శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
'స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ 5.0'కి వచ్చిన భారీ జనస్పందన పట్ల హర్షం వ్యక్తం చేసిన డాక్టర్ జితేంద్ర సింగ్
13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 231 చోట్ల తీర ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమాల నిర్వహణ..సముద్ర పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేసిన 15 లక్షల మంది ప్రజలు
భారతదేశ శాస్త్రీయ విజయాలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేయడానికి నగరాల వారీగా శాస్త్రీయ క్లస్టర్లు, బలమైన సమన్వయం, విస్తృత ప్రజా భాగస్వామ్యం ఉండాలన్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
శాస్త్రీయ విజయాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు శాస్త్ర విజ్ఞాన మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలన్న కేంద్ర మంత్రి
శాస్త్ర విజ్ఞానంతో ప్రజల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయనున్న 'విజ్ఞాన్ కీ బాత్'.. ఫౌండేషనల్ భౌతిక శాస్త్రాలు, క్వాంటం సాంకేతికతలపై ప్రత్యేక దృష్టి సారించనున్న సెప్టెంబర్ 26న జరిగే రెండో ఎడిషన్
శాస్త్రీయ విజయాల డిజిటల్ లైబ్రరీ, సీఎస్ఐఆర్@85, ఈఎస్టీఐసీ-2026 సన్నాహాలను సమీక్షించిన డాక్టర్ జితేంద్ర సింగ్
నాడు పోస్టు చేయడమైనది:
21 SEP 2026 5:55PM by PIB Hyderabad
శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని.. నగరాల వారీగా శాస్త్రీయ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని, భారత శాస్త్రీయ విజయాలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేయాలని కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భూవిజ్ఞాన శాఖ సహాయ మంత్రి(స్వతంత్ర బాధ్యత).. ప్రధాని కార్యాలయం, సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు పిలుపునిచ్చారు.
ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్న ఇటీవలి 'స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్' 5.0ను కూడా కేంద్ర మంత్రి సమీక్షించారు. 2026 సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు నిర్వహించిన ఈ తీర ప్రాంత స్వచ్ఛతా కార్యక్రమాన్ని 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 231 చోట్ల చేపట్టారు. ఇందులో 15 లక్షల మంది ప్రజలు సముద్ర పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షతన జరిగిన శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖలు, విభాగాల నెలవారీ సమీక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్, బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేష్ గోఖలే, శాస్త్ర సాంకేతిక విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ ఉమేష్ వీ. వాఘ్‌మారే, శాస్త్రీయ- పారిశ్రామిక పరిశోధన విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ ఎన్. కలైసెల్వి, భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ టీ. శ్రీనివాస కుమార్, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్) సీఈఓ డాక్టర్ శివకుమార్ కల్యాణరామన్ తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలు, శాస్త్రీయ సంస్థల సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
భారత్‌లోని శాస్త్రీయ సంస్థలు మరింత సమన్వయంతో ప్రజలకు స్పష్టంగా కనిపించే రీతిలో పనిచేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. సంబంధిత రంగాల్లో పనిచేస్తున్న సంస్థలు, భాగస్వాములను ఒకచోట చేర్చడంలో నగరాల వారీగా ఏర్పాటు చేసే శాస్త్రీయ క్లస్టర్లు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ప్రయోగశాలలు, సంస్థల నుంచి వస్తున్న ముఖ్యమైన పురోగతులు సమాజంలోని విస్తృత వర్గాలకు చేరేలా కొత్త, ప్రభావవంతమైన శాస్త్రీయ విజయాలను నిరంతరం గుర్తించటం, ప్రదర్శించటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
శాస్త్ర సాంకేతిక, ఆవిష్కరణ రంగాల్లో సాధించిన ముఖ్యమైన విజయాలు సకాలంలో, సులభంగా అర్థమయ్యే రీతిలో, ఆకర్షణీయమైన పద్ధతిలో ప్రజలకు చేరేలా శాస్త్ర విజ్ఞాన మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. శాస్త్రీయ విజయాలను సంస్థలకే పరిమితం చేయకుండా భారత శాస్త్రీయ వ్యవస్థకు, ప్రజలకు మధ్య బలమైన అనుబంధాన్ని ఏర్పరచడంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.
భారత శాస్త్రీయ సంస్థల కృషిని తెలియజేసే వీడియోలు, ఇతర కమ్యూనికేషన్‌ల ఉమ్మడి రిపాజిటరీగా ప్రతిపాదించిన 'డిజిటల్ లైబ్రరీ ఆఫ్ సైంటిఫిక్ అచీవ్‌మెంట్స్' పురోగతిని ఈ సందర్భంగా ఆయన సమీక్షించారు. డిజిటల్ లైబ్రరీ కోసం సంస్థాగత విధానాన్ని, అమలు పద్ధతులను అభివృద్ధి చేయడంలో సీఎస్ఐఆర్-ఎన్ఐఎస్‌సీపీఆర్ నోడల్ సంస్థగా పనిచేస్తోంది. సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య భాగస్వామ్యం, వనరుల సమీకరణకు సంబంధించిన విధివిధానాలు ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్నాయి.
ముఖ్యమైన శాస్త్రీయ, సాంకేతిక విజయాలను ప్రధానంగా తెలియజేసే తక్కువ నిడివి గల కంటెంట్ సృష్టి, ప్రసారంతో సహా డీఎస్టీ, డీబీటీ, డీఎస్ఐఆర్ లేదా సీఎస్ఐఆర్, ఎంఓఈఎస్‌లు ప్రస్తుతం చేపడుతోన్న డిజిటల్ అవగాహన కార్యక్రమాలను కూడా ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. శాస్త్రీయ సంస్థల పనులకు మరింత విస్తృతమైన గుర్తింపును తెచ్చిపెట్టడం, ముఖ్యమైన పరిణామాలు కేవలం శాస్త్రీయ వర్గాలకే పరిమితం కాకుండా విస్తృత సమాజానికి చేరేలా చూడటమే ఈ సమన్వయ విధానానికి ఉన్న ముఖ్య ఉద్దేశం.
ప్రజా భాగస్వామ్యాన్ని ఇదే స్థాయిలో కొనసాగించాలన్న కేంద్ర మంత్రి.. శాస్త్రీయ అవగాహన, పర్యావరణ బాధ్యత, ప్రజా భాగస్వామ్యం మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన తీరప్రాంతాలు, సురక్షితమైన సముద్రాల కోసం చేపట్టిన ఈ దేశవ్యాప్త కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు, తీర ప్రాంత ప్రజలు, ప్రభుత్వ శాఖలు, శాస్త్రీయ సంస్థలు, వాలంటీర్లు అందరూ భాగస్వామ్యులయ్యారు.
దేశంలో స్వయంప్రతిపత్తి కలిగిన శాస్త్రీయ సంస్థల కృషిని ప్రజలకు తెలియజేయటానికి, వాటి విజయాలను విస్తృత జనబాహుళ్యానికి చేరవేయడానికి శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్టీ) ప్రారంభించిన నెలవారీ ఉపన్యాస వేదిక 'విజ్ఞాన్ కీ బాత్' పురోగతిని కూడా ఇందులో సమీక్షించారు. ఈ నెల 26న జరగనున్న రెండో ఎడిషన్‌లో ఎస్.ఎన్. బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ డైరెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సెషన్‌లో ఫౌండేషనల్ భౌతిక శాస్త్రాలు, క్వాంటం సాంకేతికత రంగంలో సాధించిన పురోగతిపై ప్రత్యేకంగా చర్చిస్తారు.
2026 ఆగస్టు 29న నిర్వహించిన 'విజ్ఞాన్ కీ బాత్' ప్రారంభ ఎడిషన్‌లో విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, పారిశ్రామిక రంగానికి చెందిన 7,500 మందికి పైగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అత్యాధునిక పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలు, వాటి జాతీయ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించడానికి, భారతదేశ శాస్త్రీయ సంస్థలకు ప్రజలతో గల అనుబంధాన్ని మరింత పెంచడానికి ఈ వేదిక దోహదపడుతుందని భావిస్తున్నారు.
2026 సెప్టెంబర్ 25న జరగనున్న కార్యక్రమంతో పాటు సీఎస్ఐఆర్@85ఏర్పాట్లు, ఈఎస్టీఐసీ-2026కు సంబంధించిన తాజా అంశాలను కూడా ఈ సమావేశంలో పరిశీలించారు. భారతదేశ శాస్త్రీయ సంస్థల విజయాలు, వాటి కృషిని సమర్థవంతంగా ప్రచారం చేయటం.. కార్యక్రమాలకు సన్నద్ధం కావడం, సమన్వయం చేసుకోవడం వంటి అంశాలపై చర్చించారు.
శాస్త్రీయ వ్యవస్థలో సహకారాన్ని, సమన్వయాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిన చర్చలు (థీమాటిక్ ఇంటరాక్షన్లు), క్లస్టర్-ఆధారిత భాగస్వామ్యాలతో సహా మంత్రిత్వ శాఖల మధ్య, ఆయా విభాగాల మధ్య సమన్వయ విధానాలపై కూడా ఈ సమీక్షలో చర్చించారు. శాస్త్రీయ విజయాలను సమన్వయంతో ప్రచారం చేసేందుకు, వాటి విస్తృత వ్యాప్తిని సులభతరం చేయడానికి శాస్త్రీయ మంత్రిత్వ శాఖలు, విభాగాల ప్రసార బృందాల మధ్య క్రమమైన సమాచార మార్పిడి ఉండాలని చెప్పారు.
శాస్త్రీయ వ్యవస్థలో బలమైన సంస్థాగత సహకారం, సమన్వయంతో కూడిన సమాచార ప్రసారం, నిరంతర ప్రజా భాగస్వామ్యం భాగం కావాలని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. తద్వారా శాస్త్ర సాంకేతిక, ఆవిష్కరణల్లో భారత పురోగతి అందరికి కనిపించేలా, అందుబాటులో ఉండేలా, ప్రయోజనకరంగా ఉండేలా చూడటానికి ఉన్న ప్రాముఖ్యతను కూడా ఆయన ప్రధానంగా చెప్పారు.
ఈ కార్యక్రమాలను సమన్వయ పద్ధతిలో ముందుకు తీసుకెళ్లడం, శాస్త్రీయ సంస్థలు- ప్రజలకు మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడం, భారత శాస్త్రీయ విజయాలు- ఆవిష్కరణలకు మరింత విస్తృతమైన గుర్తింపును తీసుకురావాలన్న ఆలోచనతో ఈ సమావేశం ముగిసింది.




***
(రిలీజ్ ఐడి: 2313266)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8