ఆయుష్
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌లోని సీసీఆర్ఏఎస్ - ఎన్ఐఐఎంహెచ్‌ను సందర్శించిన నీతి ఆయోగ్ (ఆరోగ్య విభాగం) సభ్యుడు ప్రొఫెసర్ (డాక్టర్) ఎం. శ్రీనివాస్


దేశ వైద్య వారసత్వంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను, విస్తృతమైన గుర్తింపును సాధించాలని పిలుపునిచ్చిన ప్రొఫెసర్ (డాక్టర్) ఎం. శ్రీనివాస్

నాడు పోస్టు చేయడమైనది: 11 SEP 2026 7:18PM by PIB Hyderabad

హైదరాబాద్‌లో ఉన్న ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సీసీఆర్ఏఎస్ - భారతీయ వైద్య వారసత్వ జాతీయ సంస్థ (ఎన్ఐఐఎంహెచ్)ను.. నీతి ఆయోగ్ (ఆరోగ్య విభాగం) సభ్యుడు ప్రొఫెసర్ (డాక్టర్) ఎం. శ్రీనివాస్ సందర్శించారు. నీతి ఆయోగ్ ఓఎస్డీ (ఆరోగ్య విభాగం) డాక్టర్ శోభిత్ కుమార్, యంగ్ ప్రొఫెషనల్ డాక్టర్ జాన్వీ ప్రజాపతి ఆయన వెంట ఉన్నారు.

ప్రొఫెసర్ శ్రీనివాస్‌కు.. న్యూఢిల్లీలోని కేంద్ర ఆయుర్వేద విజ్ఞాన పరిశోధన మండలి (సీసీఆర్ఏఎస్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్. శ్రీకాంత్ స్వాగతం పలికారు. సంప్రదాయ వైద్య విధానాల్లో సంస్థ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు, డిజిటల్ పోర్టళ్లు, రిపాజిటరీలు, చరిత్రాత్మక పరిశోధనలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. సుసంపన్నమైన భారతీయ వైద్య వారసత్వాన్ని రికార్డు చేసి, భద్రపరచడంలో ఎన్ఐఐఎంహెచ్ పాత్రను కూడా ఆయన వివరించారు. అనంతరం సంస్థ సాధించిన కీలక మైలురాళ్లు, వివిధ కార్యకలాపాలపై ఎన్ఐఐఎంహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్‌చార్జ్ డాక్టర్ గోలి పెంచల ప్రసాద్ క్లుప్తంగా వివరించారు.

పర్యటన సందర్భంగా మ్యూజియాన్ని, గ్రంథాలయాన్ని, పరిశోధన విభాగాన్ని ప్రొఫెసర్ శ్రీనివాస్ సందర్శించి.. అధికారులు, ప్రాజెక్టు సిబ్బందితో సంభాషించారు. సహీ ప్రాజెక్టు కింద.. అగల్య, రాణి రుద్రమదేవి శాసనాలపై ఆ సంస్థ రూపొందించిన డాక్యుమెంటరీని కూడా ఆయన వీక్షించారు.

ప్రాచీన తాళపత్ర గ్రంథాల డిజిటలీకరణ, చారిత్రక శాస్త్రీయ రికార్డులను భద్రపరచడం, ఆధునిక సమాచార వ్యవస్థలు, పరిశోధన పోర్టళ్ల ద్వారా భారతీయ వైద్య వారసత్వాన్ని బలోపేతం చేయడంలో సీసీఆర్ఏఎస్ - ఎన్ఐఐఎంహెచ్ కృషిని ప్రొఫెసర్ (డాక్టర్) ఎం. శ్రీనివాస్ అభినందించారు.

మ్యూజియం పరిరక్షణ, నిర్వహణ కోసం అంతర్జాతీయ పద్ధతులు, ప్రమాణాలను అనుసరించాలని ప్రొఫెసర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సుసంపన్నమైన దేశ వైద్య వారసత్వాన్ని పరిరక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడం, నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయడానికి.. శిక్షణ కోర్సులు, సర్టిఫికేట్ కోర్సులు, సంయుక్త పోస్ట్-డాక్టోరల్ కోర్సులను ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకతను కూడా ఆయన వివరించారు.

వైద్య, అనుబంధ రంగాల విద్యార్థులు, వృత్తి నిపుణుల కోసం.. విద్యాపరమైన పర్యాటక కేంద్రంగా ఎన్ఐఐఎంహెచ్‌ను తీర్చిదిద్దాలని ప్రొఫెసర్ శ్రీనివాస్ సూచించారు. సంస్థకు ప్రపంచవ్యాప్త గుర్తింపును పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

విద్యార్థులు, అధ్యాపకులతో అనుసంధానమయ్యేలా... నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ (ఎన్‌సీఐఎస్ఎం), నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) వంటి నియంత్రణ సంస్థలతో ఎన్ఐఐఎంహెచ్ భాగస్వామ్యం వహించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా సుసంపన్నమైన దేశ వైద్య వారసత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేసేలా.. ఐఐటీలు, జాతీయ ప్రాధాన్యమున్న ఇతర సంస్థల్లో మినీ మ్యూజియాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

భారతదేశ ఘనమైన వైద్య వారసత్వాన్ని పరిరక్షించే దిశగా ఆ సంస్థ చేస్తున్న కృషిని ప్రొఫెసర్ శ్రీనివాస్ అభినందించారు. సంస్థ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసుకునేందుకు తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. సుసంపన్నమైన దేశ వైద్య వారసత్వాన్ని పరిరక్షిస్తున్న ‘ఆలయం’గా సందర్శకుల పుస్తకంలో ఎన్ఐఐఎంహెచ్‌ను ఆయన అభివర్ణించారు. భావి తరాల కోసం వారసత్వ సంపదను రక్షించి, భద్రపరచడంలో.. సంస్థ నాయకత్వం, సిబ్బంది అంకితభావాన్ని అభినందించారు.  

 

***


(రిలీజ్ ఐడి: 2309371) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil