ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఈశాన్య ప్రాంతంలో డీఆర్ఐ మెరుపు దాడులు.. భారీగా మెథాంఫెటమైన్ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు
231 కిలోలకు పైగా మెథాంఫెటమైన్ మాత్రలు స్వాధీనం.. నాలుగు ట్రక్కుల అడ్డగింపు, ముగ్గురు అరెస్టు
స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల మార్కెట్ విలువ రూ. వంద కోట్లకు పైమాటే
నాడు పోస్టు చేయడమైనది:
16 SEP 2026 3:43PM by PIB Hyderabad
మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) మెరుపు దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఈశాన్య ప్రాంతంలో చేపట్టిన సోదాల్లో భాగంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాను డీఆర్ఐ ఛేదించింది. దీంతో ఈ ప్రాంతంలో భారీ మొత్తంలో మెథాంఫెటమైన్ పట్టుబడింది. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల అక్రమ మార్కెట్ విలువ రూ.వందల కోట్లుగా పైగా ఉంటుందని అంచనా. నిఘా సమాచారం ఆధారంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో పాటు పలు ప్రాంతాల్లో సమన్వయ నిఘా చేపట్టడంతోపాటు ఏకకాలంలో వాహనాలను అడ్డగించారు. ఈ చర్యల్లో భారీగా మెథాంఫెటమైన్ సరుకు స్వాధీనం చేసుకున్నారు.
పక్కా నిఘా సమాచారంతో 15.09.2026న అస్సాం, త్రిపురలోని పలు ప్రాంతాల్లో భారీగా మెథాంఫెటమైన్ మాత్రలను తరలిస్తున్నట్లు అనుమానించిన నాలుగు ట్రక్కులను డీఆర్‌ఐ అధికారులు అడ్డగించారు.
15.09.2026న చేపట్టిన తొలి ఆపరేషన్‌లో అనుమానాస్పద ట్రక్కుల్లో ఒకదాన్ని అస్సాంలోని రామ్‌నాథ్‌పూర్ వద్ద గుర్తించి అడ్డుకున్నారు. ఇది సిల్చార్‌కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ చర్యకు 38వ బెటాలియన్ అస్సాం రైఫిల్స్ సహకరించింది. అనంతరం ఇదే తరహా సరుకును తరలిస్తున్న మరో అనుమానాస్పద ట్రక్కును సమీప ప్రాంతంలో గుర్తించారు. అయితే ఆ వాహనం వద్ద డ్రైవర్ గానీ, సహయకుడు గానీ ఎవరూ కనిపించలేదు.
మొదటి ట్రక్కును క్షుణ్ణంగా తనిఖీ చేయగా, డ్రైవర్ క్యాబిన్ పైకప్పులో దాచిన 275 ప్యాకెట్లలో మొత్తం 55 కిలోల బరువున్న గులాబీ-నారింజ రంగు మాత్రలు లభించాయి. ఇవి మెథాంఫెటమైన్ మాత్రలుగా అనుమానిస్తున్నారు. రెండో ట్రక్కును కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అదే రంగులో ఉన్న మాత్రలతో కూడిన 271 ప్యాకెట్లు బయటపడ్డాయి. వీటి మొత్తం బరువు 54.2 కిలోలు. వీటిని కూడా డ్రైవర్ క్యాబిన్ పైకప్పులోనే దాచారు. దీంతో మొత్తం 109.2 కిలోల అనుమానిత మెథాంఫెటమైన్ మాత్రలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద రెండు వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు ఒకరిని అరెస్టు చేశారు.
ఇదే నిఘా ఆధారిత ఆపరేషన్‌లో భాగంగా సిమెంట్ లోడ్‌తో ఖోవై నుంచి అగర్తలా వైపు వెళ్తున్న మరో సరుకు రవాణా వాహనాన్ని డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. అగర్తలాకు సుమారు 45 కిలోమీటర్ల దూరంలోని టెలియామురా వద్ద 28వ బెటాలియన్ అసోం రైఫిల్స్ సహకారంతో అడ్డుకున్నారు. వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, డ్రైవర్ క్యాబిన్ పైకప్పులో దాచిన 295 ప్లాస్టిక్ ప్యాకెట్లు లభించాయి. వాటిలో మెథాంఫెటమైన్‌గా అనుమానిస్తున్న గులాబీ-నారింజ రంగు మాత్రలు ఉన్నాయి. వీటి మొత్తం బరువు 72.6 కిలోలు కాగా అక్రమ సరుకుతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అరెస్టు చేశారు.
ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో అందిన అదనపు సమాచారం ఆధారంగా సేకరించిన డీఆర్‌ఐ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. దీంతో అదే ముఠాకు చెందిన మరో ట్రక్కును త్రిపురలోని పానిసాగర్ సమీపంలో అడ్డుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో కూడా దాచిన 50 కిలోల అనుమానిత మెథాంఫెటమైన్ మాత్రలు లభ్యమయ్యాయి. నిషేధిత సరుకును, వాహనాన్ని స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అరెస్టు చేశారు.
డీఆర్‌ఐ చేపట్టిన సమన్వయ చర్యల ఫలితంగా మొత్తం 231.8 కిలోల అనుమానిత మెథాంఫెటమైన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. అక్రమ సరుకు రవాణాకు ఉపయోగించిన నాలుగు ట్రక్కులను స్వాధీనం చేసుకున్నారు.
గతంలో ఆగస్టు 2026లో సిల్చార్, మిజోరాం సమీప ప్రాంతాల్లో డీఆర్ఐ చేపట్టిన రెండు ప్రత్యేక ఆపరేషన్లలో 76 కిలోల మెథాంఫెటమైన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో కూడా వివిధ ప్రాంతాల్లో వాహనాల్లో ఈ మాత్రలను దాచిపెట్టి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
****
(రిలీజ్ ఐడి: 2310937)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12