నౌకారవాణా మంత్రిత్వ శాఖ
భారత్ నౌకా మరమ్మతుల పరిశ్రమను బలోపేతం చేసేందుకు కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్, డ్రైడాక్స్ వరల్డ్ మధ్య సంయుక్త భాగస్వామ్య ఒప్పందం
50:50 వాటాతో సంయుక్త భాగస్వామ్యం ద్వారా కొచ్చిలోని అంతర్జాతీయ నౌకా మరమ్మత్తు కేంద్రం విస్తరణ; భారత్‌లో నౌకా మరమ్మతుల వ్యవస్థ బలోపేతం; ప్రపంచవ్యాప్తంగా నౌకల మరమ్మత్తులకు రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంలో కీలక పాత్ర
నాడు పోస్టు చేయడమైనది:
11 SEP 2026 9:35PM by PIB Hyderabad
కొచ్చిలోని అంతర్జాతీయ నౌకా మరమ్మతుల సదుపాయం (ఐఎస్ఆర్ఎఫ్) నిర్వహణ, విస్తరణ కోసం సంయుక్త భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసినట్లు డీపీ వరల్డ్‌కు చెందిన డ్రైడాక్స్ వరల్డ్, కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్ ( సీఎస్ఎల్) నేడు ప్రకటించాయి.
న్యూఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు - 2026 సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందంపై డ్రైడాక్స్ వరల్డ్ సీఈఓ కెప్టెన్ రాడో ఆంటోలోవిక్, పీహెచ్‌డీ, కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జోస్ వి.జె. సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖ (ఎంఓపీఎస్డబ్ల్యూ) మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధునాతన శాస్త్ర, సాంకేతికత సహాయ విదేశాంగ మంత్రి ఒమ్రాన్ షరఫ్ అల్‌హషిమి సమక్షంలో ఈ సంతకాలు జరిగాయి.
2025లో జరిగిన ఇండియా మారిటైమ్ వీక్ సందర్భంగా డ్రైడాక్స్ వరల్డ్ కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందానికి కొనసాగింపుగా ఈ ఒప్పందం ఖరారైంది. ఆ అవగాహన ఒప్పందం ప్రకారం నౌకా మరమ్మతులు, అనుబంధ సముద్ర సేవల రంగాల్లో పరస్పర సహకారానికి గల అవకాశాలను అన్వేషించేందుకు ఇరు సంస్థలు అంగీకరించాయి. తాజాగా 50:50 వాటాతో సంయుక్త భాగస్వామ్య సంస్థ ఏర్పాటు చేయడం ద్వారా ఈ సహకారాన్ని ఇరు సంస్థలు అధికారికంగా ఖరారు చేశాయి. దీంతో భారత్‌లోని నౌకా మరమ్మతుల రంగంలో తొలిసారిగా ఈ తరహా ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యం ప్రారంభమైంది.
ఈ సంయుక్త భాగస్వామ్య ఏర్పాటు కింద కొచ్చిలోని అంతర్జాతీయ నౌకా మరమ్మతుల కేంద్రం నిర్వహణ, విలీనం, విస్తరణ చేపడతారు. దీనివల్ల విస్తృత శ్రేణి నౌకలకు సేవలందించేందుకు అదనపు సామర్థ్యం అందుబాటులోకి రావడంతో పాటు, భారతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ వినియోగదారుల నుంచి పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు వీలు కలుగుతుంది.
ఈ భాగస్వామ్యం కొచ్చి నగరాన్ని సముద్ర సేవల కేంద్రంగా మరింత బలోపేతం చేయడంతో పాటు, కేరళలో నౌకల మరమ్మతులు, ఇంజినీరింగ్, ఫ్యాబ్రికేషన్, అనుబంధ సముద్ర సేవల రంగాల్లో అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు.
కేంద్ర రేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద్ సోనోవాల్ మాట్లాడుతూ, " కొచ్చి షిప్‌యార్డ్, డ్రైడాక్స్ వరల్డ్ సంస్థల మధ్య ఏర్పడిన ఈ భాగస్వామ్యం భారత నౌకా మరమ్మతు వ్యవస్థను బలపరచడంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. శతాబ్దాలుగా సాగుతున్న వాణిజ్యం, వ్యాపారం, ప్రజల మధ్య సంబంధాల ద్వారా వర్ధిల్లిన భారత్ - యుఏఈ దేశాల చిరస్థాయి సముద్ర సంబంధాలను ప్రతిబింబిస్తోంది. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ల ఉమ్మడి దృక్పథం, తిరుగులేని సంకల్పాలు ఈ ద్వైపాక్షిక సంబంధాలకు వ్యూహాత్మక, ఆర్థిక రంగాలలో కొత్త వేగాన్ని అందిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న భారత నౌకా నిర్మాణం, మరమ్మతు సామర్థ్యాలను యుఏఈ ప్రపంచస్థాయి నావికా నైపుణ్యంతో మేళవించడం ద్వారా ఏర్పడిన ఈ సంయుక్త భాగస్వామ్యం కొచ్చిన్‌ను అంతర్జాతీయ నౌకాయాన సేవల కేంద్రంగా బలోపేతం చేయడమే కాకుండా, కొత్త సామర్థ్యాలు, నైపుణ్యాలు, ఆర్థిక అవకాశాలను సృష్టిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విలక్షణ సారథ్యంలో భారత్ ప్రపంచంలోని ప్రముఖ సముద్ర దేశాల్లో ఒకటిగా అవతరించే దిశగా దృఢంగా ముందుకు సాగుతోంది. ఈ భాగస్వామ్యం మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 లక్ష్యాల సాధన దిశగా మరో కీలక అడుగు” అని పేర్కొన్నారు.
యూఏఈ విదేశాంగ శాఖలో అధునాతన శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల సహాయ మంత్రి ఒమ్రాన్ షరఫ్ అల్‌హషిమీ మాట్లాడుతూ, “పరస్పర విశ్వాసం, ఆర్థిక సహకారం, అభివృద్ధికి కొత్త మార్గాలను సృష్టించాలనే ఉమ్మడి ఆకాంక్షలపై ఆధారపడిన దీర్ఘకాలిక సంబంధాన్ని యూఏఈ, భారత్ పంచుకుంటున్నాయి. డ్రైడాక్స్ వరల్డ్, కొచ్చిన్ షిప్‌యార్డ్‌ల మధ్య కుదిరిన ఈ సంయుక్త భాగస్వామ్యం స్పష్టమైన పారిశ్రామిక ఫలితాలుగా ఈ సంబంధం ఎలా రూపాంతరం చెందగలదో చూపించే బలమైన ఉదాహరణ. పరస్పరపూరక నైపుణ్యాలను సమన్వయం చేయడం ద్వారా భారత సముద్ర సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఇది దోహదపడుతుంది. పెరుగుతున్న భారత సముద్ర రంగ సామర్థ్యాలను యూఏఈకి ఉన్న ప్రపంచస్థాయి అనుభవంతో సమన్వయం చేయడం ద్వారా ఇలాంటి భాగస్వామ్యాలు మరింత సమర్థవంతమైన నౌకా మరమ్మతుల సేవలను అందించేందుకు, సముద్ర అనుసంధానాన్ని బలోపేతం చేసేందుకు దోహదపడతాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాల నిరంతర వృద్ధికి కూడా ఇవి తోడ్పడతాయి” అని పేర్కొన్నారు.
రేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విజయ్ కుమార్ మాట్లాడుతూ, “ఈ సంయుక్త భాగస్వామ్యం కేవలం కొచ్చికే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సుదీర్ఘ సముద్రతీర ప్రాంతంలో అమలు చేయగల నమూనాగా దీనిని విస్తరించవచ్చు. తద్వారా నౌకా మరమ్మతులు, నౌకల రూపాంతర సేవల్లో అత్యుత్తమ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అవకాశం కలుగుతుంది. భారత్‌కు ఉన్న వ్యూహాత్మక భౌగోళిక స్థానం, అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు ఉన్న సమీపతను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఈ సంయుక్త భాగస్వామ్యం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించేందుకు, వేలాదిమంది నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు దోహదపడుతుంది. ఇది మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా కొనసాగుతూ నౌకా నిర్మాణం, నౌకా మరమ్మతుల రంగాల్లో భారత్‌ను ప్రపంచస్థాయి శక్తిగా నిలబెట్టేందుకు దోహదపడుతుంది. ఈ సంయుక్త భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేయడం కేవలం ఒక వ్యాపార ఒప్పందం మాత్రమే కాదు. ఇది మన సంకల్పానికి ప్రతీక. ప్రపంచ స్థాయిలో పోటీపడేందుకు భారత్ సిద్ధంగా ఉందనే సందేశాన్ని ఇస్తోంది. ప్రపంచస్థాయి సముద్ర సేవలను అందించడంతో పాటు మన ఆర్థిక వ్యవస్థను, వ్యూహాత్మక సామర్థ్యాలను బలోపేతం చేసే భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలన్న భారత్ నిబద్ధతను ఇది చాటిచెబుతోంది” అని పేర్కొన్నారు.
డ్రైడాక్స్ వరల్డ్ సీఈఓ కెప్టెన్ రాడో ఆంటోలోవిక్ మాట్లాడుతూ, “ కొచ్చి షిప్‌యార్డ్‌తో ఈ భాగస్వామ్యం భారత్ నౌకా మరమ్మతుల పరిశ్రమకు ఒక ముఖ్యమైన మైలురాయి. గత ఏడాది కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ద్వారా ఏర్పడిన బలమైన పునాదిపై ఇది నిర్మితమవుతోంది. కోచిన్ షిప్‌యార్డ్ స్థానిక నైపుణ్యం, నిపుణులైన సిబ్బందిని డ్రైడాక్స్ వరల్డ్ ప్రపంచస్థాయి సామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞానంతో సమన్వయం చేయడం ద్వారా ప్రపంచస్థాయి నౌకా మరమ్మతు సేవలను అందించే వ్యవస్థను రూపొందిస్తున్నాం. మా లక్ష్యం ఒక్క సదుపాయానికే పరిమితం కాదు. భారత్ అంతటా నౌకా మరమ్మతులు, ఫ్యాబ్రికేషన్ సామర్థ్యాలను విస్తరించే అవకాశాలను మేం చూస్తున్నాం” అని అన్నారు.
కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జోస్ వి.జె. మాట్లాడుతూ, “డ్రైడాక్స్ వరల్డ్ (దుబాయ్) తో ఈ సంయుక్త భాగస్వామ్యం భారత్‌ను ప్రపంచ నౌకా మరమ్మతుల కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయాణంలో కీలక మలుపుగా నిలుస్తుంది. కొచ్చిన్ షిప్‌యార్డ్‌కు ఉన్న అపార దేశీయ అనుభవాన్ని డ్రైడాక్స్ వరల్డ్ ప్రపంచస్థాయి నైపుణ్యంతో సమన్వయం చేయడం ద్వారా కేవలం వ్యాపార కార్యకలాపాలను విస్తరించడం మాత్రమే కాకుండా ప్రపంచస్థాయి అత్యుత్తమ విధానాలను అందిపుచ్చుకుని నౌకా మరమ్మతులకు పట్టే సమయాన్ని తగ్గించి, నాణ్యత, భద్రతలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నాం. కొచ్చిలోని అంతర్జాతీయ నౌకా మరమ్మతుల సదుపాయం కేంద్రంగా ఏర్పాటైన ఈ భాగస్వామ్యంబలమైన నౌకా మరమ్మతుల క్లస్టర్ అభివృద్ధికి దోహదపడుతుంది. అంతర్జాతీయ నౌకాదళాలను ఆకర్షించడంతో పాటు అధిక నైపుణ్యం కలిగిన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. అలాగే మారిటైమ్ ఇండియా 2030, ‘అమృత్ కాల్ 2047 లక్ష్యాల సాధన దిశగా ముందుకు తీసుకెళ్తుంది” అని అన్నారు.
నౌకా నిర్మాణం, మరమ్మతులలో కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్ కు ఉన్న నౌకా నిర్మాణం, మరమ్మతుల సామర్థ్యాలు, ఇంజినీరింగ్ నైపుణ్యం, శిక్షణ పొందిన సిబ్బందిని ఈ భాగస్వామ్యం ద్వారా డ్రైడాక్స్ వరల్డ్‌కు అధునాతన నౌకల మరమ్మతులు, నిర్వహణ, భారీ స్థాయి నౌకల రూపాంతరం, సముద్రతీర ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, నిర్మాణ రంగాల్లో ఉన్న ప్రపంచస్థాయి అనుభవంతో సమన్వయం చేస్తున్నారు. ప్రధాన అంతర్జాతీయ నౌకాయాన మార్గాలకు వ్యూహాత్మకంగా అనువైన ప్రదేశంలో ఉన్న ఈ సదుపాయంలో అత్యాధునిక నౌకల లిఫ్ట్ వ్యవస్థతో పాటు ఆధునిక డాకింగ్ సదుపాయాలు ఉన్నాయి. వీటి ద్వారా వివిధ రకాల నౌకలకు మరమ్మతులు, నిర్వహణ సేవలను అందించేందుకు వీలు కలుగుతుంది.
ఈ భాగస్వామ్యంలో డ్రైడాక్స్ వరల్డ్, కొచ్చి షిప్‌యార్డ్ లిమిటెడ్ చెరో 50 శాతం వాటాను కలిగి ఉంటాయి. ప్రారంభ మూలధనాన్ని ఇరు సంస్థలు తమ ఈక్విటీ వాటాల రూపంలో సమకూర్చనున్నాయి.



***
(రిలీజ్ ఐడి: 2309597)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3