జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్‌కు (ఎన్‌సీఎస్‌సీ) అందించిన అంకితభావ సేవలకు, సామాజిక న్యాయం కోసం చేసిన కృషికి గుర్తింపుగా కమిషన్ చైర్మన్ శ్రీ కిశోర్ మక్వానాకు “డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జనసేవా పురస్కారం–2026” ప్రదానం చేశారు.
జాతీయ రాజధాని న్యూ ఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో జరిగిన 16వ సంసద్ రత్న అవార్డ్స్–2026 కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా.. విద్య, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ ప్రత్యేక అతిథిగా కార్యక్రమానికి విచ్చేశారు. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ మాజీ చైర్మన్ శ్రీ హన్సరాజ్ అహిర్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేశానికి, సామాజిక న్యాయానికి కమిషన్ చేస్తున్న అంకితమైన సేవలను, కృషిని సంసద్ రత్న అవార్డ్స్ కమిటీ జ్యూరీ గుర్తించింది.
పురస్కార ప్రశంసాపత్రంలో శ్రీ మక్వానా చేస్తున్న అంకితభావ కృషిని గుర్తిస్తూ, ఆయన నాయకత్వంలో కమిషన్ అందిస్తున్న విశిష్ట సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించింది.
జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్‌కు శ్రీ మక్వానా అందిస్తున్న అంకితభావ సేవలను గుర్తిస్తూ ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్, సంసద్ రత్న అవార్డ్స్ కమిటీ సంయుక్తంగా ఆయనను ఈ పురస్కారానికి నామినేట్ చేశాయి.
శ్రీ కిశోర్ మక్వానా నాయకత్వంలో జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ షెడ్యూల్డ్ కులాల రాజ్యాంగబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించడంలో కట్టుబడి ఉన్న ప్రభావవంతమైన సంస్థగా తన పాత్రను మరింత బలోపేతం చేసింది. షెడ్యూల్డ్ కులాల వర్గాల సభ్యులకు న్యాయం, హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక సాధికారతను నిర్ధారించడానికి కమిషన్ చురుగ్గా పనిచేసింది.
ఈ గౌరవం దేశవ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాల హక్కులను పరిరక్షించడానికి, సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడానికి కమిషన్ చూపిస్తున్న నిరంతర కట్టుబాటును ప్రతిబింబిస్తుంది.