యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

93 యూనివర్సిటీల వీసీలతో సమావేశానికి అధ్యక్షత వహించిన

కేంద్ర సహాయమంత్రి రక్షాఖడ్సే.. వీబీవైఎల్డీ- 2027లో విస్తృతంగా పాల్గొనాల్సిందిగా అభ్యర్థన

వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ - 2027, నషా ముక్త్ అభియాన్, యువ కనెక్ట్ కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనేలా ప్రోత్సహించాలని పిలుపు

నాడు పోస్టు చేయడమైనది: 18 SEP 2026 5:39PM by PIB Hyderabad

యువత కేంద్రంగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల్లో ఉన్నత విద్యాసంస్థల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా.. దేశవ్యాప్తంగా ఉన్న 93 విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో నిర్వహించిన సమావేశానికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే అధ్యక్షత వహించారు.

యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ సునిల్ పైల్వాల్, సంయుక్త కార్యదర్శి శ్రీ శివ్ రతన్, మై భారత్ డైరెక్టర్ శ్రీ సలిల్ కుమార్, జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) డైరెక్టర్ శ్రీ ప్రశాంత్ ప్రియా గౌతమ్, విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సమావేశంలో 40 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, 38 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 13 డీమ్డ్, ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, అలాగే మణిపూర్‌ ఎన్ఎస్‌యూ, గ్వాలియర్‌ ఎల్ఎన్ఐపీఈ ప్రతినిధులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ - 2027, నషా ముక్త్ అభియాన్, యువ కనెక్ట్ కార్యక్రమాలపై విశ్వవిద్యాలయాల నాయకత్వానికి వివరించేందుకు, ఈ కార్యక్రమాల్లో వారి క్రియాశీల భాగస్వామ్యంపై చర్చించడానికి ఈ సమావేశం వేదికగా నిలిచింది.

ఉపకులపతులనుద్దేశించి కేంద్ర సహాయమంత్రి రక్షాఖడ్సే మాట్లాడుతూ.. వికసిత భారత్ @2047 లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విద్యాసంస్థల సమష్టి బాధ్యతను వివరించారు. యువత భాగస్వామ్యం, నాయకత్వం, సామాజిక అనుసంధానం, నిర్మాణాత్మక చర్చలకు విశ్వవిద్యాలయాలు విస్తృతంగా అవకాశం కల్పించాలని పిలుపునిచ్చారు.

వీబీవైఎల్డీ-2027 గురించి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమ వైవిధ్యాన్ని ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. విధాన రూపకర్తలు, నిపుణులు, జాతీయ స్థాయి నాయకులతో సంభాషిస్తూ... తమ ఆలోచనలను, సృజనాత్మకతను, పరిష్కార మార్గాలను ప్రదర్శించే అవకాశాలను యువతకు కల్పించాలనీ, విద్యార్థులు ఉత్సాహంగా భాగస్వాములయ్యేలా విశ్వవిద్యాలయాలు ప్రోత్సహించాలనీ కోరారు.

నషా ముక్త్ భారత్ అభియాన్ కింద యువతలో అవగాహనను పెంపొందించాలనీ, యువత కేంద్రంగా కార్యాచరణను బలోపేతం చేయాలనీ, అలాగే యువ కనెక్ట్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అవకాశాలను కల్పించాలనీ ఆమె కోరారు. యువజన కార్యకలాపాలను క్యాంపస్‌లకే పరిమితం చేయకుండా సమాజంలో విస్తృతం చేయడంలో విద్యాసంస్థల పాత్ర అత్యంత కీలకమైందన్నారు.

యువ నాయకత్వం, సామాజిక బాధ్యత, దేశ నిర్మాణానికి సంబంధించి మరింత బలమైన వ్యవస్థను రూపొందించడంలో దోహదపడేలా... విశ్వవిద్యాలయాలు, విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో విస్తృతంగా భాగస్వామ్యం వహించేలా ఉపకులపతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

వీబీవైఎల్డీ-2027, నషా ముక్త్ భారత్ అభియాన్, యువ కనెక్ట్ కార్యక్రమాల్లో విశ్వవిద్యాలయ స్థాయిలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా కీలక కార్యాచరణ చర్యలపై చర్చించడంతో ఈ కార్యక్రమం ముగిసింది. ప్రొఫెసర్ నీలోఫర్ ఖాన్, ప్రొఫెసర్ దివాకర్ సింగ్ రాజ్‌పుత్, ప్రొఫెసర్ కల్పనా శర్మ, ప్రొఫెసర్ దివాకర్ చంద్ర దేక, దల్జీత్ సింగ్ చౌదరి, ప్రొఫెసర్ సురేశ్ గోసావి సహా వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

 

***


(రిలీజ్ ఐడి: 2312460) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी