రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

‘సరికొత్త ప్రపంచం కోసం ఆధ్యాత్మిక జాగృతి’ ప్రచార ఉద్యమాన్ని గుజరాత్.. వడోదరాలో ప్రారంభించిన రాష్ట్రపతి..


‘గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్’ రిట్రీట్ సెంటర్‌కు ప్రారంభోత్సవం

నాడు పోస్టు చేయడమైనది: 23 SEP 2026 10:15PM by PIB Hyderabad

సరికొత్త ప్రపంచం కోసం ఆధ్యాత్మిక జాగృతి’ పేరిట బ్రహ్మ కుమారీలు చేపట్టిన కార్యక్రమాన్ని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గుజరాత్.. వడోదరాలో ఈ రోజు, అంటే 2026 సెప్టెంబర్ 23న ప్రారంభించారు. ‘గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్’ రిట్రీట్ సెంటరును కూడా రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా, ‘‘వికసిత్ భారత్ కోసం యువత: దేశ నిర్మాణం కోసం అంతర్గత శక్తిని మేల్కొలపడం’’ పేరిట గుజరాత్.. నడియాద్‌లో బ్రహ్మ కుమారీలు చేపట్టిన మరో ప్రచార ఉద్యమాన్ని రాష్ట్రపతి దృశ్య మాధ్యమం సాయంతో ప్రారంభించారు.

సభను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ, ఒక్క ఆర్థిక అభివృద్ధే కాకుండా మానవ వికాసం కలగాల్సిన అవసరం కూడా ఉందన్నారు. మేధస్సును పెంపొందింపచేసే విద్యతో పాటు, జ్ఞానాన్ని మేల్కొలిపే విద్య మనకు కావాలని శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రగతి సాధన, దాంతో పాటు ప్రకృతి పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలని వివరించారు. ఇతరులను నియంత్రించడానికి బదులు స్వీయ నియంత్రణను నేర్పే శక్తిని మనం అలవరుచుకోవాలనీ, మానవులందరినీ కలిపే ఆధ్యాత్మికత ప్రధానమనీ రాష్ట్రపతి అన్నారు. ధ్యానం, ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా వ్యక్తిగత పరివర్తన, సరికొత్త ప్రపంచం అన్న సందేశాలను బ్రహ్మకుమారీలు ఒక్క భారత్‌లోనే గాక ప్రపంచంలో అనేక దేశాలకు చేరవేశారని తెలుసుకొని సంతోషించానని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు.  

 

మార్పును ఆహ్వానించే సామర్థ్యం  మనిషిలో ఉంటుందని రాష్ట్రపతి అన్నారు. వ్యక్తులు ఆలోచనలను, చేతలను మార్చుకోవడం వల్ల జీవితంలో మార్పును తీసుకురావడం సాధ్యపడుతుందని నమ్మితే, ఒక్క తమ లోపలే కాక పూర్తి సంఘంలో కూడా సకారాత్మక మార్పును తీసుకు రాగలిగే వారవుతారని శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ రోజు ప్రారంభించుకొన్న గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్‌.. రాబోయే కాలంలో విభిన్న వర్గాల వారు ఒక చోట చేరి శాంతియుతంగా, సద్భావనతో నడుచుకొనే కేంద్రంగా మారుతుందని తాను నమ్ముతున్నానని రాష్ట్రపతి అన్నారు.

‘‘వికసిత్ భారత్ కోసం యువత: దేశ నిర్మాణం కోసం అంతర్గత శక్తిని మేల్కొలపడం’’ పేరిట చేపట్టిన ప్రచార ఉద్యమాన్ని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జన్మస్థలమైన నడియాద్‌లో దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించినందుకు ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్రపతి అన్నారు. యువతరం తమ ఆలోచనలను, భావోద్వేగాలను, చేతలను సకారాత్మకమైనవిగా ఉండేటట్లు చూసుకొంటే ఏర్పడే ప్రభావం కుటుంబంపై, పనిప్రదేశంపై, సమాజంపై, చివరికి పూర్తి దేశంపై పడుతుందని శ్రీమతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఇందువల్ల, ‘‘అంతర్గత శక్తిని మేల్కొలపడం’’ వ్యక్తిగత వికాస సందేశాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా, దేశ నిర్మాణానికి సంబంధించిన విస్తృత ప్రక్రియని రాష్ట్రపతి అన్నారు. యువతకు సాధికారతను కల్పించడం మన అందరి బాధ్యతని రాష్ట్రపతి స్పష్టం చేశారు. వారిని స్వయంసమృద్ధి కలిగిన, శాంతిని కోరుకొనే, బాధ్యతాయుత పౌరులుగా మనం తప్పక తీర్చిదిద్దాలని శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు.

వ్యక్తిలో పరివర్తన కలిగితే, అది సమాజ పరివర్తనకు పునాదిని వేస్తుందని భావిస్తారని రాష్ట్రపతి గుర్తు చేశారు. ప్రస్తుతం, ఈ ఘన వారసత్వాన్ని ఆధునిక జీవితావసరాలతో సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆర్థికంగా సంపన్నమైన, విజ్ఞానశాస్త్రపరంగా ఆధునికమైన, ఆధ్యాత్మికంగా జాగృతమైన భారత్‌ను ఆవిష్కరించడమే మన లక్ష్యం కావాలని రాష్ట్రపతి ఉద్బోధించారు.

రాష్ట్రపతి ప్రసంగం ఇక్కడ:

Please click here to see the President's Speech- 

 

***


(రిలీజ్ ఐడి: 2314346) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati