బొగ్గు మంత్రిత్వ శాఖ
పంజాబ్ లోని విద్యుత్ కేంద్రాలకు సమృద్ధిగా బొగ్గు సరఫరా
నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కోసం కోల్ ఇండియా నుంచి సకాలంలో బొగ్గు తరలింపు, సొంత గనుల ద్వారా బొగ్గు వినియోగం పెంపు అవశ్యం
నాడు పోస్టు చేయడమైనది:
13 SEP 2026 2:13PM by PIB Hyderabad
"పరిశ్రమలు, వ్యవసాయానికి 14 గంటల విద్యుత్ కోతలతో తీవ్రమైన పంజాబ్ విద్యుత్ సంక్షోభం" అనే శీర్షిక సహా పంజాబ్‌లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి తగ్గడానికి ప్లాంట్ల నిలిపివేత, చాలీచాలని బొగ్గు సరఫరానే కారణమని వచ్చిన కొన్ని వార్తా కథనాలను బొగ్గు మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఈ వార్తలు వాస్తవ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉన్నాయని స్పష్టం చేసింది. పంజాబ్‌లోని విద్యుత్ కేంద్రాలకు తగినంత పరిమాణంలో బొగ్గు లభ్యత కల్పించామని, పంజాబ్‌తో పాటు దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా అందించడానికి కోల్ ఇండియా పూర్తి కట్టుబాటుతో ఉందని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది.
పిఎస్పిసిఎల్ సొంత గనుల నుంచి పంజాబ్ స్వతంత్ర విద్యుత్ ప్లాంట్ల (ఐపీపీ)కు బొగ్గు రవాణా సాఫీగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. పీఎస్‌పీసీఎల్‌కు చెందిన సొంత విద్యుత్ కేంద్రాల సామర్థ్యాన్ని మరింతగా వినియోగించుకోవడం, ఐపీపీల్లో ఏర్పడే సాంకేతిక లోపాలను పర్యవేక్షించడం, కోల్ ఇండియా అనుబంధ సంస్థలు ఇప్పటికే అందుబాటులో ఉంచిన బొగ్గును సకాలంలో తరలించుకోవడం వంటి చర్యలు విద్యుత్ ఉత్పత్తిని గరిష్ఠ స్థాయిలో కొనసాగించేందుకు, రాష్ట్ర అవసరాలను తీర్చేందుకు దోహదపడతాయి.
పంజాబ్ బొగ్గు సరఫరా వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం, సీఐఎల్ మద్దతు
క్యాప్టివ్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచి పంజాబ్‌లోని స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బొగ్గు తరలించడానికి కేంద్ర ప్రభుత్వం చురుగ్గా చర్యలు చేపట్టింది:
-
జార్ఖండ్ రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించే నిబంధనకు లోబడి, పీఎస్‌పీసీఎల్‌కు చెందిన పచ్వారా సెంట్రల్ బొగ్గు గని నుంచి ఐపీపీలకు బొగ్గు సరఫరాకు ఇబ్బంది లేదు.
-
నిర్దేశిత వినియోగ ప్లాంట్ల అవసరాలను తీర్చిన తర్వాత, నభా పవర్ లిమిటెడ్ (రాజ్‌పురా), తల్వండి సబో పవర్ లిమిటెడ్ (మాన్సా) లతో సహా పీఎస్‌పీసీఎల్‌కు చెందని ఇతర స్వతంత్ర విద్యుత్ ప్లాంట్లకు పచ్‌వారా సెంట్రల్ కోల్ మైన్ నుంచి వార్షిక ఉత్పత్తిలో 50% వరకు బొగ్గును ఉపయోగించుకోవడానికి ఇప్పటికే అనుమతి ఉంది.
పంజాబ్‌లోని ఐపీపీలకు సీఐఎల్ నుంచి తగినంతగా బొగ్గు సరఫరా
గత మూడు రోజుల్లో నాభా పవర్ లిమిటెడ్ రోజువారీ సగటు బొగ్గు వినియోగం సుమారు 4.3 బోగీలు ఉండగా, బొగ్గు సరఫరా సగటున రోజుకు సుమారు 5 బోగీలుగా ఉంది. తల్వండి సాబో పవర్ లిమిటెడ్ రోజువారీ వినియోగం సుమారు 3.8 బోగీలు ఉండగా, సరఫరా సగటున రోజుకు సుమారు 5 బోగీలుగా ఉంది. ప్రస్తుత సెప్టెంబర్ నెలలో ఇప్పటివరకు నాభా పవర్ లిమిటెడ్‌కు రోజుకు సగటున 4.9 రేక్‌లు, తల్వండి సాబో పవర్ లిమిటెడ్ కు రోజుకు సగటున 4.1 బోగీల చొప్పున బొగ్గు సరఫరా అయింది. ఈ సరఫరా ఆయా ఐపీపీల సగటు బొగ్గు వినియోగం కంటే ఎక్కువగా ఉంది.
పీఎస్‌పీసీఎల్ క్యాప్టివ్ గనుల నుంచి బొగ్గు తరలింపును మరింత పెంచుకోవాల్సిన పంజాబ్
పీఎస్‌పీసీఎల్ పచ్వారా సెంట్రల్ గనిలో 2026 ఏప్రిల్ నుంచి 11.09.2026 వరకు వార్షిక లక్ష్యంలో 83.67 శాతం బొగ్గు ఉత్పత్తి జరిగింది. అయితే, బొగ్గు తరలింపు లక్ష్యంలో కేవలం 68.44 శాతం మాత్రమే నమోదైంది. ఉత్పత్తి, రవాణా మధ్య ఉన్న ఈ వ్యత్యాసంతో గనిలో సుమారు 3.21 లక్షల టన్నుల తరలించని బొగ్గు నిల్వ పేరుకుపోయింది. పీఎస్పీసీఎల్ తన సొంత ప్లాంట్లలో మరింత విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఈ నిల్వలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తరలించాల్సి ఉంది.
పీఎస్‌పీసీఎల్ విద్యుత్ కేంద్రాల్లో తక్కువ పీఎల్ఎఫ్, ఐపీపీల్లో అంతరాయాలు
పీఎస్‌పీసీఎల్ మూడు థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్వహిస్తోంది. అవి గురు హర్‌గోబింద్ టీపీఎస్ (లెహ్రా మొహబ్బత్), గోయింద్వాల్ సాహిబ్ టీపీపీ, రోపర్ టీపీఎస్. వీటి మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2,300 మెగావాట్లు. 11.09.2026 నాటికి పీఎస్‌పీసీఎల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు నిర్దేశిత ప్రమాణ అవసరంలో సుమారు 114 శాతంగా ఉన్నాయి. ఇది అవసరానికి మించి తగినంత బొగ్గు అందుబాటులో ఉన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది.
తగినంత బొగ్గు నిల్వలు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రస్తుత సెప్టెంబర్‌లో పీఎస్‌పీసీఎల్ విద్యుత్ కేంద్రాల తాత్కాలిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) సుమారు 59 శాతంగా మాత్రమే ఉంది. అందువల్ల ఈ నెలలో విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉండటానికి విద్యుత్ కేంద్రాల వద్ద బొగ్గు కొరత కారణం కాదని స్పష్టమవుతోంది.
మరోవైపు ఐపీపీ విద్యుత్ కేంద్రాల్లో అంతరాయాలు చోటుచేసుకున్నట్లు సమాచారం అందింది. విద్యుత్ ఉత్పత్తి నిరంతరంగా కొనసాగేందుకు పంజాబ్ ప్రభుత్వం వీటిని నిశితంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.
సీఐఎల్ ఇప్పటికే అందుబాటులో ఉంచిన బొగ్గును ఐపీపీలు మరింతగా తరలించుకోవాలి.
సీఐఎల్ అనుబంధ సంస్థలు పంజాబ్‌లోని ఐపీపీలకు అదనంగా బొగ్గును అందుబాటులో ఉంచాయి. అయితే, బొగ్గు బుకింగ్, తరలింపు పరిమాణాలు అందుబాటులో ఉంచిన పరిమాణం కంటే తక్కువగా ఉన్నాయి.
-
సీఐఎల్ అనుబంధ సంస్థ సీసీఎల్ 30.03.2026న ఆర్‌సీఆర్ విధానంలో ఎన్పీఎల్, టీఎస్పీఎల్లకు 5.0 లక్షల టన్నుల బొగ్గును అందుబాటులో ఉంచింది. ఇందులో ఇప్పటివరకు సుమారు 4.1 లక్షల టన్నులు బుక్ కాగా, 3.2 లక్షల టన్నులు తరలించారు.
-
ఎన్‌పీఎల్‌కు 3.5 లక్షల టన్నుల బొగ్గును బీసీసీఎల్ అందుబాటులో ఉంచింది. ఇందులో ఇప్పటివరకు సుమారు 1.7 లక్షల టన్నులు బుక్ కాగా, 1.1 లక్షల టన్నులు తరలించారు.
-
విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిన నేపథ్యంలో రెండో త్రైమాసికంలో సరళీకృత విధానం కింద సీఐఎల్ అదనంగా బీసీసీఎల్ నుంచి ఎన్‌పీఎల్‌కు 2.30 లక్షల టన్నుల బొగ్గు, సీసీఎల్ నుంచి టీఎస్‌పీఎల్‌కు 3.0 లక్షల టన్నుల బొగ్గు కేటాయించింది. అయితే, ఈ కేటాయింపులకు సంబంధించి బొగ్గు తరలింపు ఇంకా ప్రారంభం కాలేదు.
పంజాబ్ లోని ఐపీపీలకు అదనపు బొగ్గు అందుబాటులోకి వస్తూనే ఉంది. కేటాయించిన/ఆఫర్ చేసిన బొగ్గును సకాలంలో తరలించుకోవడం ద్వారా విద్యుత్ కేంద్రాల వద్ద బొగ్గు లభ్యతను మరింత పెంచడం కీలకం.
సీఐఎల్, దాని అనుబంధ సంస్థలు ఆర్‌సీఆర్, సరళ విధానం, అదనపు రైళ్ల ఏర్పాట్ల ద్వారా బొగ్గు లభ్యతను పెంచేందుకు చర్యలు చేపడుతున్నాయి. సీఐఎల్ ఇప్పటికే అందుబాటులో ఉంచిన బొగ్గును సకాలంలో బుక్ చేసుకుని తరలించుకోవడంతో పాటు, అందుబాటులో ఉన్న రేక్ సరఫరాను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా ఎన్పీఎల్, టీఎస్‌పీఎల్‌కు బొగ్గు చేరికలను పెంచడం అవశ్యం.
ప్రస్తుత ఇంధన సరఫరా ఒప్పందాల ప్రకారం పీఎస్పీసీఎల్ తో పాటు పంజాబ్ లోని స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులకు కూడా బొగ్గును సరఫరా చేసేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ, కోల్ ఇండియా సంస్థలు కట్టుబడి ఉన్నాయి. పంజాబ్‌లో విద్యుత్ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి తీసుకురావడానికి ఐపీపీలు కేటాయించిన బొగ్గును సకాలంలో తీసుకెళ్లడం, పీఎస్పీసీఎల్ స్వంత క్యాప్టివ్ గనుల నుంచి రవాణాను పెంచడం, పీఎస్పీసీఎల్ ప్లాంట్లలో మెరుగైన విద్యుత్ ఉత్పత్తి పనితీరును కనబరచడం తక్షణ అవసరం.
***
(రిలీజ్ ఐడి: 2309901)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14