జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

రాజస్థాన్‌లోని బన్స్‌వారాలో ఓ మహిళపై ఆమె భర్త, ఇతర బంధువులు దాడి చేసి, బహిరంగంగా అవమానించినట్లు వచ్చిన వార్తను సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ


రెండు వారాల్లోగా సమగ్ర నివేదికను అందించాలని రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, బన్స్‌వారా పోలీసు సూపరింటెండెంట్‌‌కు నోటీసులు జారీ

నాడు పోస్టు చేయడమైనది: 15 SEP 2026 7:34PM by PIB Hyderabad

రాజస్థాన్‌లోని బన్స్‌వారాలో 2026 సెప్టెంబర్ 1న ఓ మహిళను ఆమె భర్త, ఇతర బంధువులు కర్రలతో కొట్టి, జుట్టు కత్తిరించి, అర్ధ నగ్నంగా ఊరేగించారన్న వార్తను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) సుమోటోగా స్వీకరించింది. ఆమె వేరొక వ్యక్తితో ఇంటి నుంచి వెళ్లిపోయిందని వారు ఆరోపించినట్లు సమాచారం.

మీడియాలో వచ్చిన వార్తలోని విషయాలను కమిషన్ గమనించింది. అవి నిజమైతే... బాధిత మహిళ జీవించే హక్కుకు, ఆత్మగౌరవానికి భంగం కలిగించిన తీవ్రమైన అంశంగా పరిగణిస్తుంది. అందువల్ల, రెండు వారాల్లోగా ఈ అంశంపై సమగ్ర నివేదికను సమర్పించాలని రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, బన్స్‌వారా పోలీస్ సూపరింటెండెంట్‌కు నోటీసులు జారీ చేసింది. దర్యాప్తు స్థితి, బాధితురాలికి చెల్లించిన నష్టపరిహారం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన వివరాలు ఈ నివేదికలో ఉంటాయని భావిస్తున్నారు.

2026 సెప్టెంబరు 4న మీడియాలో ప్రచురితమైన కథనం ప్రకారం... ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నివేదిక ప్రకారం, అందరూ చూస్తుండగానే క్రూరంగా, అమానవీయంగా ప్రవర్తిస్తూ ఆ మహిళను హింసించారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2310749) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी