బొగ్గు మంత్రిత్వ శాఖ
2014 నుంచి సీసీఎల్ ప్రయాణం: అధిక బొగ్గు ఉత్పత్తి నుంచి ఆధునిక మైనింగ్, సుస్థిర రవాణా, సమ్మిళిత అభివృద్ధి వరకు..
ఉత్పత్తి సామర్థ్యం విస్తరణ, యాంత్రీకరణ, రైలు అనుసంధానం, సాంకేతికత వినియోగం, పునరుత్పాదక ఇంధనం, ఆర్థిక బలోపేతం, సమాజాభివృద్ధిలో సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ దశాబ్ద కాల ప్రస్థానం
నాడు పోస్టు చేయడమైనది:
22 SEP 2026 12:52PM by PIB Hyderabad
భారత బొగ్గు రంగంలో 2014 నుంచి గణనీయమైన అభివృద్ధి చోటుచేసుకుంది. విధానపరమైన సంస్కరణలు, ప్రాజెక్టులకు అనుమతుల ప్రక్రియలో మెరుగుదల, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతికతను అందిపుచ్చుకోవడం, యాంత్రీకరణను పెంచడం, సామర్థ్యం, ఇంధన భద్రతపై మరింత దృష్టి వంటి చర్యలు ఈ మార్పునకు దోహదపడ్డాయి. జార్ఖండ్‌లోని బొగ్గు క్షేత్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) ఈ పరివర్తనకు ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలిచింది.
సీసీఎల్ కార్యకలాపాల్లో చోటుచేసుకున్న అభివృద్ధి స్థాయిని దాని బొగ్గు ఉత్పత్తి గణాంకాలు స్పష్టంగా తెలియజేస్తాయి. 2013–14 ఆర్థిక సంవత్సరంలో 50.0 మిలియన్ టన్నులుగా ఉన్న సీసీఎల్ బొగ్గు ఉత్పత్తి 2024–25 ఆర్థిక సంవత్సరంలో 87.5 మిలియన్ టన్నులకు పెరిగింది. ఇది సంస్థ చరిత్రలోనే అత్యధిక ఉత్పత్తి. అంటే 2013–14 నుంచి ఇప్పటివరకు సీసీఎల్ తన ఉత్పత్తిని దాదాపు 75 శాతం పెంచుకుంది. కొత్త, విస్తరణ ప్రాజెక్టుల ద్వారా అదనపు మైనింగ్ సామర్థ్యాన్ని సృష్టించడం సీసీఎల్ పరివర్తనలో కీలక అంశంగా నిలిచింది. ఈ కాలంలో అమ్రపాలి (35 ఎంటీవై), మగధ్ (51 ఎంటీవై), చంద్రగుప్త ఓసీపీ (15 ఎంటీవై), కోట్రే బసంత్‌పూర్ పచ్మో (5 ఎంటీవై) వంటి భారీ గనులను అభివృద్ధి చేశారు. కారో, కోనార్, నార్త్ ఉరిమారి తదితర ప్రస్తుత గనుల సామర్థ్యాలను కూడా విస్తరించారు. మరిన్ని కొత్త గనులు, విస్తరణ ప్రాజెక్టులు ప్రస్తుతం అమలు దశలో ఉన్నాయి. ఇవి రాబోయే సంవత్సరాల్లో సీసీఎల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుతాయని భావిస్తున్నారు.
పెరిగిన బొగ్గును వినియోగదారులకు సుస్థిరమైన, సమర్థవంతమైన రవాణా మార్గాల ద్వారా తరలించడం మరో ప్రధాన సవాలుగా నిలిచింది. అందువల్ల బొగ్గు తరలింపు, లాజిస్టిక్స్ రంగంలో కూడా సీసీఎల్ పరివర్తన స్పష్టంగా కనిపిస్తోంది. అధిక ఉత్పత్తికి సమర్థవంతమైన బొగ్గు తరలింపు మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా తోడవ్వాలని గుర్తించిన సంస్థ, రైల్వే అనుసంధానం, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లు (సీహెచ్‌పీలు), సైలోలు, వేగవంతమైన లోడింగ్ వ్యవస్థలు, ఫస్ట్ మైల్ కనెక్టివిటీ (ఎఫ్‌ఎంసీ) ప్రాజెక్టుల్లో దశలవారీగా పెట్టుబడులు పెట్టింది.
ఉత్తర కరణ్‌పురా బొగ్గు క్షేత్రాలకు అత్యంత కీలకమైన రైల్వే అనుసంధాన మార్గాల్లో ఒకటైన టోరి–శివ్‌పూర్ రైలు కారిడార్‌ను దశలవారీగా మరింత బలోపేతం చేశారు. మూడు రైల్వే లైన్లతో కూడిన ఈ కారిడార్ ఏటా సుమారు 100 మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. బొగ్గు రవాణాను మరింత సుస్థిరంగా, సమర్థవంతంగా మార్చేందుకు సీసీఎల్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లు, ఫస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తోంది. 7.5 ఎంటీవై సామర్థ్యం గల ఉత్తర ఉరిమారి సీహెచ్‌పీ ఇప్పటికే ప్రారంభమైంది. అభివృద్ధి దశలో ఉన్న ప్రధాన సీహెచ్‌పీ ప్రాజెక్టుల్లో కోనార్ (5 ఎంటీవై), కేడీహెచ్–పూర్ణాదిహ్ (7.5 ఎంటీవై), అమ్రపాలి (25 ఎంటీవై), కారో (7 ఎంటీవై), మగధ్ (51 ఎంటీవై) ఉన్నాయి. రహదారి రవాణాపై ఆధారపడటాన్ని తగ్గించడం, లోడింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, బొగ్గును నేరుగా రైలు మార్గం ద్వారా తరలించేందుకు వీలు కల్పించడం ఈ వ్యవస్థల ప్రధాన లక్ష్యం.
భారత్ ఉక్కు రంగానికి కోకింగ్ బొగ్గు అత్యంత కీలకం. ఈ రంగం ఇప్పటికీ దిగుమతులపై గణనీయంగా ఆధారపడుతోంది. దిగుమతులకు ప్రత్యామ్నాయం కల్పించాల్సిన వ్యూహాత్మక ప్రాధాన్యతను గుర్తించిన సీసీఎల్.. నాణ్యమైన దేశీయ శుద్ధి చేసిన కోకింగ్ బొగ్గు లభ్యతను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించింది. తద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడంలో కూడా సంస్థ దోహదపడుతోంది. మొత్తం 14.50 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం (ఎంటీవై) కలిగిన అయిదు కొత్త కోకింగ్ బొగ్గు వాషరీలను సీసీఎల్ అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టుల పురోగతిలో గణనీయమైన ముందడుగు పడింది.
సీసీఎల్ తన కార్యకలాపాల పర్యవేక్షణ, నిర్వహణ విధానాలను మార్చేందుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను కూడా అందిపుచ్చుకుంటోంది. కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, తన కార్యకలాపాల పరిధిలో భద్రత, నిఘా, కార్యకలాపాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేసేందుకు కృత్రిమ మేధ ఆధారిత సమగ్ర కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)ను సంస్థ ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం ఆధునిక సాంకేతికతలను సమగ్రపరచి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, మరింత సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునేలా సహాయపడుతోంది.
సీసీఎల్ అభివృద్ధి ప్రస్థానంలో మరో ముఖ్యమైన అంశం పునరుత్పాదక ఇంధనం, ఇంధన సంరక్షణపై పెరుగుతున్న దృష్టి. ప్రస్తుతం సీసీఎల్ వద్ద 32 మెగావాట్లకు పైగా స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యం ఉంది. ఇందులో మొత్తం 29 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు గ్రౌండ్-మౌంటెడ్ సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. గిరిడిహ్ జిల్లాలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్‌ఎస్)తో కలిసి భారీ 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఈ కార్యక్రమాల ద్వారా సంస్థ ఇంధన మిశ్రమంలో పునరుత్పాదక ఇంధనం వాటా పెరగడంతో పాటు, ఉద్గారాలు తగ్గి, నెట్ జీరో లక్ష్యానికి సీసీఎల్ చేస్తున్న విస్తృత కృషికి మద్దతు లభిస్తుంది.
ఆధునిక, పర్యావరణహిత సాంకేతికతలను అందిపుచ్చుకోవడం ద్వారా సీసీఎల్ మైనింగ్‌ను మరింత సుస్థిరంగా మారుస్తోంది. సంస్థ సర్ఫేస్ మైనర్లు, కంటిన్యూయస్ మైనర్ల వంటి పేలుడు రహిత సాంకేతికతలను అవలంబించడంతో పాటు, ఓవర్‌బర్డెన్ డంప్‌లను శాస్త్రీయంగా పునరుద్ధరించడం, వర్షపు నీటి సంరక్షణ, మొక్కల పెంపకం, గని భూముల పునరుద్ధరణ వంటి చర్యలు చేపడుతోంది. 2014కు ముందు సర్ఫేస్ మైనర్లు, కంటిన్యూయస్ మైనర్ల ద్వారా ఉత్పత్తి శూన్యంగా ఉండగా.. ప్రస్తుతం వాటి ద్వారా జరిగే ఉత్పత్తి వాటా దాదాపు 70 శాతానికి పెరిగింది. స్థానిక ప్రజల ప్రయోజనం కోసం సీసీఎల్ అదనపు గని నీటిని కూడా వినియోగిస్తోంది. తద్వారా మైనింగ్ కార్యకలాపాల ద్వారా లభించే వనరును సమాజాభివృద్ధికి కీలక సాధనంగా మలుస్తోంది.
సీసీఎల్ పరివర్తనతో పాటు సంస్థ ఆర్థిక స్థితి కూడా గణనీయంగా బలోపేతమైంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.808 కోట్లుగా ఉన్న పన్నుల అనంతర లాభం (పీఏటీ).. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.4,035 కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో నికర ఆస్తి విలువ రూ.3,816 కోట్ల నుంచి రూ.16,464 కోట్లకు పెరిగింది.
సీసీఎల్ పరివర్తనలో సామాజిక కోణం కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమాల ద్వారా అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో సీఎస్‌ఆర్ వ్యయం ప్రధానంగా ప్రాథమిక మౌలిక సదుపాయాలు, తాగునీరు, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి కార్యక్రమాలకే పరిమితమై ఉండేది. ఇప్పుడు సుస్థిరమైన సామాజిక ఆస్తులు, అవకాశాలను సృష్టించేలా దీర్ఘకాలిక, విస్తృత స్థాయి కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సీసీఎల్ సుమారు రూ. 86 కోట్ల సీఎస్‌ఆర్ వ్యయాన్ని నమోదు చేసింది. సీఎస్‌ఆర్ కోసం నిర్దేశించిన సుమారు రూ. 74 కోట్ల లక్ష్యంతో పోలిస్తే ఈ వ్యయం అధికం.
సీసీఎల్ చేపడుతున్న ప్రత్యేకమైన సీఎస్‌ఆర్ కార్యక్రమాల్లో ‘సీసీఎల్ కే లాల్, సీసీఎల్ కీ లాడ్లీ’ ఒకటి. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ద్వారా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత వసతి విద్యతో పాటు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల కోచింగ్ అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం 20 మంది బాలురు, 20 మంది బాలికలతో మొత్త 40 మంది ఎంపికవుతారు. గ్రామీణ, గనుల ప్రభావిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతోంది.
అదేవిధంగా సీసీఎల్ జార్ఖండ్ ప్రభుత్వం భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన రాంచీలోని ఖేల్‌గావ్ స్పోర్ట్స్ అకాడమీ మరో ప్రధాన కార్యక్రమంగా ఎదిగింది. 34వ జాతీయ క్రీడల కోసం నిర్మించిన మౌలిక సదుపాయాలను ఉపయోగించి ఈ అకాడమీని ఏర్పాటు చేశారు. జార్ఖండ్ రాష్ట్ర క్రీడా ప్రోత్సాహక సంఘం ద్వారా ఇది నిర్వహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా యువ క్రీడాకారులకు క్రీడల్లో క్రమబద్ధమైన శిక్షణ, విద్య, జీవన నైపుణ్యాల అభివృద్ధికి అవసరమైన సహాయాన్ని ఈ అకాడమీ అందిస్తోంది. ఈ అకాడమీకి చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రెండుసార్లు జాతీయ సీఎస్‌ఆర్ అవార్డు లభించింది.
నేడు సీసీఎల్ కేవలం బొగ్గు ఉత్పత్తి సంస్థగా మాత్రమే కాకుండా, అంతకుమించిన విస్తృత పాత్రను పోషిస్తోంది. 2014 నుంచి సంస్థలో చోటుచేసుకున్న మార్పు అధిక ఉత్పత్తి, మెరుగైన ఉత్పాదకత, విస్తరించిన మైనింగ్ సామర్థ్యం, యాంత్రీకృత బొగ్గు తరలింపు, బలోపేతమైన రైల్వే అనుసంధానం, పునరుత్పాదక ఇంధన వినియోగం, మెరుగైన పర్యావరణ నిర్వహణ, ఆర్థిక బలోపేతం, విస్తృత సామాజిక అభివృద్ధి దిశగా సాగిన మార్పును ప్రతిబింబిస్తోంది.
బొగ్గు సంస్థలో చోటుచేసుకున్న పరివర్తనను కేవలం మిలియన్ టన్నుల ఉత్పత్తి ఆధారంగా మాత్రమే అంచనా వేయలేమని సీసీఎల్ ప్రయాణం స్పష్టం చేస్తోంది. సుమారు 50 ఎంటీ నుంచి 87.5 ఎంటీకి పెరిగిన ఉత్పత్తి ఈ పరివర్తనలో ఒక భాగం మాత్రమే. కొత్త మైనింగ్ సామర్థ్యాన్ని సృష్టించడం, ఆధునిక బొగ్గు తరలింపు మౌలిక సదుపాయాలను నిర్మించడం, సీహెచ్‌పీలు, రైల్వే వ్యవస్థలను సమగ్రపరచడం, పునరుత్పాదక ఇంధనాన్ని అందిపుచ్చుకోవడం, ఉత్పాదకత, పర్యావరణ నిర్వహణను మెరుగుపరచడం, అలాగే సీసీఎల్ కే లాల్, సీసీఎల్ కీ లాడ్లీ, ఖేల్‌గావ్ స్పోర్ట్స్ అకాడమీ వంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో పెట్టుబడులు పెట్టడం వంటి అంశాల్లోనే విస్తృతమైన పరివర్తన కనిపిస్తోంది.
ఆర్థిక వృద్ధితో పాటు ఇంధన భద్రత, పర్యావరణ బాధ్యతలను సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ నిరంతరం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో 2014 నుంచి సీసీఎల్ అనుభవం ఒక సంప్రదాయ మైనింగ్ సంస్థ క్రమంగా ఆధునిక, సాంకేతికత ఆధారిత, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించే, సామాజిక బాధ్యతకు స్పందించే సంస్థగా ఎలా రూపాంతరం చెందగలదో చూపిస్తోంది. అదే సమయంలో దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో కీలక పాత్రను సీసీఎల్ కొనసాగిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2313711)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13