రక్షణ మంత్రిత్వ శాఖ
దృఢత్వం, శక్తి, నూతన ఆవిష్కరణలు, సమ్మిళిత అభివృద్ధితో
‘2047కల్లా వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు పురోగమిస్తున్న భారత్: రక్షణ మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
18 SEP 2026 3:29PM by PIB Hyderabad
‘వికసిత్ భారత్ లక్ష్యాన్ని 2047కల్లా సాధించడానికి’ పౌరుల్లో సవాళ్లను ఎదుర్కొనే స్థితి, దృఢసంకల్పం, కరుణ, నూతన ఆవిష్కరణలు, శక్తి, సమ్మిళిత అభివృద్ధి, జాతీయ గుర్తింపు తాలూకు ప్రబల భావనను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తూ దేశానికి సేవలు అందిస్తోందని కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ రోజు కేరళంలోని కోచిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సాహసం, ప్రజాసంక్షేమం, భద్రత, సేవాభావం, లక్ష్యాలను సాధించాలన్న దృఢసంకల్పం, కరుణ, భావితరాల వారికి ప్రేరణనివ్వడం, జాతీయ సామర్థ్యాలను బలోపేతం చేయడం, సమ్మిళిత వృద్ధి, ప్రపంచానికి నాయకత్వాన్ని అందించడం వంటి శతాబ్దాల నాటి విలువల నుంచి భారత్ స్ఫూర్తిని పొంది, అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకు పోతోందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
భారత్ 2014కు పూర్వం.. అవినీతి, దుష్పరిపాలన వంటి ముఖ్య సవాళ్లను ఎదుర్కొందని, ఈ సవాళ్లు ప్రజల మనోబలాన్ని బలహీనపరిచాయని రక్షణ మంత్రి అన్నారు. ప్రతికూలతలకు ఆత్మవిశ్వాసంతో ఎదురొడ్డి నిలవడంతో పాటు, ఆ ప్రతికూలతలను అవకాశాలుగా మార్చుకునే సామర్థ్యంతో గత 12 సంవత్సరాల్లో దేశ ప్రగతి సాధ్యపడిందని ఆయన అన్నారు. ‘‘గత పన్నెండు సంవత్సరాలలో, ప్రపంచంలో కోవిడ్-19 వంటి మహమ్మారి ఎదురైంది. అనేక యుద్ధాలు వచ్చాయి. అవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అంతర్జాతీయ సవాళ్లు ఎదురైనా, మనం స్వావలంబన కలిగిన, అభివృద్ధి చెందిన దేశంగా మారే మార్గంలో పురోగమిస్తున్నాం’’ అని ఆయన అన్నారు.
దుష్ట శక్తుల నుంచి పౌరులను కాపాడి, వారికి భద్రతను కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు ముప్పు కలగజేయాలనుకున్న వారిని అంతం చేయడానికి సరిహద్దును దాటేందుకు కూడా భారత్ సిద్ధంగా ఉంటుందనడానికి ఆపరేషన్ సిందూర్ ఒక నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. నక్సలిజాన్ని కూడా పరిసమాప్తం చేశామని ఆయన అన్నారు.
దేశీయ శక్తియుక్తులను నిరంతరాయంగా ప్రోత్సహిస్తూ ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రక్షణ మంత్రి అన్నారు. దేశవాళీ రక్షణ రంగ ఉత్పత్తుల విలువ 2014లో రూ.40,000 కోట్ల స్థాయిలో ఉంటే, ప్రస్తుతం అది దాదాపు రూ.1.80 లక్షల కోట్లకు చేరుకొందని ఆయన తెలిపారు. రక్షణ రంగ ఎగుమతులు సుమారు రూ.600 కోట్ల నుంచి రమారమి రూ.40,000 కోట్లకు పెరిగాయన్నారు. భారత రక్షణ ఉత్పాదనలు ఇంచుమించు 100 దేశాలకు చేరుకుంటున్నాయని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వివరించారు.
దేశ లక్ష్యాలను సాహసం, దృఢసంకల్పంతో సాధించుకోవడానికి అలుపెరుగని ప్రయత్నాలు చేయాలన్నదే పౌరుల సంకల్పంగా ఉందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ చెబుతూ, దేశానికి అన్నింటి కన్న పెద్ద శక్తిగా యువత నిలుస్తోందన్నారు. ‘‘మన యువతీయువకులు అంకుర సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. యూనికార్న్‌లను తీర్చిదిద్దుతున్నారు. హైడ్రోజన్ రాకెట్లను రూపొందిస్తున్నారు. రాకెట్లను, కృత్రిమ ఉపగ్రహాలను తయారు చేస్తున్నారు. వారు భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఏ ప్రయత్నాన్నీ వదలివేయడం లేదు’’ అని రక్షణ మంత్రి అన్నారు.
కరుణ భావన నుంచి ప్రభుత్వం స్ఫూర్తిని పొంది, ప్రజల జీవనాన్ని మెరుగుపరిచే దిశగా కృషి చేస్తోందని రక్షణ మంత్రి అన్నారు. గత పది, పన్నెండు సంవత్సరాల్లో 250 మిలియన్ కన్నా ఎక్కువ మంది ప్రజలను పేదరికం గుప్పిట్లో నుంచి బయటకు తీసుకు వచ్చిందన్నారు. భారత్ ప్రజాస్వామ్య సాఫల్యమో, లేదా భారత్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు విజయవంతం కావడమో.. ఏ రకంగా అయినా సరే భారత్ ఇవాళ ప్రపంచ దేశాలకు స్ఫూర్తినిస్తోందని కూడా ఆయన అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన వాస్తవ కాల చెల్లింపుల వ్యవస్థ ‘యూపీఐ’ని గురించి ఆయన ప్రస్తావించారు. దీనిని 11 కన్నా ఎక్కువ దేశాలు స్వీకరించాయన్నారు. అభివృద్ధి ఫలాలను మరింత మంది చెంతకు చేర్చిన ‘పీఎమ్ శ్రీ’, ‘ఆయుష్మాన్ భారత్’, ‘లఖ్‌పతి దీదీ’, ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’, ‘జల్ జీవన్ మిషన్’, ‘ఉజ్వల యోజన’లను గురించి మంత్రి ప్రస్తావించారు.
ప్రపంచానికి ఒక ఆశాకిరణంగా భారత్ నిలిచిందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వర్ణించారు. వాతావరణ మార్పుతో పోరాడటానికి అనేక లక్ష్యాలను భారత్ నిర్దేశించుకొని, వాటిని అనుకున్న కాలాని కన్న ఎంతో ముందుగా సాధించిందని, కోవిడ్-19 వేళ దేశ ప్రజలకు టీకామందులను ఇప్పించిందని, 100 దేశాలకు 300 మిలియన్ టీకాలను పంపించిందని తెలిపారు. ప్రపంచం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకొంటున్న తరుణంలో, భారత్ ఒక నాగరికతా నేతగా నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. ‘అంతర్జాతీయ సౌర కూటమి’ (ఐఎస్ఏ), ‘గ్లోబల్ బయోఫ్యూయెల్స్ అలయెన్స్’ వంటి కార్యక్రమాలతో ప్రపంచానికి నాయకత్వాన్ని భారత్ అందిస్తోందని ఆయన అన్నారు.
ఒక్క ఆర్థిక అభివృద్ధికే భారత్ అభివృద్ధి ప్రస్థానం పరిమితం కాదని, జాతీయ ఆత్మవిశ్వాసాన్ని బలపరుచుకొని వలసవాద మనస్తత్వం నుంచి బయటపడి ముందుకు దూసుకుపోవడం కూడా అందులో ఓ భాగమని రక్షణ మంత్రి అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలో, భారత్ సాంస్కృతికంగా, నాగరికతపరంగా పునర్జాగృతికి సాక్షిగా నిలుస్తోందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సాంస్కృతిక, నాగరికతా సంబంధ వారసత్వాలకు గల ప్రాధాన్యాన్ని ఆయన ప్రస్తావిస్తూ, దేశంలో ఆధునికీకరణ యాత్ర దాని సాంస్కృతిక సంప్రదాయాల్ని గౌరవించుకోవడంతో సమానంగా సాగాలన్నారు. ‘‘‘సర్వ ధర్మ సమభావం’’ లేదా అన్ని ధర్మాలకు సమాన గౌరవం ఎల్లప్పటికీ మన నాగరికతా ఆలోచనాస్రవంతిలో కీలకంగా నిలిచింది. ఏమైనా, పాశ్చాత్య మతాతీతవాదం కారణంగా మన ధర్మాన్ని మతతత్త్వవాదంగా, సంప్రదాయాలను వెనుకబాటుతనంగా, నమ్మకాన్ని ఛాందసత్వంగా, ధర్మాన్ని మూఢవిశ్వాసంగా చిత్రించే ప్రయత్నాలు జరిగాయి’’ అని ఆయన అన్నారు.
భారతదేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వాలను మరింత ఎక్కువగా యువతరం తెలుసుకొనేటట్లు చూడడం ప్రధానమని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. యువతలో ఎక్కువ చైతన్యం వస్తే జాతీయ చేతన బలపడుతుందని, ప్రపంచంలో భారత్‌కున్న స్థానం పట్ల ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుందని ఆయన అన్నారు. భారత్ ఆర్థిక, సామాజిక, సాంకేతిక మార్పులలో తోడ్పాటును అందించాల్సిందిగా యువతకు ఆయన పిలుపునిచ్చారు. ఆత్మవిశ్వాసం తొణికిసలాడే, సమర్ధమైన, సామాజికంగా సమ్మిళితమైన భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగగలుగుతుందని, ప్రపంచ భవితకు రూపురేఖలను సంతరించడంలో ప్రధాన భూమికను పోషించగలుగుతుందని ఆయన అన్నారు.
నేటి కాలంలో సమాచార ప్రసార సాధనాల కీలక భూమికను గురించి రక్షణ మంత్రి ప్రస్తావిస్తూ, పత్రికారచనను ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా వర్ణించడం సరైందేనని, జవాబుదారుతనానికి పూచీపడే బలమైన సాధనాల్లో స్వతంత్రమైన, నిష్పాక్షికమైన పత్రికా రంగం ఒకటన్నారు. ‘‘వార్తల్ని అందించడమొక్కటే సమాచార ప్రసార సాధనాల పాత్ర కాదు. క్లిష్టమైన ప్రశ్నలను అడగడం, నిజాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం, అధికారంలో ఉన్న వారిని జవాబుదారుతనం కలిగినవారుగా నిలపడం కూడా మీడియా వంతే’’ అని ఆయన అన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2312130)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4