శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాల రూపకల్పన వేగిరం దిశగా ‘బ్రిక్‌-ఎన్‌ఐపీజీఆర్‌’లో ‘స్ప్రౌట్‌’ కేంద్రానికి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభోత్సవం

· “వాతావరణ పరిస్థితులు ఎలాంటివైనా పంటలపై పరిశోధనలను ‘స్ప్రౌట్‌’ సుసాధ్యం చేస్తుంది”

· “సత్వర పంట లక్షణాలు సహా మెరుగుదలతో జీనోమిక్స్.. జన్యు సాంకేతికతల అనుసంధానంలో ఇది తోడ్పడుతుంది”

· “బయోఈ3’ విధానం సహా జీవసాంకేతికతకు మోదీ ప్రభుత్వ ప్రోత్సాహంతో దేశీయ మొక్కల-మానవ జీవ సాంకేతికతలపరంగా భారత్‌ పురోగమనం”

· “స్పీడ్‌సీడ్ టెక్నాలజీతో శనగ ఉత్పాదక చక్రం సుమారు 40 రోజులకు తగ్గడం ద్వారా బ్రీడింగ్ వ్యవధి కూడా గణనీయంగా దిగివస్తుంది”

నాడు పోస్టు చేయడమైనది: 15 SEP 2026 4:31PM by PIB Hyderabad

   న్యూఢిల్లీలోని బ్రిక్-నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ (బ్రిక్‌-ఎన్‌ఐపీజీఆర్‌) ప్రాంగణంలో “స్పీడ్‌సీడ్ ఫినోటైపింగ్ అండ్ రిసోర్స్ ఆప్టిమైజేషన్ ఫర్ యూనిఫైడ్ ట్రెయిట్ అనాలిసిస్” (స్ప్రౌట్‌) కేంద్రాన్ని కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భూ విజ్ఞాన శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింగ్ ఈ రోజు ప్రారంభించారు. విభిన్న వాతావరణ పరిస్థితులకు తగిన, వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాల రూపకల్పనలో ఇదొక కీలక స్వదేశీ సామర్థ్యమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

భౌగోళికంగా, వ్యవసాయ-వాతావరణ పరంగా అత్యంత వైవిధ్యంగల భారత్‌ వంటి దేశంలో వ్యవసాయ పునరుత్థాన సామర్థ్య బలోపేతానికి వివిధ వాతావరణ పరిస్థితులలో పంటలపై అధ్యయనం, మూల్యాంకనం అత్యంత కీలకమని మంత్రి అన్నారు. ఇది విస్తృత ‘బయోఈ3’ విధానంతోపాటు మోదీ ప్రభుత్వం జీవసాంకేతికతకు ఇస్తున్న ప్రోత్సాహంలో భాగమని చెప్పారు. దీని కింద మొక్కల-మానవ జీవసాంకేతికతలలోనూ సమాంతర ప్రగతి నమోదవుతున్నదని మంత్రి తెలిపారు. వ్యూహాత్మక నేపథ్య రంగాల్లోనూ వాతావరణ మార్పులను తట్టుకోగల వ్యవసాయం కూడా ‘బయోఈ3’ విధానంలో భాగంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ‘బ్రిక్-ఎన్‌ఐపీజీఆర్‌’ డైరెక్టర్ ప్రొఫెసర్ మనోజ్ ప్రసాద్, డాక్టర్ సెంథిల్ కె.ముత్తప్ప, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ (డీబీటీ)లో సైంటిస్ట్-హెచ్ డాక్టర్ నితిన్ జైన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా “ఏక్ పెడ్ మా కే నామ్” కార్యక్రమంలో భాగంగా డాక్టర్ జితేంద్ర సింగ్ ‘స్ప్రౌట్’ కేంద్రాన్ని ప్రారంభించి, మొక్కను నాటారు. అనంతరం ‘బ్రిక్-ఎన్‌ఐపీజీఆర్‌’ శాస్త్రవేత్తలు, అధికారులతో కొద్దిసేపు ముచ్చటించారు.

సీజన్లతో నిమిత్తం లేకుండా నియంత్రిత వాతావరణంలో పనిచేసే కేంద్రమే ‘స్ప్రౌట్’. దీన్ని “జెర్మ్‌ ప్లాజమ్, బ్రీడింగ్ పాపులేషన్స్, మ్యూటెంట్స్, ట్రాన్స్‌ జెనిక్, జీనోమ్-ఎడిటెడ్ లైన్ల హై-త్రూపుట్ ఫినోటైపింగ్, ప్రెసిషన్ స్ట్రెస్ స్క్రీనింగ్, మూల్యాంకనం లక్ష్యంగా రూపొందించారు. ఈ కేంద్రం ప్రధానంగా శనగ పంటపై దృష్టి సారిస్తూ- కచ్చితమైన లక్షణాల మూల్యాంకనం, బ్రీడింగ్‌తో జీనోమిక్స్, జీనోమ్ ఎడిటింగ్‌లోని పురోగమనాన్ని  అనుసంధానించడంలో తోడ్పడుతుంది. జన్యు ఆవిష్కరణ నుంచి లక్షణాల ధ్రువీకరణకు, అంతిమంగా వంగడం రూపకల్పన వైపు సమర్థంగా పురోగమించేలా చేస్తుంది.

వాతావరణ మార్పులు, సరళి ఫలితంగా సత్వర వ్యవసాయ పరిష్కారాల అవసరం ఏర్పడిన తరుణంలో ఈ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. వ్యవసాయ జీవసాంకేతికతలో మద్దతుగల పరిశోధనల ఫలితంగా వరి, గోధుమ, నూనెగింజలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పండ్లు-కూరగాయలతో సహా కీలక వాణిజ్య పంటలలో మెరుగైన మొక్కల రకాలు, జన్యురకాలు రూపొందాయి. అలాగే, స్థిరమైన పంట ఉత్పాదకత, భూసారం, పోషకాల లభ్యతకు ప్రయోజనకర సూక్ష్మజీవులు తోడ్పడే అవకాశాలను మొక్కల మైక్రోబయోమ్ పరస్పర చర్యలపై సాగుతున్న కృషి , మెరుగుపరుస్తుంది.

వాస్తవిక వ్యవసాయ సవాళ్లపై సత్వర స్పందనతో రైతులకు విస్పష్ట ప్రయోజనాలను సమకూర్చగల సాంకేతికతగా ఆధునిక జీవసాంకేతికతను రూపుదిద్దాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ముఖ్యంగా జీనోమిక్స్, జన్యు సాంకేతికతలు, ప్రెసిషన్ ఫినోటైపింగ్, సత్వర బ్రీడింగ్‌లో నేటి శాస్త్రీయ పురోగమనం భవిష్యత్తులో మరింత ప్రాముఖ్యం సంతరించుకోగలదని ఆయన అన్నారు.

మొక్కల తరాల పురోగతిని వేగిరపరచేందుకు ‘స్పీడ్‌సీడ్’ అనే ప్రత్యేక సాంకేతికతను కూడా ఎన్‌ఐపీజీఆర్‌ రూపొందించింది. శనగ పంటలో గరిష్టీకరించిన విధివిధానాలు మొక్కల చక్రాన్ని సుమారు 40 రోజులకు తగ్గించగలవు. తద్వారా సంప్రదాయ బ్రీడింగ్, పరిశోధన వ్యవధి కూడా గణనీయంగా తగ్గుతుంది. ఈ సాంకేతికతను ‘స్ప్రౌట్‌’లో వినియోగించవచ్చు లేదా ఇతర అనువైన నియంత్రిత-వాతావరణ కేంద్రాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు. ఈ విధంగా ‘స్ప్రౌట్‌’, ‘స్పీడ్‌సీడ్’ సంయుక్తంగా  ఆశావహ పంట లక్షణాల మూల్యాంకనం, ప్రగతిని వేగిరపరచగలవు. అంతేగాక పరిశోధన నుంచి మెరుగైన రకాల రూపకల్పన దిశగా పురోగమన కాలాన్ని కుదించగలవు.

భారత జీవసాంకేతిక వ్యవస్థ బలోపేతం, ప్రయోగశాల పరిశోధనల నుంచి పొలాల దాకా ఆవిష్కరణలకు చేయూతనివ్వడంలో కేంద్ర జీవ సాంకేతిక విభాగం గత పన్నెండు సంవత్సరాలుగా పరిణామాత్మక పాత్ర పోషించింది. ఈ మేరకు 2014-2026 మధ్య  వ్యవసాయ జీవసాంకేతికత, అనుబంధ రంగాలలో 300కు పైగా ప్రాజెక్టులకు మద్దతిచ్చింది. కరువులు, వరదలు, లవణీయత, తెగుళ్లు, చీడపీడలను తట్టుకునే సామర్థ్యం పెంపుతో వరి, గోధుమ, శనగ, ఆవాలు, కూరగాయలు, అటవీ జాతులలో 50కి పైగా మెరుగైన రకాలు రూపొందాయి.

ఒక ప్రధాన జన్యుశాస్త్ర-సహాయక ప్రజనన కార్యక్రమం కింద వాతావరణ మార్పులను తట్టుకోగల 17 వరి రకాల రూపకల్పనను కీలక విజయంగా పేర్కొనవచ్చు. ఈ రకాలను ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. శాస్త్రీయ పరిశోధనలను రైతులతోపాటు ఆహార భద్రత సంబంధిత ప్రత్యక్ష పరిష్కారాలుగా మలచడంలో ఆధునిక జన్యుశాస్త్రం, అణు ప్రజననానికి గల సామర్థ్యాన్ని ఇది ప్రస్ఫుటం చేస్తోంది.

విడివిడి సాంకేతికతలు-ప్రయోగశాలలకు అతీతంగా బయోటెక్నాలజీ వ్యవస్థ విస్తరిస్తోందని మంత్రి అన్నారు. ఈ మేరకు మొక్కల-మానవ జీవసాంకేతికత, జన్యుశాస్త్రం సహా ఇతర ఆధునిక రంగాల్లో సమాంతర ప్రగతి నమోదవుతోందని చెప్పారు. వ్యవసాయం, ఆరోగ్యం, సుస్థిరత, జాతీయ పురోగమన సవాళ్లను పరిష్కరించగల ఆధునిక విజ్ఞానం, సాంకేతికత, అనువర్తనాల సమ్మేళనంతో మన జీవసాంకేతిక రంగ ప్రస్థానం ప్రధానంగా ముందడుగు వేస్తున్నదని ఆయన అన్నారు.

జన్యు సాంకేతికతలు, రీసైక్లింగ్/వర్తుల విధానాలు వంటి రంగాల్లోనూ జీవసాంకేతికత విస్తృత పాత్రను కూడా ఆయన ప్రస్తావించారు. వేగంగా మారుతున్న శాస్త్రీయ పరిస్థితులకు అనుగుణంగా సంస్థాగత సామర్థ్యాలతోపాటు మానవ వనరుల వ్యవస్థల  సర్దుబాటు అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. అలాగే, ‘బయోఈ3’ చట్రం కూడా బయోటెక్నాలజీ, ఇంజనీరింగ్, డిజిటలీకరణల మధ్య సమన్వయంతో సుస్థిర, వర్తుల జీవసాంకేతిక రంగాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేస్తుందని చెప్పారు.

శాస్త్రీయ విజయాలన్నీ ప్రయోగశాలలు లేదా సంబంధిత సంస్థలకే పరిమితం కారాదని, శాస్త్ర సమాచార వ్యాప్తి, ప్రజాస్వామ్యీకరణ సంస్కృతిని బలోపేతం చేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. శాస్త్రీయ సంస్థలకు అధికారిక పర్యటనలు కేవలం లాంఛనప్రాయ సంప్రదింపులు లేదా ప్రచారానికి పరిమితం కారాదని స్పష్టం చేశారు. ఈ సాంకేతికతలు ఎవరి కోసం రూపొందుతున్నాయో వారికి- ఈ ఆ రంగంలో పురోగతి ఏమిటో, దానివల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో అర్థం చేసుకోవడానికి తోడ్పడాలని పేర్కొన్నారు.

శాస్త్రీయ సాంకేతికతలు సులువుగా అర్థమయ్యేలా లఘు చిత్రాలు, వర్కుషాపులు, వృత్తిగత దృశ్యరూప కంటెంట్‌ వినియోగం పెరగాలని ఆయన సూచించారు. ఇటువంటి సమాచార వ్యాప్తితో ఏదైనా సాంకేతికత రూపొందకముందే దానికి ఎదురయ్యే సవాళ్లను మన దృష్టికి తేగలదని మంత్రి అన్నారు. అలాగే, శాస్త్రీయ జోక్యంతో ఆ సవాళ్లు ఎలా పరిష్కారమయ్యయో కూడా వివరించడం సాధ్యమవుతుందని చెప్పారు. సదరు ఆ సాంకేతికత రైతులు, పరిశ్రమలు సహా ఇతర వినియోగదారులకు కల్పించిన ఉపశమనం లేదా ప్రయోజనాన్ని ప్రస్ఫుటం చేయగలదన్నారు. సాంకేతిక నిపుణులు, వృత్తిగత ప్రచారకులు కలిసి పనిచేస్తూ- ప్రజలు, మీడియాను మరింత ప్రభావితం చేసే విధంగా ఈ కథనాలను ప్రదర్శించవచ్చని ఆయన తెలిపారు.

శాస్త్రవిజ్ఞాన సంస్థలు, పారిశ్రామిక భాగస్వాములు, రైతులు, ఇతరుల మధ్య బలమైన పరస్పర సహకారం అవశ్యమని మంత్రి పిలుపునిచ్చారు. శాస్త్రవేత్తలు, భాగస్వాములు పరస్పరం తమ పనితీరును అర్థం చేసుకోవడానికి, సహకారానికి అవకాశాలను గుర్తించడానికి వీలుగా క్రమబద్ధ సంస్థాగత సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. అలాగే, తక్షణ శాస్త్రవిజ్ఞాన వ్యవస్థకు వెలుపలగల వారికి వీటిలో పాలుపంచుకునే అవకాశాలు కల్పించాలని ఆయన సూచించారు.

సీఎస్‌ఐఆర్‌ సంస్థల అనుభవాన్ని ప్రస్తావిస్తూ- శాస్త్రవిజ్ఞాన ప్రదర్శనలకు, బాహ్య భాగస్వాములు చర్చల్లో పాల్గొనేలా చేసేందుకు క్రమబద్ధ సమావేశాలు వేదికలు కాగలవని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. శాస్త్ర పరిశోధనల ప్రయోజనాలు పరిశోధకులకు మించి సమాజానికి ప్రయోజనమిచ్చేలా బ్రిక్‌-ఎన్‌ఐపీజీఆర్‌ సహా ఇతర సంస్థలు కూడా ఇలాంటి పద్ధతులను అనుసరించాలని చెప్పారు. ఈ దిశగా పారిశ్రామిక, ఇతర భాగస్వాములను కూడా సంస్థాగత చర్చల్లో పాల్గొనేలా చేయాలని సూచించారు.

రైతులను శాస్త్రవిజ్ఞాన సంస్థలకు తీసుకెళ్లి అక్కడి కార్యకలాపాలను వీక్షించే అవకాశం కల్పించడం కూడా ప్రధానమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎస్‌ఐఆర్‌ సంస్థలతో తన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ- మునుపెన్నడూ ఇటువంటి సంస్థలను సందర్శించని రైతులు, అక్కడి పరిశోధనలపై అపోహలు పెంచుకునే అవకాశం ఉందని మంత్రి అన్నారు. ప్రత్యక్ష చర్చలు, అవగాహన ద్వారా అటువంటి భయాలను తొలగించి, రైతు ప్రయోజనం కోసం ఆధునిక విజ్ఞానం, జీవ సాంకేతికతలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో అవగాహన కల్పించే వీలుంటుందని ఆయన చెప్పారు.

ఈ పరిణామాత్మక రంగంలో శాస్త్రీయ పరిశోధనలతో కూడిన ప్రయోగాత్మక బయోటెక్నాలజీ కార్యక్రమాలు, ప్రయోగాల కోసం ఢిల్లీలోని ఒక బయోటెక్నాలజీ ప్రయోగశాల నుంచి కిట్‌లను ఉపయోగించడాన్ని కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. భారత బయోటెక్నాలజీ రంగం పురోగతి సంబంధిత విస్తృత ప్రచారంలో ఇటువంటి పరిణామాలకూ సముచిత స్థానం లభించాలన్నారు.

సంస్థలు కేవలం సాంప్రదాయ పద్ధతులపై ఆధారపడకుండా, ప్రస్తుత శాస్త్ర-సాంకేతిక పోకడలకు తగినట్లు తమ సమాచార ప్రసార, మానవ వనరుల విధానాలను నిరంతరం మార్చుకోవాలని ఆయన సూచించారు. శాస్త్రవిజ్ఞాన సంస్థలు తమ విజయాలపై సమాజం, పరిశ్రమలు, సంభావ్య లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ దిశగా వాటిని సమర్థంగా ఎరుకపరచడంలో మరింత చురుగ్గా, అందరికీ ప్రస్ఫుటమయ్యేలా వ్యవహరించాలని సూచించారు.

జీవసాంకేతికతలో నేడు భావితరం పరిజ్ఞానాలు పుట్టుకొస్తున్నాయని, భవిష్యత్తులో వాటి ప్రాధాన్యం మరింత ఇనుమడిస్తుందని మంత్రి అన్నారు. రైతులు, పరిశ్రమలు, సమాజం, భారత విజ్ఞానశాస్త్రం ఏమి చేస్తున్నదో తెలిపే రీతిలో ఈ ప్రగతిపై సమాచార వ్యాప్తికి నిరంతరం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

వాతావరణ మార్పులను తట్టుకుంటూ, అధిక దిగుబడినివ్వగల వంగడాల  రూపకల్పనకు ఎంతటి కృషి సాగుతున్నదో ‘స్ప్రౌట్’ వంటి కేంద్రాలు ప్రస్ఫుటం చేస్తాయని మంత్రి చెప్పారు. అలాగే, భారతదేశ వ్యవసాయ రంగ సామర్థ్య బలోపేతం, స్వయంసమృద్ధ వ్యవసాయ రంగ లక్ష్య సాధనలో ఆధునిక జీవ సాంకేతికత ఎలా దోహదం చేస్తున్నదో స్పష్టం చేస్తాయన్నారు. ఇటువంటి అత్యాధునిక కేంద్రాన్ని రూపొందించడంపై ‘బ్రిక్-ఎన్‌ఐపీజీఆర్‌’ శాస్త్రవేత్తలను, సాంకేతిక బృందాలను ఆయన అభినందించారు. వికసిత భారత్‌-2047పై దేశ సంకల్ప సాకారం దిశగా ప్రస్థానంలో ఇటువంటి సామర్థ్యాలు ఎంతగానో దోహదం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

***


(రిలీజ్ ఐడి: 2310760) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali