భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం
azadi ka amrit mahotsav

నగరాల్లో వ్యర్థ నిర్వహణను మెరుగుపరిచేందుకు డిజిటల్ వేదికను ప్రారంభించిన భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్

నాడు పోస్టు చేయడమైనది: 17 SEP 2026 9:44AM by PIB Hyderabad

‘భారత్‌లో ఘన వ్యర్థాల నిర్వహణ (ఎస్‌డబ్ల్యూఎమ్)కు ఎల్‌సీఏ విధాన అభివృద్ధి’ అనే ప్రాజెక్టుకు సంబంధించిన ఫలితాలను, సిఫార్సులను సమీక్షించడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు (పీఎస్ఏ) ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశం 2026 సెప్టెంబర్ 16న జరిగింది. శాస్త్రీయ కార్యదర్శి డాక్టర్ పర్విందర్ మైనీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే ఈ సమావేశంలో పీఎస్ఏ కార్యాలయ సైంటిస్ట్ ‘ఎఫ్’ డాక్టర్ విశాల్ చౌదరి, సైంటిస్ట్ ‘డి’ డాక్టర్ హఫ్సా అహ్మద్, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్ర ప్రజారోగ్య, పర్యావరణ ఇంజినీరింగ్ సంస్థ డిప్యూటీ అడ్వైజర్ శ్రవంతి, ఐఐఎస్‌సీ బెంగళూరు సివిల్ ఇంజినీరింగ్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్, ప్రాజెక్టు రివ్యూ మానిటరింగ్ కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎంఎస్ మోహన్ కుమార్ పాల్గొన్నారు. ప్రాజెక్టు కన్సార్టియంలో ఐఐఎస్‌సీ బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ రావు, ప్రొఫెసర్ చాణక్య హోయసల్, ఐఐటీ మద్రాస్‌ నుంచి  ప్రొఫెసర్ ఆర్ విను, ఐఐటీ (బీహెచ్‌యూ) వారణాసి నుంచి ప్రొఫెసర్ ఆర్ ఎస్ సింగ్‌తో పాటు ఎల్‌సీఏ మోడలింగ్, జీహెచ్‌జీ అకౌంటింగ్, డిజిటల్ టూల్ అభివృద్ధి బాధ్యత వహిస్తున్న ప్రధాన రీసెర్చి అసోసియేట్‌లు ఉన్నారు. ఆహ్వానం అందుకున్న పట్టణ స్థానిక సంస్థ (యూఎల్‌బీ)ల ప్రతినిధులు వర్చువల్ విధానంలో హాజరయ్యారు.

image.png

వ్యర్థాల నుంచి సంపద కార్యక్రమం, స్వచ్ఛ భారత్ మిషన్ – అర్బన్ లాంటి జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా 2024లో పీఎస్ఏ కార్యాలయం ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చింది. ఈ ప్రాజెక్టును ఐఐఎస్‌సీ బెంగళూరు, ఐఐటీ మద్రాస్, ఐఐటీ (బీహెచ్‌యూ) వారణాసి సంయుక్తంగా చేపట్టాయి. దేశ అవసరాలకు తగిన విధంగా లైఫ్ సైకిల్ అసెస్మెంట్ (ఎల్‌సీఏ) విధానాన్ని, జీహెచ్‌జీ కాలిక్యులేటర్ వెబ్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేయడమే దీని లక్ష్యం. ఇది తక్కువ కర్బన ఉద్గారాలతో కూడిన ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థల ప్రణాళిక, పోల్చడం, మెరుగుపరచడంలో యూఎల్‌బీలకు తోడ్పడుతుంది.

image.png

బెంగళూరు, మైసూరు, తుమకూరు, చెన్నై, ఢిల్లీ, వారణాసి నగరాల్లో చేపట్టిన కేస్ స్టడీల ఆధారంగా విస్తృత శ్రేణికి చెందిన వ్యర్థ నిర్వహణ సాంకేతిక పరిజ్ఞానాలపై జరిపిన ఎల్‌సీఏ అధ్యయన ఫలితాలను ప్రాజెక్టు బృందం సమర్పించింది. జీహెచ్‌జీ కాలిక్యులేటర్ యాప్‌లోని ప్రధాన ఫీచర్ల గురించి వివరించే వీడియోను ప్రదర్శించారు. దీనిలో విభిన్నమైన ఎస్‌డబ్ల్యూఎం సాంకేతికతలు, నిర్వహణ విధానాల్లో వెలువడే ఉద్గారాలను లెక్కించడంలో యూఎల్‌బీలకు జీహెచ్‌జీ ఎలా తోడ్పడుతుందో వివరించారు. ప్రత్యామ్నాయ వ్యర్థ నిర్వహణ మార్గాలను విశ్లేషించడానికి, తక్కువ కర్బన ఉద్గారాలు వెలువడే పద్ధతులను గుర్తించడానికి తులనాత్మక విధానాలను కూడా బృందం సమర్పించింది. వీటితో పాటు బయో మైనింగ్, వాయు రహిత విచ్ఛిన్నం, వ్యర్థాల నుంచి విద్యుత్తు, వ్యర్థాలను పూడ్చే పద్ధతుల లాంటి ఘన వ్యర్థాల నిర్వహణ పద్ధతులకు సంబంధించిన సమగ్ర ఎల్సీఏ వివరాలను అందించింది.

ఈ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేసిన జీహెచ్‌జీ కాలిక్యులేటర్ యాప్ దిగువ పేర్కొన్న అంశాలకు మద్దతు ఇస్తుంది. వాటిని సాధ్యం చేస్తుంది.

§  పట్టణ స్థానిక సంస్థ (యూఎల్‌బీ)ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన, సులభంగా వినియోగించదగిన ఈ జీహెచ్‌జీ కాలిక్యులేటర్ యాప్ ప్రస్తుతమున్న ఘన వ్యర్థాల నిర్వహణ పద్ధతుల నుంచి వెలువడే ఉద్గారాలను సమగ్రంగా విశ్లేషిస్తుంది.

§  వాయు రహిత విచ్ఛిన్నం, దహనం (వ్యర్థాల నుంచి విద్యుత్తు), కంపోస్టింగ్, రీసైక్లింగ్, పూడ్చివేత లాంటి వ్యర్థాల నిర్వహణ పద్ధతులు ఈ యాప్‌లో ఉన్నాయి.

§  నికర ఉద్గారాలు, నివారించిన ఉద్గారాలు, రవాణా సంబంధిత ఉద్గారాలు, కార్బన్ ఫుట్‌ప్రింట్‌తో పాటు వివిధ రకాల గ్రీన్‌హౌస్ వాయువుల (మీథేన్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, బ్లాక్ కార్బన్) సమాచారాన్ని ఈ యాప్ అందిస్తుంది.

§  ఈ యాప్, అతి తక్కువ కార్బన్ ఫుట్‌ప్రింట్‌తో పాటు కనిష్ట గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను వెలువరిచే వివిధ ఉత్తమ వ్యర్థాల నిర్వహణ పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించడంలో యూఎల్‌బీలకు సహాయపడుతుంది.

§  కొత్త ప్రాజెక్టుల పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయడానికి, వివిధ కన్సల్టెంట్లు రూపొందించే సమగ్ర ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్) విశ్లేషణకు, టెండర్లలో తప్పనిసరిగా సమర్పించాల్సిన పర్యావరణ పనితీరు గణాంకాలను నమోదు చేయడానికి ఈ యాప్‌ను ఉపయోగించవచ్చు.

ఈ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేసిన ఎల్‌సీఏ విధానానికి, అప్లికేషన్‌కు ఉన్న ప్రాముఖ్యాన్ని ప్రొఫెసర్  సూద్ వివరించారు. ఈ సాధనాలు ప్రణాళికలను రూపొందించడంలో పట్టణ స్థానిక సంస్థలకు శాస్త్రీయ ఆధారాలను అందిస్తాయని తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా తెలివైన, పటిష్టమైన, తక్కువ ఉద్గారాలను వెలువరించే ఘన వ్యర్థాల నిర్వహణను సాధించే దిశగా మారేందుకు సహకరిస్తాయని చెప్పారు.

స్వచ్ఛ భారత్ మిషన్ – అర్బన్‌కు అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉందని డాక్టర్ మైని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇలాంటి పరిష్కారాలను విస్తృతంగా అమలు చేయడానికి సహకరించే సంస్థాగత యంత్రాంగాల ఆవశ్యకతను తెలియజేశారు.

ప్రస్తుత, భవిష్యత్ ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన వ్యూహాత్మక సిఫార్సులను కూడా ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదించింది. వీటితో పాటు వాతావరణ మార్పులను తట్టుకునేలా, తక్కువ ఉద్గారాలు వెలువడే వ్యర్థాల నిర్వహణ దిశగా భారత్ అడుగులు వేయడానికి ఒక జాతీయ ప్రణాళికను అందించింది.

image.png

 

సమావేశంలో విడుదల చేసిన ‘భారత్‌లో ఘన వ్యర్థాల నిర్వహణ (ఎస్‌డబ్ల్యూఎమ్)కు ఎల్‌సీఏ విధాన అభివృద్ధి’ నివేదికను దిగువ లింకులో చూడొచ్చు.

https://psa.gov.in/CMS/web/sites/default/files/publication/Integrated_Report_IISc_BHU_IITM_Final%20%281%29.pdf

 

***


(రిలీజ్ ఐడి: 2311264) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Tamil