ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భాషిణి, కరెంట్ ఏఐ, కల్ప ఇంపాక్ట్ ఆధ్వర్యంలో వ్యోమ ఇన్నొవేషన్ చాలెంజ్‌ ముగింపు కార్యక్రమం


భారత్ పరిస్థితులకు అనుగుణంగా ఓపెన్ సోర్స్ పరిష్కారాలు

ఢిల్లీ ఐఐటీలో కార్యక్రమం: నాలుగు ఆవిష్కరణలకు గుర్తింపు

తుది దశకు 10 బృందాలు: నమూనాల ప్రదర్శన

నాడు పోస్టు చేయడమైనది: 16 SEP 2026 4:05PM by PIB Hyderabad

కరెంట్ ఏఐ, కల్ప ఇంపాక్ట్ సంస్థలతో కలిసి... కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖకు చెందిన డిజిటల్ ఇండియా కార్పొరేషన్ పరిధిలోని ‘డిజిటల్ ఇండియా భాషణి విభాగం (డీఐబీడీ)’ ఢిల్లీ ఐఐటీలో వ్యోమ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించింది. వివిధ భారతీయ అవసరాలకు ఉపయోగపడే ఓపెన్ సోర్స్ ఏఐ హార్డ్‌వేర్ ఆధారిత ఆచరణాత్మక అప్లికేషన్లను అభివృద్ధి చేస్తున్న పరిశోధకులు, విద్యార్థులు, అంకుర సంస్థలను ఈ కార్యక్రమం ఒకే వేదికపైకి చేర్చింది.

 

భాషిణి, కరెంట్ ఏఐ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘సునో సూత్ర’ అనే చేతిలో ఇమిడిపోయే ఓపెన్ సోర్స్, బహుభాషా ఏఐ రిఫరెన్స్ డిజైన్ ఆధారంగా కొత్త ఆవిష్కరణలు చేయాల్సిందిగా ఈ ఛాలెంజ్ భాగస్వాములను ఆహ్వానించింది. ప్రజాప్రయోజన అనువర్తనాలు, ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా ఏఐ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లను ఎలా మలచుకోవచ్చో పరిశోధించేలా ఛాలెంజ్‌ను రూపొందించారు.

 

వ్యోమ ఇన్నోవేషన్ ఛాలెంజ్ తుది పోటీలకు చేరిన 10 బృందాలు ఒకే వేదికపైకి వచ్చి, తయారు చేసిన అప్లికేషన్లను ప్రదర్శించాయి. ఆరోగ్య రక్షణ, వ్యవసాయం, సంక్షేమ పథకాల లభ్యత, న్యాయ సేవలు, దివ్యాంగుల సేవల వంటి కీలక అంశాలపై వీటిని రూపొందించారు. భారతీయ అవసరాలు, క్షేత్రస్థాయి పరిమితులకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఏఐ సాంకేతికత సామర్థ్యాన్ని ఈ ఆవిష్కరణలు చాటాయి.

 

తుది పోటీల్లో 10 ఫైనలిస్టు బృందాలు తమ ప్రొటోటైప్‌లను ప్రదర్శించాయి. అనంతరం జ్యూరీ సభ్యులు ప్రశ్నలు అడిగి తమ సలహాలు, సూచనలను అందించారు. వివిధ రంగాలు, కమ్యూనిటీలు ఎదుర్కొంటున్న నిర్దిష్ట సమస్యల పరిష్కారం కోసం ఓపెన్ సోర్స్ ఏఐ హార్డ్‌వేర్‌ను ఎలా వినియోగించుకోవచ్చో వివరిస్తూ ఆయా బృందాలు తమ ఆవిష్కరణలను ప్రదర్శించాయి.

 

ఓపెన్ సోర్స్ ఏఐ హార్డ్‌వేర్, బహుభాషా ఏఐ, ఎడ్జ్ ఏఐ రంగానికి చెందిన సమగ్ర వ్యవస్థాగత యంత్రాంగాన్నీ ఈ ఛాలెంజ్ ఒకే వేదికపైకి తెచ్చింది. ఇందులో పాల్గొన్న బృందాలు హార్డ్‌వేర్ ఆప్టిమైజేషన్, మోడల్ క్వాంటైజేషన్, కచ్చితత్వం, ఆశాజనకమైన ఆలోచనలను క్షేత్రస్థాయి వినియోగంలోకి తీసుకువెళ్లే మార్గాలపై నిపుణులతో చర్చించాయి.

 

ఫైనల్ సందర్భంగా ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికతా మంత్రిత్వశాఖ శాస్త్రవేత్త (జి) కవితా భాటియా మాట్లాడుతూ... ‘‘ప్రపంచ ఏఐ సాంకేతికతలను ఉపయోగించుకునే స్థాయి నుంచి, సొంత అవసరాల కోసం సార్వత్రిక, ప్రజాప్రయోజన సాంకేతికతలను స్వయంగా నిర్మించుకునే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. అయితే ప్రయోగశాలల్లోనో లేదా ప్రయోగాత్మక ప్రాజెక్టుల్లోనో కాదు... క్షేత్రస్థాయిలో కోట్లాది ప్రజలకు ఎంతవరకూ ఉపయోగపడుతుందన్నదే విజయానికి నిజమైన కొలమానం. స్థానికంగా పనిచేస్తూ, ఆఫ్‌లైన్‌లో సేవలందిస్తూ, బ్యాండ్‌విడ్త్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తూ, వ్యక్తిగత గోప్యతను కాపాడే పరిష్కారాల ద్వారా ఏఐని సామాన్యుడికి మరింత చేరువ చేసేందుకు... ఓపెన్ సోర్స్ హార్డ్‌వేర్‌ను, భాషిణి భాషా సామర్థ్యాలను ‘వ్యోమ’ వేదిక ఒకే వేదికపైకి తెచ్చింది. అందుబాటు ధరల్లో లభించేలా అరచేతిలో ఇమిడిపోగల పరికరాలు, స్థానిక భాషల్లో ఏఐ సేవలందించేలా తీర్చిదిద్దడం ద్వారా... సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సులభంగా, సానుకూలంగా సాంకేతికత ఎలా చేరువ కాగలదో ఈ కార్యక్రమం నిరూపిస్తోంది’’ అన్నారు.

 

శాస్త్రవేత్త () తరుణ్ పాండే మాట్లాడుతూ... ‘‘నూతన సాంకేతికత ప్రాతిపదికగా ఆచరణాత్మక అప్లికేషన్ల రూపకల్పన దిశగా యువ ఆవిష్కర్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులను వ్యోమ వంటి హ్యాకథాన్‌లు ఒక్కచోటకు తెస్తాయి. ప్రజాప్రయోజనాలే వీటి లక్ష్యం. ఆవిష్కరణలను ప్రోత్సహించడం, దేశీయ ఏఐ సామర్థ్యాలను బలోపేతం చేయడం, వైవిధ్యభరితమైన దేశ అవసరాలకు అనుగుణంగా అందరికీ అందుబాటులో ఉండే భాషా సాంకేతికతలను రూపొందించడంలో భాషిణి అంకితభావాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది. ఈ ఛాలెంజ్ ద్వారా ఆవిష్కృతమవుతున్న సాధనాలు.. అందరికీ అందుబాటులో ఉండే, సార్వత్రిక, స్థానిక అవసరాలకు తగిన ఏఐ సాంకేతిక వ్యవస్థను నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తాయి’’ అన్నారు.

 

డిజిటల్ ఇండియా భాషిణి విభాగం సీఈవో అమితాభ్ నాగ్ మాట్లాడుతూ... ‘‘సమ్మిళితత్వంలో భాష ఒక భాగం. అలాగే క్షేత్రస్థాయికి సాంకేతికతను చేర్చడం మరో కీలకమైన అంశం. ముఖ్యంగా వైవిధ్యభరితమైన, ఇంటర్నెట్ నెట్‌వర్క్ పరిమితులు ఉన్న ప్రాంతాల్లో ఏఐని మరింతగా అందుబాటులోకి తెచ్చే సార్వత్రిక, ఆఫ్‌లైన్ హార్డ్‌వేర్‌ను అన్వేషించాల్సిన ఆవశ్యకతే ‘వ్యోమ’ ఆవిర్భావానికి మూలం. క్షేత్రస్థాయిలో ఉపయోగపడే నిజమైన సాధనంగా ఓపెన్ హార్డ్‌వేర్ ఎలా నిలవగలదో ఈ బృందాల ఆవిష్కరణలు నిరూపించాయి. ఈ రోజు ఒక మైలురాయి. నూతన ప్రయాణానికి ఇది ఆరంభం కూడా. వినియోగదారుల అభిప్రాయాలు, భాగస్వామ్యాలు, నిరంతర అభ్యసనం ద్వారా ఈ సాధనాలను మరింత మెరుగుపరచడంపైనే ఇప్పుడు మనం ప్రధానంగా దృష్టి సారించాలి’’ అన్నారు.

 

ఫైనల్ వేడుకలో ‘సునో సూత్ర’ రిఫరెన్స్ డిజైన్‌ ప్రదర్శనతోపాటు.. వ్యోమ ఇన్నోవేషన్ ఛాలెంజ్ పరిణామం, ఇందులో పాల్గొన్న బృందాలు అభివృద్ధి చేసిన నూతన వినియోగ నమూనాలు, ఓపెన్ సోర్స్ ఏఐ హార్డ్‌వేర్, ఎంబెడెడ్ ఏఐ వ్యవస్థల విస్తృత సామర్థ్యంపైనా చర్చించారు.

 

వ్యోమ ఇన్నొవేషన్ ఛాలెంజ్‌లో నాలుగు ఆవిష్కరణలు విజేతలుగా నిలిచాయి. ఆవిష్కరణతోపాటు ప్రజాప్రయోజన రంగంలో దానిని ఉపయోగించే అవకాశాలను గుర్తిస్తూ.. విజేతగా నిలిచిన ప్రతి బృందానికి నగదు బహుమతిని అందించారు.

 

వ్యోమ ఇన్నొవేషన్ ఛాలెంజ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి.. గౌరవ జ్యూరీ సభ్యుల గుర్తింపును పొందిన నాలుగు విజేత బృందాలు: ఆశా సహాయక్ బృందం, శ్రవణ్ బృందం, సంగ్రహ - అప్నా సాథీ బృందం, సహాయక్ మిత్ర – ఏవీఈఆర్ఏ (అటానామస్ వాయిస్-ఎనేబుల్డ్ ఎడ్జ్ రూరల్ అడ్వైజర్) బృందం.

 

మానవుడే కేంద్రంగా ఓపెన్ సోర్స్, బహుభాషా ఏఐ హార్డ్‌వేర్‌ను ప్రోత్సహించడం కోసం.. 2026 ఫిబ్రవరిలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో ఆవిష్కరించిన సునో సూత్ర లక్ష్యాలకు అనుగుణంగానే ఈ వ్యోమ ఇన్నొవేషన్ ఛాలెంజ్ రూపుదిద్దుకుంది. వర్ధమాన ఆవిష్కర్తలకు ఈ రిఫరెన్స్ డిజైన్‌ను అందించడం ద్వారా.. విభిన్న వాతావరణాలు, వినియోగ సందర్భాలు, ప్రాంతీయ నేపథ్యాలకు తగిన విధంగా ప్రయోగాలు, తగిన మార్పుల దిశగా ఈ ఛాలెంజ్ వారికి ప్రోత్సాహాన్నిచ్చింది.

 

ఈ పోటీకే పరిమితం కాకుండా.. దేశంలోని విభిన్నమైన భాషా, సాంకేతిక, ప్రాంతీయ వాతావరణాలకు అనుగుణంగా మారగల బహుభాషా, ఎడ్జ్ ఏఐ సాంకేతికతలను విస్తరింపజేస్తూనే, ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ కోసం ఒక సమగ్ర సార్వత్రిక వ్యవస్థను అందించడమే వ్యోమ ప్రధాన లక్ష్యం.

 

ఆచరణీయ, అందరికీ అందుబాటులో ఉండే, స్థానిక అవసరాలకు తగిన ఏఐ సాధనాల అభివృద్ధి దిశగా.. ఆవిష్కర్తలు, పరిశోధకులు, ప్రభుత్వ భాగస్వాములు, వ్యవస్థాగత యంత్రాంగమంతటినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో కీలక మైలురాయిగా ఈ ఫైనల్ వేడుక నిలిచింది.

 

డిజిటల్ ఇండియా భాషిణి విభాగం (డీఐబీడీ) గురించి

ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికతా మంత్రిత్వశాఖ పరిధిలోని డిజిటల్ ఇండియా కొర్పొరేషన్ (డీఐసీ) కింద పనిచేసే డిజిటల్ ఇండియా భాషిణి విభాగం (డీఐబీడీ).. ఏఐ ఆధారిత బహుభాషా డిజిటల్ సమ్మిళితత్వం కోసం ఒక జాతీయ స్థాయి వ్యవస్థను నిర్మిస్తోంది. వచనపరంగా 36 భారతీయ భాషలు, ధ్వనిపరంగా 23 భారతీయ భాషలు, 35 అంతర్జాతీయ భాషలు ‘భాషిణి’లో అందుబాటులో ఉన్నాయి. ఇది 800కు పైగా ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో సేవలందిస్తూ.. ఇప్పటివరకు మొత్తం 9 బిలియన్లకు పైగా ఏఐ నిర్దేశాలను అందించింది. అంతేకాకుండా రోజూ 24 మిలియన్లకు పైగా ఏఐ నిర్దేశాలను ప్రాసెస్ చేస్తూ.. లాంగ్వేజ్ ఏఐ ద్వారా డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను ప్రజలందరికీ మరింతగా అందుబాటులోకి తేవడంలో సాయమందిస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అతిపెద్ద నిర్దేశక వేదికల్లో ఒకటిగా జాతీయ భాషా సాంకేతికతా కేంద్రం (ఎన్‌హెచ్ఎల్టీ) సేవలందిస్తోంది. ప్రభుత్వ, ప్రజలకు అందుబాటులో ఉండే డిజిటల్ సేవల్లో పెరుగుతున్న లాంగ్వేజ్ ఏఐ వినియోగానికి ఇది తోడ్పాటునందిస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2311152) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , English , Urdu , Marathi