నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
'వరల్డ్ స్కిల్స్ షాంఘై-2026' కోసం బయలుదేరిన భారత యువ నిపుణుల బృందం
ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతి గాంచిన నైపుణ్య పోటీల 63 విభాగాల్లో పోటీపడనున్న 70 మంది సభ్యుల టీమిండియా
11 అత్యాధునిక, అభివృద్ధి చెందుతున్న నైపుణ్య విభాగాల్లో అరంగేట్రం చేయనున్న భారత్
నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, వినూత్న ఆలోచనలు కలిగిన యువ భారతీయులతోనే 'వికసిత్ భారత్ - కుశల్ భారత్' సాకారం: శ్రీ జయంత్ చౌదరి
నాడు పోస్టు చేయడమైనది:
15 SEP 2026 7:01PM by PIB Hyderabad
'వరల్డ్ స్కిల్స్ షాంఘై-2026'లో పాల్గొననున్న భారతీయ బృందం కోసం భారత నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ న్యూఢిల్లీలోని కౌశల్ భవన్‌లో ఈ రోజు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించింది.
చైనాలోని షాంఘైలో ఈ నెల 22 నుంచి 27 వరకు జరగనున్న 48వ 'వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్'లోని 63 నైపుణ్య విభాగాల్లో పోటీపడేందుకు 70 మంది భారత యువ నిపుణుల బృందం సిద్ధమవుతోంది. సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మకత, కచ్చితత్వం, ఆవిష్కరణ, పనితనం వంటి అంశాల్లో భారత్ సాధిస్తున్న ప్రగతిని ఈ పోటీదారులు ప్రపంచ వేదికపై ప్రదర్శించనున్నారు.
భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల స్థాపన శాఖ (స్వతంత్ర బాధ్యత), విద్యా శాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి... ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వృత్తి విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల స్థాపన శాఖ (స్వతంత్ర బాధ్యత) సహాయ మంత్రి శ్రీ కపిల్ దేవ్ అగర్వాల్... ఢిల్లీ (ఎన్సీటీ) ప్రభుత్వ హోం, విద్య, విద్యుత్, పట్టణాభివృద్ధి, ఉన్నత విద్య, శిక్షణ, సాంకేతిక విద్యా శాఖ మంత్రి శ్రీ ఆశిష్ సూద్... పార్లమెంటు సభ్యులు, జిందాల్ స్టీల్ చైర్మన్ శ్రీ నవీన్ జిందాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
వీరితో పాటు ఎంఎస్‌డీఈ కార్యదర్శి శ్రీమతి దేబాశ్రీ ముఖర్జీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ డైరెక్టర్ జనరల్ శ్రీ దిలీప్ కుమార్, ఎంఎస్‌డీఈ అదనపు కార్యదర్శి శ్రీ నిరంజన్ కుమార్ సుధాంశు, ఎంఎస్‌డీఈ సీనియర్ ఆర్థిక సలహాదారు శ్రీమతి మనీషా సేన్‌శర్మ, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈవో శ్రీ అరుణ్‌కుమార్ పిళ్ళై, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పరిశ్రమల, శిక్షణా సంస్థల ప్రతినిధులు, నిపుణులు, మార్గదర్శకులు, పోటీదారులు, వారి కుటుంబ సభ్యులూ పాల్గొన్నారు.
భారత బృందాన్ని ఉద్దేశించి కేంద్ర నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల స్థాపన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), విద్యా శాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి మాట్లాడుతూ... “ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, డిజిటల్ నైపుణ్యం కలిగిన తరానికి టీమిండియా ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో పోటీ పడటానికి వీరు సిద్ధంగా ఉన్నారు. నూతన నైపుణ్యాల్లో మన భాగస్వామ్యం నానాటికీ మెరుగవుతున్న భారత నైపుణ్య శిక్షణా వ్యవస్థ శ్రేష్టతను ప్రతిబింబిస్తోంది. ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా... నైపుణ్య పోటీలు, కౌశల్ మహోత్సవాలు, రాష్ట్రాలు-పరిశ్రమలతో బలమైన భాగస్వామ్యాల ద్వారా నైపుణ్య శిక్షణను ప్రభుత్వం ఉన్నత స్థాయికి తీసుకువెళుతోంది. ఏదో ఒక సమయంలో, ఇటువంటి ప్రపంచ స్థాయి నైపుణ్య పోటీలను బారత్‌లోనూ నిర్వహించాలని మనం ఆకాంక్షించాలి. మన పోటీదారులకు నేను చెప్పేది ఏంటంటే - మీ శిక్షణను నమ్మండి. ఏకాగ్రతతో ఉండండి. నిర్భయంగా పోటీపడండి. షాంఘై కేవలం ఒక పోటీ మాత్రమే కాదు... మీ నైపుణ్యం మిమ్మల్ని ఎంత దూరం తీసుకువెళ్లగలదో తెలుసుకోవడానికి చక్కటి అవకాశం. ‘ఎప్పటికీ వదిలేయవద్దు’ అనే స్ఫూర్తిని స్వీకరించండి. మీ అత్యుత్తమ పనితీరును కనబరచండి. ఆత్మవిశ్వాసంతో, గర్వంతో నైపుణ్యాల రంగాన్ని ఎంచుకునేలా ఒక తరాన్ని ప్రేరేపించండి.” అని పిలుపునిచ్చారు. ఐక్యత, జట్టు స్ఫూర్తిని చాటుతూ... వరల్డ్‌స్కిల్స్ షాంఘై-2026లో టీమిండియా ధరించనున్న, కొత్తగా ఆవిష్కరించిన భారత పోటీదారుల దుస్తులను శ్రీ జయంత్ చౌదరి ధరించారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వృత్తి విద్యా, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల స్థాపన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ కపిల్ దేవ్ అగర్వాల్ మాట్లాడుతూ... నాణ్యమైన శిక్షణ, పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం, బలమైన పరిశ్రమల అనుసంధానం ద్వారా స్కిల్ ఇండియా మిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నిరంతర మద్దతునిస్తోందని స్పష్టం చేశారు. వరల్డ్‌స్కిల్స్ షాంఘై-2026లో పాల్గొనే టీమిండియా జట్టులో ఉత్తరప్రదేశ్ నుంచి ప్రతిభావంతులైన యువత పాల్గొనడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో నైపుణ్య అవకాశాలను విస్తరించడానికి, యువత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వ హోం, విద్య, విద్యుత్, పట్టణాభివృద్ధి, ఉన్నత విద్య, శిక్షణ, సాంకేతిక విద్య శాఖల మంత్రి శ్రీ ఆశిష్ సూద్ మాట్లాడుతూ... విద్య, నైపుణ్యాలు, ఉపాధి మధ్య అంతరాన్ని పూడ్చాల్సిన ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. వరల్డ్‌స్కిల్స్ షాంఘై-2026లో టీమిండియా పాల్గొనడం... క్రమబద్ధమైన శిక్షణ, సరైన అవకాశాలు యువతను ప్రపంచ స్థాయిలో రాణించేలా చేయగలవని నిరూపిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవాన్ని, ఉపాధితో పాటు పరిశ్రమల స్థాపన కోసం స్పష్టమైన మార్గాలను అందించాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా యువతను సిద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ ఆశిష్ సూద్ పునరుద్ఘాటించారు.
ఈ భాగస్వామ్యం గురించి ప్రస్తావిస్తూ... జిందాల్ స్టీల్ ఛైర్మన్ శ్రీ నవీన్ జిందాల్ ఇలా అన్నారు. “భారత యువ నైపుణ్య ఛాంపియన్లు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, రాణించాలనే సంకల్పానికి ప్రతీకగా నిలుస్తారు. వరల్డ్‌స్కిల్స్ షాంఘై-2026కి దేశ ఆకాంక్షలను మోసుకువెళ్తున్న టీమిండియాకు మద్దతునివ్వడం మాకు గర్వకారణం. ప్రపంచం ముందు భారతీయ ప్రతిభను, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న ప్రతి పోటీదారునికి నా శుభాకాంక్షలు.” వరల్డ్‌స్కిల్స్ షాంఘై-2026లో టీమిండియాకు అధికారిక మర్చండైజ్ స్పాన్సర్‌గా జిందాల్ స్టీల్ వ్యవహరిస్తోంది. భారతీయ పోటీదారులు ప్రారంభ వేడుకలు, పోటీల కోసం ధరించే దుస్తులను అందిస్తోంది.
తొలిసారిగా, భారత్ 11 కొత్త నైపుణ్య విభాగాల్లో పోటీపడనుంది. అవి డెంటల్ ప్రొస్థెటిక్స్, డిజిటల్ ఇంటరాక్టివ్ మీడియా డిజైన్, ఇంటెలిజెంట్ సెక్యూరిటీ టెక్నాలజీ, ల్యాండ్‌స్కేప్ గార్డెనింగ్, ఆప్టో ఎలక్ట్రానిక్ టెక్నాలజీ, రిటైల్ సేల్స్, మానవరహిత వైమానిక వ్యవస్థలు, ఇండస్ట్రియల్ మెకానిక్స్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, హెవీ వెహికల్ టెక్నాలజీ, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్. ఈ పోటీల్లో భారత భాగస్వామ్యం... నానాటికీ మెరుగవుతున్న దేశ నైపుణ్య శిక్షణ వ్యవస్థ శ్రేష్టతనూ, పరిపక్వతనూ ప్రతిబింబిస్తోంది. ఈ వ్యవస్థ సంప్రదాయ వృత్తులను దాటి సంక్లిష్ట సాంకేతికతలు, ప్రత్యేక సేవలు, తదుపరి తరం పారిశ్రామిక సామర్థ్యాల దిశగా విస్తరిస్తోంది.
టీమిండియా సన్నాహాలకు రాష్ట్ర ప్రభుత్వాలు, నైపుణ్య రంగాలు, శిక్షణా సంస్థలు, పారిశ్రామిక భాగస్వాములు, నిపుణులు, మార్గదర్శకులతో కూడిన విస్తృతమైన నెట్‌వర్క్ మద్దతునిచ్చింది. ప్రత్యేక సౌకర్యాలు, పరికరాలు, సాంకేతిక నైపుణ్యం, అనుకరణలు, అంతర్జాతీయ అనుభవం ద్వారా... పోటీదారులు కచ్చితమైన ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ పొందేందుకు ఈ భాగస్వాములు సహాయం అందించారు.
వరల్డ్ స్కిల్స్ ఇండియా ఛాంపియన్స్ క్లబ్‌కు 16 మంది సభ్యులతో కూడిన మొదటి బృందాన్ని ఈ వేడుకలో ప్రకటించారు. విశిష్ట మాజీ పోటీదారులు, పతక విజేతలను భారత నైపుణ్యాల ఉద్యమానికి అంబాసిడర్‌లుగా చేర్చారు. ఈ ఛాంపియన్లు ఔత్సాహిక పోటీదారులకు మార్గనిర్దేశం చేసేందుకు, వారి అనుభవాలను పంచుకోవడానికి, మరింత మంది యువకులు ఆత్మవిశ్వాసంతో, శ్రేష్ఠతతో, గర్వంతో వారి నైపుణ్యాలను కొనసాగించేందుకు క్లబ్ స్ఫూర్తినిస్తుంది.
వరల్డ్‌స్కిల్స్... వృత్తి నైపుణ్యాల్లో శ్రేష్ఠతను గుర్తించి, ప్రోత్సహించే ప్రపంచంలోనే అగ్రగామి వేదిక. షాంఘై ఎడిషన్‌లో 60కి పైగా దేశాలు, ప్రాంతాల నుంచి 1,400 మందికి పైగా యువ పోటీదారులు 64 నైపుణ్యాల విభాగాల్లో పోటీపడతారు.
అంతర్జాతీయ నైపుణ్య పోటీల్లో భారత్ ప్రదర్శన స్థిరమైన పురోగతిని కనబరుస్తోంది. 2015లో 29వ స్థానంలో ఉన్న భారత్... వరల్డ్‌స్కిల్స్ లియోన్-2024లో 13వ స్థానానికి చేరుకుంది. ఆ పోటీల్లో నాలుగు కాంస్య పతకాలు, 12 మెడలియన్స్ ఫర్ ఎక్సలెన్స్‌ను కైవసం చేసుకుంది. వరల్డ్‌స్కిల్స్ ఆసియా-2025లో భారత్ ఆసియా స్థాయిలో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది.
షాంఘైకి బయలుదేరుతున్న 70 మంది సభ్యుల బృందం వెంట... దేశ ఆశలు... శిక్షకులు, మార్గదర్శకుల నైపుణ్యం... పరిశ్రమలు, సంస్థల మద్దతు... దేశవ్యాప్తంగా ఉన్న కుటుంబాల ప్రోత్సాహం ఉన్నాయి. సృజనాత్మక, నిర్మాణాత్మక, ఆవిష్కరణలు, నైపుణ్యంతో కూడిన పనితీరును కనబరిచేవారిదే భవిష్యత్తు అని ప్రపంచానికి చాటిచెప్పడానికి 'టీమిండియా' సిద్ధంగా ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2310761)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6