కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

టెలికమ్యూనికేషన్ల విభాగం ఆధ్వర్యంలో బెంగళూరులో మూడో రౌండ్‌టేబుల్ సమావేశం… పెట్టుబడులు, ఆవిష్కరణలు, దేశీయంగా తయారీపై దృష్టి


కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ అధ్యక్షతన బెంగళూరులో పెట్టిబడిదారుల రౌండ్‌టేబుల్ సమావేశం

గ్వాలియర్ టెలికాం తయారీ కేంద్రంలో రూ.5,500 కోట్ల పెట్టుబడికి ఇప్పటికే ముందుకు వచ్చిన 24 కంపెనీలు: కేంద్రమంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా

దేశీయంగా టెలికాం తయారీ, ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేయటంపై పరిశ్రమల భాగస్వామ్యం దృష్టి… గ్వాలియర్‌లోని టీఎంజడ్ కోసం బెంగళూరు పెట్టుబడిదారుల రోడ్ షోలో సుమారు రూ.700 కోట్ల కేటాయింపులు

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక కార్యక్రమాలైన ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియాకు అనుగుణంగా భారత తొలి సమగ్ర టెలికాం తయారీ జోన్ (టీఎంజడ్)

నాడు పోస్టు చేయడమైనది: 22 SEP 2026 9:45PM by PIB Hyderabad

బెంగళూరులో ఇవాళ పెట్టుబడిదారుల మూడో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని టెలికమ్యూనికేషన్ల విభాగం (డీఓటీ) నిర్వహించింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఏర్పాటుకానున్న భారతదేశ తొలి సమీకృత టెలికాం తయారీ జోన్ (టీఎంజీ)లోని పెట్టుబడి అవకాశాలపై ప్రముఖ సాంకేతిక, టెలికాం, సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల భాగస్వాములతో చర్చలు జరిగాయి.

 

ఈ రౌండ్‌టేబుల్ సమావేశానికి కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ అధ్యక్షత వహించారు. దేశీయంగా టెలికాం తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయటం, విలువ జోడింపును పెంపొందించటం, పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలను ప్రోత్సహించటం, ఎగుమతులకు మద్దతివ్వటం, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే టెలికాం, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థను అభివృద్ధి చేయటంపై చర్చించేందుకు పరిశ్రమల ప్రముఖులను, ఆసక్తి గల పెట్టుబడిదారులను ఈ సమావేశం ఒకచోట చేర్చింది.

 

ఈ సందర్భంగా శ్రీ జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ… "టెలికాం తయారీ జోన్ సహకార సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ప్రభుత్వం కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 8,000 కోట్ల ప్రోత్సాహకాలు, రాయితీలను అందిస్తోంది. ఇటువంటి సహకార దృక్పథమే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పెట్టటానికి, నూతన ఆవిష్కరణలు చేయటానికి, వ్యాపార విస్తరణకు కావలసిన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది" అని అన్నారు.

"భారత్ ఇప్పుడు సేవా రంగం ఆధారిత దేశం నుంచి ఉత్పత్తి రంగం ఆధారిత దేశంగా మారుతోంది. టెలికాం రంగంలోనూ మా ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయి. దేశీయంగా విలువ జోడింపును పెంచటం, భారత్‌లోనే మేధో సంపత్తిని సృష్టించటం, భారత్ లో డిజైన్ చేసి, తయారు చేసిన ఉత్పత్తులను ప్రపంచంలోని ప్రతీ ప్రాంతానికి చేర్చటం. సెమీకండక్టర్ల నుంచి విమానయాన రంగం వరకు ప్రతి రంగంలోనూ ఆత్మనిర్భర్ భారత్ ప్రయాణం ఊపందుకోవటం మనం చూశాం. తదుపరి రంగం టెలికాం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక కార్యక్రమాలు మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ ద్వారా డిజైన్ ఇన్ ఇండియాను సాధించి, ప్రపంచంతో పోటీపడే ఉత్పత్తులను మనం తయారుచేయాలి" అని కేంద్రమంత్రి అన్నారు.

"నేటి బెంగళూరు రోడ్‌షోతో పెట్టుబడిదారుల సేకరణ మొదటి దశ పూర్తయింది. ఇప్పటికే దాదాపు 24 కంపెనీలు భాగస్వాములయ్యాయి. మా నిబద్ధత చాలా స్పష్టమైనది. టీఎంజడ్ కి సంబంధించి ఏ పెట్టుబడిదారుడికైనా సందేహాలు, సమస్యలుంటే 48 గంటల్లోగా పరిష్కరించేందుకు మేం కృషి చేస్తాం. గ్వాలియర్‌ను కేవలం ఒక తయారీ కేంద్రంగా మాత్రమే కాక, పరిశ్రమలకు బాధ్యతాయుతమైన ప్రభుత్వ భాగస్వామి లభిస్తుందనే విశ్వసనీయమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం" అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

"వ్యూహాత్మక స్థానం, మౌలిక వసతుల అండతో పలు రంగాల్లో పెట్టుబడులకు బలమైన గమ్యస్థానంగా మధ్యప్రదేశ్ ఎదుగుతోంది. ముఖ్యంగా అత్యాధునిక సాంకేతికత, టెలికాం రంగాల్లో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఈ భాగస్వామ్యం ద్వారా కొత్త పెట్టుబడులు వస్తాయి. ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రపంచ ఆర్థిక అగ్రగామిగా మారేందుకు భారతదేశ ప్రయాణానికి ఇది దోహదపడుతుంది" అని విశ్వసిస్తున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ తెలిపారు.

టెలికాం తయారీ జోన్ ఆవిష్కరణ తర్వాత టెలికాం శాఖ చేపట్టిన నిరంతర పెట్టుబడిదారుల సమీకరణలో భాగంగా బెంగళూరు పెట్టుబడిదారుల రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.

