శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తదుపరి తరం మల్టీసెన్సర్‌ ఉపగ్రహ సాంకేతికత అభివృద్ధికి గెలాక్స్ఐతో రూ.63.84 కోట్ల ఆర్‌డీఐ మద్దతు ఒప్పందంపై సంతకం చేసిన టీడీబీ - డీఎస్‌టీ


అధిక రిజల్యూషన్‌ భూ పరిశీలన కోసం ఎస్ఏఆర్‌, ఆప్టికల్‌ ఇమేజింగ్‌ను సమన్వయం చేసే స్వదేశీ ఆప్టోఎస్ఏఆర్‌ సాంకేతికత

నాడు పోస్టు చేయడమైనది: 24 SEP 2026 3:54PM by PIB Hyderabad

వ్యూహాత్మక, నిరంతరం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో ప్రైవేట్ రంగ పరిశోధన, అభివృద్ధిని  వేగవంతం చేసేందుకు కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహంలో భాగంగా, సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (డీఎస్టీ) పరిధిలోని సాంకేతిక అభివృద్ధి మండలి (టీడీబీ )  బెంగళూరుకు చెందిన '  గెలాక్స్ఐ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా పరిశోధన, అభివృద్ధి ఆవిష్కరణల (ఆర్డిఐ) నిధి కింద ఆ సంస్థకు రూ. 63.84 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తారు.

మొత్తం రూ. 247.69 కోట్ల ఆమోదిత వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్, అధిక రిజల్యూషన్ (<0.5 మీటర్లు) కలిగిన ఆప్టోసార్  మల్టీసెన్సార్ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేయడం, ఈ సాంకేతికతను టిఆర్ఎల్-6 స్థాయి నుంచి టిఆర్ఎల్-9 స్థాయికి తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆప్షనల్లీ కన్వర్టిబుల్ డిబెంచర్ల (ఓసీడీ)  ద్వారా ఈ ఆర్థిక సహాయం అందిస్తారు. భూమిని పరిశీలించే రెండు భిన్నమైన పద్ధతులైన సింథటిక్ ఎపర్చర్ రాడార్ (ఎస్ఏఆర్),  ఎలక్ట్రో - ఆప్టికల్ (ఈఓ) ఇమేజింగ్‌లను ఒకే చోటికి తీసుకురావడమే గెలాక్స్ఐ ప్రాజెక్ట్‌లో కీలకమైన ఆప్టోసార్ ప్రధాన ప్రత్యేకత.

ఆప్టికల్ ఇమేజింగ్ అత్యంత స్పష్టమైన దృశ్య సమాచారాన్ని అందించినప్పటికీ దాని పనితీరు మేఘావృత వాతావరణం, వెలుతురు లేమి వల్ల ప్రభావితమవుతుంది. కానీ, సింథటిక్ ఎపర్చర్ రాడార్ పగటి వెలుతురుతో సంబంధం లేకుండా, మేఘాలను సైతం అధిగమించి ఇమేజింగ్ సేకరించగలదు. ప్రతిపాదిత వ్యవస్థ ఎస్ఏఆర్, ఈఓ  డేటాను ఒకే చోటికి చేర్చడం ద్వారా ఈ రెండింటి పరస్పర సామర్థ్యాలను మిళితం చేసి, భూమికి సంబంధించిన మరింత స్పష్టమైన, నిరంతరాయమైన సమాచారాన్ని అందిస్తుంది.

ప్రతిపాదిత ఉపగ్రహాన్ని 0.5 మీటర్ల కంటే తక్కువ  స్పష్టత కలిగిన హై రిజల్యూషన్ చిత్రాలను అందించేలా రూపొందించారు. వివిధ రకాల వాతావరణ, వెలుతురు పరిస్థితులలో చిత్రాలను సేకరిస్తూనే... విస్తృత ప్రాంత పర్యవేక్షణ, సుదూర నిఘా, మానవులు, వాహనాల గుర్తింపు, అలాగే లక్ష్యాల వర్గీకరణ వంటి అనువర్తనాలకు మద్దతు ఇవ్వడం ఈ సాంకేతికత ముఖ్య ఉద్దేశం.

ఒక ముఖ్యమైన సాంకేతిక పరిపక్వత రంగానికి ఈ ప్రాజెక్ట్ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆర్డీఐ నిధుల మద్దతు ద్వారా గెలాక్స్ఐ  సంస్థ తన సాంకేతికతను టీఆర్ఎల్-6 స్థాయి నుంచి టీఆర్ఎల్ - 9  స్థాయికి తీసుకెళ్లడానికి అవసరమైన తదుపరి అభివృద్ధి, ఇంజినీరింగ్, పరీక్షలు, ప్రామాణీకరణ ప్రక్రియలను చేపట్టడానికి దోహదపడుతుంది.

టీడీబీ కార్యదర్శి శ్రీ రాజేష్‌ కుమార్‌ పాఠక్‌ మాట్లాడుతూ, “భారత్ అంతరిక్ష వ్యవస్థలో కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. అధునాతన సాంకేతికతలను దేశీయంగా అభివృద్ధి చేసి, అమలు చేయగల సామర్థ్యం రానున్న రోజుల్లో మరింత కీలకం కానుంది. అధునాతన అభివృద్ధి దశ నుంచి అమలు దశకు చేరుకునే మధ్య కీలక దశల్లో సాంకేతికత ఆధారిత ప్రయత్నాలకు మద్దతు అందించేందుకు ఆర్‌డీఐ ఫండ్‌ ఒక ముఖ్యమైన వ్యవస్థను అందిస్తోంది. గెలాక్స్ఐతో కుదిరిన ఈ ఒప్పందం అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష సాంకేతికతల్లో దేశీయ సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు, వాటిని వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావడం పట్ల టీడీబీ దృష్టిని ప్రతిబింబిస్తోంది” అని అన్నారు.

గెలాక్స్ఐ స్పేస్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ సంస్థ ప్రమోటర్లు మాట్లాడుతూ, “ఆర్‌డీఐ ఫండ్‌ కింద టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ బోర్డు అందిస్తున్న సహకారం మా ఆప్టోఎస్ఏఆర్‌ సాంకేతికత అభివృద్ధి, ధ్రువీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు దోహదపడుతుంది. ఎస్ఏఆర్‌, ఆప్టికల్‌ సెన్సింగ్‌ సాంకేతికతలను సమన్వయం చేయడం ద్వారా విస్తృత వాతావరణ, వెలుతురు పరిస్థితుల్లో అధిక రిజల్యూషన్‌ సమాచారాన్ని అందించగల భూ పరిశీలన సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు మేం కృషి చేస్తున్నాం. ఈ సాంకేతికతను టీఆర్ఎల్‌–9 స్థాయికి తీసుకెళ్లడంతో పాటు, అనంతరం వినియోగంలోకి తీసుకురావడంలో ఈ భాగస్వామ్యం కీలకంగా ఉంటుంది” అని తెలిపారు.

 

***


(రిలీజ్ ఐడి: 2314725) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी