బొగ్గు మంత్రిత్వ శాఖ
2014 నుంచి ఎస్ఈసీఎల్‌లో వచ్చిన మార్పులు మధ్య భారతదేశంలో అవకాశాలను విస్తృతం చేస్తూ బొగ్గు ఉత్పత్తి, మౌలిక సదుపాయాల విస్తరణ
నాడు పోస్టు చేయడమైనది:
12 SEP 2026 3:48PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి భారతదేశ బొగ్గు రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పారదర్శకత, సామర్థ్యం, టెక్నాలజీ వినియోగం, మౌలిక వసతుల అభివృద్ధి, సులభతర వ్యాపార విధానాలు, ఇంధన భద్రతను పెంపొందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం చేపట్టిన పలు విధానపరమైన, నిర్మాణాత్మక సంస్కరణలు దీనికి ప్రధాన కారణం. ఈ సంస్కరణలు నిర్ణయాలు తీసుకోవటాన్ని వేగవంతం చేశాయి. గనుల ప్రణాళికను ఆధునీకరించాయి. రవాణా మౌలిక వసతులను బలోపేతం చేశాయి. ఈ రంగంలో ఉత్పాదకతను పెంచాయి. జాతీయ స్థాయిలో దీని ఫలితం స్పష్టంగా కనిపిస్తోంది. నిరంతర ఇంధన భద్రతకు దేశంలోని బొగ్గు సుమారు 73 శాతం విద్యుత్ ఉత్పత్తికి ఆసరాగా నిలుస్తోంది. జాతీయ స్థాయిలో భారతదేశ బొగ్గు ఉత్పత్తి 2025-26 ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండో ఏడాది కూడా ఒక బీటీ (బిలియన్ టన్ను) మార్కును దాటి, 1.04 బీటీకి చేరుకుంది.
కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) మినీ రత్న అనుబంధ సంస్థ సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఈసీఎల్).... ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ బొగ్గు రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ జాతీయ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించింది. ఆవిర్భావ సంవత్సరమైన 1985-86 ఆర్థిక సంవత్సరంలో కేవలం 34.2 ఎంటీల సాధారణ బొగ్గును ఉత్పత్తి చేసిన ఎస్‌ఈసీఎల్... 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 176.28 ఎంటీల బొగ్గును ఉత్పత్తి చేసే ప్రముఖ బొగ్గు సంస్థగా అవతరించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సీఐఎల్ మొత్తం ఉత్పత్తిలో సుమారు 23 శాతం, భారతదేశ మొత్తం బొగ్గు ఉత్పత్తిలో దాదాపు 17 శాతం వాటాను ఎస్ఈసీఎల్ అందిస్తోంది. దీని కార్యకలాపాల ద్వారా 36,000 మందికి పైగా రెగ్యులర్ ఉద్యోగులు, 24,000 మంది కాంట్రాక్టు కార్మికులు ఉపాధి పొందుతున్నారు. రవాణాదారులు, సరఫరాదారులు, సేవలందించే వారితో కూడిన భారీ వ్యవస్థకు ఇది అండగా నిలుస్తోంది.
ఫలితాలను సాధించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవటం
ఎస్‌ఈసీఎల్ కార్యకలాపాల్లో కోర్బాలోని గెవ్రా, కుస్ముండా, దీప్కా ఉన్నాయి. ఇవన్నీ 185 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని గల మూడు పెద్ద గనులు. ఇవి బొగ్గు తవ్వకం, విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలుగా నిలుస్తుండటం వల్ల వీటిని భారతదేశ శక్తి కేంద్రాలుగా అభివర్ణిస్తుంటారు.
గడచిన దశాబ్ద కాలంలో SECL సాధించిన వృద్ధి, దాని స్థాయి, సామర్థ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. 2013-14లో 124.26 మిలియన్ టన్నులుగా (ఎంటీ) ఉన్న బొగ్గు ఉత్పత్తి, 2025-26 నాటికి 176.28 ఎంటీలకు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 13 రాష్ట్రాలకు గాను 178.63 ఎంటీల బొగ్గును సరఫరా చేసింది. ఇది 2013-14లో ఉన్న 122.03 ఎంటీలతో పోలిస్తే 46 శాతం కన్నా ఎక్కువగా వృద్ధిని నమోదు చేసింది. అన్నింటికన్నా ముఖ్యంగా ఉత్పాదకతలో దూసుకెళ్లింది. మైనింగ్ సామర్థ్యానికి కొలమానమైన అవుట్‌పుట్ పర్ మ్యాన్-షిఫ్ట్ (ఓఎంఎస్)... 2013-14లో 7.23 టన్నులుగా ఉండగా, 2025-26 నాటికి రెట్టింపునకు పైగా పెరిగి 16.47 టన్నులకు చేరుకుంది.
ఎస్ఈసీఎల్, ఐఆర్సీఓఎన్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో కలిసి ఛత్తీస్‌గఢ్ ఈస్ట్ రైల్వే, ఛత్తీస్‌గఢ్ ఈస్ట్-వెస్ట్ రైల్వే కారిడార్లను అభివృద్ధి చేస్తోంది. సుమారు రూ.13,685 కోట్ల మొత్తం పెట్టుబడితో దాదాపు 342.6 కిలోమీటర్ల రైల్వే లైన్లతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఈ నెట్‌వర్క్ మాండ్-రాయ్‌గఢ్, కోర్బా బొగ్గు క్షేత్రాల్లోని మారుమూల ప్రాంతాలను జాతీయ రైల్వే వ్యవస్థతో కలుపుతుంది. దీనివల్ల సమీప భవిష్యత్తులో సరకులతో పాటు ప్రయాణికుల రాకపోకలు సమర్థవంతంగా సాగుతాయి.
దాదాపు రూ. 2,700 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 156 మిలియన్ టన్నుల ఉమ్మడి సామర్థ్యం గల పదకొండు ఫస్ట్ మైల్ కనెక్టివిటీ (ఎఫ్‌ఎంసీ) ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి బొగ్గు రవాణాకు సంబంధించిన కర్బన ఉద్గారాలను తగ్గిస్తున్నాయి. యంత్రాలతో జరిగే లోడింగ్ సామర్థ్యాన్ని మరో 85 ఎంటీవై పెంచటానికి భవిష్యత్తులో మరో ఏడు ప్రాజెక్టులను కూడా ప్లాన్ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌ఎంసీ వ్యవస్థల ద్వారా బొగ్గు రవాణా 28 శాతం పెరిగింది. మొత్తం రవాణాలో ఇది 41.3 శాతంగా నమోదైంది. వినియోగదారులకు బొగ్గును చేరవేయటంలో యాంత్రిక మౌలిక సదుపాయాల పాత్ర వేగంగా పెరుగుతుందని ఇది తెలియజేస్తుంది.
గనుల పనితీరుని మార్చటం
గనుల లోపల సర్ఫేస్ మైనర్లు, నిరంతర మైనర్ల వాడకం పెరుగుతుండటం యంత్రాల వినియోగం దిశగా స్థిరమైన మార్పును తెలియజేస్తుంది. సంప్రదాయ డ్రిల్లింగ్, పేలుళ్లు లేకుండానే 88 శాతానికి పైగా బొగ్గు సర్ఫేస్ మైనర్ల ద్వారా ఉత్పత్తి జరుగుతోంది. దీనివల్ల కంపనాలు, దుమ్ము తగ్గుతాయి. నిరంతర మైనర్లు భూగర్భ భారీ-ఉత్పత్తికి మద్దతిస్తున్నాయి. ఎస్ఈసీఎల్ భూగర్భ బొగ్గు ఉత్పత్తిలో 76 శాతాన్ని అందిస్తున్నాయి.
సింఘాలి భూగర్భ గనిలో కొత్త పేస్ట్ ఫిల్ టెక్నాలజీ... అంటే గని తవ్విన ఖాళీ స్థలాలను ఇంజనీరింగ్ మిశ్రమంతో నింపటం ద్వారా భూగర్భ స్థిరత్వానికి మద్దతిచ్చేందుకు, సంప్రదాయ మైనింగ్‌కు అడ్డుగా ఉండే ఉపరితల ప్రాంతాల కింద బొగ్గును వెలికి తీసేందుకు ఉద్దేశించినవి. మైన్ డెవలపర్, ఆపరేటర్ ఏర్పాట్లు, ఆదాయ-భాగస్వామ్య ఒప్పందాలు... వనరులను అభివృద్ధి చేయటానికి, ప్రత్యేక ఆపరేటింగ్ సామర్థ్యాలను కంపెనీలోకి తీసుకురావటానికి అదనపు మార్గాలను అందిస్తాయి.
ఈ మార్పులకు డిజిటల్ వ్యవస్థలు మరింత మద్దతునిస్తున్నాయి. యంత్రాల పర్యవేక్షణ, డ్రోన్ సర్వేలు, వీడియో అనలిటిక్స్, కార్మికుల భద్రతా అప్లికేషన్లను డిజీ కోల్ ఒకచోట చేర్చుతుంది. ఫిబ్రవరి 2026లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిర్వహించిన జాతీయ కార్యశాలలో డిజీకోల్ ప్రదర్శన... పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంపొందించటంలో డిజిటల్ వ్యవస్థల పాత్రను స్పష్టం చేసింది. గనులు, రవాణా మార్గాలు, గమ్యస్థాన కేంద్రాల వద్ద విస్తరించి ఉన్న 1,600కి పైగా సీసీటీవీ కెమెరాల వ్యవస్థ... తెలివైన, డిజిటల్‌గా అనుసంధానమైన మైనింగ్ వ్యవస్థను నిర్మిస్తోంది. దీని తర్వాత తదుపరి దశగా ఏఐ ఆధారిత నిఘా విశ్లేషణలను తీసుకొచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు.
మహిళలకు నూతన అవకాశాలను కల్పించటం
ఆధునికీకరణ... ఎస్‌ఈసీఎల్ ఉద్యోగులకు ఉపాధి అవకాశాలను విస్తరిస్తోంది. మహిళా ఉద్యోగులను సాధికారత దిశగా నడిపించేందుకు ఎస్‌ఈసీఎల్ యాజమాన్యం చేపట్టిన ప్రాజెక్ట్ ధారశక్తి... నైపుణ్య శిక్షణను అందించటంతో పాటు హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ (హెచ్‌ఈఎంఎం) ఆపరేషన్లతో సహా సాంకేతిక, కార్యాచరణ మార్గాలను సుగమం చేస్తోంది. భూయజమానులుగా, వారిపై ఆధారపడిన వారిగా నియమితులైన మహిళలు అర్హతలు, సామర్థ్యాలకు తగిన పనులను చేసేందుకు ఇది తోడ్పడుతుంది. మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండే రంగాల్లోకి మార్గాన్ని సులభతరం చేస్తూ 19 మంది మహిళా ట్రైనీల బృందం ఆధునిక సిమ్యులేటర్లను ఉపయోగించి హెచ్‌ఈఎంఎం ఆపరేటర్ శిక్షణను పొందుతోంది. బిలాస్‌పూర్‌లోని వసంత్ విహార్‌లో కోల్ ఇండియా తరపున తొలిసారిగా మహిళలే నిర్వహించే వైద్యశాలను, కోర్బాలోని సెంట్రల్ వర్క్‌షాప్‌లో తొలి మహిళా సెంట్రల్ స్టోర్ యూనిట్‌ను ఎస్‌ఈసీఎల్ ఏర్పాటు చేసింది.
బలమైన ఆర్థిక సహకారం
ఎస్ఈసీఎల్ ఆర్థిక స్థితి దాని కార్యకలాపాల సామర్థ్యాలతో పాటు వృద్ధి చెందింది. మార్చి 2015 నాటికి సుమారు రూ. 9,544 కోట్లుగా ఉన్న నికర విలువ, మార్చి 2026 నాటికి సుమారు రూ. 20,457 కోట్లకు పెరిగింది. ఇది దాదాపు 114 శాతం పెరుగుదలను సూచిస్తుంది.
ప్రభుత్వ ఆదాయానికి ఈ సంస్థ అందించే సహకారం గణనీయమైనది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌ఈసీఎల్ ప్రత్యక్ష పన్నులు, రాయల్టీ, ఇతర పన్నులు, లెవీల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు సుమారు రూ. 11,830 కోట్లను చెల్లించింది. ఒక్క రాయల్టీ చెల్లింపులే 2014-15 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 2,075 కోట్ల నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,485 కోట్లకు పెరిగాయి. ఇది దాదాపు 70 శాతం పెరుగుదల. ఈ చెల్లింపులు కంపెనీ ఆర్థిక సహకారాన్ని కేవలం బొగ్గు సరఫరా, ఉపాధికి మాత్రమే పరిమితం కాకుండా మరింత విస్తృతం చేస్తున్నాయి.
బొగ్గు క్షేత్రాల పరిధిలో అవకాశాలను సృష్టించటం
ఎస్ఈసీఎల్ సీఎస్ఆర్ ప్రయాణం... కేవలం అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రాథమిక సౌకర్యాల కల్పన నుంచి ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఫలితాలనిచ్చే సుస్థిరమైన కార్యక్రమాల దిశగా మళ్లింది. కంపెనీ సీఎస్ఆర్ వ్యయం 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 43.91 కోట్ల నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 127 కోట్లకు పైగా పెరిగింది. (సుమారు 188 శాతం వృద్ధి). 2014-15 నుంచి ఎస్‌ఈసీఎల్ గనుల ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం సుమారు రూ.1,078 కోట్లను వెచ్చించింది. ఇది ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, గ్రామీణ మౌలిక సదుపాయాలు, నీటి సంరక్షణ, సామాజిక సమ్మిళితత్వంపై ప్రత్యేక దృష్టి సారించింది. స్థానిక కమ్యూనిటీల సాధికారతకు కృషి చేస్తూనే 2014-15 నుంచి 2026 ఆగస్టు వరకు భూమిని కోల్పోయిన కుటుంబాలకు ఎస్‌ఈసీఎల్ మొత్తం 5,405 ఉద్యోగాలను కల్పించింది.
విద్య, ఆరోగ్య రంగాల్లోని అడ్డంకులను తొలగించే కార్యక్రమాల ద్వారా ఈ అభివృద్దిలో మానవీయ కోణం స్పష్టంగా కనిపిస్తుంది. 2023లో ప్రారంభమైన ఎస్ఈసీఎల్ కే సుశృత్ కార్యక్రమం... ఎస్ఈసీఎల్ కార్యకలాపాలు జరిగే ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలతో పాటు ఉచిత రెసిడెన్షియల్ నీట్ కోచింగ్‌ను అందిస్తోంది. తొలి రెండు బ్యాచుల్లో 80 మంది విద్యార్థులకు గాను 70 మంది నీట్ పరీక్షలో అర్హత సాధించి ఎంబీబీఎస్, డెంటల్, ఆయుర్వేద, ఫిజియోథెరపీ, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. బొగ్గు పీఎస్‌యూ సీఎస్‌ఆర్ పథకాల్లో భారత ప్రభుత్వ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) పోర్టల్‌లో జాబితా చేసిన తొలి పథకం ఇదే కావడం విశేషం. దీని చేరిక ద్వారా ఈ కార్యక్రమాన్ని జాతీయ స్థాయి పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన ప్రయోజనాల మార్గంతో అనుసంధానించారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లలకు ఎస్‌ఈసీఎల్ కీ ధడ్కన్ ఉచిత గుండె శస్త్ర చికిత్సలను అందిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 300 శస్త్రచికిత్సలు పూర్తయ్యాయి. ఇది పిల్లల భవిష్యత్తును మార్చగల వైద్య సేవలను కుటుంబాలకు చేరువ చేస్తూ... మొత్తం 1,060 శస్త్రచికిత్సల లక్ష్యం దిశగా ఇది ముందుకు సాగుతోంది.
భూమి పునరుద్ధరణ, సమాజానికి మద్దతు
ఆగస్టు 2026 నాటికి కోల్ ఇండియా అనుబంధ సంస్థలన్నింటిలోనూ అత్యధికంగా 28 మూసివేసిన గనులను... ఎస్‌ఈసీఎల్ శాస్త్రీయ పద్ధతిలో మూసివేసింది. గనుల తవ్వకం పూర్తయిన భూమిని భవిష్యత్తులో స్థానిక ప్రజల ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించాలనే దానిపై ప్రణాళికలు రూపొందించటం కంపెనీ చేపడుతున్న ప్రధాన బాధ్యతల్లో ఒకటిగా మారుతోంది.
పర్యావరణ రంగానికి సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరంలో మియావాకి పద్ధతిలో మొక్కల పెంపకంతో సహా 571 హెక్టార్లలో అత్యధికంగా 14.36 లక్షల మొక్కలను నాటారు. 2014లో ఈ సంఖ్య కేవలం 5 లక్షల వరకు మాత్రమే ఉండేది. ఈ కృషితో గనుల ప్రాంతాల చుట్టూ పచ్చదనాన్ని పునరుద్ధరిస్తున్నారు.
ఒకప్పటి మైనింగ్ ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో బిష్రాంపూర్ సమీపంలోని కేనాపారా ఎకో పార్క్... పర్యాటకాన్ని, కమ్యూనిటీ ఉపాధిని ఎలా ప్రోత్సహించగలదో తెలియజేస్తుంది. అలాగే ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో ఉన్న బాంకీ 7, 8 అండర్‌గ్రౌండ్ మైన్ వద్ద ఇప్పుడు ఒక ఆరోగ్య కేంద్రం, వారాంతపు సంత ఏర్పాటయ్యాయి. ఈ ఉదాహరణలు గనుల పునర్వినియోగానికి ఆచరణాత్మక అర్థాన్నిస్తున్నాయి. ఒకప్పుడు తవ్వకాల కోసం ఉపయోగించిన ప్రదేశాలు, చుట్టుపక్కల నివాస ప్రాంతాలకు సేవలందిస్తున్నాయి. గనుల ద్వారా వచ్చిన నీటితో 3,800 హెక్టార్లకు పైగా భూమికి సాగునీరు అందుతోంది. సోలార్ ప్రాజెక్టులు మైనింగ్ భూములను మరో ఉత్పాదక అవసరాలకు వినియోగిస్తున్నాయి. పునరుత్పాదక ఇంధన రంగాన్ని ఎస్‌ఈసీఎల్ మరింత విస్తరిస్తూనే ఉంది. దీని సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం 44 ఎండబ్ల్యూ (2014 నాటికి సున్నాగా ఉంది)కు చేరుకుంది.
తదుపరి దశకు సన్నద్ధం
భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో పునరుత్పాదక ఇంధన వనరులను విస్తరించేందుకు అవసరమైన విశ్వసనీయ, చవకైన, స్థిరమైన బేస్-లోడ్ శక్తిని బొగ్గు అందిస్తూనే ఉంది. ఈ ప్రయాణంలో ఎస్‌ఈసీఎల్ సాధించిన ఉత్పత్తి, ఉత్పాదకత, ఆర్థిక పనితీరు, మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమ వృద్ధి రికార్డులు కీలక ఆధారంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం కోర్బా కోల్‌ఫీల్డ్స్ అతిపెద్ద ఇంధన భద్రతకు కేంద్రంగా ఉండగా, విస్తరిస్తున్న రైల్వే కనెక్షన్ల మద్దతుతో మంద్-రాయ్‌ఘర్ బొగ్గు గనులు అదనపు ఉత్పత్తి కేంద్రంగా మారుతున్నాయి.
2014 నుంచి ఎస్ఈసీఎల్ ప్రయాణం కేవలం అధికంగా బొగ్గును వెలికితీయటం మాత్రమే కాదు. మెరుగైన ఉత్పాదకత, పటిష్టమైన ఆర్థిక స్థితి, ఆధునిక రవాణా సౌకర్యాలు, డిజిటల్, సాంకేతిక పురోగతి, పర్యావరణ బాధ్యత, సమర్థవంతమైన సమాజ అభివృద్ధికి నిదర్శనం. ప్రగతిశీల విధాన సంస్కరణలు, సంస్థాగత నిబద్ధత, మానవ వనరులు భారతదేశ బొగ్గు రంగ సామర్థ్యాన్ని స్పష్టమైన జాతీయ విలువగా మార్చుతాయో ఇది చాటిచెబుతోంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎస్ఈసీఎల్ మరింత సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా బొగ్గును ఉత్పత్తి చేయటానికి, సరఫరా చేయటానికి కట్టుబడి ఉంది. తద్వారా ఉద్యోగులు, సమాజం, వినియోగదారులు, దేశానికి అభివృద్ధి ఫలాలను అందేలా చూస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2309614)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3