సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

షెడ్యూల్డ్ కులాల విద్యార్థి మృతికి సంబంధించి ఐఐటీ ముంబయిలో క్షేత్రస్థాయి విచారణ చేసిన ఎన్‌సీఎస్‌సీ ఛైర్మన్ శ్రీ కిషోర్ మక్వానా


సాహిల్ వాకోడే మృతికి దారితీసిన పరిస్థితులను సమీక్షించిన కమిషన్.. సంబంధిత సాక్ష్యాధారాలన్నింటినీ భద్రపరచాలని, పరిశీలించాలని ఆదేశం

నాడు పోస్టు చేయడమైనది: 24 SEP 2026 8:12PM by PIB Hyderabad

ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థి సాహిల్ వాకోడే మృతి చెందిన ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ (ఎన్‌సీఎస్‌సీ- నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్) ఛైర్మన్ శ్రీ కిషోర్ మక్వానా ఈ రోజు ఐఐటీ ముంబయిలో క్షేత్రస్థాయి విచారణ చేశారు.

కుల వివక్ష, వేధింపులు, విద్యార్థి మృతికి దారితీసిన పరిస్థితులపై మృతుడి కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ పర్యటన చేపట్టారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ముంబయి పోలీస్ నేర విభాగం దర్యాప్తు చేస్తోంది. షెడ్యూల్డ్ కులాలకు రాజ్యాంగంతో పాటు చట్టం ఇచ్చిన అధికారాల ప్రకారం కమిషన్ ఈ అంశాన్ని పరిశీలిస్తోంది.

ఈ పర్యటన సందర్భంగా ఐఐటీ ముంబయి డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, రిజిస్ట్రార్, సంబంధిత అధ్యాపకులు, సంస్థలోని ఇతర అధికారులతో ఛైర్మన్ విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థి మరణానికి ముందు జరిగిన పరిణామాల క్రమంపై కమిషన్ సమగ్ర వివరాలను కోరింది. ముఖ్యంగా 2026 సెప్టెంబర్ 18న జరిగిన మిడ్-సెమిస్టర్ పరీక్ష సమయంలో విద్యార్థి విద్యాపరమైన అక్రమాలకు పాల్పడినట్లుగా భావిస్తున్న సంఘటన వివరాలను అడిగి తెలుసుకుంది.

పరీక్ష సమయంలో విద్యార్థిని విచారించిన తీరు, ఆ తర్వాత అనుసరించిన విధానం, సంబంధిత అధ్యాపకులు- సంస్థకు చెందిన అధికారుల పాత్ర, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి, షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థుల సంక్షేమం- హక్కులను పరిరక్షించడానికి అందుబాటులో ఉన్న సంస్థాగత యంత్రాంగాలను కమిషన్ పరిశీలించింది.

ఈ అంశానికి సంబంధించి అన్ని రికార్డులు, సాక్ష్యాధారాలు, సీసీటీవీ రికార్డులు, ఎలక్ట్రానిక్ ఆధారాలు, అధికారిక సమాచార మార్పిడి, పరీక్షకు సంబంధించిన రికార్డులు, ఇతర పత్రాలను చట్టానికి అనుగుణంగా భద్రపరిచి దర్యాప్తు అధికారులకు అందజేయాలని ఛైర్మన్ చెప్పారు. తద్వారా విద్యార్థి మృతికి దారితీసిన పరిస్థితులు సాక్ష్యాధారాల ప్రకారం స్పష్టమవుతాయని ఆయన పేర్కొన్నారు.

క్షేత్రస్థాయి విచారణలో భాగంగా సాహిల్ వాకోడే చదువుతున్న ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాన్ని ఎన్‌సీఎస్‌సీ శ్రీ కిషోర్ మక్వానా స్వయంగా సందర్శించారు. పరీక్ష జరిగిన తరగతి గదిని, పరీక్షా హాల్‌ను కూడా ఛైర్మన్ పరిశీలించారు. పరీక్ష సమయంలో, ఆ వెంటనే జరిగిన పరిణామాల క్రమం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం హాస్టల్ ప్రాంగణాన్ని, మృతిచెందిన విద్యార్థి ఉన్న గదిని కమిషన్ సందర్శించింది. సాహిల్ వాకోడే సహచరులు, తోటి విద్యార్థులతో ఛైర్మన్ మాట్లాడారు. క్యాంపస్‌లో అతడి విద్యాపరమైన అనుభవాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. అతని మృతికి ముందు నెలకొన్న పరిస్థితులు, సంఘటనల గురించి సమాచారాన్ని సేకరించారు. అధికారిక రికార్డులు, కొనసాగుతున్న దర్యాప్తు నివేదికలతో పాటు  ఈ వివరాలను పరిగణలోకి తీసుకుని కమిషన్ తదుపరి చర్యలు తీసుకోనుంది.

ఐఐటీ ముంబయిలో క్షేత్రస్థాయి విచారణ ముగిసిన తర్వాత గౌరవ ఛైర్మన్.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, పోలీస్ కమిషనర్, నేర విభాగం అధికారులతో సహా దర్యాప్తుతో సంబంధం ఉన్న సీనియర్ పోలీసు అధికారులతో ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో దర్యాప్తు స్థితిగతులు, పురోగతిని కమిషన్ సమీక్షించింది. ఎఫ్‌ఐఆర్, సాక్ష్యాధారాల సేకరణ- భద్రపరచడం, సీసీటీవీ రికార్డులు, సాక్షుల విచారణ, ఈ కేసుకు సంబంధించిన ఇతర కీలక అంశాల గురించి వివరాలను అడిగి తెలుసుకుంది.

దర్యాప్తు నిష్పక్షపాతంగా, సమగ్రంగా సత్వరమే జరిగేలా చూడాలని.. ప్రతి సంబంధిత ఆరోపణను, పరిస్థితిని లభించిన సాక్ష్యాధారాల ఆధారంగా చట్టానుసారం కచ్చితంగా పరిశీలించాలని దర్యాప్తు అధికారులను గౌరవ ఛైర్మన్ ఆదేశించారు.

అన్ని రకాల డాక్యుమెంటరీలు, ఎలక్ట్రానిక్, ఫోరెన్సిక్, వాంగ్మూల ఆధారాలను సక్రమంగా సేకరించి, భద్రపరిచి, పరిశీలించేలా చూడాలని పోలీసు అధికారులను ఛైర్మన్ కోరారు. చట్టప్రకారం ఎక్కడ అవసరమైతే అక్కడ విద్యార్థులు, అధ్యాపకులు, సంస్థ అధికారులు, సంబంధిత సమాచారం ఉన్న ఇతర వ్యక్తుల వాంగ్మూలాలను నమోదు చేయాల్సిన అవసరాన్ని కూడా కమిషన్ చెప్పింది.

ఈ అంశంపై తదుపరి పరిశీలన నిమిత్తం సాధ్యమైనంత త్వరగా సమగ్రమైన ‘చర్యలు తీసుకున్న నివేదిక’ను (యాక్షన్ టేకెన్ రిపోర్ట్) జాతీయ ఎస్సీ కమిషన్‌కు సమర్పించాలని సంబంధిత అధికారులను గౌరవ ఛైర్మన్ ఆదేశించారు.

అనంతరం సాహిల్ వాకోడే తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులను కలిసిన ఛైర్మన్.. వారి ఆవేదనను, ఆందోళనలను వివరంగా విన్నారు. విద్యార్థి మృతికి దారితీసిన పరిస్థితులపై తమ ఆరోపణలను కుటుంబ సభ్యులు కమిషన్ ముందుంచారు. ఈ సందర్భంగా.. కమిషన్ తగిన జోక్యం చేసుకోవాలని కోరుతూ ఒక రాతపూర్వక ఫిర్యాదును అందజేశారు.

రాజ్యాంగం, చట్టపరమైన నిబంధనల ప్రకారం ఈ అంశాన్ని కమిషన్ పరిశీలిస్తుందని కుటుంబ సభ్యులకు ఎన్‌సీఎస్‌సీ ఛైర్మన్ శ్రీ కిషోర్ మక్వానా హామీ ఇచ్చారు. దర్యాప్తు పురోగతిని కమిషన్ నిశితంగా పరిశీలిస్తుందని.. వెలుగులోకి వచ్చే వాస్తవాలు, సాక్ష్యాల ఆధారంగా తన అధికార పరిధిలో తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

షెడ్యూల్డ్ కులాల సభ్యులకు లభించిన రాజ్యాంగ, చట్టబద్ధమైన రక్షణలకు సమర్థవంతమైన పరిరక్షణ ఉండాలని.. ప్రతిష్ఠాత్మక సంస్థల్లో గౌరవం, సమానత్వం, వివక్ష లేకపోవడం, విద్యార్థుల సంక్షేమం, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కారం కోసం తగిన యంత్రాంగాలు ఉండాలని కమిషన్ పునరుద్ఘాటించింది.

అన్ని ఆరోపణలను నిష్పాక్షికంగా, పారదర్శకంగా, సముచితమైన ప్రక్రియ ప్రకారం పరిశీలించేలా చూస్తూనే సామాజిక ఐక్యత, సఖ్యతను కాపాడటానికి ఉన్న ప్రాముఖ్యతను కూడా కమిషన్ ప్రధానంగా పేర్కొంది.

మహారాష్ట్రలోని ఎన్‌సీఎస్‌సీ రాష్ట్ర కార్యాలయ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ బాబు, ఢిల్లీలోని ఎన్‌సీఎస్‌సీ ప్రధాన కార్యాలయ ఏపీసీఆర్ (అట్రాసిటీస్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్) విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఆర్. స్టాలిన్, ఎన్‌సీఎస్‌సీ రాష్ట్ర కార్యాలయ అధికారులు ఎన్‌సీఎస్‌సీ ఛైర్మన్‌తో పాటు ఉన్నారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2314734) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Marathi