శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఉక్కు వ్యర్థాలతో (స్టీల్ స్లాగ్) తో నిర్మించిన రహదారులు నిర్మాణ వ్యయాన్ని 40 శాతం వరకు తగ్గించడంతో పాటు, నాలుగు రెట్లు అధిక మన్నిక, దృఢత్వాన్ని అందిస్తాయి: డాక్టర్ జితేంద్ర సింగ్
దేశీయ స్టీల్ స్లాగ్ రోడ్ల సాంకేతికతను అన్ని రాష్ట్రాలు, ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ రంగంలో విస్తృతంగా అమలు చేయాలి: మంత్రి పిలుపు
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పదేపదే పునరుద్ఘాటించే 'చెత్త నుంచి సంపద' పునర్వినియోగ ప్రాధాన్యతలతో సహా ప్రస్తుత ప్రభుత్వంలోని పలు ప్రతిష్టాత్మక పథకాల లక్ష్యాలను ఈ చొరవ ఏకకాలంలో నెరవేరుస్తుంది: డాక్టర్ జితేంద్ర సింగ్
1.85 కిలోమీటర్ల గిన్నిస్ రికార్డు నుంచి 40 కిలోమీటర్ల ఒడిశా రహదారి వరకు: తదుపరి మైలురాయిని సృష్టించేందుకు సీఎస్ఐఆర్ - సీఆర్ఆర్ఐ, జిందాల్ స్టీల్ సన్నద్ధం
స్టీల్ స్లాగ్ సాంకేతికతతో నిర్మించిన రహదారులకు దాదాపు 15 ఏళ్ల వరకు పెద్ద స్థాయి మరమ్మతుల అవసరం ఉండదు: కేంద్ర మంత్రి
ఒక ప్రాజెక్టు నుంచి అనేక ప్రాజెక్టులకు - ఒక రాష్ట్రం నుంచి అనేక రాష్ట్రాలకు: స్టీల్ స్లాగ్ రోడ్ల సాంకేతికతను విస్తృతంగా అమలు చేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపు
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన స్టీల్ స్లాగ్ రహదారితో భారత్ గిన్నిస్ వరల్డ్ రికార్డు
నాడు పోస్టు చేయడమైనది:
12 SEP 2026 4:45PM by PIB Hyderabad
ఉక్కు వ్యర్థాలు/ ఉప ఉత్పత్తుల (స్టీల్ స్లాగ్) రోడ్ల సాంకేతికత ద్వారా రహదారుల నిర్మాణ వ్యయాన్ని సుమారు 40 శాతం వరకు తగ్గించడంతో పాటు, సంప్రదాయ రహదారులతో పోలిస్తే నాలుగు రెట్లు అధిక దృఢత్వాన్ని అందించవచ్చని కేంద్ర శాస్త్ర, సాంకేతికత, భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అనుకూలమైన పరిస్థితుల్లో ఈ సాంకేతికత రహదారుల నిర్వహణ చక్రాన్ని గణనీయంగా పొడిగించగలదని, సుమారు 15 సంవత్సరాల తర్వాత మాత్రమే నిర్వహణ అవసరమయ్యే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం రహదారి ఇంజినీరింగ్ రంగానికే కాకుండా, మొత్తం మౌలిక సదుపాయాల ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపగల కీలక సాంకేతిక పురోగతి అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
ఈ దేశీయ సాంకేతికతను ఒక ప్రాజెక్టు నుంచి అనేక ప్రాజెక్టులకు, ఒక రాష్ట్రం నుంచి అనేక రాష్ట్రాలకు విస్తరించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకే పరిమితం కాకుండా, రైల్వేలు, ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టర్లు, మౌలిక సదుపాయాల నిర్వహణ సంస్థలు కూడా ఈ సాంకేతికతను విస్తృతంగా స్వీకరించాలని ఆయన సూచించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో నిర్మించిన 1.85 కిలోమీటర్ల పొడవైన రహదారి “ప్రాసెస్ చేసిన ఉక్కు వ్యర్థాలతో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారి”గా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు. న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్–సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, జిందాల్ స్టీల్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ రికార్డు సాధన కోసం కృషి చేశాయి. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో నిర్మించిన 1.85 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి, ఉక్కు తయారీ ప్రక్రియలో ఉత్పత్తయ్యే ఉప ఉత్పత్తి అయిన ప్రాసెస్ చేసిన స్టీల్ స్లాగ్‌ను రహదారి నిర్మాణానికి ఉపయోగించే అగ్రిగేట్స్‌గా మార్చే దేశీయ సాంకేతికతను భారీ స్థాయిలో అమలు చేసిన ఘనతను చాటిచెబుతోంది.ఈ కార్యక్రమంలో రహదారి వర్చువల్ ప్రారంభోత్సవం, శాస్త్రీయ డాక్యుమెంటరీ విడుదల, సీఎస్ఐఆర్ - సీఆర్ఆర్ఐ, జిందాల్ స్టీల్ మధ్య సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ఒప్పందంపై సంతకాలు, ‘స్టీల్ గ్రిట్’ బ్రాండ్ ఆవిష్కరణ, ప్రాజెక్టు బృందానికి అభినందనలు వంటి కార్యక్రమాలు కూడా జరిగాయి.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఈ విజయవంతమైన కార్యక్రమం ప్రభుత్వం నిర్దేశించిన పలు కీలక ప్రాధాన్యతలను ఏకకాలంలో సాకారం చేస్తోందని అన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పదేపదే ప్రస్తావిస్తున్న ‘వ్యర్థం నుంచి సంపద’ విధానంలో భాగంగా పునర్వినియోగ అవకాశాలకు ఇది ప్రోత్సాహం కల్పిస్తోందని పేర్కొన్నారు.
పార్లమెంట్ సభ్యుడు, జిందాల్ స్టీల్ చైర్మన్, ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ నవీన్ జిందాల్, డీఎస్ఐఆర్ కార్యదర్శి, సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్. కలైసెల్వి, నీతి ఆయోగ్ మాజీ సభ్యుడు, డీఆర్‌డీవో మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వి.కె. సరస్వత్, సీఎస్ఐఆర్ - సీఆర్ఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ రవి శేఖర్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, పారిశ్రామిక రంగ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేశంలో సైన్స్, సాంకేతికత, పారిశ్రామిక రంగాలు సమష్టిగా పనిచేయడం ద్వారా పారిశ్రామిక వ్యర్థాలను మౌలిక సదుపాయాల సంపదగా ఎలా మార్చవచ్చో ఈ విజయం చాటిచెబుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. భారత్‌లో రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, పారిశ్రామిక కారిడార్లు, ఓడరేవులు, పట్టణ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సహజ వనరుల పరిరక్షణ బాధ్యత కూడా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా గనులు, క్వారీల ద్వారా వెలికితీసే సహజ నిర్మాణ పదార్థాల వినియోగాన్ని తగ్గించి వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్టీల్ స్లాగ్ రోడ్ల కార్యక్రమం ఈ రెండు సవాళ్లను ఏకకాలంలో పరిష్కరించేందుకు సాంకేతికత ఆధారిత మార్గాన్ని అందిస్తోంది. ఒకవైపు పారిశ్రామిక ఉప ఉత్పత్తిని ప్రయోజనకరంగా వినియోగించుకోవడంతో పాటు, మరోవైపు సహజ వనరులను పరిరక్షించేందుకు ఇది దోహదపడుతుంది
భౌగోళికంగా వైవిధ్యభరితమైన భారత్ వంటి దేశంలో ఈ సాంకేతికత ప్రాధాన్యత మరింత పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, అధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో సంప్రదాయ రహదారులు తరచుగా మన్నికకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటాయని ఆయన తెలిపారు. ఈశాన్య ప్రాంతంతో తనకు ఉన్న ఏడేళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మంత్రి, భారీ వర్షపాతం కారణంగా అక్కడి పలు ప్రాంతాల్లో రహదారి నిర్మాణ పనులు ఏడాదిలో నాలుగు లేదా ఐదు నెలలకే పరిమితమవుతున్నాయని చెప్పారు. ఒక సీజన్‌లో నిర్మించిన రహదారుల్లోని కొన్ని భాగాలు తదుపరి నిర్మాణ పనుల చక్రం ప్రారంభమయ్యేలోపే దెబ్బతినే పరిస్థితులు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అందువల్ల, ఇలాంటి సవాళ్లతో కూడిన భౌగోళిక పరిస్థితుల్లో మరింత బలమైన, మన్నికైన రహదారి సాంకేతికతలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.
గ్రామీణ రహదారులపై మారుతున్న రవాణా స్వభావాన్ని కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. గ్రామాలను అనుసంధానించేందుకు, ప్రధానంగా తేలికపాటి వాహనాల రాకపోకలకు అనుగుణంగా తొలుత నిర్మించిన రహదారులు ఆ ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది పారిశ్రామిక ప్రాంతాలుగా మార్పు చెందినప్పుడు భారీ ట్రక్కులు, వాణిజ్య వాహనాల రాకపోకలు కూడా పెరుగుతాయని, ఇలాంటి మార్పుల నేపథ్యంలో అధిక భారాన్ని తట్టుకోవడంతో పాటు, ఎక్కువ కాలం మన్నికగా ఉండే రహదారి సాంకేతికతల అవసరం మరింత పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
సమన్వయంతో కూడిన విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం గురించి ప్రస్తావిస్తూ, రహదారి నిర్మాణం కేవలం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు మాత్రమే పరిమితం కాదని ఆయన అన్నారు. రైల్వేలు, ఇతర అనేక ప్రభుత్వ శాఖలు కూడా రహదారులు, భారీ సామర్థ్యం కలిగిన మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నాయని, ప్రైవేట్ నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టర్లు, మౌలిక సదుపాయాల నిర్వహణ సంస్థలు కూడా ఈ సాంకేతికతను అమలు చేయడానికి మరో కీలక వర్గంగా ఉన్నాయని తెలిపారు. ఇంజినీర్లు, అమలు సంస్థలకు ఈ సాంకేతికతపై పూర్తి అవగాహన కల్పించి, తమ తమ ప్రాజెక్టులకు ఇది ఎంతవరకు అనుకూలమో అంచనా వేసేలా చేయడానికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలతో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం, పరస్పర భాగస్వామ్యం అవసరమని ఆయన పిలుపునిచ్చారు.
ఇకపై ఈ సాంకేతికతను “ఒక ప్రాజెక్టు నుంచి అనేక ప్రాజెక్టులకు, ఒక రాష్ట్రం నుంచి అనేక రాష్ట్రాలకు” విస్తరించడమే లక్ష్యంగా ఉండాలని, తద్వారా నిరూపితమైన స్వదేశీ ఆవిష్కరణలను ప్రధాన స్రవంతి మౌలిక సదుపాయాల నిర్మాణంలో భాగం చేయాలని మంత్రి పేర్కొన్నారు. సాంకేతికంగా పటిష్ఠమైన అమలుకు సీఎస్ఐఆర్ - సీఆర్ఆర్ఐ రూపొందించిన శాస్త్రీయ మార్గదర్శకాలు, ప్రాసెసింగ్ విధానాలు, నాణ్యత నియంత్రణ వ్యవస్థలు పునాదిగా నిలుస్తాయని తెలిపారు. సాంకేతికంగా, ఆర్థికంగా అనుకూలమైన ప్రాంతాల్లో ఈ సాంకేతికత అమలును వేగవంతం చేసేందుకు ప్రభుత్వ సంస్థలు, శాస్త్రీయ పరిశోధనా సంస్థలు, పారిశ్రామిక రంగం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలు సమన్వయంతో పనిచేయవచ్చని మంత్రి పేర్కొన్నారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ కార్యక్రమాన్ని “సంపూర్ణ ప్రభుత్వ యంత్రాంగం, సంపూర్ణ దేశ భాగస్వామ్యం”తో కూడిన సమష్టి సహకారానికి ఉదాహరణగా అభివర్ణించారు. ఇందులో ప్రభుత్వం, పరిశోధనా సంస్థలు, పారిశ్రామిక రంగం, ఇంజినీర్లు కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. ఈ సాంకేతికత రూపకల్పనతో పాటు, దాని అమలు కూడా పూర్తిగా దేశీయంగానే సాగుతోందని ఆయన పేర్కొన్నారు. తదుపరి దశలో దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతలపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, ప్రయోగశాలలు, ప్రదర్శన ప్రాజెక్టుల స్థాయి నుంచి భారీ స్థాయిలో క్షేత్రస్థాయి అమలుకు అవి చేరుకునేలా మరింత పటిష్ఠమైన మార్గాలను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాల్సి ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
ఉక్కు వ్యర్థాలతో చేపట్టే ఈ రహదారుల నిర్మాణ కార్యక్రమం వ్యర్థాల నుంచి సంపద సృష్టి, చక్రీయ ఆర్థిక వ్యవస్థ (సర్క్యులర్ ఎకానమీ) అనే విస్తృత దృక్పథంలో భాగమని మంత్రి పేర్కొన్నారు. ఏ పదార్థాన్నైనా కేవలం వ్యర్థంగా భావించే ధోరణి నుంచి భారత్ క్రమంగా బయటపడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఇలాంటి వనరుల నుంచి కొత్త ఆర్థిక విలువను సృష్టించవచ్చని పేర్కొన్నారు. వినియోగించిన వంట నూనె నుంచి జీవ ఇంధనాల తయారీ, ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి విలువైన పదార్థాల పునరుద్ధరణకు సంబంధించి సీఎస్ఐఆర్ చేపడుతున్న కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, రీసైక్లింగ్, వనరుల పునరుద్ధరణ భవిష్యత్తులో పారిశ్రామిక అభివృద్ధి తదుపరి దశలో మరింత కీలకమైన భాగంగా మారనున్నాయని ఆయన తెలిపారు.
పరిశోధనను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో డాక్టర్ సతీష్ పాండే, సీఎస్ఐఆర్ - సీఆర్ఆర్ఐ బృందం చూపిన నిరంతర కృషిని, అంకితభావాన్ని శ్రీ జితేందర్ సింగ్ అభినందించారు. శాస్త్రీయ ప్రతిభ తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలంటే తగిన అవకాశం అవసరమని ఆయన అన్నారు. వాస్తవ మౌలిక సదుపాయాల్లో ఈ సాంకేతికతను ప్రదర్శించేందుకు అవసరమైన విస్తృత స్థాయి, వేదికను జిందాల్ స్టీల్ అందించిందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సాంకేతికత ఆధారిత పరిష్కారాల అభివృద్ధిలో శాస్త్రీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు మరిన్ని ఉక్కు పరిశ్రమల సంస్థలు ముందుకు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సాంకేతికత ఇప్పటికే పలు కీలక ప్రాజెక్టుల ద్వారా తన ప్రయాణాన్ని కొనసాగించింది. గుజరాత్‌లోని హజీరాలో చేపట్టిన ప్రధాన ప్రదర్శన ప్రాజెక్టుతో ఇది ప్రారంభమైంది. అక్కడ ప్రాసెస్ చేసిన ఉక్కు వ్యర్థ ఉత్పత్తులను పారిశ్రామిక ప్రాంతాన్ని హజీరా ఓడరేవుతో అనుసంధానించే ఆరు వరుసల రహదారి నిర్మాణంలో వినియోగించారు. అనంతరం ఈ సాంకేతికతను ఎన్‌హెచ్–66 ముంబై / గోవా జాతీయ రహదారికి విస్తరించింది. అక్కడ సుమారు 80,000 టన్నుల ఉక్కు వ్యర్థాలను ప్రాసెస్ చేసి కిలోమీటరు పొడవైన నాలుగు వరుసల రహదారి భాగం నిర్మాణంలో ఉపయోగించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో వ్యూహాత్మకంగా కీలకమైన సరిహద్దు ప్రాంతంతో పాటు, భారీ వాహనాల రాకపోకలను తట్టుకునే రహదారి మౌలిక సదుపాయాల నిర్మాణంలో కూడా ఈ సాంకేతికతను అమలు చేశారు.
హజీరా ఓడరేవులోని బహుళ ప్రయోజన బెర్త్‌ను బొగ్గు నిల్వ ప్రాంగణంతో అనుసంధానిస్తూ నిర్మించిన 1.1 కిలోమీటర్ల ఉక్కు వ్యర్థాల రహదారి ద్వారా ఈ సాంకేతికత ఓడరేవు మౌలిక సదుపాయాల రంగంలోకి కూడా ప్రవేశించింది. తగిన ప్రాసెసింగ్, రహదారి నిర్మాణ రూపకల్పన, నాణ్యత నియంత్రణను పాటించినప్పుడు పారిశ్రామిక, సరకు రవాణా రంగాల్లోని కఠినమైన అవసరాలను తీర్చడంలో ప్రాసెస్ చేసిన ఉక్కు వ్యర్థ ఉత్పత్తులకు ఉన్న సామర్థ్యాన్ని ఈ ప్రాజెక్టు చాటిచెబుతోంది.
గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన 1.85 కిలోమీటర్ల రహదారి ఇప్పటికే మరింత భారీ మైలురాయికి బాటలు వేస్తోంది. డీఎస్ఐఆర్ కార్యదర్శి, సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్. కలైసెల్వి మాట్లాడుతూ, సీఎస్ఐఆర్ 85వ సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ విజయం సాధించడం సంస్థకు ఎంతో ప్రత్యేకమైన, కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. జిందాల్ స్టీల్ అంగుల్ ప్లాంట్ నుంచి ఒడిశాలో 40 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి సీఎస్ఐఆర్ - సీఆర్ఆర్ఐకి వర్క్ ఆర్డర్ లభించినట్లు ఆమె ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఉన్న 1.85 కిలోమీటర్ల గిన్నిస్ రికార్డు స్థాయి నుంచి ఈ సాంకేతికత 40 కిలోమీటర్ల స్థాయిలో అమలుకు విస్తరించనుందని తెలిపారు. ఈ తదుపరి మైలురాయితో సీఎస్ఐఆర్ - సీఆర్ఆర్ఐ, జిందాల్ స్టీల్ సంస్థలు తమ సొంత రికార్డును తామే అధిగమించేందుకు సిద్ధమవుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డును అంతిమ గమ్యంగా కాకుండా, సాంకేతికతను తదుపరి దశలో విస్తృతంగా అమలు చేయడానికి ఆరంభంగా పరిగణించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సాంకేతికంగా, ఆర్థికంగా అనుకూలమైన ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా ఈ సాంకేతికతను మళ్లీ మళ్లీ అమలు చేసినప్పుడే అసలైన విజయం సాధించినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో అభివృద్ధి చేసిన ఒక ఆవిష్కరణను భారత్‌లోనే విస్తృతంగా వినియోగించే మౌలిక సదుపాయాల పరిష్కారంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ మౌలిక సదుపాయాల సంస్థలతో మరింత బలమైన సమన్వయం, భాగస్వామ్యం అవసరమని మంత్రి పిలుపునిచ్చారు.
ఉక్కు వ్యర్థాల రోడ్ల కార్యక్రమం శాస్త్ర, పారిశ్రామిక రంగాలను, వ్యర్థాన్ని సంపదగా, ఆవిష్కరణను మౌలిక సదుపాయాలతో, పరిశోధనను సమాజ అవసరాలతో అనుసంధానిస్తోందని ఆయన అన్నారు. దేశీయ సాంకేతికతను అభివృద్ధి చేయడానికే పరిమితం కాకుండా, దానిని భారీ స్థాయిలో అమలు చేసే దిశగా భారత్ క్రమంగా ముందుకు సాగుతోందనడానికి ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. తద్వారా ఆర్థికంగా సమర్థవంతమైన, పర్యావరణపరంగా బాధ్యతాయుతమైన, సాంకేతికంగా పటిష్ఠమైన మౌలిక సదుపాయాలను దేశం నిర్మించగలుగుతోందని ఆయన తెలిపారు.
డాక్టర్ కలైసెల్వి మాట్లాడుతూ, ఈ విజయం సీఎస్ఐఆర్ - సీఆర్ఆర్ఐ, జిందాల్ స్టీల్ మధ్య భాగస్వామ్య బలాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. సీఎస్ఐఆర్‌తో సహకరించినందుకు శ్రీ నవీన్ జిందాల్‌కు, ఆయన బృందానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. శాస్త్రవేత్తలను, ఇంజినీర్లను, ముఖ్యంగా డాక్టర్ సతీష్ పాండేను ఆమె అభినందించారు. గుజరాత్‌లో ప్రారంభమైన సాంకేతికత వినియోగాన్ని జాతీయ రహదారుల నెట్‌వర్క్, అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి, ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించే స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కృషి కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
తదుపరి 40 కిలోమీటర్ల ఒడిశా ప్రాజెక్టు ఇప్పటికే కార్యరూపం దాల్చే దశలో ఉండటంతో, ఈ ప్రయాణం ఇప్పుడు ప్రపంచ రికార్డు నుంచి దేశవ్యాప్తంగా విస్తృత అమలు దిశగా సాగుతోంది. ఒక విజయవంతమైన ప్రాజెక్టును అనేక ప్రాజెక్టులుగా, ఒక రాష్ట్రంలో అమలును అనేక రాష్ట్రాలకు విస్తరించడంతో పాటు పారిశ్రామిక ఉప ఉత్పత్తిని విలువైన మౌలిక సదుపాయాల వనరుగా మార్చే దిశగా ముందుకు సాగుతోంది.
****
(రిలీజ్ ఐడి: 2309609)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5