విద్యుత్తు మంత్రిత్వ శాఖ
పరిశ్రమ, పరిశోధన, ఇంధనం పై యూరోపియన్ పార్లమెంటరీ కమిటీ (ఐటీఆర్ఈ) తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించిన కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద్ నాయక్
నాడు పోస్టు చేయడమైనది:
24 SEP 2026 5:53PM by PIB Hyderabad
కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద్ నాయక్ ఈ రోజు న్యూఢిల్లీలో యూరోపియన్ పార్లమెంట్ కు చెందిన పరిశ్రమ, పరిశోధన, ఇంధన కమిటీ (ఐటీఆర్ఈ) ప్రతినిధి బృందంతో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. విద్యుత్ రంగంలో భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించడంతో పాటు, దాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
ఇంధన భద్రత, విద్యుత్ రంగ మార్పు, తక్కువ కార్బన్ ఉద్గారాల అభివృద్ధి, అణుశక్తి, కార్బన్ మార్కెట్లు, నూతన సాంకేతికతల అభివృద్ధి వంటి పలు అంశాలపై సమావేశంలో చర్చలు జరిగాయి. ప్రస్తుతం కొనసాగుతున్న బహుముఖ కార్యక్రమాలపై అభిప్రాయాల మార్పిడితో పాటు భారత్ - ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో సాధించిన గణనీయమైన పురోగతి సహా స్థిరంగా బలోపేతమవుతున్న భారత్ - ఈయూ సంబంధాల ఆధారంగా సహకారాన్ని మరింత పెంపొందించే మార్గాలపై వేర్వేరు కోణాల్లో విస్తృతంగా చర్చించారు.
భారత్‌లో వేగంగా మారుతున్న విద్యుత్ రంగం గురించి, స్థిరమైన, విశ్వసనీయమైన, భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా ఉండే ఇంధన వ్యవస్థను నిర్మించేందుకు దేశం చేస్తున్న ప్రయత్నాల గురించి శ్రీ శ్రీపాద్ నాయక్ వివరించారు. నిర్ణీత వ్యవధి కంటే ముందే భారత్ ఎన్‌డిసి లక్ష్యాలను సాధించిందని, శిలాజయేతర ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని వేగంగా విస్తరిస్తోందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ ప్రసార, పంపిణీ మౌలిక సదుపాయాల బలోపేతం, ఇంధన నిల్వ, స్మార్ట్ గ్రిడ్ పరిష్కారాల అమలు, అణుశక్తి, విద్యుత్ సామర్థ్యం, గ్రీన్ హైడ్రోజన్ రంగాలలో దేశం సాధిస్తున్న పురోగతిని ఆయన వివరించారు.
దీర్ఘకాలిక ఇంధన నిల్వ, డిజిటల్ విద్యుత్ వ్యవస్థ సాంకేతికతలు, హరిత హైడ్రోజన్, కార్బన్ సేకరణ. - వినియోగం - నిల్వ, చిన్న మోడ్యులర్ రియాక్టర్లు సహా అణు సాంకేతికతలు వంటి నూతన అభివృద్ధి రంగాలు, కొత్తగా వస్తున్న అవకాశాలలో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించడంపై రెండు పక్షాలు సమగ్రంగా చర్చించాయి. కార్బన్ మార్కెట్లు, మారుతున్న కార్బన్ ధరల విధానంపై కూడా వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో కార్బన్ సరిహద్దు సర్దుబాటు యంత్రాంగం (సీబీఏఎం) కూడా ఉంది.
ఈ సమావేశం భారత్ - యూరోపియన్ యూనియన్ భాగస్వామ్యంలో ఇంధనం, విద్యుత్ సహకార కీలక ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటించింది. సురక్షితమైన, ప్రతికూల పరిస్థితులను తట్టుకునే, సుస్థిరమైన ఇంధన వ్యవస్థల నిర్మాణానికి మద్దతుగా నిరంతర సంప్రదింపులు, నైపుణ్యాల పరస్పర మార్పిడి, సాంకేతిక, సంస్థాగత సహకారాన్ని మరింతగా విస్తరించేందుకు ఇరుపక్షాలు తమ నిబద్ధతను వ్యక్తం చేశాయి.
***
(రిలీజ్ ఐడి: 2314707)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13