బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక ప్రచారం 5.0 సాధించిన విజయం స్ఫూర్తితో ప్రత్యేక ప్రచారం 6.0కు సన్నద్ధమవుతున్న బొగ్గు మంత్రిత్వశాఖ

నాడు పోస్టు చేయడమైనది: 14 SEP 2026 3:43PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం 2026 అక్టోబర్ 2 నుంచి 31వ తేదీ వరకు ప్రత్యేక ప్రచారం 6.0ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. “ఈ-వ్యర్థాల సమర్థవంతమైన సేకరణ, వేరు చేయడం, పారవేయడం”పై ఈ ప్రచారంలో ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.

 

2025 అక్టోబర్ 2 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన ప్రత్యేక ప్రచారం 5.0 ద్వారా పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ బాధ్యత పట్ల బలమైన నిబద్ధతను చాటారు. బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు చేసిన ఈ ప్రచారం దాని పరిధిలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, క్షేత్రస్థాయి కార్యాలయాల్లో విశేష ఫలితాలను సాధించింది.

 

ప్రత్యేక ప్రచారం 5.0 (2 అక్టోబర్ 2025–31 అక్టోబర్ 2025)

  

ప్రత్యేక ప్రచారం 5.0లో భాగంగా బొగ్గు మంత్రిత్వ శాఖ 1.13 కోట్ల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణాన్ని శుభ్రపరిచింది. అలాగే 14,017 మెట్రిక్ టన్నులకు పైగా పనికిరాని సామాగ్రిని తొలగించింది. స్క్రాప్ విక్రయం ద్వారా రూ.56.85 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

 

డీఏఆర్‌పీజీ నివేదిక ప్రకారం ప్రత్యేక ప్రచారం 5.0లో భారత ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీ చేసిన స్థలాల విస్తీర్ణం విభాగంలో బొగ్గు మంత్రిత్వ శాఖ అత్యుత్తమ పనితీరు కనబరిచి అగ్రస్థానంలో నిలిచింది. అలాగే ఆర్జించిన ఆదాయం విభాగంలో మూడో స్థానంలో నిలిచింది. ప్రజా ఫిర్యాదులు, పీఎంఓ నుంచి వచ్చిన సూచనలు, సందర్భాల పరిష్కారంలో మంత్రిత్వ శాఖ 100 శాతం లక్ష్యాన్ని సాధించింది. అదేవిధంగా నిర్దేశించిన లక్ష్యంలో 100 శాతం పురోగతిని నమోదు చేసింది. మొత్తం 2,56,478 ఫైళ్లను పరిశీలించగా, 1,28,527 ఫైళ్లను తొలగించి, మూసివేశారు. ప్రజల్లో అవగాహన కల్పించడంలోనూ మంత్రిత్వ శాఖ విశేషంగా రాణించింది. సోషల్ మీడియా వేదికలను సమర్థవంతంగా వినియోగిస్తూ 3,107 ట్వీట్లు, 841 పత్రికా ప్రకటనలు, 29 పీఐబీ ప్రకటనలను విడుదల చేసింది. విస్తృత మీడియా ప్రచారం ద్వారా ప్రత్యేక ప్రచారం 5.0 కార్యక్రమాలు, సాధించిన విజయాలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేసింది.

 

వినూత్న కార్యక్రమాలు (ప్రత్యేక ప్రచారం 5.0)

 

వ్యర్థాలను కళగా, స్క్రాప్‌ను శిల్పాలుగా మార్చుతూ.. ఎంసీఎల్‌లోని ఓరియంట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎకో పార్క్‌లో చార్‌ధామ్‌ ఆలయాల ప్రతిరూపాలను రూపొందించారు. మొత్తం 7 నుంచి 8 టన్నుల వరకు పునర్వినియోగించిన వ్యర్థ పదార్థాలతో ఈ శిల్పాలను పూర్తిగా తయారు చేశారు. ఇందులో వినియోగం నుంచి తొలగించిన ఎల్‌హెచ్‌డీ విడిభాగాలు, కన్వేయర్ బెల్ట్ భాగాలు, పంప్ విడిభాగాలు, డ్రిల్ మెషీన్ విడిభాగాలు, విద్యుత్ పరికరాలు తదితరాలను వినియోగించారు.

 

1. శ్రీ జగన్నాథ్ ధామ్, పూరీ, ఒడిశా

2. శ్రీ బద్రీనాథ్ ధామ్, చమోలీ, ఉత్తరాఖండ్

3. శ్రీ ద్వారికానాథ్ ధామ్, ద్వారక, గుజరాత్

4. శ్రీ రామనాథస్వామి ధామ్, రామేశ్వరం, తమిళనాడు

 

వీటితోపాటు నవంబర్ 2025 నుంచి ఆగస్టు 2026 (ప్రత్యేక ప్రచారం 5.0) మధ్య కాలంలో మంత్రిత్వ శాఖ, దాని ప్రభుత్వ రంగ సంస్థలు ఈ కింది విజయాలను సాధించాయి. 

·       83.92 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని శుభ్రపరిచి, పరిశుభ్రతలో అత్యున్నత ప్రమాణాలను కొనసాగించాయి.

·     15,585 మెట్రిక్ టన్నులకు పైగా స్క్రాప్‌ను బాధ్యతాయుతంగా పారవేసి, రూ.55.29 కోట్ల ఆదాయాన్ని సమకూర్చాయి.

·      ఖాళీ చేసిన స్థలాలను మొక్కల పెంపకం, ఉద్యానవన కార్యకలాపాలు, సుందరీకరణ, మార్గాల విస్తరణ, పార్కింగ్‌ స్థలాలు, కార్యాలయ సీటింగ్‌ ఏర్పాట్లు, నిల్వ తదితర వివిధ అవసరాలకు సమర్థవంతంగా వినియోగించాయి.

ఈ విజయాలు పరిశుభ్రత, పర్యావరణ సుస్థిరత, వనరుల సమర్థవంతమైన నిర్వహణ దిశగా బొగ్గు మంత్రిత్వ శాఖ, దాని ప్రభుత్వ రంగ సంస్థలు నిరంతరం చేస్తున్న కృషిని ప్రతిబింబిస్తున్నాయి. ప్రత్యేక ప్రచారం 5.0 విజయవంతం కావడం పర్యావరణ బాధ్యత పట్ల మంత్రిత్వ శాఖకు ఉన్న నిబద్ధతను చాటడంతో పాటు, ప్రత్యేక ప్రచారం 6.0ను విజయవంతంగా, ప్రభావవంతంగా అమలు చేసేందుకు పటిష్టమైన పునాదిని ఏర్పాటు చేసింది.

 

ప్రత్యేక ప్రచారం 6.0కు సన్నద్ధతలో భాగంగా 2026 సెప్టెంబర్ 1న సంయుక్త కార్యదర్శి (కోఆర్డ్) అధ్యక్షతన సీఐఎల్‌, దాని అనుబంధ సంస్థలు, ఎన్‌ఎల్‌సీఐఎల్‌, ఎస్‌సీసీఎల్‌, సీసీఓ, సీఎంపీఎఫ్‌ఓలకు చెందిన నోడల్ అధికారులతో బొగ్గు మంత్రిత్వ శాఖ సన్నాహక సమావేశాలను నిర్వహించింది.

 

ఈ సన్నాహక సమావేశంలో ప్రత్యేక ప్రచారం 5.0 సందర్భంగా బొగ్గు మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలు, అమలు చేసిన ఉత్తమ విధానాలపై అధికారులకు అవగాహన కల్పించారు. అలాగే ప్రత్యేక ప్రచారం 6.0లో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలు, ప్రాధాన్యతలపై నోడల్ అధికారులకు వివరించి, వాటి అమలుకు అవసరమైన దిశానిర్దేశం చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2310207) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil