోగ వాహనం కోసం ‘ఆర్డీఐ’ కింద ₹200 కోట్ల మద్దతిస్తూ ‘అగ్నికుల్ కాస్మోస్‌’తో ‘టీడీబీ-డీఎస్టీ’ ఒప్పందం


ప్రస్తుత సాంకేతికతను టీఆర్ఎల్-4.. నుంచి టీఆర్ఎల్-8 దాకా పెంచుతూ భవిష్యత్తరం పునర్వినియోగ సామర్థ్యం సాధించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం

నాడు పోస్టు చేయడమైనది: 25 SEP 2026 3:09PM by PIB Hyderabad

   స్వదేశీ, పునర్వినియోగ అంతరిక్ష రవాణా వ్యవస్థల నవతరం ఆవిష్కరణ దిశగా భారత్‌ ప్రస్థానానికి గణనీయ ఉత్తేజం లభించింది. ఈ మేరకు కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ (డీఎస్‌టీ) పరిధిలోని సాంకేతికాభివృద్ధి సంస్థ (టీడీబీ) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని ‘మెస్సర్స్ అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్‌’తో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికింద పరిశోధన-అభివృద్ధి-ఆవిష్కరణ (ఆర్‌డీఐ) నిధి నుంచి ₹200 కోట్ల ఆర్థిక సహాయం అందజేస్తుంది.

సాంకేతికత సంసిద్ధత స్థాయి-4 (టీఆర్ఎల్) నుంచి టీఆర్ఎల్-8 దాకా శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉన్నతీకరిస్తూ భావితరం పునర్వినియోగ ప్రయోగ వాహనం (ఆర్‌ఎల్‌వీ) ‘అగ్నిబాన్‌’ తయారీపై దృష్టి కేంద్రీకరించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇందుకోసం అందజేసే ఆర్థిక సహాయం ఐచ్ఛికంగా మార్చుకోగల డిబెంచర్ల (ఓసీడీ) ద్వారా ఆ సంస్థకు లభిస్తుంది. ఈ మేరకు ప్రయోగ వాహన తొలి దశను మాత్రమే తిరిగి వాడుకోగలిగే ప్రస్తుత సంప్రదాయ పరిజ్ఞానాన్ని అధిగమిస్తూ- వాహన అన్ని దశల పునర్వినియోగ సామర్థ్యం సాధించడం ఈ ప్రాజెక్టు ధ్యేయం. ప్రతిపాదిత రూపకల్పన, ప్రయోగ, తయారీ వ్యయం తగ్గింపు సహా అంతరిక్ష శిథిలాల సమస్యను పరిమితం చేస్తూ, అధిక పౌనఃపున్యంతో, పునరావృత ప్రయోగ సాధ్యంగా ‘అగ్నిబాన్‌’ రూపుదాలుస్తుంది.

ఇందులో పునర్వినియోగ ప్రయోగ వాహణ నిర్మాణం ప్రధానాంశం. ఈ మేరకు తేలికైన ఎగువ దశ, కచ్చితమైన కక్ష్య ప్రవేశ సామర్థ్యం, డీప్ థ్రాట్లింగ్, పునఃప్రారంభ సామర్థ్యం దిశగా రూపొందించిన సెమీ-క్రయోజెనిక్ ద్రవ ఇంధన చోదక వ్యవస్థ ఇందులో అంతర్భగంగా ఉంటాయి. ఈ వ్యవస్థలతో పలుమార్లు ప్రయోగించగలిగేలా వాహనాన్ని మెరుగుపరుస్తూ మిషన్ కార్యకలాపాలలో మరింత సౌలభ్యాన్నివ్వడం దీని ఉద్దేశం.

వివిధ అభివృద్ధి-ప్రయోగాత్మక పరీక్ష కార్యక్రమాల ద్వారా ఈ సాంకేతికతలోని అనేక అంశాల్లో అగ్నికుల్ తన సామర్థ్యాన్ని ఇప్పటికే ప్రదర్శించింది. ఈ సంస్థ సాధించిన మునుపటి విజయాల్లో స్వదేశీ ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం 'అగ్నిబాన్' తయారీ ప్రధానమైనది. ఈ మేరకు తమ సంస్థలోనే ప్రణాళిక రూపొందించి, ఏకఖండ 3డీ-ప్రింటెడ్ ‘అగ్నిలెట్’ రాకెట్ ఇంజిన్‌ను తయారు చేసింది. చిన్న ఉపగ్రహ ప్రయోగాల కోసం మాడ్యులర్ కాన్ఫిగరింగ్‌ చేయగల ప్రయోగ వాహన అభివృద్ధి-వాణిజ్యీకరణ కోసం టీడీబీ ఇంతకుముందు కూడా ‘అగ్నికుల్‌’ సంస్థకు మద్దతిచ్చింది.

ఈ నేపథ్యంలో ‘ఆర్‌డీఐ’ పథకం మద్దతుతో కూడిన ప్రస్తుత కొత్త కార్యక్రమం, సంబంధిత సాంకేతిక ప్రస్థానాన్ని మరొక దశ ముందుకు తీసుకెళ్తుంది. అంటే- కేవలం ప్రయోగ వాహన తయారీ నుంచి పునర్వినియోగ, పునరావృత, కార్యాచరణ సామర్థ్యాల ఉన్నతీకరణతో అత్యాధునిక వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా ఇది సాగుతుంది. ప్రతిపాదిత ‘అగ్నిబాన్ ఆర్‌ఎల్‌వి’లో పునర్వినియోగ హిత ఎగువ దశ స్వరూపం, దిగువకు చేరగల ప్రొపల్షన్ వ్యవస్థ ఉన్నాయి. తదనుగుణంగా నియంత్రిత అవరోహణ, పునరుద్ధరణకు మద్దతివ్వగల సాంకేతికతలను సంస్థ రూపొందిస్తోంది. ఈ కార్యక్రమంలో, పునఃప్రారంభం, డీప్ థ్రాట్లింగ్‌ సమర్థ ప్రొపల్షన్ వ్యవస్థలు కూడా ఉన్నాయి. అవరోహణ, లాండింగ్ కార్యకలాపాల్లో కీలక సామర్థ్యాలివే!

పునర్వినియోగ ప్రయోగ వాహన తయారీకి అవసరమైన చోదక శక్తి, ఆరోహణ వ్యవస్థలు, కక్ష్యలోకి ప్రవేశం, అవరోహణ-పునరుద్ధరణ వంటి సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి-ధ్రువీకరణకు ఈ ప్రాజెక్టు తోడ్పడుతుందని అంచనా. అంతరిక్ష సాంకేతికతలలో అత్యాధునిక-పునర్వినియోగ ప్రయోగ వాహనాలు, ప్రొపల్షన్‌ ఆవిష్కరణల వంటి వాటిని ఆర్‌డీఐ నిధి ప్రాధాన్యాంశాలుగా గుర్తించిన నేపథ్యంలో తదనుగుణంగానే ఈ కార్యక్రమం సాగుతుంది.

ఈ సందర్భంగా టీడీబీ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ- “భారత అంతరిక్ష రంగ ప్రస్థానంలో తదుపరి దశ లేదా కక్ష్యను చేరడమే కాకుండా ఆ ప్రక్రియను మరింత తరచుగా, సౌలభ్యంతో, సమర్థంగా విజయవంతం చేయగల సాంకేతికతలు ఇప్పుడు అవసరం. దీనికి సంబంధించి పునర్వినియోగ వాహన రూపకల్పన ఓ కీలక పరిజ్ఞానం. ఆ దిశగానే ప్రతిష్టాత్మక స్వదేశీ సాంకేతికతల అభివృద్ధికి ఆర్డీఐ ఫండ్ ద్వారా  టీడీబీ మద్దతిస్తోంది. అత్యాధునిక సాంకేతిక దశల నుంచి వినియోగం వైపు పురోగమనం కోసం నిరంతర పెట్టుబడులు అవసరం. ఈ పరిస్థితుల నడుమ పునర్వినియోగ ప్రయోగ వాహన తయారీపై ‘అగ్నిబాన్ ఆర్ఎల్‌వీ’ కార్యక్రమం దృష్టి సారిస్తుంది. అంటే- ఆధునిక అంతరిక్ష యాన వ్యవస్థలలో భారత్‌ సామర్థ్య బలోపేతం ద్వారా ఈ విధానాన్ని ప్రతిబింబిస్తుంది” అన్నారు.

అనంతరం ‘అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్’ వ్యవస్థాపకులు మాట్లాడుతూ-  “ప్రయోగ వాహన పునర్వినియోగం కోసం ప్రొపల్షన్, వాహన రూపకల్పన, గైడెన్స్, రికవరీ, మిషన్ ఆపరేషన్లను అత్యంత విశ్వసనీయ ఏకీకృత వ్యవస్థగా రూపొందించడం అవశ్యం. ఈ కృషికి టీడీబీ విశిష్ట మద్దతు లభించడం మాకెంతో ప్రత్యేకం. భారత్‌లో సాంకేతిక పరిజ్ఞాన వాస్తవ అభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తుందనడానికి ఇదే నిదర్శనం. అగ్నిబాన్‌ను అంతర్జాతీయ స్థాయి పునర్వినియోగ వాహనంగా అభివృద్ధి చేయడం సహా పదేపదే అంతరిక్ష యానానికి స్వదేశీ వేదికను సమకూర్చడంలో ఈ చేయూత మాకెంతో వెసులుబాటు కల్పిస్తుంది” అన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2314934) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil