కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేయడంపై ముంబయిలో ముగిసిన భవన, ఇతర నిర్మాణ కార్మికుల జాతీయ సదస్సు


బీఓసీడబ్ల్యూ సంక్షేమ సేవలను బలోపేతం చేసేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం, పరస్పర అభ్యాసం అవసరం: కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి



బీఓసీడబ్ల్యూ సదస్సులో నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ లేబర్ చౌక్‌లు, కార్మికుల సౌకర్యాలపై తమ కార్యక్రమాలను ప్రదర్శించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

నాడు పోస్టు చేయడమైనది: 12 SEP 2026 3:59PM by PIB Hyderabad

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహించిన రెండు రోజుల జాతీయ భవన, ఇతర నిర్మాణ కార్మికుల (బీఓసీడబ్ల్యూ) సదస్సు నేడు ముంబైలో ముగిసింది. 2026 సెప్టెంబర్ 11, 12 తేదీల్లో జరిగిన ఈ సదస్సులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, బీఓసీడబ్ల్యూ సంక్షేమ బోర్డులు, ఇతర భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు పాల్గొని నిర్మాణ కార్మికుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, సామాజిక భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించారు. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్‌ మన్సుఖ్ మాండవీయ సదస్సు తొలిరోజుకు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీమతి శోభా కరంద్లాజే పాల్గొన్నారు.

 

సదస్సు రెండో రోజు ప్రారంభోపన్యాసంలో కార్యదర్శి బీఓసీడబ్ల్యూ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు, అందుబాటులో ఉన్న అవకాశాలను వివరించారు. నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, విధానాలు, కార్యక్రమాల రూపకల్పనలో కార్మికుల గౌరవాన్ని కేంద్రంగా ఉంచడం ద్వారా మరింత స్పందించే, సమ్మిళిత, పటిష్టమైన కార్మిక వ్యవస్థను నిర్మించవచ్చని ఆయన చెప్పారు. కార్మిక మార్కెట్‌లో సమాచారం, అవకాశాల అందుబాటులో ఉన్న అసమానతలను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. ఉద్యోగార్థులు, యజమానుల మధ్య మెరుగైన అనుసంధానాలను సులభతరం చేసే వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

 

రాష్ట్రాల మధ్య, అంతర్జాతీయ స్థాయిలో కార్మికుల వలసలను సామాజిక భద్రత, సంక్షేమ పథకాల రూపకల్పనలో తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని కార్యదర్శి పేర్కొన్నారు. నిర్మాణ కార్మికుల వృత్తిపరమైన ఆరోగ్యం, శారీరక భద్రత, ఇతర పని ప్రదేశ సమస్యలపై మరింత దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు.

 

సదస్సులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పంచుకున్న ఉత్తమ విధానాలను ప్రశంసించిన ఆయన.. నిరంతర సహకారం, పరస్పర అభ్యాసం కోసం కేంద్రం, రాష్ట్రాల మధ్య అనుభవాల మార్పిడిని మరింత పెంచాలని, తరచుగా వర్చువల్ సమావేశాలు నిర్వహించాలని సూచించారు.

 

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కీలక చర్యలను కార్యదర్శి వివరించారు. ఇందులో వివిధ స్థాయిల్లో అమలు చేస్తున్న విభిన్న సంక్షేమ చర్యలను సమన్వయం చేయడం, సుస్థిర సంక్షేమ కార్యక్రమాలకు మద్దతుగా యాక్చురియల్ విశ్లేషణను మరింత విస్తృతంగా వినియోగించడం వంటివి ఉన్నాయి.

 

సదస్సు రెండో రోజు “కొత్త కార్మిక చట్టాల నేపథ్యంలో బీఓసీడబ్ల్యూ సంక్షేమ బోర్డుల పాత్రలు, బాధ్యతలు” అనే అంశంపై సమావేశంతో ప్రారంభమైంది. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ కార్యక్రమాలు, ఉత్తమ విధానాలను వివరించాయి. భవన, ఇతర నిర్మాణ కార్మికులకు సంక్షేమ సేవల అమలును మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా చేపట్టిన చర్యలను ఈ ప్రజెంటేషన్లు వివరించాయి.

 

భవన నిర్మాణ కార్మికుల నైపుణ్యాభివృద్ధిపై చేపడుతున్న కార్యక్రమాలను ఉత్తరప్రదేశ్ వివరించగా..  డిజిటల్ లేబర్ చౌక్‌లతో రాజస్థాన్‌ తమ‌ అనుభవాన్ని పంచుకుంది.  శ్రమ సేవా సువిధా కేంద్రాల గురించి బిహార్ వివరించగా, నిర్మాణ సఖి వేదికను అస్సాం ప్రస్తావించింది. ఈ ప్రజెంటేషన్ల అనంతరం పాల్గొన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఇతర భాగస్వామ్య వర్గాల మధ్య చర్చలు జరిగాయి. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమం, ఉపాధికి సంబంధించిన సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు అనుసరిస్తున్న విధానాలు, అనుభవాలను పంచుకునేందుకు ఈ చర్చలు అవకాశం కల్పించాయి.

 

ఆ తర్వాత సదస్సులో నైపుణ్యాభివృద్ధి, ఉపాధిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికవేత్తల మంత్రిత్వ శాఖ నైపుణ్యాభివృద్ధిపై ప్రజెంటేషన్ ఇవ్వగా, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ దేశ ఉపాధి వృద్ధి ప్రస్థానంపై ప్రజెంటేషన్ ఇచ్చింది. అనంతరం ఈ అంశాలపై చర్చలు జరిగాయి.

 

దీంతోపాటు లేబర్ స్టాక్‌పై కూడా ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.  ఇందులో భాగంగా నిర్మాణ రంగం, పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ-ఐడబ్ల్యూ) పై ఒక నివేదికను  సమర్పించి, దానిపై విస్తృతంగా చర్చలు జరిపారు

  

రెండు రోజుల సదస్సులో జరిగిన చర్చలు.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ అనుభవాలు, విధానాలను పంచుకునేందుకు, భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, సేవల పంపిణీ వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఒక వేదికను అందించాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2309604) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी