శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఢిల్లీలోని భారత్ మండపంలో 2026 అక్టోబరు 27 నుంచి 29 వరకు ‘ఈఎస్టీఐసీ – 2026’… ప్రారంభించనున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
వర్ధమాన శాస్త్రీయ విజ్ఞాన, సాంకేతికత, ఆవిష్కరణల సమాలోచన (ఈఎస్టీఐసీ)లో వక్తలుగా ముగ్గురు నోబెల్ గ్రహీతలు, అంతర్జాతీయ పురస్కారాల గ్రహీతలు
ఏడాది పొడవునా విడివిడి కార్యక్రమాలను నిర్వహించడానికి బదులు.. శాస్త్ర, సాంకేతిక వ్యవస్థలోని అనేక అంశాలను ఒకే వేదికపైకి తెచ్చే కొత్త విధానంలో భాగంగా గతేడాది ఈఎస్టీఐసీకి రూపకల్పన
మెట్రో నగరాల నుంచి కాదు.. చిన్న పట్టణాల నుంచే నేడు 50 - 60 శాతం అంకుర సంస్థలు
వ్యాపార విస్తరణ కోసం నిపుణులు, వ్యవస్థాపకులు, వ్యాపార ప్రముఖులు, మార్కెట్ల లభ్యత
దేశ తదుపరి ఆవిష్కరణల పరంపర మెట్రో నగరాల ఆవల నుంచే రావాలి
అవరోధాలను బద్దలుగొడదాం, ప్రయోగశాలల నుంచి మార్కెట్లకు వారధులను నిర్మిద్దాం
పరిశోధనలు- అంకుర సంస్థలు- పరిశ్రమల మధ్య బలమైన అనుసంధానాన్ని సాధిద్దాం: ఈఎస్టీఐసీ-2026 సన్నాహక కార్యక్రమంలో పిలుపునిచ్చిన డాక్టర్ జితేంద్ర సింగ్
ఆవిష్కరణలను విస్తరించాలంటే.. నిర్వహణ, సమాచార ప్రసార వ్యవస్థలను విజ్ఞాన శాస్త్రంతో సమగ్రంగా అనుసంధానించడం ఆవశ్యకమన్న కేంద్ర మంత్రి
స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలతో ఈఎస్టీఐసీ ప్రణాళికలను రూపొందించాలని శ్రీ జితేంద్ర సింగ్ సూచన.. కేవలం ఓ వార్షిక కార్యక్రమంగా ఈ సదస్సు మిగిలిపోకూడదని వ్యాఖ్య
నాడు పోస్టు చేయడమైనది:
10 SEP 2026 5:02PM by PIB Hyderabad
భారత్ మండపంలో 2026 అక్టోబర్ 27 నుంచి 29 వరకు ‘వర్ధమాన శాస్త్రవిజ్ఞాన, సాంకేతికత, ఆవిష్కరణల సమాలోచన (ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ కాంక్లేవ్ - ఈఎస్టీఐసీ) - 2026’ను నిర్వహించబోతున్నామని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దీనిని ప్రారంభిస్తారని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ, భూ విజ్ఞాన శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పీఎంవో- అణు ఇంధన - అంతరిక్ష విభాగం – సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ ఈ రోజు వెల్లడించారు. ముగ్గురు నోబెల్ బహుమతి గ్రహీతల (ప్రొఫెసర్ జోచిమ్ ఫ్రాంక్, సర్ రిచర్డ్ జె. రాబర్ట్స్, ప్రొఫెసర్ కోస్ట్యా నోవోసెలోవ్)తోపాటు.. అంతర్జాతీయ పురస్కారాలు పొందిన పలువురు వక్తలు కూడా కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
ఈఎస్టీఐసీ - 2026 సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ.. శాస్త్ర, సాంకేతిక రంగాలు అపూర్వ వేగంతో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, శాస్త్రీయ సామర్థ్యాలతోపాటు నిర్వహణ, కమ్యూనికేషన్, ఇతర రంగాల నైపుణ్యాన్ని కూడా ఈ వ్యవస్థ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
ఏడాది పొడవునా అనేక విడివిడి కార్యక్రమాలను నిర్వహించడానికి బదులు, శాస్త్ర విజ్ఞాన, సాంకేతిక వ్యవస్థలోని అనేక అంశాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే కొత్త విధానంలో భాగంగా.. గతేడాది ఈఎస్టీఐసీ భావనను రూపొందించినట్టు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. శాస్త్ర, సాంకేతికతా రంగం కోసం మరింత సమగ్రమైన వ్యవస్థను రూపొందించే లక్ష్యంతో.. పరిశోధకులు, ఆవిష్కర్తలు, అంకుర సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, విధాన రూపకర్తల మధ్య సత్సంబంధాలను నెలకొల్పేందుకు ఈ సమాలోచన సదస్సు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన వివరించారు.
ఆవిష్కరణలను వేగవంతం చేయాల్సిన, దేశ శాస్త్రీయ సామర్థ్యాలను విస్తృత ఆర్థిక, సామాజిక ప్రయోజనాంశాలుగా మలచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి అన్నారు. ఈ దిశగా సంస్థాగత ఆటంకాలను తొలగించి – శాస్త్రీయ పరిశోధనలు, అంకుర సంస్థలు, పరిశ్రమలు, మార్కెట్లు, సమాజాలను బలంగా అనుసంధానించాలని పిలుపునిచ్చారు.
‘సృజనాత్మక మేధ, విజ్ఞాన శాస్త్రానికి ప్రేరణ, సాంకేతిక సాధికారత’ అన్న ప్రధాన ఇతివృత్తం... శాస్త్రీయ ఆవిష్కరణల్లో సృజన, ఊహాశక్తుల ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సృజనాత్మకత, ఊహాశక్తి వినూత్న సామర్థ్యాలను బలోపేతం చేస్తాయని, అదే సమయంలో ఆలోచనలను అర్థవంతమైన ఫలితాలుగా ఆవిష్కరించేందుకు ఒక సానుకూల వ్యవస్థ ఆవశ్యకమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
దేశంలో అంకుర సంస్థల పురోగతిని వివరిస్తూ... 2014లో దేశంలో 350 - 400 సంస్థలు మాత్రమే ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 2.3 లక్షలు దాటిందని, భారత్ నేడు ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థగా నిలిచిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. నేడు 50 - 60 శాతానికి పైగా అంకుర సంస్థలు మెట్రో నగరాల నుంచి కాకుండా.. చిన్న పట్టణాల నుంచే వస్తున్నాయన్న ఆయన.. దేశవ్యాప్తంగా వ్యవస్థాపకత, ఆవిష్కరణల విస్తరణకు ఇది అద్దం పడుతోందన్నారు. ఈ వర్ధమాన అంకుర సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి.. నిపుణులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులు, మార్కెట్ల లభ్యత అవకాశాలు మరింత మెరుగ్గా లభించాలని శ్రీ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
భవిష్యత్తులో నిర్వహించబోయే ఈఎస్టీఐసీ ఎడిషన్లు... నిర్వహణ, సమాచార ప్రసార సంస్థలను మరింత విస్తృతంగా ఒకే వేదికపైకి చేరుస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్వహణ నైపుణ్యం అంకుర సంస్థలకు, కాబోయే పారిశ్రామికవేత్తలకు మార్కెట్ ప్రవేశ వ్యూహాలను రూపొందించడంలో సహాయపడగలదు. అదే సమయంలో వైజ్ఞానిక విజయాలను యువతకు, సమాజంలోని విస్తృత వర్గాలకు వారు అర్థం చేసుకునే భాష, మాధ్యమాల ద్వారా చేరవేయడంలో సమాచార ప్రసార నైపుణ్యం సహాయపడుతుంది.
జాతీయ పరిశోధన సంస్థ (నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్), రూ. లక్ష కోట్ల పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల (ఆర్డీఐ) నిధి వంటి కార్యక్రమాలతో.. అలాంటి సానుకూల వ్యవస్థను ఏర్పరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. వివిధ మంత్రిత్వశాఖలు, భాగస్వామ్య పక్షాల సమన్వయం ద్వారా.. పరిశోధన, ఆవిష్కరణల నుంచి సాంకేతిక అభివృద్ధి, వ్యవస్థాపకత, మార్కెట్ అప్లికేషన్ల దిశగా సాగే ప్రయాణం మరింత బలోపేతమవుతుందన్నారు.
అభివృద్ధి చెందుతున్న శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ ఇటీవల సాధించిన విజయాలను కేంద్ర మంత్రి ప్రస్తావించారు. ఇందులో డీప్ ఓషన్ మిషన్, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థపై విస్తరిస్తున్న భారత్ దృష్టి వంటి అంశాలు ఉన్నాయి. భారత్ తొలి స్వదేశీ పరిశోధనా నౌకను ప్రారంభించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ అందిస్తున్న అవకాశాలను అన్వేషించే దిశగా భారత్ మరింత విస్తృతంగా ముందుకు సాగుతోందని తెలిపారు. అంతరిక్షం, బయోటెక్నాలజీ రంగాల్లో సాధించిన విజయాలను కూడా భారత్‌లో శాస్త్రీయ సామర్థ్యాలు ఏ స్థాయిలో విస్తరిస్తున్నాయో చూపించే ఉదాహరణలుగా ఆయన పేర్కొన్నారు.
మూడు రోజుల సదస్సుతోనే ఈ కార్యక్రమం ముగిసిపోకుండా, దాని కొనసాగింపునకు చర్యలు తీసుకోవాలని డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు. ఈఎస్‌టీఐసీలో జరిగిన చర్చలు, పొందిన అనుభవాల ఆధారంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలతో కూడిన ప్రణాళికను శాస్త్రీయ సలహా బృందం, నిర్వాహక బృందాలు రూపొందించాలని ఆయన కోరారు. ఒకసారి జరిగిన కార్యక్రమం ద్వారా పొందిన అనుభవాలు తదుపరి కార్యక్రమానికి ఉపయోగపడాలని, సదస్సు కేవలం ప్రతి ఏడాది జరిగే ఒక కార్యక్రమంగా మిగిలిపోకుండా మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయంతో చేపట్టే చర్యలు నిరంతరం కొనసాగాలని ఆయన అన్నారు.
అంకుర సంస్థల రిజిస్ట్రేషన్, పేటెంట్లు, ఇతర ఆవిష్కరణ ప్రక్రియలకు సంబంధించిన విధానాల గురించి యువ ఆవిష్కర్తలకు మరింత అవగాహన కల్పించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. అనేక మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఆలోచనలు, సామర్థ్యాలు ఉన్నప్పటికీ తమ ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన విధానాల గురించి పూర్తి అవగాహన ఉండకపోవచ్చని అన్నారు. అటువంటి సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా యువతలో ఉన్న ఈ సామర్థ్యాన్ని మరింతగా వెలికి తీయవచ్చని తెలిపారు.
వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞాన పరిస్థితులు, ముఖ్యంగా కృత్రిమ మేధ గురించి కేంద్రమంత్రి ప్రస్తావిస్తూ... సాంకేతికత ప్రస్తుతం కేవలం అవకాశాలను అందిపుచ్చుకోవడానికే కాకుండా, యువత కొత్త అవకాశాలను సృష్టించేందుకు కూడా మరింతగా సహాయపడుతోందని అన్నారు. ప్రతి తరం, సమాజంలోని ప్రతి వర్గానికి, ముఖ్యంగా యువతకు ఈఎస్‌టీఐసీ ఆసక్తికరమైన కార్యక్రమంగా మారాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కే సూద్, శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన విభాగం (డీఎస్‌ఐఆర్) కార్యదర్శి, సీఎస్‌ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్ కలైసెల్వి, బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేష్ ఎస్ గోఖలే, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ ఎస్ కృష్ణన్, ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయ శాస్త్రీయ కార్యదర్శి డాక్టర్ పర్విందర్ మైనీతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు, ప్రతినిధులు హాజరయ్యారు.
భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కే సూద్ మాట్లాడుతూ.. 13 మంత్రిత్వ శాఖలు, ప్రముఖ సంస్థలు, పరిశ్రమల భాగస్వాములు, 5,000 మందికి పైగా ప్రతినిధులను ఒకచోట చేర్చిన తొలి విడత విజయం ఆధారంగా ఈఎస్‌టీఐసీ 2026 నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా సమగ్ర ప్రభుత్వ విధానాన్ని ఈఎస్టీఐసీ ప్రతిబింబిస్తుందని, యువ ఆవిష్కర్తలు, విధాన రూపకర్తలు, సంస్థలు, పరిశ్రమలను ఒకే జాతీయ దార్శనికత చుట్టూ తీసుకువస్తుందని తెలిపారు. భారత్‌కు ముఖ్యమైన అభివృద్ధి చెందుతున్న అవకాశాలకు సంబంధించిన 12 ప్రధాన అంశాలను ఇందులో చర్చిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
డీఎస్‌ఐఆర్ కార్యదర్శి, సీఎస్‌ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్. కలైసెల్వి మాట్లాడుతూ.. ఈఎస్‌టీఐసీ-2026 నిర్వహణ బాధ్యతను సీఎస్‌ఐఆర్ చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి తిరువనంతపురంలోని సీఎస్‌ఐఆర్-ఎన్ఐఐఎస్‌టీ నోడల్ ప్రయోగశాలగా వ్యవహరిస్తోందని, ఈ కార్యక్రమం కోసం 13 మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ సదస్సు ద్వారా శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల రంగాల మధ్య సమన్వయం మరింత బలోపేతమవుతుందని, 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మించాలనే జాతీయ లక్ష్యానికి ఇది దోహదపడుతుందని తెలిపారు.
భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయ మార్గదర్శకత్వంలో సీఎస్‌ఐఆర్ నిర్వహిస్తున్న ఈఎస్‌టీఐసీ-2026కు సీఎస్‌ఐఆర్-ఎన్ఐఐఎస్‌టీ నిర్వహణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ సదస్సులో నోబెల్ బహుమతి గ్రహీతలు, ప్రపంచస్థాయి శాస్త్రవేత్తలు, డీప్‌టెక్ అంకుర సంస్థలు, మహిళా పారిశ్రామికవేత్తలు, యువ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పరిశ్రమల నాయకులు, విధాన రూపకర్తలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు), పరిశోధన-అభివృద్ధి సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ప్రధాన ప్రసంగాలు, 12 అంశాలపై సాంకేతిక సమావేశాలు, ప్యానెల్ చర్చలు, శాస్త్ర, సాంకేతిక రంగాల ప్రముఖులు, డీప్‌టెక్ అంకుర సంస్థల ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు, పోస్టర్ ప్రదర్శనలు, బీ2బీ, బీ2జీ సమావేశాలు నిర్వహించనున్నారు. అధునాతన తయారీ, ఇంధన సాంకేతికతలు, సింథటిక్ బయాలజీ, సముద్ర-నౌకయాన సాంకేతికతలు, క్వాంటం కమ్యూనికేషన్, సెమీకండక్టర్లు, వ్యవసాయ-సాంకేతకత, జనరేటివ్, అటానమస్ ఏఐ, రోబోటిక్స్, అధునాతన వైద్య సంరక్షణ, ఇమ్మర్సివ్ టెక్నాలజీలు (వర్చువల్ అనుభూతిని కల్పించే సాంకేతికతలు), అంతరిక్ష శాస్త్రం వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలు ఈ సాంకేతిక సమావేశాల్లో చర్చకు రానున్నాయి.
నోబెల్ బహుమతి గ్రహీతలు ప్రొఫెసర్ జోకిమ్ ఫ్రాంక్, సర్ రిచర్డ్ జె. రాబర్ట్స్, ప్రొఫెసర్ కొస్త్యా నోవోసెలోవ్ సహా పలువురు ప్రముఖ శాస్త్రవేత్తలు ఈఎస్‌టీఐసీ 2026లో పాల్గొననున్నారు. భారత్‌లో అభివృద్ధి చెందుతున్న అంకుర సంస్థలు, డీప్‌టెక్ రంగాలను ప్రదర్శించే సాంకేతిక ఆధారిత ప్రదర్శనను కూడా సదస్సులో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రదర్శన రెండో రోజు నుంచి ప్రజల సందర్శనకు అందుబాటులో ఉంటుంది.
ఈఎస్‌టీఐసీ-2026ను 2026 అక్టోబర్ 27 నుంచి 29 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈఎస్‌టీఐసీ-2026ను ప్రారంభించనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2026 సెప్టెంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది.
***
(రిలీజ్ ఐడి: 2308973)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5