పార్లమెంటరీ వ్యవహారాలు
azadi ka amrit mahotsav

జవహర్ నవోదయ విద్యాలయాల 27వ జాతీయ యువజన పార్లమెంటు పోటీ (2025-26) విజేతలకు బహుమతి ప్రదానం


· బహుమతులు.. జ్ఞాపికలు అందజేసిన పార్టమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కిరణ్‌ రిజిజు

· జాతీయ స్థాయి విజేత: మణిపూర్‌లోని (షిల్లాంగ్ ప్రాంతీయ) ‘పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, ఉఖ్రుల్-1’

నాడు పోస్టు చేయడమైనది: 10 SEP 2026 8:27PM by PIB Hyderabad

   దేశంలోని జవహర్ నవోదయ విద్యాలయాల (జేఎన్‌వీ) 27వ జాతీయ యువజన పార్లమెంటు పోటీ (2025-26)ల విజేతలకు న్యూఢిల్లీలో ఇవాళ (సెప్టెంబరు 10) బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు.  పార్లమెంట్ హౌస్ ప్రాంగణంలోని గ్రంథాలయ భవనంలో గల జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో సాగిన ఈ కార్యక్రమానికి కేంద్ర పార్లమెంటరీ-మైనారిటీ వ్యవహారాల శాఖల మంత్రి శ్రీ కిరణ్‌ రిజిజు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా జాతీయ స్థాయి విజేతగా నిలిచిన మణిపూర్‌లోని ‘జేఎన్‌వీ’ ఉఖ్రుల్-1 పాఠశాల జట్టును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే, ప్రతిభ చాటిన ఇతర ఆరు ‘జేన్‌వీ’ల జట్లను కూడా ప్రశంసించారు. అనంతరం పోటీల విజేతలకు బహుమతులు, జ్ఞాపికలను అందజేశారు.

అనంతరం విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ- ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన పార్లమెంటు ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించారు. తామెన్నుకున్న ప్రతినిధుల ద్వారా పౌరులు తమనుతాము పరిపాలించుకునే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ భారత్‌కు అత్యంత అనుకూలమైనదని మంత్రి పేర్కొన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే ప్రపంచంలో అత్యుత్తమ పాలనా విధానమని శ్రీ రిజిజు అభివర్ణించారు. జవహర్ నవోదయ విద్యాలయాలు విద్యార్థుల వ్యక్తిత్వాన్ని చక్కగా తీర్చిదిద్దుతూ సన్మార్గంలో నడుపుతున్నాయని ఆయన కొనియాడారు.

అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ నికుంజ్ బిహారీ ధల్ ప్రసంగిస్తూ- విజేత జట్లను అభినందించడంతో పాటు ఈ కార్యక్రమ నిర్వహణలో తమ శాఖ సహా  ఇతర భాగస్వామ్య వ్యవస్థలు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, విశ్లేషణాత్మక ఆలోచన సామర్థ్యం, సమష్టి కృషి స్ఫూర్తిని పెంచడంలో ఇలాంటి కార్యక్రమాలు సదవకాశం కల్పిస్తాయని వ్యాఖ్యానించారు.

మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ సత్య ప్రకాష్ తొలుత ముఖ్య అతిథితోపాటు ఇతర ప్రముఖులకు సాదర స్వాగతం పలికారు. దేశం ‘వికసిత భారత్‌-2047’ లక్ష్యాన్ని సాధించడంలో సంప్రదాయ గురు-శిష్య పరంపర తరహాలో ప్రిన్సిపాళ్లు-ఉపాధ్యాయులు, విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని ఆయన ప్రస్ఫుటం చేశారు.

జవహర్ నవోదయ విద్యాలయాల స్థాయిలో నిర్వహించిన 27వ జాతీయ యువజన పార్లమెంటు పోటీ (2025-26)లో జాతీయ స్థాయి విజేతగా నిలిచిన మణిపూర్‌లోని పిఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయం, ఉఖ్రుల్-1 (షిల్లాంగ్ ప్రాంతం) విద్యార్థులు ఈ సందర్భంగా మరో్సారి తమ “యువ పార్లమెంట్” ప్రదర్శనను నిర్వహించారు.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మూడు దశాబ్దాలుగా జవహర్ నవోదయ విద్యాలయాల స్థాయిలో యువజన పార్లమెంటు పోటీని నిర్వహిస్తోంది. ఈ మేరకు ‘జాతీయ యువజన పార్లమెంట్ పోటీ’ పథకంలో భాగంగా నవోదయ విద్యాలయ సమితి కింద దేశవ్యాప్తంగా 8 ప్రాంతాల పరిధిలోని 100 విద్యాలయాల మధ్య 2025-26లో 27వ పోటీని నిర్వహించారు.

దేశంలోని ‘జేఎన్‌వీ’ల విద్యార్థులకు ఈ యువజన పార్లమెంటు పథకం ఒక వేదికను ఏర్పరుస్తుంది. తద్వారా వారికి వాక్చాతుర్యం, విశ్లేషణాత్మక ఆలోచనా సామర్థ్యం సహా నాయకత్వ లక్షణాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. అలాగే, పార్లమెంటు కార్యకలాపాలు, విధానాలు, చర్చల పద్ధతులపై ఈ పథకం వారికి అవగాహన కల్పిస్తుంది. అదే సమయంలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సమర్థ ప్రసంగ నైపుణ్య కల్పనకు దోహదం చేస్తుంది. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యంగల అంశాలపై ఉత్సాహభరిత చర్చల్లో పాల్గొనేలా ‘జేఎన్‌వీ’లలోని ప్రతిభావంతులు, వక్తలైన విద్యార్థులకు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ద్వారా ఎనలేని ప్రోత్సాహం లభిస్తుంది.

జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన మణిపూర్‌లోని ‘పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, ఉఖ్రుల్-1’ జట్టు ఈ సందర్భంగా “పండిట్ జవహర్ లాల్ నెహ్రూ రన్నింగ్ పార్లమెంటరీ షీల్డ్”తోపాటు ట్రోఫీని అందుకుంది.

మరోవైపు తమతమ ప్రాంతీయ పరిధిలో విజేతలుగా నిలిచిన కింది 7 ‘జేఎన్‌వీ’ జట్లకు మంత్రి శ్రీ కిరణ్‌ రిజిజు జ్ఞాపికలు, బహుమతులను అందజేశారు:

వ.సం.

విద్యాలయాల   పేరు

ప్రాంతం

1

పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, కొళ్లం, కేరళ

హైదరాబాద్

2

పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, థియోగ్, సిమ్లా

చండీగఢ్

3

పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, సూరత్‌గఢ్, శ్రీగంగానగర్

జైపూర్

4

పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, బిలాస్‌పూర్, ఛత్తీస్‌గఢ్

భోపాల్

5

పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, వల్సాద్, గుజరాత్

పుణె

6

పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, పురూలియా, పశ్చిమ బెంగాల్

పాట్నా

7

పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, ఉధమ్ సింగ్ నగర్, ఉత్తరాఖండ్

లక్నో

ఈ కార్యక్రమంలో చివరగా- పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిప్యూటీ కార్యదర్శి శ్రీ అనిల్ కుమార్ వందన సమర్పణ చేశారు. ఈ పోటీని విజయవంతం చేయడంలో ఎనలేని రీతిలో సహకరించిన ప్రముఖులు, అధికారులు, ఇతర భాగస్వాములు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

 

***


(రిలీజ్ ఐడి: 2308997) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Telugu