శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
బయోఈ3 కింద జీవ ఆధారిత బయోడీగ్రేడెబుల్ ప్లాస్టిక్ వాణిజ్య వినియోగాన్ని అధికారికంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
దేశంలో లభించే పలు వ్యవసాయ, సేంద్రీయ వ్యర్థాల నుంచి అత్యాధునిక బయోటెక్నాలజీ ద్వారా విలువైన పర్యావరణహిత ఉత్పత్తుల తయారీ
వ్యర్థాల నుంచి సంపద సృష్టి... పర్యావరణానికి హాని చేయని సరికొత్త పరిశ్రమలు, స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు
ఆహార వనరుగా ఉన్న చెరకును సుస్థిర పదార్థాలుగా ఎలా మార్చవచ్చో ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని పిలుపు
దేశాన్ని సరికొత్త పర్యావరణహిత, సుస్థిరమైన తయారీ రంగం దిశగా ముందుకు నడిపించనున్న పీఎల్ఏ ఆధారిత బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్
రూ. 75 కోట్ల బయోఈ3 గ్రాంట్ మద్దతుతో బలరాంపూర్ చీనీ మిల్స్ ద్వారా ఏటా 100 టన్నుల సామర్థ్యంతో పీఎల్ఏ, కో-పాలిమర్స్ తయారీ కోసం పైలట్ కేంద్రం ఏర్పాటు
నాడు పోస్టు చేయడమైనది:
24 SEP 2026 5:57PM by PIB Hyderabad
పాలీలాక్టిక్ యాసిడ్ ఆధారిత బయోడీగ్రేడెబుల్ ప్లాస్టిక్ వాణిజ్య వినియోగాన్ని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. ఇది అత్యాధునిక సుస్థిర తయారీ రంగం దిశగా భారత్ పరివర్తనలో కీలక ముందడుగు.
ప్రభుత్వ బయోఈ3 (ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, ఉపాధి కోసం బయోటెక్నాలజీ) విధానంలో భాగంగా, బలరాంపూర్ చీనీ మిల్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. ఇది బయోటెక్నాలజీ, సుస్థిర తయారీ రంగం, వాణిజ్య విధానానికి మారడాన్ని ఒకే చోటికి చేర్చుతోంది. అత్యాధునిక జీవ-ఆధారిత వస్తువులను అభివృద్ధి చేయడానికి, వాటిని వాణిజ్యపరమైన ఉత్పత్తి దిశగా నడిపించడానికి ఈ ప్రాజెక్టు తోడ్పడుతోంది. దీని కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పరిధిలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ అందించిన రూ. 75 కోట్ల గ్రాంట్, ఏటా 100 టన్నుల (100 టీపీఏ) సామర్థ్యం గల పీఎల్ఏ, కో-పాలిమర్స్ పైలట్-స్థాయి పరిశోధనాభివృద్ధి కేంద్రానికి పూర్తి మద్దతుగా నిలుస్తోంది.
కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని బయోటెక్నాలజీ విభాగంలో ఈ సరికొత్త ప్రాజెక్టును అధికారికంగా ఆవిష్కరించారు. సుస్థిరమైన పర్యావరణహిత ఉత్పత్తుల అభివృద్ధి, వాటి విస్తరణ కోసం ఉద్దేశించిన ఈ పీఎల్ఏ, కో-పాలిమర్ సాంకేతికతలకు సంబంధించిన పైలట్ కేంద్రాన్ని... ఉత్తరప్రదేశ్‌లోని కుంభీలో గల బలరాంపూర్ చీనీ మిల్స్ సమీకృత తయారీ భవన సముదాయంలో ఏర్పాటు చేయనున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ... భారత బయోఎకానమీ ప్రయాణంలో ఈ ప్రాజెక్టు ఒక కీలక మైలురాయి అవుతుందని కొనియాడారు. బయోటెక్నాలజీ రంగం కేవలం ల్యాబ్ పరిశోధనలకే పరిమితం కాకుండా... మార్కెట్ ఉత్పత్తులుగా మారడం, సుస్థిర తయారీ రంగంగా ఎదగడం, సరికొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడం దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ఆయన పేర్కొన్నారు. 2014లో దాదాపు 10 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత బయోఎకానమీ... నేడు దాదాపు 195 బిలియన్ డాలర్లకు పెరిగిందన్నారు. ఇది దేశంలో బయోటెక్నాలజీ ఆధారిత ఆర్థిక కార్యకలాపాల వేగవంతమైన వృద్ధికి నిదర్శనమని ఆయన వెల్లడించారు. రాబోయే కాలంలో శాస్త్రీయ సామర్థ్యాలను వాణిజ్యపరంగా లాభదాయకమైన ఉత్పత్తులుగా, సాంకేతికతలుగా మార్చడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ సరికొత్త బయో-ప్లాస్టిక్ ప్రాజెక్టు... ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి హాని చేయని తయారీ పద్ధతుల వైపు మార్పులో భారత్‌ను ముందంజలో నిలపడంలో సహాయపడుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. మన దేశ శాస్త్రవేత్తల ప్రతిభను, పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యంతో జోడించి పర్యావరణ సమస్యలను పరిష్కరిస్తూనే... విలువైన వస్తువులను ఎలా తయారు చేయవచ్చో ఈ ప్రాజెక్టు నిరూపిస్తోందని ఆయన వివరించారు. బయోటెక్నాలజీ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలవడానికి, ఇతర దేశాల పర్యావరణ సమస్యలకు సరైన పరిష్కారాలను చూపే స్థాయికి ఎదగడానికి ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ "వ్యర్థాల నుంచి సంపద" (వేస్ట్ టు వెల్త్) అనే అంశంపై ప్రధానంగా మాట్లాడారు. దేశంలో ఉన్న వైవిధ్యం వల్ల, వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రకాల వ్యవసాయ, సేంద్రీయ వ్యర్థాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల వ్యర్థాలను ఉపయోగకరమైన వస్తువులుగా మార్చడానికి వేర్వేరు సాంకేతికతలు, పద్ధతులు అవసరమవుతాయని ఆయన తెలిపారు. ఏ ప్రాంతానికి తగిన బయోటెక్నాలజీని ఆ ప్రాంతంలో ఉపయోగించడం ద్వారా, స్థానికంగా దొరికే వ్యర్థాలను సంపదగా మార్చవచ్చని.. ఆయా ప్రాంతాల అభివృద్ధికి సరికొత్త అవకాశాలనూ సృష్టించవచ్చని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
"ప్రకృతిలో వృథా అంటూ ఏదీ లేదు" అని డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. మనం చెత్తగా భావించే వస్తువుల్లోనూ దాగి ఉన్న గొప్ప విలువను శాస్త్ర సాంకేతిక రంగాల ద్వారా వెలికితీయవచ్చని ఆయన అన్నారు. జీవ వనరులు, రీసైక్లింగ్, సేంద్రీయ వ్యర్థాలను ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మార్చడంలో దేశానికి ఉన్న విభిన్న అనుభవం.. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉపయోగపడే సరికొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన దేశానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తోందని ఆయన వివరించారు.
పరిశోధనలను కేవలం ప్రయోగశాలలకే పరిమితం చేయకుండా, ప్రారంభ దశలోనే వాటిని వాణిజ్య ఉత్పత్తులుగా మార్చాలని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు. ఇందుకోసం పైలట్ కేంద్రాలు, ప్రయోగాల వాలిడేషన్, నైపుణ్యం గల మానవ వనరులు, పరిశ్రమల భాగస్వామ్యం ద్వారా సాంకేతికతలను మార్కెట్లోకి తీసుకురావాలని ఆయన అన్నారు. ఈ పీఎల్ఏ కేంద్రం భవిష్యత్తులో అధిక విలువైన వస్తువుల తయారీకి అవసరమైన పాలిమర్స్‌ను అభివృద్ధి చేయడానికి, యువతకు ప్రత్యేక నైపుణ్య శిక్షణనివ్వడానికి, పెద్ద ఎత్తున వాణిజ్య ఉత్పత్తికి అవసరమైన జ్ఞానాన్ని, అనుభవాన్ని అందించే ఒక అద్భుతమైన వేదికగా మారుతుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
ఏటా 100 టన్నుల (100 టీపీఏ) ఉత్పత్తి సామర్థ్యం గల ఈ పైలట్ పరిశోధనాభివృద్ధి కేంద్రం... ప్రత్యేక రకాల పీఎల్ఏ గ్రేడ్‌లను, అధిక విలువైన వస్తువుల తయారీకి ఉపయోగపడే అధునాతన పీఎల్ఏ కో-పాలిమర్స్‌ను అభివృద్ధి చేయడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇది వ్యాపారానికి అవసరమైన ఆర్థిక-సాంకేతిక డేటాను, తయారీ విధాన నైపుణ్యాలను అందిస్తూనే... కొత్త ఉత్పత్తుల రూపకల్పనకు, కస్టమర్ల వాలిడేషన్‌కు పూర్తి మద్దతునిస్తుంది. విదేశీ సాంకేతికతలపై ఆధారపడుటను తగ్గించడం కోసం స్వదేశీ సాంకేతికతలను ప్రోత్సహించడంతో పాటు, భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున వాణిజ్య ఉత్పత్తిని చేపట్టడానికి ఈ కేంద్రం దోహదపడుతుంది. ఈ కార్యక్రమం పరిశ్రమలు, విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థల మధ్య పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
బయోటెక్నాలజీ గురించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో విస్తృతంగా వివరించాలని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. మనం నిత్య జీవితంలో చూసే చెరకు వంటి వ్యవసాయ వనరులను, కేవలం ఆహార అవసరాలకే కాకుండా పర్యావరణానికి మేలు చేసే రకరకాల వస్తువుల తయారీకి ఎలా వాడుతున్నారో ప్రజలకు కథల రూపంలో వివరించాలనీ ఆయన సూచించారు. ఇటువంటి ప్రచారం ద్వారా బయోటెక్నాలజీ విలువను ప్రజలు సులభంగా గ్రహిస్తారనీ, ఈ సరికొత్త పద్ధతులను వేగంగా అలవర్చుకుంటారన్నారు. దీని ద్వారా మన దేశీయ సాంకేతికతలతో తయారైన ఉత్పత్తుల వాణిజ్య విక్రయాలకు ఎంతగానో మద్దతు లభిస్తుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ "వోకల్ ఫర్ లోకల్ అండ్ గ్లోబల్" విధానంతో ముడిపెడుతూ... భారత్ సొంతంగా వాణిజ్య ఉత్పత్తి సామర్థ్యాలను పెంపొందించుకోవాలని, స్థానికంగా అభివృద్ధి చేసిన విజయవంతమైన సాంకేతికతలను ప్రపంచ మార్కెట్లకు తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక వృద్ధి, పర్యావరణ సుస్థిరత, ఉపాధి లక్ష్యాలను ఒకేసారి ముందుకు తీసుకెళ్లడానికి బయోఈ3 విధానం ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన స్పష్టం చేశారు
ఈ పీఎల్ఏ ప్రాజెక్టు భారత బయో-ఆధారిత తయారీ రంగంలో ఒక పెద్ద మార్పునకు శ్రీకారం చుట్టింది. బలరాంపూర్ చీనీ మిల్స్ చేపట్టిన ఈ వాణిజ్య ప్రాజెక్టు... పునరుత్పాదక చక్కెర ముడిసరుకును పీఎల్ఏ, బయో-ప్లాస్టిక్స్‌గా మార్చడం ద్వారా వ్యవసాయ వనరులను పర్యావరణహిత ఉత్పత్తులుగా మారుస్తోంది. ఈ కంపెనీ తన వాణిజ్య పీఎల్ఏ కేంద్రాన్ని ఒక పెద్ద పారిశ్రామిక స్థాయి బయో-ప్లాస్టిక్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతుండగా... ప్రభుత్వం బయోఈ3 ద్వారా మద్దతునిస్తున్న పైలట్ కేంద్రం తదుపరి తరం పీఎల్ఏ గ్రేడ్‌లు, కో-పాలిమర్ల కోసం ఒక వినూత్న పరిశోధనాభివృద్ధి వేదికగా పనిచేయనుంది.
ఈ సందర్భంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కార్యదర్శి, డీజీ-బీఆర్ఐసీ, బీఆర్ఐసీ చైర్మన్ డాక్టర్ రాజేష్ సుధీర్ గోఖలే మాట్లాడుతూ... ఈ కార్యక్రమం బయోటెక్నాలజీని కేవలం ల్యాబ్ పరిశోధనలకే పరిమితం చేయకుండా ప్రయోగపూర్వక పద్ధతులు, పైలట్ కేంద్రాలు, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక స్థాయి ఉత్పత్తితో కూడిన ఒక సమగ్ర తయారీ వ్యవస్థ దిశగా ముందుకు నడిపిస్తోందన్నారు. చక్కెర, ఇతర బయోమాస్ వంటి జీవ వనరులను లాక్టిక్ యాసిడ్, అధిక విలువైన బయోపాలిమర్స్‌గా మార్చడం ద్వారా... ఈ ప్రాజెక్టు ఇథనాల్‌కు మించిన ఒక సరికొత్త వాల్యూ చెయిన్‌ను సృష్టిస్తుందని ఆయన వివరించారు. ఇది సుస్థిర అభివృద్ధి, ఉపాధి కల్పన, ప్రాంతీయ వృద్ధికి ఎన్నో కొత్త అవకాశాలను అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కార్యదర్శి, డీజీ-బీఆర్ఐసీ, బీఆర్ఐసీ చైర్మన్ డాక్టర్ రాజేష్ సుధీర్ గోఖలే, డీబీటీ సైంటిస్ట్-హెచ్, బీఐఆర్ఏసీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ధనంజయ్, డీబీటీ సంయుక్త కార్యదర్శి శ్రీమతి ఏక్తా విష్ణోయ్, డీబీటీ నుంచి డాక్టర్ కలైవాణి గణేశన్, బీఐఆర్ఏసీకి చెందిన డాక్టర్ శిల్పి గుప్తా, బలరాంపూర్ చీనీ మిల్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి అవంతిక సరయోగి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు.
బయోఈ3 మద్దతుగల ఈ కార్యక్రమం... అధునాతన జీవ ఆధారిత పదార్థాల అభివృద్ధి, వాణిజ్యీకరణను వేగవంతం చేస్తుందని... భారత స్వదేశీ జీవ సంబంధిత ఉత్పాదక సామర్థ్యాలను బలోపేతం చేస్తుందని... సుస్థిరమైన, ఉపాధిని కల్పించే, ప్రపంచంతో పోటీపడగల జీవ ఆర్థిక వ్యవస్థ ఆవిర్భావానికీ తోడ్పడుతుందని భావిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2314730)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7