బొగ్గు మంత్రిత్వ శాఖ
వాణిజ్య బొగ్గు గనుల వేలం 16వ విడతను ప్రారంభించనున్న బొగ్గు మంత్రిత్వశాఖ
నాడు పోస్టు చేయడమైనది:
16 SEP 2026 5:17PM by PIB Hyderabad
16వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలాన్ని సెప్టెంబర్ 17న న్యూఢిల్లీలో బొగ్గు మంత్రిత్వశాఖ ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు, గనులశాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
వాణిజ్య బొగ్గు తవ్వకాలను 2020లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. గత ఆరేళ్లలో పూర్తయిన 15 విడతల వేలం ప్రక్రియల ద్వారా మొత్తం 147 బొగ్గు గనులను విజయవంతంగా వేలం వేశారు. దీని ద్వారా ఈ రంగంలోకి 44 కొత్త కంపెనీలు ప్రవేశించాయి. వేలం వేసిన గనుల ద్వారా ఏటా సుమారు రూ.47,500 కోట్ల ఆదాయం సమకూరుతున్నట్లు అంచనా. దాదాపు రూ.55,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంతోపాటు బొగ్గు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో సుమారు 4.9 లక్షల ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని భావిస్తున్నారు.
16వ విడతలో పూర్తిగా అన్వేషించిన, పాక్షికంగా అన్వేషించిన కొత్త బొగ్గు బ్లాకులను వేలం వేయనున్నారు. ఈ వేలం విధానంలో అత్యంత సరళమైన నిబంధనలు కొనసాగుతాయి. గనుల నుంచి తీసిన బొగ్గును ఏ నిర్దిష్ట ప్రయోజనం కోసం వినియోగించాలనే దానిపై పరిమితులు లేవు. అలాగే ఆటోమేటిక్ మార్గం ద్వారా 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీవై) అనుమతిస్తారు. తక్కువ ముందస్తు చెల్లింపులు మాత్రమే ఉంటాయి. వీటిని భవిష్యత్తు ఆదాయంలో సర్దుబాటు చేసుకోవచ్చు. చిన్న సంస్థలు, తొలిసారి వేలంలో పాల్గొనే సంస్థలు సులభంగా రంగంలోకి ప్రవేశించడంతో పాటు, ఇప్పటికే ఈ రంగంలో ఉన్న పెద్ద మైనింగ్ కంపెనీలు, సాంకేతికత ఆధారిత సంస్థలు కూడా పోటీలో పాల్గొనేలా ఈ నిబంధనలు రూపొందించారు.
వాణిజ్య బొగ్గు గనుల వేలం కార్యక్రమం దేశీయ బొగ్గు ఉత్పత్తి, అందుబాటును క్రమంగా పెంచింది. బొగ్గు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు కూడా మద్దతుగా నిలుస్తోంది. 16వ విడత వేలం ద్వారా అదనపు బొగ్గు బ్లాకులను ఉత్పత్తిలోకి తీసుకురావడం, మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఈ రంగంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈ పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
భారత్ దీర్ఘకాలిక ఇంధన భద్రత లక్ష్యాలకు అనుగుణంగా దేశానికి నమ్మకమైన, అందుబాటు ధరలో ఇంధన సరఫరా అందేలా చూడటానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2311149)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11