బొగ్గు మంత్రిత్వ శాఖ
సొంత అవసరాల కోసం కేటాయించిన బొగ్గు గనుల అభివృద్ధిని వేగవంతం చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరిన బొగ్గు మంత్రిత్వశాఖ… రాష్ట్ర బొగ్గు అవసరాలను తీర్చేందుకు కట్టుబడి ఉన్న కోల్ ఇండియా లిమిటెడ్
కేటాయింపులు జరిగి దశాబ్దానికి పైగా కాలం గడచినా కార్యరూపం దాల్చని సహర్‌పూర్ జమర్‌పాని బొగ్గు గనిలో 973 మిలియన్ టన్నులకు పైగా నిల్వలు... కోల్ ఇండియా నిరంతర సరఫరాల కారణంగా క్రమంగా పెరుగుతున్న యూపీఆర్‌వీయూఎన్ఎల్ బొగ్గు నిల్వలు
నాడు పోస్టు చేయడమైనది:
17 SEP 2026 8:51AM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్‌లో బొగ్గు సరఫరా నిలిచిపోవటం వల్ల తీవ్రమైన విద్యుత్ కొరత ఏర్పడిందని ఇటీవల మీడియా కథనాలు వెల్లడించాయి. రాష్ట్ర అవసరాలు తీర్చేందుకు తగినంత బొగ్గును కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) అందిస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితిని స్పష్టం చేయటానికి, సొంత అవసరాలకు కేటాయించిన గనుల అభివృద్ధిని వేగవంతం చేయాలని తెలిపేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ పలు అంశాలను నమోదు చేస్తోంది.
15.09.2026 నాటికి ఉత్తరప్రదేశ్ రాజ్య విద్యుత్ ఉత్పాదన నిగమ్ లిమిటెడ్ (యూపీఆర్‌వీయూఎన్ఎల్)కు సంబంధించిన థర్మల్ పవర్ ప్లాంట్లలో ఎక్కడా బొగ్గు నిల్వలు నిండుకోలేదు. కాబట్టి ప్రస్తుత నిల్వ స్థితికి సంబంధించి ప్లాంట్ స్థాయిలో బొగ్గు లభ్యతకు సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితులు లేవు.
సొంత అవసరాల కోసం కేటాయించిన గనుల అభివృద్ధిని వేగవంతం చేయాల్సిన యూపీ
జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో 973 మిలియన్ టన్నులకుపైగా నిల్వలున్న సహర్‌పూర్ జమర్‌పాని బొగ్గు బ్లాక్‌ను, ఉత్తరప్రదేశ్ రాజ్య విద్యుత్ ఉత్పత్తి నిగమ్ లిమిటెడ్ (యూపీఆర్‌వీయూఎన్ఎల్) థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల బొగ్గు అవసరాలను తీర్చేందుకు కేటాయించారు. బొగ్గు గనుల (ప్రత్యేక నిబంధనలు) చట్టం-2015 ద్వారా 13.08.2015న బొగ్గు మంత్రిత్వ శాఖ యూపీఆర్‌వీయూఎన్ఎల్‌కు కేటాయించింది.
ఈ బ్లాక్ కేటాయించి పదేళ్లు గడుస్తున్నా యూపీఆర్‌వీయూఎన్ఎల్ నుంచి ఎలాంటి కార్యాచరణ లేకపోవటం వల్ల పురోగతి జరగలేదు. ఫలితంగా ఉత్తరప్రదేశ్ విద్యుత్ కేంద్రాల పూర్తి బొగ్గు అవసరాలు ఇప్పటికీ సీఐఎల్ ద్వారానే తీరుతున్నాయి.
సహర్‌పూర్ జమర్‌పాని కేటాయింపు తర్వాత విద్యుత్ రంగంలో సొంత వినియోగానికి కేటాయించిన పద్నాలుగు ఇతర బొగ్గు బ్లాకులు ఇప్పటికే కార్యరూపం దాల్చాయి. అనుబంధ ప్లాంట్ల కోసం బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించాయి. విద్యుత్ ప్లాంట్లకు దీర్ఘకాలిక ఇంధన భద్రతను చేకూర్చేందుకు, బాహ్య వనరులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు సహర్‌పూర్ జమర్‌పాని బ్లాక్ అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని బొగ్గు మంత్రిత్వ శాఖ కోరింది.
బొగ్గు సరఫరా స్థితి: యూపీఆర్‌వీయూఎన్ఎల్‌కు పూర్తి మద్దతిస్తున్న సీఐఎల్
యూపీఆర్‌వీయూఎన్ఎల్ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. సెప్టెంబర్ 1, 2026 నాటికి 7.25 లక్షల టన్నులు (ఎల్‌టీ)గా ఉన్న బొగ్గు నిల్వలు, సెప్టెంబర్ 15 నాటికి 8.41 లక్షల టన్నులకు పెరిగాయి. గత ఏడు రోజుల్లో రోజువారీ సగటు బొగ్గు వినియోగం సుమారు 0.83 లక్షల టన్నులు ఉండగా, రోజువారీ సగటు బొగ్గు రాక సుమారు 0.90 లక్షల టన్నులుగా ఉంది. ఇది నిల్వలు నిరంతరం పెరుగుతున్నట్లు తెలియజేస్తుంది.
|
అనుబంధ సంస్థ
|
01.09.2026 నాటికి
|
15.09.2026 నాటికి
|
|
యూపీఆర్‌వీయూఎన్ఎల్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు(ఎల్‌టీ)
|
7.25
|
8.41
|
ఈ మెరుగుదల రైల్వే సరఫరాల నిరంతర కొనసాగింపులో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. గత 10 రోజుల్లో యూపీఆర్‌వీయూఎన్ఎల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకు సగటున దాదాపు 17.7 రేక్స్ చొప్పున సీఐఎల్ సరఫరా చేసింది. థర్మల్ పవర్ ప్లాంట్ల (టీపీపీలు) వద్ద నిల్వలను మరింత పెంచేందుకు సీఐఎల్ 03.09.2026న యూపీఆర్‌వీయూఎన్ఎల్‌తో సహా అన్ని జెన్‌కోలు, ఐపీపీలకు రోడ్డు, ఆర్‌సీఆర్ పద్ధతిలో అదనపు బొగ్గును అందించింది.
యూపీఆర్‌వీయూఎన్ఎల్ ప్లాంట్ల వద్ద దృష్టి సారించాల్సిన అంశాలు
వివిధ ప్లాంట్ల వద్ద అన్-లోడింగ్ ఇబ్బందుల వల్ల రైల్వే వారు ఎప్పటికప్పుడు రేక్స్ నిల్వపై ఆంక్షలు విధిస్తున్నారు. దీనివల్ల బొగ్గు సరఫరాను పెంచేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
బొగ్గు నిల్వలు 8 ఎల్‌టీలకు పైగా పెరిగినప్పటికీ, యూపీఆర్‌వీయూఎన్‌ఎల్ థర్మల్ విద్యుత్ కేంద్రాల ప్రస్తుత నెల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) కేవలం 48 శాతంగానే ఉంది. ప్రస్తుత నెలలో విద్యుత్ ఉత్పత్తి తగ్గటానికి కారణం... ప్లాంట్ వద్ద సరిపడా బొగ్గు నిల్వలు లేకపోవటం కాదు. విద్యుత్ ఉత్పత్తి మెరుగుపడాలంటే విద్యుత్ కేంద్రాల వద్ద ఉన్న నిర్వహణ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి. అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వలను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది.
ఉత్తరప్రదేశ్‌తో పాటు దేశం మొత్తానికి బొగ్గును సరఫరా చేసేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ, కోల్ ఇండియా లిమిటెడ్ పూర్తిగా కట్టుబడి ఉన్నాయి. థర్మల్ పవర్ ప్లాంట్ల కోసం దీర్ఘకాలిక ఇంధన భద్రతను పెంపొందించుకునేందుకు, బాహ్య బొగ్గు వనరులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు, సహర్‌పూర్ జమర్‌పాని వద్ద ఉన్న సొంత వినియోగ బొగ్గు గనుల అభివృద్ధికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రిత్వ శాఖ సూచిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2311238)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8