జూలై 30, 2026న టెలికాం శాఖ, మధ్యప్రదేశ్ ప్రభుత్వం న్యూఢిల్లీలో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. దీనిద్వారా గ్వాలియర్‌లో భారతదేశ తొలి టెలికాం తయారీ జోన్, ఫేజ్-I ఏర్పాటవుతుంది. ఈ ఒప్పందం ప్రకారం... టెలికాం, ఎలక్ట్రానిక్స్ తయారీ, పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలు, అనుబంధ కార్యకలాపాల కోసం సమగ్ర మౌలిక సదుపాయాలతో వినియోగానికి సిద్ధంగా ఉండే పారిశ్రామిక క్లస్టర్ రూపుదిద్దుకుంటుంది. ఈ ఫేజ్-I కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 493 కోట్ల వ్యయాన్ని వంద శాతం సమకూరుస్తుండగా, మధ్యప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 170 ఎకరాల భూమిని ఉచితంగా అందిస్తూ, పెట్టుబడిదారులకు రాయితీలను కల్పిస్తోంది.

దీని తర్వాత ఢిల్లీ, ముంబైలో రెండు పెట్టుబడిదారుల రౌండ్‌టేబుల్ సమావేశాలు జరిగాయి. టెలికాం తయారీ జోన్ (టీఎంజడ్) ద్వారా సుమారు రూ.5,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు, 18,000 ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఈ సమావేశాల్లో పరిశ్రమ వర్గాలు హామీ ఇచ్చాయి.

టీఎంజడ్‌పై పెట్టుబడిదారుల ఆసక్తిని పెట్టుబడిదారుల మూడో రౌండ్‌టేబుల్ సమావేశం ప్రతిబింబించింది. యాజమాన్యాల పరిశీలన తర్వాత రూ. 700 కోట్ల నుంచి రూ. 800 కోట్ల మధ్య పెట్టుబడులను ప్రతిపాదించాయి. పలు కంపెనీలు ఈ పెట్టుబడులపై సానుకూలంగా స్పందించటంతో పరిశీలన నిమిత్తం ప్రాంతాల సందర్శన చేపట్టనున్నాయి.

ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ కలల సాకారానికి అనుగుణంగా టెలికాం తయారీ జోన్ రూపుదిద్దుకుంది. టెలికాం, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు, తయారీ, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలను వేగవంతం చేయటమే దీని ఉద్దేశం.

పెట్టుబడిదారుల రౌండ్‌టేబుల్ సమావేశానికి ముందు బెంగళూరులోని ప్రముఖ సాంకేతిక, టెలికాం కంపెనీ క్వాల్‌కామ్‌ను కేంద్రమంత్రి సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా కంపెనీ యాజమాన్యం, ఉన్నత ప్రతినిధులతో సమావేశమయ్యారు. టెలికాం సాంకేతికతల్లో వస్తున్న మార్పులు, సెమీకండక్టర్ సామర్థ్యాలు, స్వదేశీ ఉత్పత్తుల అభివృద్ధి, పరిశోధన, ఆవిష్కరణలతో పాటు భారత టెలికాం తయారీ రంగంలో సాంకేతిక సంస్థల భాగస్వామ్యాన్ని మరింత పెంచే అవకాశాలపై చర్చించారు.

 

టెలికాం పరికరాలు, సెమీకండక్టర్ సాంకేతికతలు, ఉత్పత్తి డిజైన్, పరిశోధన, అభివృద్ధి, తదుపరి తరం కమ్యూనికేషన్ సాంకేతికతల వంటి రంగాల్లో పరిశ్రమ అవసరాలను అర్థం చేసుకుని, బలమైన ప్రభుత్వ-పరిశ్రమ సహకారానికి మార్గాలను అన్వేషించేందుకు ఈ పారిశ్రామిక సందర్శన చక్కని అవకాశాన్ని కల్పించింది.

 

గ్వాలియర్ టెలికాం తయారీ జోన్ (టీఎంజడ్) గురించి

మొబైల్ పరికరాలు, ఆప్టికల్ ఫైబర్, టెలికాం పరికరాలు, తదుపరి తరం 5జీ, 6జీ సాంకేతికతలను కవర్ చేస్తూ... టెలికాం తయారీ, ఆర్ అండ్ డీ, ఆవిష్కరణల కోసం రూపొందించిన, వినియోగానికి సిద్ధంగా ఉండే సమీకృత పారిశ్రామిక క్లస్టరే గ్వాలియర్‌ టెలికాం తయారీ జోన్ (టీఎంజడ్). ఇటీవల కుదుర్చుకున్న ఎంఓయూ ప్రకారం… మొదటి దశ కోసం కేంద్ర ప్రభుత్వం 100 శాతం మద్దతిస్తూ రూ. 493 కోట్లను అందిస్తుండగా... మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి ఖర్చు లేకుండా సుమారు 170 ఎకరాల భూమితో పాటు పెట్టుబడిదారులకు పలు ప్రోత్సాహకాలను అందిస్తుంది.

దీనికోసం ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ)లో మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి 51 శాతం వాటా, టెలికమ్యూనికేషన్స్ విభాగానికి 49 శాతం వాటా ఉన్నాయి.

మరిన్ని వివరాలకు డీఓటీ హ్యాండిల్స్‌ను ఫాలో అవ్వండి:

ఎక్స్ - https://x.com/DoT_India

 

ఇన్‌స్టా https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ==

 

ఎఫ్‌బీ - https://www.facebook.com/DoTIndia

 

యూట్యూబ్: https://youtube.com/@departmentoftelecom?si=DALnhYkt89U5jAaa

 

***


(రిలీజ్ ఐడి: 2313866) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Kannada