రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘వన్ ట్యాగ్’ ఫాస్టాగ్ మార్పిడి సేవకు మార్గాన్ని సుగమం చేసే ఎన్‌హెచ్ఏఐ రాజ్‌మార్గ్‌యాత్ర యాప్


‘వన్ ట్యాగ్’ ఫాస్టాగ్ మార్పిడి అందుబాటులోకి రావడంతో
రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌లో జాతీయ రహదారి వినియోగదారులకు ఇక మరిన్ని పౌర ప్రధాన సేవల లభ్యత

నాడు పోస్టు చేయడమైనది: 17 SEP 2026 4:15PM by PIB Hyderabad

ఫాస్టాగ్ (FASTag) వినియోగదారులకు మరిన్ని ప్రత్యామ్నాయాలను అందించాలనే ఉద్దేశంతో, ‘వన్ ట్యాగ్’ (OneTag) రూపంలో ఓ ఫాస్టాగ్ మార్పిడి సేవను తీసుకువచ్చారు. దీనిని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ)కి చెందిన రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌లో పొందవచ్చు. ఈ కార్యక్రమం ఫాస్టాగ్ వినియోగదారులకు వారి వాహనానికి అంటించిన ప్రస్తుత ఫాస్టాగ్‌ను అట్టిపెట్టుకుంటూనే,  జారీదారు సంస్థను మార్చుకొనేందుకు వీలుంటుంది. దీనితో వారికిక కొత్త ఫాస్టాగ్‌ను పొందాల్సిన అవసరం ఉండదు. ‘వన్ ట్యాగ్’ ఫాస్టాగ్ పోర్టబులిటీ అందుబాటులోకి రావడం వల్ల, జాతీయ రహదారుల వినియోగదారులకు రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌లో అందుతున్న పౌర ప్రధాన సేవల పరిధి విస్తరిస్తుంది. ఇప్పటికే దీనిలో ఫాస్టాగ్ వార్షిక పాస్, ఫాస్టాగ్ స్థానిక పాస్, అత్యవసర హెల్ప్‌లైన్ 1033 తదితర సేవలు లభిస్తున్నాయి.
వినియోగదారులకు ఫాస్టాగ్ మార్పిడి ప్రక్రియలో రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌ మార్గదర్శకత్వాన్నందిస్తుంది. ఫాస్టాగ్ యూజర్లు అర్హతను సరిచూసుకోవడానికి యాప్‌లో లాగ్ ఇన్ అయ్యి, తమ వాహన రిజిస్ట్రేషన్ నంబరును నింపాలి. వారికి ప్రస్తుత జారీదారు బ్యాంకు నుంచి ఆరు అంకెల మొబైల్ వెరిఫికేషన్ కోడ్ (ఎమ్‌వీసీ) వస్తుంది. దానిని సరి చూసిన తరువాత, వినియోగదారు ఒక కొత్త జారీదారు సంస్థను ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. వినియోగదారు వెరిఫికేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయాలి. మార్పిడి ప్రక్రియను పూర్తి చేయడం కోసం కొత్త జారీదారు సంస్థతో వాలెట్ ఆన్‌బోర్డింగును చేసుకోవాల్సి ఉంటుంది. మార్పిడి విజయవంతంగా ముగిసిన తరువాత, వాహన నమోదు సంఖ్యతో ముడిపడి ఉన్న ప్రస్తుత ఫాస్టాగ్ ఐడీ యథాతథంగా ఉంటుంది. దీంతో వినియోగదారు రెండో జారీదారు బ్యాంకుతోనూ అదే ట్యాగును వాడొచ్చు.
మార్పిడి పూర్తి అయిన తరువాత, ప్రస్తుత ఫాస్టాగ్ వాలెట్‌ను మునుపటి జారీదారు మూసివేస్తారు. వర్తించే సర్దుబాట్లు పూర్తి చేసిన అనంతరం మిగులు సొమ్మును తిరిగి ఇస్తారు. అంతేకాదు, ఇంటరాపరబుల్ ఫాస్టాగ్‌ను మళ్లీ మార్చుకోవడాని కన్న ముందు 6 నెలల పాటు కూలింగ్ గడువు వెసులుబాటు ఉంటుంది.
‘వన్ ట్యాగ్’ కార్యక్రమం ద్వారా తొలి ట్యాగును అనేక సార్లు తయారు చేయాల్సిన అగత్యం తగ్గిపోతుంది. దీంతో ఫాస్టాగ్ జీవన చక్రం నిర్వహణ మెరుగవుతుంది. నిర్వహణ వ్యయం, పంపేందుకు ఖర్చు, తిరిగి జారీ చేసేందుకు అయ్యే ఖర్చులు తగ్గుతాయి. ‘వన్‌ట్యాగ్’ ద్వారా జారీదారు సంస్థను మార్చుకొనే ప్రక్రియ సులభతరం అవుతుంది. వినియోగదారులకు ప్రత్యామ్నాయాలు కూడా పెరుగుతాయి. మరింత ఎక్కువ సంస్థల సేవలను అందుకొనే, సమర్థ ఫాస్టాగ్ విస్తారిత అనుబంధ వ్యవస్థ (ఇకోసిస్టమ్)ను ఏర్పాటు చేయడానికి తోడ్పాటు లభిస్తుంది.
ప్రస్తుతం 98 శాతం కన్నా ఎక్కువ వ్యాప్తి రేటు, దాదాపు 13 కోట్ల మంది వినియోగదారులున్న ఫాస్టాగ్  దేశంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ వసూలు చేసే వ్యవస్థలో ఒక విప్లవాన్ని తీసుకువచ్చింది. ‘వన్‌ ట్యాగ్’ను పరిచయం చేయడం వల్ల డిజిటల్ టోలింగ్ స్వరూపం మరింత బలోపేతం అవుతుంది. అంతేకాదు, ఫాస్టాగ్ వినియోగదారులకు ఇంకా ఎక్కువ సౌలభ్యం కలగడంతో పాటు, ప్రస్తుత ఫిజికల్ ట్యాగ్ కూడా అలాగే ఉంటుంది. జాతీయ రహదారులను వినియోగించుకొంటున్న వారికి ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2311469) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Malayalam , Urdu , हिन्दी