శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
శాస్త్రీయ పరిశోధనలను ప్రజలకు చేరువ చేసేందుకు సరల్ ఏఐని ఉపయోగిస్తున్న సీఎస్ఐఆర్-ఎన్ఐఎస్‌సీపీఆర్
నాడు పోస్టు చేయడమైనది:
15 SEP 2026 8:46AM by PIB Hyderabad
శాస్త్రీయ పరిశోధనలను మరింత బలోపేతం చేసేందుకు సీఎస్‌ఐఆర్-నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (సీఎస్ఐఆర్-ఎన్ఐఎస్‌సీపీఆర్) కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా న్యూఢిల్లీలోని అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్) కార్యక్రమం సరల్ ఏఐ సహాయంతో జర్నల్స్‌లో ప్రచురితమైన పరిశోధనలను ఆకర్షణీయమైన, సులభంగా అర్థమయ్యే వీడియోలుగా మారుస్తోంది.
శాస్త్రీయ విషయాలు, పరిశోధనల గురించి సమర్థవంతంగా సమాచారాన్ని ప్రసారం చేయటానికి అత్యాధునిక సాంకేతికతలను స్వీకరించాలన్న ప్రభుత్వ ప్రాధాన్యతకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంది. పరిశోధన సంస్థలు సరల్ ఏఐని వినియోగించాల్సిందిగా కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ప్రోత్సహించారు. ఇందులో భాగంగా సీఎస్ఐఆర్-ఎన్ఐఎస్‌సీపీఆర్ ఈ సాంకేతికతను వినియోగించటంలో అగ్రస్థానంలో నిలిచింది.
సీఎస్ఐఆర్-ఎన్ఐఎస్‌సీపీఆర్ డైరెక్టర్ డాక్టర్ గీతా వాణి రాయసం నేతృత్వంలో శాస్త్రీయ పరిశోధనల పరిధిని, ప్రభావాన్ని విస్తరించేందుకు నూతన సాంకేతికతలను, డిజిటల్ వేదికలను ఆ సంస్థ అన్వేషిస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఇటీవల సరల్ ఏఐపై ప్రయోగాత్మక కార్యశాలను ఎన్ఐఎస్‌సీపీఆర్ నిర్వహించింది. ఇందులో జర్నల్స్ సంపాదకులు, పరిశోధకులతో సహా 90 మందికి పైగా పాల్గొన్నారు. సీఎస్ఐఆర్-ఎన్ఐఎస్‌సీపీఆర్ డైరెక్టర్ డాక్టర్ గీతా వాణి రాయసం మాట్లాడుతూ... "శాస్త్రీయ పరిజ్ఞానం కేవలం పరిశోధన రంగానికే పరిమితం కాకుండా అందరికీ చేరినప్పుడే దానికి మరింత విలువ ఉంటుంది. సరల్ ఏఐ వంటి ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవటం ద్వారా భారతీయ పరిశోధనలను మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు, విస్తృతమైన, విభిన్నమైన వర్గాల ప్రజలకు చేరవేసేందుకు సీఎస్ఐఆర్-ఎన్ఐఎస్‌సీపీఆర్ కృషి చేస్తోంది" అని తెలిపారు.
సమాజానికి శాస్త్రీయ విషయాలను మరింత విస్తృతంగా చేరవేయటం, పరిశోధనలను మరింత అందుబాటులోకి తీసుకురావటంపై అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్) ప్రత్యేకంగా దృష్టి సారించటం ద్వారా ఈ కార్యక్రమం స్ఫూర్తిని పొందింది. ప్రచురితమైన పరిశోధనా పత్రాల నుంచి చిన్న వీడియోలను తయారుచేసే సరల్ ఏఐ గురించి ఎన్ఐఎస్‌సీపీఆర్ సందర్శన సందర్భంగా ఏఎన్ఆర్ఎఫ్ సీఈఓ డాక్టర్ శివకుమార్ కళ్యాణరామన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సంక్లిష్టమైన శాస్త్రీయ పరిశోధనలను సులభంగా మార్చి, వాటిని సాధారణ ప్రజలకు సమర్థవంతంగా చేరవేసేందుకు సరల్ ఏఐని సాధనంగా వినియోగించాలని ఆ సంస్థను ప్రోత్సహించారు. ఏఎన్ఆర్ఎఫ్ సీఈఓ డాక్టర్ శివకుమార్ కళ్యాణరామన్ మాట్లాడుతూ... "పరిశోధనలు కేవలం ప్రచురణలతోనే ఆగిపోకూడదు. సరల్ ఏఐ వంటి సాధనాలు పరిశోధకులు, సంస్థలు, పరిశోధనా పత్రాలను దాటి వాటిని మరింత మందికి చేరువ చేసేందుకు, భారతీయ పరిశోధనల ప్రభావాన్ని మరింత పెంచేందుకు సహాయపడతాయి" అని అన్నారు.
విద్యార్థులు, ప్రజలు శాస్త్రీయ పరిశోధనలను సులభంగా తెలుసుకునేందుకు, అర్థం చేసుకునేందుకు, ఇతరులతో పంచుకునేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. ఈ వీడియోలు ప్రత్యేకమైన యూట్యూబ్ ప్లేజాబితా (యూట్యూబ్ ప్లేజాబితా లింక్ -https://www.youtube.com/playlist?list=PLb4FmdATtzOs) ద్వారా అందుబాటులో ఉంటాయి. ఇది సంప్రదాయ పరిశోధనా పత్రాలకు మించి పరిశోధనలు... విస్తృత స్థాయిలో ప్రజలను చేరేందుకు అదనపు డిజిటల్ మార్గాన్ని అందిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2310508)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5